Christmas Tract - క్రిస్మస్ కరపత్రిక - దేవుడే మానవునిగా జన్మించడానికి గల పది కారణాలు ఏమిటి?

 

 

“దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి?”

పాస్టర్ విజయ్ భాస్కర్ సింగపోగు

క్రిస్మస్ రానే వచ్చేసింది! పండుగ వాతావరణం ఈ నెల ఆరంభములోనే అన్ని చోట్ల కనిపిస్తున్నది. చిన్న చిన్న గ్రామాల

సహితం క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంగా సందడిగా జరుపుకుంటూ ఉన్నాము. కానీ ఇంత క్రిస్మస్ 

జరుపుకుంటూ,  దాని అసలు అర్ధం తెలుసుకోకపోతే అంతా వ్యర్ధమే అవుతుంది. 2021 క్రిస్మస్ సమయములో “సజీవ 

నిరీక్షణ” కార్యక్రమములో బోధించిన అంశం: “దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి?”  

https://radio882.com/webradio/live/  ఈ లింక్ మీద ప్రతి బుధవారము రాత్రి 8;15 నుండి 8:30 వరకు లైవ్ గా  

 రేడియోలో ప్రసారమయ్యే సమయములోనే రేడియో లేకపోయినా, మీ ఫోన్, లేదా ఐపాడ్ లేదా లాప్ టాప్ మీద 

వినవచ్చు. మిగతా సమయాల్లో ఎప్పుడైనా, ఈ వెబ్ సైట్ లో వినవచ్చు, 

చదవవచ్చు కూడా! అప్పటి ఈ ధ్యానమును వెబ్సైట్లో అప్పటినుండి ఉంచాము. ఇప్పటివరకు ఆ ధ్యానమును 500 

మారులు పైగా  ప్రజలు చదివారు, విన్నారు. గతించిన I కోరింథీ అధ్యయనాలు, దానికి ముందు రేడియోలో ప్రసారమైన 

రోమా పత్రిక బైబిల్ అధ్యయనాలు వెబ్ సైట్లో ఉన్నాయి. మీరు కూడా వాటిని చదవాలని, లేదా వినాలని కోరితే ఈ వెబ్ 

సైట్లో ఎప్పుడైనా వినవచ్చు. అలా చేయడానికి పెద్ద ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ అవసరం. www.sajeevanireekshana.org  

అని గూగుల్ లేదా క్రోమ్ లాంటి బ్రౌజర్లలో టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి.ఈ వెబ్ సైట్ ద్వారా మీరు పొందిన 

మేలు, ఆశీర్వాదం, దిద్దుబాటు, హెచ్చరిక, మరేదైనా, మాతో పొంచుకోండి: ఫోన్ నంబర్ 8143178111 వాట్సప్

గాని, కాల్ చేసి గాని, ఈమెయిల్: sajeevanireekshana@gamil.com లో గాని, మీకు వీలైనా విధంగా తెలపండి. 

          Incarnation అనే ఇంగ్లీష్ మాటను తెలుగులో అవతారమని తర్జుమా చేస్తున్నారు. కానీ ఆ మాట లాటిన్ 

నుండి వచ్చింది. దాని అసలు అర్ధం “శరీరమును ధరించుట”. యేసు క్రీస్తు ప్రభువు తనంతట తానే జీవము గలిగిన 

దేవుడు. యోహాను 5:26.తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.” యోహాను సువార్త 5:26. అదే సువార్త 10:18 గమనించండి: “ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.” ఇది 

ప్రభువు దైవత్వానికి, నిత్యత్వానికి స్పష్టమైన రుజువు. అంతే కాదు, ప్రభువు సృష్టికర్త అని, ఆయన లేకుండా ఏ

సృష్టము కలుగలేదని యోహాను సువార్త మొదటి అధ్యాయములోని మొదటి వచనాల్లో స్పష్టముగా చెప్పబండింది.   

ఇంకా వివరంగా యేసు క్రీస్తు ప్రభువు దైవత్వమును గూర్చి మీరు తెలుసుకోవాల నుకుంటే, కొలస్సీ పత్రిక మొదటి 

అధ్యాయం చదవండి. యేసు క్రీస్తు ప్రభువు క్రిస్మస్ నాడు ప్రవచనాల నెరవేర్పుగా శరీరము ధరించాడు, కానీ అనాది 

నుండి, తండ్రితో బాటు సజీవుడుగా, దేవునిగా నిరoతరము జీవించినవాడు, జీవిస్తున్నవాడు కూడా! హల్లెలూయ! 

క్రిస్మస్ సందర్భములో ఎక్కువ బోధించబడే మీకా 5:2లో ఉన్న మాటలు ప్రభువు యొక్క నిత్యత్వమును స్పష్టంగా 

ఉద్ఘాటిస్తున్నాయి. “బెత్లెహేము ఎఫ్రాతా, యూదవారి  కుటుంబములలో నీవు  స్వల్ప గ్రామమైనను, నా కొరకు 

ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలమునుండి మొదలుకొని శాశ్వతకాలము వరకు 

ఆయన ప్రత్యక్షమగుచుండెను.”  మీకా 5:2 పాత నిబంధన కాలములలో “దూత” అనే పేరిట ఆయనే భూమిమీద ఉన్న 

తన ప్రజలు యూదులను దర్శించాడు. ఒక్క ఉదాహరణ చూడాలనుకుంటే సంసోను తల్లితండ్రులు, అనగా మానోహ 

దంపతులతో “దూత” అని వారనుకున్న ప్రభువు చెప్పిన మాటలు జాగ్రతగా గమనించండి: “యెహోవా దూత నీ వేల నా 

పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకానిదనెను.” న్యాయా. 13:18. నిత్యత్వములో సజీవుడుగా ఉన్న దైవ 

కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు అనే పేరున క్రిస్మస్ ద్వారా ఈ భయంకరమైన పాపిష్టి లోకములో శరీరమును 

ధరించుకొని జన్మించడానికి తగ్గించుకున్నాడు. అతున్నత స్థాయి నుండి అత్యంత అధమ స్థాయికి తగ్గించుకున్నాడు. 

ఆయన తన మహిమతో అలాగే ఉండి ఉంటే, మానవ శరీరము ధరించలేడు. ఆయన మానవ స్వభావమును, అనగా 

పాపము లేని మానవ స్వభావమును సంతరించుకొని కన్య మరియ గర్భములో ఏ మానవ ప్రమేయము లేకుండా 

పరిశుద్ధాత్మ శక్తిద్వారా  జన్మించాడు. యేసు క్రీస్తు ప్రభువు పరిపూర్ణమైన దేవుడుగా ఉండి కూడా పాపములేని 

శరీరముతో, పాపరహిత మానవ స్వభావముతో జన్మించడము ద్వారా ఆయన మనకు దేవునికి పరిపూర్ణమైన 

మధ్యవర్తిగా, పరిపూర్ణమైన ప్రధాన యాజకునిగా పరిచర్య చేశాడు. తన మహా మహిమను ప్రక్కకుపెట్టి మనమధ్యలో 

మనలాగా జీవించాడు.

         ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు మానవ శరీరము, మానవ స్వభావము ధరించాడో విపులంగా 

అధ్యయనం చేద్దాం. ఆ 10 కారణాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

మొదటి కారణము: దేవుణ్ణి మానవులందరికీ పరిపూర్ణంగ బయలు పరచడానికి ఆయన మానవ 

స్వభావం ధరించాడు. దేవుడు ఎలా వుంటాడో, నీవు తెలుసుకోవాలనుకుంటే, యేసు క్రీస్తు దగ్గరే మీ అన్వేషణ 

ఆగిపోతుంది. “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను 

బయలు పరచెను.” యోహాను 1:18 దేవుని గుణగణాలు ఏమిటి? ఆయనను గూర్చి నీవింకా తెలుసుకోవాలి 

అనుకుంటున్నావా? యేసు క్రీస్తు ప్రభువు మానవ శరీరం, స్వభావం ధరించింది నీ కోసమే! ప్రభువు స్వంత మాటల్లో ఈ 

విషయం ఎలా ప్రస్ఫుటమయ్యిందో చూడండి: ప్రభువుతో మూడున్నర ఏళ్లకాలం ప్రభువుతో ఉన్న శిష్యుడు ఫిలిప్పుతో 

ప్రభువు అన్న మాటలు జాగ్రతగా వినండి: “అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే 

చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను 

చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచు మని యేల చెప్పుచున్నావు? తండ్రి 

యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా 

యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.” యోహాను 14:8 నుండి. 

యేసు క్రీస్తులో పరిశుద్ధుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదే పరిపూర్ణమైన చివరి దేవుని ప్రత్యక్షత.

 

రెండవ కారణము: తాను కొందరికి చేసిన వాగ్దానములను నెరవేర్చి, పాత నిబంధనలో 

అనుగ్రహించబడిన ప్రత్యక్షతను ఇంకా ఎక్కువ చేసి, సత్యమును పరిపూర్ణం చేయడానికి దేవుడు 

మానవ శరీరం ధరించాడు. పాత నిబందనలో దేవునిగూర్చి తెలుపబడిన ఆయన క్రియలు, ప్రవచనాలు, 

సత్యము, ప్రత్యక్షత పరిపూర్ణం కావాలంటే, దేవుడే స్వయంగా రావాలి. మనకు దేవుడు వ్యక్తిగతంగా 

ప్రత్యక్షమయ్యాడు. కొందరికి పాత నిబంధనలో తాను చేసిన వాగ్దానములు ఆయన యేసు క్రీస్తులో 

నెరవేర్చాడు. ఆదామునకు ఆది. 3:15లో చేసిన “స్త్రీ సంతానము” అనే రక్షకుని రాకను గూర్చిన వాగ్దానము 

యేసు క్రీస్తులో నెరవేర్చాడు. అబ్రహామునకు చేసిన వాగ్దానము ఆది. 12:3లో ఉన్నది. భూమియొక్క 

సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని” అబ్రాముతో అన్న వాగ్దానము ఇప్పుడు యేసు క్రీస్తులో 

నెరవేరింది. మనమంతా “సమస్త వంశములు” అనే మాటలో ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువు అబ్రహాము 

సంతానములో, ఆయన సంతానమైన యూదుల జాతిలో జన్మించాడు. గమనిస్తున్నారా, శ్రోతలూ? II 

సమూయేలు 7:12లో దావీదుకిచ్చిన వాగ్దానమును గమనించండి. “నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని 

హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.” యేసు క్రీస్తు ప్రభువు ను దావీదు కుమారుడా అని 

యూదులలో గ్రుడ్డి వారు సంబోధించి, సమీపించి ఆయనవద్ద చూపు పొందారు. ప్రభువు సిలువ మీద 

యూదుల రాజు అనే బ్యానర్ వ్రాయబడింది. అవును, దావీదునకివ్వబడిన వాగ్దానము యేసు క్రీస్తులోనే 

 నెరవేరింది. దూతమరియమ్మ తో చెప్పిన మాటలు గమనించండి: “మరియా,భయపడకుము; దేవునివలన నీవు 

కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;  ఆయన 

గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును 

ఆయనకిచ్చును.” లూకా 1:30-32. అవును, యేసు క్రీస్తు ప్రభువు వంశపు లెక్కలో చూస్తే ఆయన దావీదు 

వంశపువాడైనా, ఆయన దేవుని కుమారుడు, “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” ప్రియ 

మిత్రమా, దేవుడెవరో, ఎలా ఉంటాడో, ఆయన గుణగణములు, స్వభావము, క్రియలు ఏమిటో అని ఎప్పుడైనా 

ఆలోచించావా? యేసు క్రీస్తులోనే దేవుని స్వభావము, క్రియలు, మాటలు, సమస్తమూ ఉన్నవి. నీవు ఆయనను 

హృదయ పూర్వకంగా విశ్వసించి, నీ జీవితపు సారధ్యం, నీ జీవితంపైన ఆయనకు అధికారం ఇస్తే, ఆయనకు నీకు 

కూడా రక్షకుడు, విమోచకుడు అవుతాడు.

మూడవ కారణం: యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి మానవ శరీరమును 

ధరించాడు. అది పాపములేని మానవ శరీరము, స్వభావము. మత్తయి సువార్త 5:17,18 గమనించండి: 

ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి 

వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు 

దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” 

ధర్మశాస్త్రములోని ప్రతి ఆజ్ఞను, ప్రతి చట్టమును నెరవేర్చిన ఏకైక దైవ మానవుడు యేసు క్రీస్తే! మానవులు              

ప్రతి ఒక్కరూ, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారే! అందులో నీవు నేను కూడా ఉన్నాము. ఆయనలో ఏ              

పాపము లేదని లేఖనాల్లో అనేక చోట్ల రుజువయ్యింది. పాపములేని పరిశుద్ధమైన, నిష్కళంకమైన జీవితము              

ప్రభువు జీవించి ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా నెరవేర్చాడు.

 

         నాలుగవ కారణము: ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపమునకు పరిహారముగా మరణించడానికి యేసు క్రీస్తు ప్రభువు శరీరధారి అయ్యాడు. గమనించండి శ్రోతలూ, మొట్టమొదట పాపము లోకములో ప్రవేశించినపుడు దేవుడు పాపికి బదులు మరొకరు పరిహారము చేయడాన్ని మొదలు పెట్టాడు. కొందరు నాకొరకు మరొకరు పరిహారం చేయడమేమిటి, అది నేనొప్పుకోను’, అంటూ ఉంటారు. లేవీయకాండము లోని బలులు ప్రత్యామ్నాయ పరిహారమును సూచిస్తున్నాయి. జంతువుల రక్తము పాపమును పరిహరించదు. నీ పాపము కోసం నీవే మరణించినా నీ పాపము పరిహరించబడదు. ఏ మానవుడు మరణించినా పాపమునకు పరిహారము కలుగదు. ఎందుకు? పరిశుద్ధమైన బలి, పరిహారము చెల్లించాలి. అది కేవలము పరిపూర్ణమైన పరిశుద్ధుడైన రక్షకుడు యేసు క్రీస్తు మాత్రమే చెల్లించగలడు. అందుకే ఆయన మానవునిగా జన్మించవలసి వచ్చింది. మత్తయి సువార్త 20:28 “మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.అనేకులకు ప్రతిగా అన్న మాటలను

గమనించారా? వారి స్థానములో, వారికి బదులుగా అని అర్ధం. ప్రియ మిత్రమా, యేసు క్రీస్తు నీ స్థానములో నీ పాపమునకు పరిహారము చెల్లించడానికి మానవునిగా జన్మించాడు.

         ఐదవ కారణము, ఆయన క్రొత్త నిబంధనను తీసుకురావడానికి శరీర ధారి అయ్యాడు.  యేసు క్రీస్తు ప్రభువు పాత నిబంధనలోని ప్రతి ఆజ్ఞను, ప్రతి చట్టమును నెరవేర్చడమే కూకుండా, క్రొత్త నిబంధనను ఆరంభించి నెరవేర్చాడు. మత్తయి 26:28 గమనించండి: వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.”  ఇది క్రొత్త నిబంధన రక్తము, ఆయనతోనే ఆరంభమయ్యింది. హెబ్రీ. 9:22లో లేఖనమేమి చెబుతున్నది? “రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.” నీ పాపపు క్షమాపణ కోసం యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమును చిందించాడు. ఆయన జన్మించింది అందుకే! నీవు ఈ నిబంధన యేసు క్రీస్తుతో చేసి నీ పాపములకు క్షమాపణ పొందావా?

        ఆరవ కారణము, మన బధ్ధ శత్రువు సైతాను, అపవాది క్రియలు నశింపచేయడానికి యేసు క్రీస్తు ప్రభువు మానవడుగా జన్మించాడు. I యోహాను పత్రిక 3:8 “అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.”  సైతాను దేవునికి, ఆయన ప్రజలకు శత్రువు. ప్రస్తుతము వాడు, వాని దూతలు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు జన్మించక ముందు ఇంకా చాలా ఘోరంగా నాశనమును కలిగిoచాయి. మార్కు సువార్తలోని మదటి కొన్ని అధ్యా యాలు ఒక్కసారి చదవండి, ప్రభువు వెళ్ళిన ప్రతిచోట దయ్యములను వెళ్లగొట్టాడు. సాతాను శక్తులనుండివేలాదిమందిని విడిపించాడు. 5వ అధ్యాయములో దయ్యముల సైన్యం పట్టి పీడిస్తున్న మనిషిని రాత్రి ప్రయాణం చేసి కేవలం ఆయనను విముక్తుణ్ణి చేయడానికే గదరెనీయుల దేశం వెళ్ళాడు ప్రభువు. 2000 పందులకంటే ఆ ఒక్కణ్నే విలువైన వ్యక్తిగా చేసుకున్న ప్రభువు మనలను కూడా సైతాను శక్తులనుండి విడిపించడానికి శక్తిమంతుడు. హల్లెలూయ!

         ఏడవ కారణం, లోకమును నీతియుక్తముగా తీర్పు తీర్చడానికి యేసు క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. యోహాను 5:22. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు;…”  తీర్పు తీర్చే సర్వాధికారం యేసు క్రీస్తు ప్రభువునకు తండ్రి ఇచ్చాడు. ఆయనను న్యాయాధిపతిగా

ఒప్పుకోక తప్పదు. అదే అధ్యాయము 27వ వచనములో లేఖనమేమి సెలవిస్తున్నది? “ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.”  ఆయన మానవ శరీరము ధరించాడు, మానవునిగా జీవించాడు గనుక ఆయన తీర్పులు న్యాయమైనవి. మనుష్యకుమారుడు అని తనవిషయం తాను ఎంతో ఇష్టాపూర్వకంగా ప్రభువు సంబోధించుకున్నారు. మనుష్యజాతితో ప్రభువునకున్న సంబంధాన్ని స్పష్టంగా బోధించేది ఈ మాటే! ప్రభువు మానవ శరీరం ధరించకపోతే ఆయనకు మనుష్యకుమారుడు అనే బిరుదు ఉండదు. ఆయన జడ్జ్ గా ఈభూమ్మీద అడుగుపెట్టినపుడు, మానవాళి అంతా ఆయనముందు మోకరిల్లేటపుడు నీవెక్కడ ఉంటావు? నీవిప్పుడు యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా విశ్వసించి మనుష్యులముందు ఒప్పుకుంటే, ఆయన నిన్ను తనకుమారుడుగా ఒప్పుకుంటాడు.

         ఎనిమిదవ కారణం, తన యందు విశ్వాసముంచిన వారితో సహానుభవము, సానుభూతి కలిగిన ప్రధాన యాజకుడుగా ఉండడానికి యేసు క్రీస్తు మానవుడుగా జన్మించాడు.  యేసు క్రీస్తు ప్రభువు మానవ శరీరపు బంధకాలతో పరిమితులతో జీవించినందు చేత, మీరు, నేను ఎదుర్కుంటున్న ప్రతి శోధన, బాధ, నింద, వ్యతిరేకత, క్లిష్టసమస్యలు అన్నీ ప్రభువు స్వయంగా ఎదుర్కొని జయించినవాడు. హెబ్రీ. 4:14-16  ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.”

            తొమ్మిదవ కారణము, విశ్వాసులైన వారికి మాదిరిగా మార్గదర్శకంగా ఉండడానికి ప్రభువు మానవుడుగా జన్మించాడు. I యోహాను 2:6. “ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.”  ప్రభువు మనకోసం శ్రేష్టమైన మాదిరి చూపించాడు. ఈ లోకములో ఎవరిని చూచి, వారిని వెంబడించలేము, కానీ ప్రభువును చూస్తూ, ఆయన చూపించిన మాదిరిని వెంబడిస్తూ జీవించవచ్చు. I పేతురు 2:21. “ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను”  

         పదవ కారణము, యేసు క్రీస్తు ప్రభువు మానవజాతిని పరలోకపు భాగ్యము, భావిజీవితం కోసం సిద్ధపరచడానికి మానవుడుగా జన్మించాడు. దేవుని కుమారుడు మానవుడుగా జన్మించి, మరణించి, పునరుధ్ధానుడై తండ్రి కుడిప్రక్కలో కూర్చొని తనవారికోసం విజ్ఞాపన చేస్తున్నందుచేత ఆయనను పరిపూర్ణంగా విశ్వసించి నమ్మకంగా వెంబడించే వారిని తనతో బాటు పరలోకములో చేర్చుకోవాలని ప్రభువు మానవశరీరం ధరించాడు. ప్రభువు పరిపూర్ణుడైనట్టు ఒకానొక రోజు మనము ఆయనలాగా మార్చబడతాము, హల్లెలూయ! I యోహాను పత్రిక 3:2లో మన భవిష్యత్తు నిర్ణయించబడింది. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.”  ఇది ఎంతగొప్ప నిరీక్షణ! ఇదే సజీవ నిరీక్షణ!! ఆదాము మనకిచ్చిన పాపపు స్వభావముతో ఉన్న మనలను యేసు క్రీస్తు ప్రభువు తన పరిశుద్ధ, నూతన స్వభాములోనికి మనలను మార్చడానికి ప్రభువు మానవడుగా జన్మించాడు. ఆపో. పౌలు ఫిలిప్పీ 3:21లో మన మంటి శరీరములను యేసయ్య ఏ విధంగా మార్చబోతున్నాడో చెప్పాడు. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.

యేసు క్రీస్తు ప్రభువు, పరిపూర్ణ పరిశుద్ధుడైన దైవ కుమారుడు, మానవుడుగా జన్మించడానికి 10 కారణాలు అధ్యయనం చేశాం. ప్రభువు చేసిన ఈ అత్యంత ఘనమైన క్రియను హృదయపూర్వకంగా గ్రహించి, నమ్మి, ప్రభువుతో అనుదినము నడవడానికి అవసరమైనత కృప ప్రభువే స్వయంగా మనకందరికీ అనుగ్రహించుగాక!



No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...