ప్రభువు బల్లను సరిగా ఆచరించి అవలంబించడం -మొదటి భాగము
I కోరింథీ-37 11:17-34
మీకందరికీ మీలో ప్రతి ఒక్కరికీ యేసు క్రీస్తు ప్రభువు మహిమగలిగిన నామములో శుభములు!
బాగున్నారా? క్రొత్త సంవత్సరం క్రొత్త గురిని మీ ముందుంచుకున్నారా? పరిశుద్ధగ్రంధం బైబిల్
ప్రతిదినం చదివి, పఠించి, ధ్యానించాలనే గురి పెట్టుకొనండి! ప్రతి దినం కనీసం రెండు గంటలు
దీక్షతో, దీన మనసుతో, ప్రభువు వాక్యపు వెలుగు మీ హృదయoలో మనసులో నిండి
పరిశుద్ధాత్ముడు మీలో వెలుగు నింపేటట్టుగా సిద్ధపరచుకొనండి. ప్రార్ధించుకుందాం,
ఈ పూట లేఖన భాగము I కోరింథీ 11:17-34. అంశం ప్రభువు బల్లను సరిగా ఆచరించి,
యోగ్యముగా పాలుపొందడం. రండి రేడియోకు దగ్గరగా వచ్చి, నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని,
ఏకాగ్రతతో దేవుని పరిశుద్ధ వాక్యమును అధ్యయనం చేద్దాం.
పాత నిబంధనలో కొన్ని పండుగలు దేవుడు నిర్ణయించిన విషయం మీకు తెలుసని
నమ్ముతున్నాను. ఆ పండుగల సమయాల్లో ఇశ్రాయేలీయులు జీవనానికి సాధారణంగా చేసే
పనులు చేయకూడదని దేవుని హెచ్చరిక. ఎందుకంటే, ఆ పండుగలు, దేవునికి వారికి ఉన్న
సంబంధమునకు గుర్తులు. వారి విమోచకుడైన దేవునికి వారితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని అవి
సూచిస్తున్నవి. మరి క్రొత్తనిబంధనలో పండుగలు ఉన్నాయా? ఈనాడు పండుగ అని
పిలువబడకపోయినా, దేవునికి ఆయన ప్రజలతో గల వ్యక్తిగత సంబంధాన్ని ప్రభువు బల్ల
సూచిస్తున్నది. గతంలో 10వ అధ్యాయము ధ్యానించినపుడు ప్రభువు బల్ల విషయం ధ్యానించాము.
జ్ఞాపకం తెచ్చుకొని ధ్యానించండి, లేదా వెబ్ సైట్లోనికి వెళ్ళి మళ్ళీ వినవచ్చు. వెబ్సైట్ అడ్రెస్
కావలసినవారు మెస్సెజ్ చేయవచ్చు. ప్రభువు బల్లను కొందరు ప్రతి ఆదివారము చేస్తారు,
మరికొందరు, నెలలోని ఒకవారములో చేస్తారు, మరి కొందరు ఇంకా ఎక్కువ గడువు ఉంచి
చేస్తూఉంటారు. శ్రోతలూ, గమనించండి, ఎప్పుడు ఎన్నిసార్లు చేస్తున్నామన్నది కాదు ముఖ్యం. ఏ
విధoగా పాలుపొందుతున్నామన్నది ముఖ్యం.
ఏ విధంగా యోగ్యంగా, సరియైన రీతిగా ప్రభువు పరిశుద్ధమైన బల్లలోపాలుపొందాలో ఆపో.
పౌలు ఈ లేఖన భాగములో దానికి అవసరమైన మార్గదర్శకాలు స్పష్ట పరిచారు, వాటిని క్షుణ్ణంగా
ధ్యానిద్దామా?
మొదటిది, అక్రమ కారులను సరియైన రీతిగా పాలొందనివారిని ఖండించండి. I కోరింథీ 11:17-22 వచనాలు :
17. మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరుకూడి వచ్చుట యెక్కువ కీడుకేగాని యెక్కువమేలుకు కాదు.
18. మొదటి సంగతి యేమనగా, మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను.
19. మీలో యోగ్యులైన
వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు.
20. మీరందరు కూడి
వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు.
21. ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును.
22. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లులేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచు దురా? మీతో ఏమి చెప్పుదును? దీనినిగూర్చి మిమ్మును మెచ్చుదునా? మెచ్చను.”
కొరింథీ సంఘములో చాలా క్లిష్ట సమస్యలున్నవని అర్ధమవుతున్నది కదా! వారి కూడికలు,
సంఘములో సమావేశాలు, మేలు కాదుగాని కీడు కలిగిస్తున్నవని పౌలు స్పష్టపరుస్తున్నాడు.
అవునా? వారిలో పార్టీలు ఉన్నవి. ఏదో ఒక అంశము మీద ఏకీభవించనివారు ఒక గుంపు కూడి
ప్రవర్తిస్తున్నారు. కాని, 'వేరు వేరు అభిప్రాయాలు ఉండకతప్పదు' అని చెప్పడం గమనించారా?
ఎందుకని? కొందరు సత్యమును సరిగ్గా అర్ధం చేసుకునేవారుంటారు, మరి కొందరు అపార్థం
చేసుకుని అపోహలు పెట్టుకునేవారుంటారు.
ఆదినాల్లో ఎవరి భోజనం వారు తెచ్చుకొని తినేవారు. అవి ప్రభువు రాత్రి భోజనముకాదు. కాని,
వారు అపోహపడి ప్రవర్తించారు. తప్పు చేశారు. అందుచేత అపో. ప్రభువు బల్ల ఒక సాధారణమైన
మామూలుగా పాలొందే బల్ల కాదని బోధిస్తూ, సరి చేస్తున్నారు. ఇది ఎంత అవసరమో
గమనిస్తున్నారా? సంఘము సమావేశము కావడం మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఉండే
సమయముకాదు, స్థలము కాదు. దేవుని పరిశుద్ధ సంఘము కూడినపుడు ప్రభువు బల్ల చాలా
గంభీరoగా నిష్టతో చేయాల్సిన ప్రతిష్ఠ. అది చాలా పరిశుద్ధమైన ఘడియ. కీర్తన కారుని మాటల్లో
చెప్పాలంటే, 46వ కీర్తనల్లో ఉన్నట్టుగా “ఊరకుండి ఆయనే దేవుడని తెలుసుకోవలసిన
ఘడియ.” సంఘపు సమావేశములో ఎంతో భయభక్తులు, శ్రద్ధ, ఆసక్తులు ఉండాలి. ప్రత్యేకించి
బల్లలో పాలుపొందేసమయములో ఇంకా ఎక్కువగా!
దీని విషయములో ఒక ప్రముఖ దైవజనుడు ఇచ్చిన ఉపదేశము తెలుసుకుందాం. “వారు
ఎంత పొరబడ్డారో చూడండి. ప్రభువు బల్లను వారు జరుపుకునే ఒక సాధారణమైన పండుగ
అనుకున్నారు. అంతే కాదు, అందరూ కలిసి, ఒకే చోట పాలుపొంద వలసిన పండుగ అని
గ్రహించక ఎవరికివారు వారికి తోచినట్టు చేస్తూ ఉన్నారు. ఎవరికి వారు వేరు వేరు చోట్ల భోజనము
చేస్తూ ఉండడం కాదు, గాని అందరూ కలిసి ఆరాధన పూర్వకoగా చేయవలసిన పండుగ అనే
సత్యాన్నే కాల రాశారు.
కాబట్టి మొదటి మార్గదర్శకం అక్రమకారులను దండించవలసిన అవసరత ఉన్నది. మీ మీ
సంఘాల్లో అక్రమ కారులను సంఘ కాపరులు, సంఘ పెద్దలు దండిస్తున్నారా? ఇది మీ
గంభీరమైన బాధ్యత అని మీకు దైవసేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి, కేవలం బల్ల
సమయములో మాత్రమే ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా, వినయ విధేయతలతో ప్రవర్తించి
బయట, అనగా, ఇంట్లో, మార్కెట్లో బంధువులమధ్యలో, ఆఫీసులో స్నేహితులమధ్యలో
ఇష్టానుసారంగా జీవించే వారు ఉన్నారు. మీరు ఆ లెక్కలో ఉన్నారా? పరిశుద్ధాత్ముని
హెచ్చరికలను త్రోసివేయకండి. 'కేవలం బాప్తిస్మము తీసుకుంటే చాలు, బల్లలో పాలు
పొందవచ్చు' అని అపోహపడేవారు కోకొల్లలు. మీరు కూడానా? జాగ్రత్తసుమీ! అక్రమంగా
పాలుపొందేవారు, భయము లేకుండా బల్లలో పాలుపొందేవారు తీర్పు తప్పించుకోలేరు.
సంఘములోని తోటి సహోదరులు, సహోదరిలతో ప్రేమ అభిమానాలతో, కలిసి మెలిసి
జీవించలేనివారు, పార్టీలు పార్టీ స్వభావము మనసులో కలిగిఉన్నవారు అయోగ్యంగా పాలు
పొందుతున్నారని గమనిస్తున్నారా? నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీకందరికీ ప్రేమతో
ఇస్తున్న హెచ్చరిక! ఇప్పటికే మన సంఘాల్లో ఉన్న స్థితిగతులు, సంఘటనలు, పార్టీలు,
ముఠాస్వభావము, కోర్టు కేసులు, మన ప్రభువును ఎంతో గాయపరుస్తున్నాయి, ప్రభువును మళ్ళీ
సిలువ వేస్తారా?
ఇది ఒక ఆచారమని భ్రమ పడకండి! ప్రభువు బల్లలో పాలు పొందితే
పాపములు క్షమించబడతాయని కొందరు భ్రమ పడుతున్నారు. శ్రోతలూ, మీలో చాలా మంది
ఈలాటి అపోహలతో ప్రభువు అతి పరిశుద్ధమైన బల్లలోపాలు పొందుతున్నారా? పాపమునుండి
శుద్ధి చేయబడి, పాపమును ఒప్పుకొని, విడిచిపెట్టి, పరిశుద్ధాత్మ దేవుని చేత శుద్ధి చేయబడిన
తరువాత మాత్రమే పాలు పొందాలి. మన రక్షకుడు తన శరీరమును బలి చేశాడు. పాపములేని
తన పరిశుద్ధ శరీరమును విరిచి, గాయపరచబడ్డానికి అప్పగించుకొని, రక్తము కార్చబడేవరకు
గాయములతో చిత్రహింసలు పడి, భూమినిదున్నినట్లే, ప్రభువు శరీరమును దున్నడానికి
అప్పగించుకున్నాడు.
కీస్తులో నా ప్రియ సహోదరీ సహోదరులారా, మన శరీరపు స్వభాముతోనే జీవిస్తూ, శరీరపు కోరికలను
తీర్చుకుంటూ, విచ్చలవిడిగా జీవిస్తూ, ప్రభువు బల్లలో పాలు పొంది పాపము కడుగబడుతుందనుకోవడం
కొరింథీ సంఘములాగానే అపోహ పడుతున్నట్లు. మౌనధ్యానములో మీరున్న చోటనే నాతో బాటు
మీరుకూడా, మనమంతా మనలను మనము సరిచేసుకుందాం. దానికి అవసరమైనంత మహాకృప ప్రభువు
మనలో ప్రతి ఒక్కరికి, ఒక్కోక్కరికి అనుగ్రహించుగాక!
గమనిక: ఇదే అంశం మీద రెండు, మూడవ భాగములుగా బైబిల్ అధ్యయనాలు ఈ వెబ్ సైట్ లోనే ఉన్నవి. అవికూడా చదవండి, వినండి.
No comments:
Post a Comment