Happy Independence Day! మీ అందరికీ మీలో ప్రతి ఒక్కరికీ స్వాతంత్రదినోత్సవ శుభములు! అభినందనలు!
భారతీయ పౌరులముగా మనమంతా సంతోషిస్తున్న సమయం! మన దేశమంతటికీ ఈ స్వతంత్ర ప్రతిపత్తి
సంపాదించడానికి శ్రమించి, ఎంతో కఠినమైనశ్రమలు, హింస భరించి, ప్రాణాలు సహితం ఇచ్చిన త్యాగధనులను ఈ
దినాన్న జ్ఞాపకం చేసుకోవాలి. బ్రిటిష్ సామ్రాజ్య బానిసత్వం విడిపించబడిన మనకు ఈ దేశపౌరులుగా జీవించే
స్వతంత్రం దొరికింది.
ఇక ఆత్మలో స్వతంత్రం గురించి ఆలోచిద్దాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి ఆత్మలో స్వతంతo గూర్చి పరిశుద్ధగ్రంధం బైబిల్ ఏమి సెలవిస్తుందో తెలుసుకుందాం. సర్వసృష్టి కర్త అయిన దేవుడు ఒక్కడే, ఆయనే భూమి మీద ఉన్న ప్రతి దేశమునకు, జనమునకు, తెగలకు, ఆదివాసిలకు, ప్రతి మానవునికి సృష్టికర్త. ఆయనే ఎవరిని ఏ దేశములో ఉంచాడో అక్కడ వారున్నారు. ఈ విషయాలన్నీ అదికాండము లో ఉన్నవి. ఎన్ని బానిసత్వాలు తొలగిపోయినా, ఒక బానిసత్వము తొలగిపోవడము లేదు. అదేమిటి? యోహాను సువార్త 8:34 గమనించి చూడండి: “అందుకు యేసు --పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” ఇవి స్వయానా యేసుక్రీస్తు ప్రభువు మాటలు. పాపమునకు అంత దుష్టశక్తి ఉన్నది. పాపము అనేక విధములుగా కనిపిస్తూఉంటుంది. పాపము కనిపించే రూపములు భయము, అనుమానము, అజ్ఞానము, అవివేకము, క్రూరత్వము, అబద్ధము, మోసము, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా చాలరూపాలు ఉంటాయి. చాలామంది నేనేమీ పాపము చేయలేదు, ఎవరినీ కొట్టలేదు, తిట్టలేదు, వేరే ఏ విధంగా బాధ పెట్టలేదు అంటూ ఉంటారు. పాపము చేయలేదు అనుకోవడమే పెద్ద పాపము. దేవుని వాక్యము ఏమని బోధిస్తుందో తెలుసుకుందాం. I యోహాను పత్రిక 1:8 “మనము పాపములేని వారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యముండదు.” మనము ఎవరితో పాపము మనలో లేదని చెబుతున్నామో వారిని కాదు, మనలను మనమే మోసగించుకొంటున్నాము. శ్రోతలూ, జాగ్రతగా వింటున్నారా? బైబిల్ గ్రంధం సత్యమును ఉన్నదున్నట్టుగా సెలవిస్తున్నది. “నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. రోమా 3:10-12. 23వ వచనములో ఎంతో నిర్దిష్టంగా దేవుడు సెలవిస్తున్న సత్యం ఏమిటంటే, “ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” పాపము మనలను బంధించింది. ఇది ఎంత భయంకరమైన బంధకమంటే పాపము చేశాడని కూడా గుర్తించలేని స్థితిలోఉన్నాము. చనిపోయిన వారికి ఏమని చెప్పగలము, వారితో ఏమి మాట్లాడగలము? మన పాపములు మనలను ఆత్మలో అలాంటి స్థితిలో పడవేసిందని మనమంతా గ్రహించాలి. ఎఫెసీ 2:1 “ మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా,…” అని బైబిల్ ఎంతో స్పష్టంగా మనస్థితిను చూపిస్తున్నది. చచ్చినవారికి ఏమి అవసరము? జీవము. బంధించబడినవారికి ఏమి అవసరము? విమోచన. ఈ విమోచన మనకు కలిగించడానికి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునుండి భూమి మీదికి దిగివచ్చాడు.
అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బానిసలుగా జీవించారు. వారిని చూచిన ఆ దేశపు రాజు ఫరో వారిమీద బహుకఠినమైన కొరడాలతో కొట్టించాడు. వెట్టిపనులు చేసి బానిసలుగా వారిని మార్చివేశారు. విపరీతమైన శ్రమలు, హింసలు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది అత్యంత కఠినమైన బానిసత్వము. నిర్గమ కాండము 1:13,14 వచనాలు చదువుకుందాము. “ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.” కఠినత్వమే, క్రూరత్వమే వారి ఆహారపానీయాలయ్యాయి. బ్రతుకు మీద విసుకు కలిగించారు. ఈనాడు పాపమును బట్టి మనకు సంక్రమించిన శాపమునుబట్టి మన బ్రతుకులు కూడా వెట్టి చాకిరిగా మారుతున్నాయి. ప్రొద్దున లేచినప్పటినుండి సాయంకాలము వరకు ఎంతో కష్టపడి పనిచేసుకుంటాము. మనశ్శాంతిగా ఉంటుందా? మరికొందరు రాత్రి పొద్దుపోయేదాకా కష్టపడి పనిచేసేవారున్నారు. నిద్రలేమివలన ఆరోగ్యము క్షీణిస్తున్న వారు మరికొందరుంటారు. కొందరు ఈ విధంగా పనిచేసుకుంటున్నపుడు కొన్ని ఆకస్మికంగా జరిగే ప్రమాదాలకు గురి అవుతారు. దాని వల్ల కాలుగానీ చేయిగాని పోగొట్టుకొని ఉంటారు. ఇక జీవితాంతము అలా ఉండాల్సిందేకదా. మరికొందరు ప్రమాదాల్లో రెండు కళ్ళు పోగొట్టుకొని గ్రుడ్డివారు అయి ఉంటారు. పని చేయడం మంచిదే, మోసము, అబద్ధము, కపటము లేనిడైతే, బ్రతకడానికి ఏ పని చేసినా మంచిదే! దేవుడు మనలను సృష్టించింది పని చేయడానికి. కానీ పని ఒక విసుగులా మారకూడదు. వెట్టిపని, చాకిరిగా మారకూడదు. కారణం? సమస్య పనిలో లేదు, మన హృదయాల్లో ఉన్నది. మన హృదయాల్లోని నిరాశ, నిస్పృహ, కోపము, ఆవేశము, ఆక్రోశము, అసూయ, ద్వేషము, గర్వము మొదలైన అనేకమైన పాపపు స్వరూపాలు మనలను విసుగువైపు నడిపిస్తాయి.
ఆ భయంకరమైన ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీయులు ఏమి చేశారు? ఎవరు వారిని విమోచించారు? నిర్గమ కాండము 2:23,24 గమనించండి: “ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.” వారు దేవునికి వారి మూలుగులను, నిట్టూర్పులను వినిపించారు. మొరపెట్టారు. ఈనాడు పెద్ద శోధన ఏమిటంటే ఎవరో ఒక మానవుణ్ణి ఆశ్రయించడం. ఒక అధికారి కావచ్చు, ఒక బంధువు కావచ్చు, మరొక గొప్ప వ్యక్తి కావచ్చు, మంచి వాడని పేరుమోసిన వ్యక్తి కావచ్చు. శ్రోతలూ, ఏ మానవుడు నమ్మదగినవాడు కాదు, ఎవరిని ఆశ్రయించినా, ఒరిగిపోతున్న గోడలాగే, ఎప్పుడో ఒకప్పుడు నిరాశ ఎదురవుతుంది. కలిగిన నిరాశకు ఇంకొంచెం నిరాశ ఎక్కువవుతుంది. “వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను” అనే ప్రశస్తమైన దేవుని మాటలు గమనించారా? మీరు నేను సజీవుడైన దేవునికి మొర పెడితే ఆయన తప్పక మొరను చేరనిస్తాడు. ఆయన చేతి పని అయిన మానవులను ఆయన విడువడు. “దేవుడు వారి మూలుగును విని……” అనే మాటలు మీ చెవుల్లో నాటనీయండి. హల్లెలూయ! దేవుడు వినే దేవుడు, జీవములేని విగ్రహం కాదు. ఆయన మాటలు పరిశుద్ధ గ్రంధం బైబిల్లో సంపూర్ణంగా ఉన్నవి. అంతే కాదు, ఆయన అదినుండి అంతము, అంతము నుండి ఆది సమస్తము ఎరిగినవాడు. భూత, భవిష్యత్ వర్తమానాలు అంతా ఆయనకు ఒక్కటే! అంతటి గొప్ప దేవునికి నీవిషయం తెలియదనుకుంటున్నావా? తప్పక నీవిషయం సంపూర్ణoగా ఆయనకు తెలుసు. అయినప్పటికీ నీ మొర వింటాడు. కొన్ని షరతులు ఉంటాయి. కొంచెo ఓపిక పట్టి ఇంకా ముందుకు వెంటే మీకు అర్థమవుతుంది. వినడమే కాదు, ప్రభువు తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అని లేఖనం సెలవిస్తుంది. ఏమిటా నిబంధన? నిబంధన అంటే ఒడంబడిక, లేదా ఒప్పందం, నియమం అని అర్ధం. అది ఎవరితో చేశాడు? జాగ్రతగా గమనిచండి, “తాను చేసిన నిబంధన” అని లేఖనము సెలవిస్తుంది. అబ్రహాము, ఆయన కుమారుడు ఇస్సాకుతో, ఆయన కుమారుడు యాకోబులతో చేశాడు. అబ్రహాము వంశపువారు చంద్రుడిని ఆరాధించేవారు. ఈనాటికి కూడా సూర్య చంద్రులను, గాలిని, నీటిని, చెట్లను, జంతువుల బొమ్మలను ఆరాధించేవారున్నారు. కానీ దేవుడు అబ్రహాముతో వారిని విడిచిపెట్టి తాను చెప్పినట్టు చేయమని ఆదేశించాడు. ఆ నిబంధన ఆయన సంతానమంతటికీ ఇచ్చాడు. అబ్రహాము విశ్వాసముంచినందు చేత, ఆయన విశ్వాసమును బట్టి దేవుడు ఆయనతో తన నిబంధన చేశాడు. అబ్రహాము ఆయన సంతానం పాప స్వభావమును బట్టి ఎన్నో రీతులుగా సృష్టికర్త, రక్షణ కర్త అయిన దేవుణ్ణి విస్మరించారు, ఆయన మాటకు వ్యతిరేకంగా జీవించారు. అయినప్పటికీ అది దేవుడు చేసిన నిబంధన గనుక ఆయన తన మాటను బట్టి వారిని విడిచిపెట్టలేదు. ఆ నిబంధన నెరవేర్పుగా తన ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును మానవ జాతి అంతటి పాపము కోసం పరిహారముగా చేసి, మన అందరికీ బదులుగా మన పాపముల కోసం యేసు ప్రభువును దేవుని గొర్రెపిల్లగా పంపించాడు. యేసు ప్రభువును చూపిస్తూ, బాప్తిస్మమిచ్చు యోహాను “లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల” అని ఉద్ఘాటించాడు. ఆనాడు ఇశ్రాయెలీయుల మొర వినడానికి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. ఈ నాడు యేసు క్రీస్తుద్వారా ఆయన క్రొత్త నిబంధన చేశాడు. ఆయన ద్వారా, ఎవరైనా, దేవుని వద్దకు, సర్వ సృష్టికర్త, దగ్గరికి రావచ్చు. క్రీస్తు ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరినీ ఏ భేదము లేకుండా ప్రభువు స్వీకరించి పాపపు బానిసత్వము నుండి విమోచిస్తాడు. యేసు రక్షకుడు సిలువ మీద కార్చిన ఆ పరిశుద్ధ రక్తము మన విమోచన క్రయధనము. పాపపు బానిసత్వము నుండి ఎవరినైనా విమోచించడానికి రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభువు తన రక్తము కార్చి ప్రాణమిచ్చాడు. మీరు నిరాశలో కూరుకుపోయి ఉన్నారా? మానసిక ఒత్తిడి మిమ్ములను క్రుంగదీస్తుందా? మీ పాప భారము మోయలేనంతగా ఉందా? యేసు క్రీస్తు ప్రభువు పాపపు సంకెళ్లనుండి విమోచించగల పరిశుద్ధుడు, శక్తిమంతుడు. మన స్వభావమున పాపపు స్వభావము, కానీ ప్రభువు క్రీస్తు ద్వారా నీ స్వభావమును మార్చగల విమోచకుడు. యేసు క్రీస్తు ప్రభువు యెదుట నీ పాపములు ఒప్పుకొని ఆయన నిన్ను పాపపు బానిసత్వము నుండి విమోచించమని నీవు బ్రతిమాలినట్లయితే ఆయన నీ స్వభావమును తన పరిశుద్ధాత్ముని శక్తి చేత రూపాంతరం చెందించగలడు. మరణసమయములో నీ చేయి పట్టుకొని నిన్ను తన పరిశుద్ధ సన్నిధిలో చేర్చుకుంటాడు. ఈ జీవితమంతా నిన్నుతన శాంతి సమాధానాలతో కరుణిస్తాడు. దీనమనసుతో యేసు క్రీస్తు ప్రభువు వద్దకు వచ్చుటకు పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయుగాక! అమెన్!!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment