క్రిస్మస్ ప్రత్యేక ధ్యానము
“దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి?”
---పాస్టర్ విజయ్ భాస్కర్ సింగపోగు
క్రిస్మస్ రానే వచ్చేసింది! పండుగ వాతావరణం డిసెంబర్ నెల ఆరంభములోనే అన్ని చోట్ల కనిపిస్తున్నది. చిన్న చిన్న గ్రామాల్లో సహితం క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంగా సందడిగా జరుపుకుంటూ ఉన్నాము. కానీ ఇంత క్రిస్మస్ జరుపుకుంటూ, దాని అసలు అర్ధం తెలుసుకోకపోతే అంతా వ్యర్ధమే అవుతుంది. 2021 క్రిస్మస్ సమయములో “సజీవ నిరీక్షణ” కార్యక్రమములో బోధించిన అంశం: “దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి?” అప్పటి ఈ ధ్యానమును వెబ్సైట్లో అప్పటినుండి ఉంచాము. ఇప్పటివరకు ఆ ధ్యానమును 320 సార్లు ప్రజలు చదివారు, విన్నారు. మీరు కూడా గతించిన I కోరింథీ అధ్యయనాలు, దానికి ముందు మనమంతా కలిసి చేసిన రోమా పత్రిక బైబిల్ అధ్యయనాలు అదే వెబ్ సైట్లో ఉన్నాయి. మీరు కూడా వాటిని చదవాలని, లేదా వినాలని కోరితే ఈ వెబ్ సైట్లో ఎప్పుడైనా వినవచ్చు. అలా చేయడానికి పెద్ద ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ అవసరం. www.sajeevanireekshana.org అని గూగుల్ లేదా క్రోమ్ లాంటి బ్రౌజర్లలో టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి.
ఇక ఈ క్రిస్మస్ బైబిల్ అధ్యయనం చేద్దాం. రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. Incarnation అనే ఇంగ్లీష్ మాటను తెలుగులో అవతారమని తర్జుమా చేస్తున్నారు. కానీ ఆ మాట లాటిన్ నుండి వచ్చింది. దాని అసలు అర్ధం “శరీరమును ధరించుట”. యేసు క్రీస్తు ప్రభువు తనంతట తానే జీవము గలిగిన దేవుడు. యోహాను 5:26.“తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.” యోహాను సువార్త 5:26. అదే సువార్త 10:18 గమనించండి: “ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.” ఇది ప్రభువు దైవత్వానికి, నిత్యత్వానికి స్పష్టమైన రుజువు. అంతే కాదు, ప్రభువు సృష్టికర్త అని, ఆయన లేకుండా ఏ సృష్టము కలుగలేదని యోహాను సువార్త మొదటి అధ్యాయములోని మొదటి వచనాల్లో స్పష్టముగా చెప్పబండింది. ఇంకా వివరంగా యేసు క్రీస్తు ప్రభువు దైవత్వమును గూర్చి మీరు తెలుసుకోవాలనుకుంటే, కొలస్సీ పత్రిక సాంతం చదవండి. యేసు క్రీస్తు ప్రభువు క్రిస్మస్ నాడు ప్రవచనాల నెరవేర్పుగా శరీరము ధరించాడు, కానీ అనాది నుండి, తండ్రితో బాటు సజీవుడుగా, దేవునిగా నిరoతరము జీవించినవాడు, జీవిస్తున్నవాడు కూడా! హల్లెలూయ! క్రిస్మస్ సందర్భములో ఎక్కువ బోధించబడే మీకా 5:2లో ఉన్న మాటలు ప్రభువు యొక్క నిత్యత్వమును స్పష్టంగా ఉద్ఘాటిస్తున్నాయి. “బెత్లెహేము ఎఫ్రాతా, యూదవారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలమునుండి మొదలుకొని శాశ్వతకాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను.” మీకా 5:2 పాత నిబంధన కాలములలో “దూత” అనే పేరిట ఆయనే భూమిమీద ఉన్న తన ప్రజలు యూదులను దర్శించాడు. ఒక్క ఉదాహరణ చూడాలనుకుంటే సంసోను తల్లితండ్రులు, అనగా మానోహ దంపతులతో “దూత” అని వారనుకున్న ప్రభువు చెప్పిన మాటలు జాగ్రతగా గమనించండి: “యెహోవా దూత నీ వేల నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకానిదనెను.” న్యాయా. 13:18. నిత్యత్వములో సజీవుడుగా ఉన్న దైవ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు అనే పేరున క్రిస్మస్ ద్వారా ఈ భయంకరమైన పాపిష్టి లోకములో శరీరమును ధరించుకొని జన్మించడానికి తగ్గించుకున్నాడు. అతున్నత స్థాయి నుండి అత్యంత అధమ స్థాయికి తగ్గించుకున్నాడు. ఆయన తన మహిమతో అలాగే ఉండి ఉంటే, మానవ శరీరము ధరించలేడు. ఆయన మానవ స్వభావమును, అనగా పాపము లేని మానవ స్వభావమును సంతరించుకొని కన్య మరియ గర్భములో ఏ మానవ ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ శక్తిద్వారా జన్మించాడు. యేసు క్రీస్తు ప్రభువు పరిపూర్ణమైన దేవుడుగా ఉండి కూడా పాపములేని శరీరముతో, పాపరహిత మానవ స్వభావముతో జన్మించడము ద్వారా ఆయన మనకు దేవునికి పరిపూర్ణమైన మధ్యవర్తిగా, పరిపూర్ణమైన ప్రధాన యాజకునిగా పరిచర్య చేశాడు. తన మహా మహిమను ప్రక్కకుపెట్టి మనమధ్యలో మనలాగా జీవించాడు.
ఎందుకు యేసు క్రీస్తు ప్రభువు మానవ శరీరము, మానవ స్వభావము ధరించాడో విపులంగా అధ్యయనం చేద్దాం. ఆ 10 కారణాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం. రండి, రేడియోకు దగ్గరగా రండి.
1. మొదటి కారణం: దేవుణ్ణి మానవులందరికీ పరిపూర్ణంగ బయలు పరచడానికి ఆయన మానవ స్వభావం ధరించాడు. దేవుడు ఎలా వుంటాడో, నీవు తెలుసుకోవాలనుకుంటే, యేసు క్రీస్తు దగ్గరే మీ అన్వేషణ ఆగిపోతుంది. “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.” యోహాను 1:18 దేవుని గుణగణాలు ఏమిటి? ఆయనను గూర్చి నీవింకా తెలుసుకోవాలి అనుకుంటున్నావా? యేసు క్రీస్తు ప్రభువు మానవ శరీరం, స్వభావం ధరించింది నీ కోసమే! ప్రభువు స్వంత మాటల్లో ఈ విషయం ఎలా ప్రస్ఫుటమయ్యిందో చూడండి: ప్రభువుతో మూడున్నర ఏళ్లకాలం ప్రభువుతో ఉన్న శిష్యుడు ఫిలిప్పుతో ప్రభువు అన్న మాటలు జాగ్రతగా వినండి: “అప్పుడు ఫిలిప్పు ప్రభువా, తండ్రిని మాకు కనబర చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచు మని యేల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయు చున్నాడు.” యోహాను 14:8 నుండి. యేసు క్రీస్తులో పరిశుద్ధుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదే పరిపూర్ణమైన చివరి దేవుని ప్రత్యక్షత.
రెండవ కారణము: తాను కొందరికి చేసిన వాగ్దానములను నెరవేర్చి, పాత నిబంధనలో అనుగ్రహించబడిన ప్రత్యక్షతను ఇంకా ఎక్కువ చేసి, సత్యమును పరిపూర్ణం చేయడానికి దేవుడు మానవ శరీరం ధరించాడు. పాత నిబందనలో దేవునిగూర్చి తెలుపబడిన ఆయన క్రియలు, ప్రవచనాలు, సత్యము, ప్రత్యక్షత పరిపూర్ణం కావాలంటే, దేవుడే స్వయంగా రావాలి. మనకు దేవుడు వ్యక్తిగతంగా ప్రత్యక్షమయ్యాడు. కొందరికి పాత నిబంధనలో తాను చేసిన వాగ్దానములు ఆయన యేసు క్రీస్తులో నెరవేర్చాడు. ఆదామునకు ఆది. 3:15లో చేసిన “స్త్రీ సంతానము” అనే రక్షకుని రాకను గూర్చిన వాగ్దానము యేసు క్రీస్తులో నెరవేర్చాడు. అబ్రహామునకు చేసిన వాగ్దానము ఆది. 12:3లో ఉన్నది. “భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని” అబ్రాముతో అన్న వాగ్దానము ఇప్పుడు యేసు క్రీస్తులో నెరవేరింది. మనమంతా “సమస్త వంశములు” అనే మాటలో ఉన్నాము. యేసు క్రీస్తు ప్రభువు అబ్రహాము సంతానములో, ఆయన సంతానమైన యూదుల జాతిలో జన్మించాడు. గమనిస్తున్నారా, శ్రోతలూ? II సమూయేలు 7:12లో దావీదుకిచ్చిన వాగ్దానమును గమనించండి. “నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను.” యేసు క్రీస్తు ప్రభువు ను ‘దావీదు కుమారుడా’ అని యూదులలో గ్రుడ్డి వారు సంబోధించి, సమీపించి ఆయనవద్ద చూపు పొందారు. ప్రభువు సిలువ మీద యూదుల రాజు అనే బ్యానర్ వ్రాయబడింది. అవును, దావీదునకివ్వబడిన వాగ్దానము యేసు క్రీస్తులోనే నెరవేరింది. దూత మరియమ్మ తో చెప్పిన మాటలు గమనించండి: “మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.” లూకా 1:30-32. అవును, యేసు క్రీస్తు ప్రభువు వంశపు లెక్కలో చూస్తే ఆయన దావీదు వంశపువాడైనా, ఆయన దేవుని కుమారుడు, “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” ప్రియ మిత్రమా, దేవుడెవరో, ఎలా ఉంటాడో, ఆయన గుణగణములు, స్వభావము, క్రియలు ఏమిటో అని ఎప్పుడైనా ఆలోచించావా? యేసు క్రీస్తులోనే దేవుని స్వభావము, క్రియలు, మాటలు, సమస్తమూ ఉన్నవి. నీవు ఆయనను హృదయ పూర్వకంగా విశ్వసించి, నీ జీవితపు సారధ్యం, నీ జీవితంపైన ఆయనకు అధికారం ఇస్తే, ఆయనకు నీకు కూడా రక్షకుడు, విమోచకుడు అవుతాడు.
No comments:
Post a Comment