I కొరింథీ అధ్యయనం-36 11:1-16~రెండవ భాగం క్రైస్తవ మహిళలు తలమీద ముసుగు ఎందుకు ధరించాలి?-రెండవ భాగం

 

I కొరింథీ అధ్యయనం-36   11:1-16~రెండవ భాగం

క్రైస్తవ మహిళలు తలమీద ముసుగు ఎందుకు ధరించాలి?-రెండవ భాగం

     సజీవ నిరీక్షణ శ్రోతలందరికీ శుభములు! గడ్డురోజుల్లో జీవిస్తున్నాము. కోవిడ్ తరువాత కలిగే బలహీనతలతో 

చాలామంది నలిగిపోతూఉన్నారు. ఎంతోమంది అకస్మాత్తుగా మరణిస్తూ ఉన్నారు. ఎవరి మరణ ఘడియ ఎప్పుడో 

ఎవ్వరికీ తెలియదు. మరణించినవారందరూ దేవుని వద్దకు చేరతారనే అపోహలో లక్షలాదిమంది ఉన్నారు. మీరు 

కూడానా? లేదండీ, పరిశుద్ధుడైన దేవునివద్దకు ఒక పాపి ఎలా చేరగలడు? పాపమునకు పరిహారముగా యేసు క్రీస్తు 

ప్రభువు చిందించిన రక్తము మాత్రమే క్షమాపణనిస్తుంది. మీ పాపము కడుగబడాలని కొరితే ఆయన క్షమాపణ 

కోరుతూ ప్రార్థించoడి.

            మునుపటి అధ్యయనంలో స్తీ ముసుగు ధరించుకోవడానికి ఉన్న ఆధారాలను గమనించాముకదా! ఇక స్త్రీ ముసుగును ధరించాలని నిర్దేశించడానికి ఈపూట ముసుగు యొక్క అన్వయింపును అధ్యయనం చేద్దాం. రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ముసుగునకు గల నిర్దిష్టమైన, విశేషమైన భావమును గూర్చి తెలుసుకుందాం. I కోరింథీ 11:16వ వచనo.

         ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.”  ముసుగు ఉన్న లేకున్నా ఫర్వాలేదు అని చెప్పడంలేదు. దీన్ని ఒకరు పాటించిన పాటించకపోయినా ఫర్వాలేదు, అని చెప్పడం కాదు. 16వ వచనమును పరీక్షిస్తే, ప్రపంచమంటికీ అవి వర్తిస్తుందని అర్ధం. ముసుగు ధరించని వారి ఆచారమును ఖండించడానికి ఈ మాట చెప్పబడుతున్నది. పౌలు ఇంత స్పష్టంగా ముసుగు విషయం బోధించినవారువాత ఒక్క మాటతో అంతా కొట్టి వేసేంత బుద్ధిహీనుడు పౌలు కాదు. ఎవరైనా చారిత్రికంగా, సాంస్కృతికంగా పౌలు దినాలను గమనించినపుడు ఈ బోధ ప్రకారం ఒక స్త్రీ వెంట్రుకలు కత్తిరించుకుంటే, ఆమె ఆ పట్టణములో వ్యభిచారిణి అని చెప్పకనే చెబుతుంది. ఈ విషయమును పౌలుతో వాదించాలని మీరు ప్రయత్నిస్తే ఆయన ఒప్పుకోడు.

         మునుపటి అధ్యయనాల్లో బోధించిన సత్యాలను మీరు జ్ఞాపకము చేసుకుంటే, ప్రత్యేకించి 1:2; 4:17; 7:17 ఈ భాగాలను పరీక్షించి చూస్తే, ఈ పత్రిక కేవలం కోరింథీ సంఘముకోసం మాత్రమే ఆయన వ్రాయలేదని మీకర్ధమవుతుంది. తప్పనిసరిగా అన్ని సంఘములకోసం, అన్ని కాలములకోసం వ్రాస్తున్నట్టుగా తేటపరిచాడు. ఆదిమ విశ్వాసుల చరిత్రను తరచి చూస్తే, ముసుగు ధరించడం అందరూఅంగీకరించిన విషయమని ఎవరికైనా అర్థమవుతుంది. రోమ్ నగరములోని సమాధులను గమనిస్తే, స్త్రీలు శరీరమును కప్పుకొని ముసుగు ధరించేవారని, పురుషులు వెంట్రుకలు కత్తిరించుకునే వారని ఒక పండితుడు వ్రాశాడు.

         మన దేశములో మన సంఘాల్లో కూడా గత చరిత్రలో స్త్రీలు అనేక డినామినేషన్ల వారు ముసుగు ధరించడాన్ని ప్రోత్సహించారు. ఈ ముసుగు భద్రత కోసం కప్పుకునేది కాదు. ఈ నాడు ఉన్న సoఘాల్లో I కోరింథీలో బోధించబడిన ముసుగును లెక్క చేయడంలేదు. అది ప్రజలకోసం బహిరంగమైన క్రియగా చేసే క్రియ కాదు.

4,5 వచనాలు గమనించండి:

         4. ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు        తన తలను అవమానపరచును.

            5. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను            అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.”

ఈ విషయములో పలువురు పలు రకాలుగా అభిప్రాయపడుతూ ఉంటారు. బహిరంగ ఆరాధనకు మాత్రమే ముసుగు ఉండాలని కొందరి వాదన. కానీ ఈ లేఖన భాగములో  ప్రార్ధించేటపుడైన, ప్రవచించేటపుడైన, ముసుగు ధరించాలని ఆదేశమున్నది. గమనించారా? ఎక్కువ సార్లు మనము ప్రార్థించే సమయము గురించి మాట్లాడుతూ ఉంటాము. ప్రార్థన కేవలము ఇంటిలో, వ్యక్తిగతంగా రహస్యంగా చేస్తామా, లేదా బహిరంగంగా కూడా చేస్తామా? పరిశుద్ధ బైబిల్ గ్రంధం తనకు తాను వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడదు. మరొక చోట, అనగా I థేస్స. 5:17 లో పౌలు ఎల్లప్పుడు ప్రార్థించమని హెచ్చరించాడు. ఆ రీతిగా చూస్తే ముసుగు కేవలం బహిరంగపు సమావేశాల్లో మాత్రమే కాదని గ్రహించవచ్చు.

         ఆ తరువాత ప్రవచించే సమయము గురించి, అనగా దేవుని వాక్యము బోధించే సమయం కూడా ప్రస్తావించబడింది. ఇదే పత్రికలోని 14వ అధ్యాయము 3వ వచనంలో ప్రవచించే విషయం పౌలు బోధించాడు. గమనించండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు.”   సంఘపు సమావేశాల్లోనే కాకుండా ఇతర చోట్ల కూడా, అనగా ఇళ్ళలో, స్త్రీల కూటాల్లో  స్త్రీలు  క్షేమాభివృధ్ధి, హెచ్చరిక ఆదరణ కలిగే మాటలు మాట్లాడాలనిఆశిస్తున్నాము. కాబట్టి ముసుగు ధరించడం కేవలం సంఘకూటాల్లోనే కాదు, అన్నిచోట్ల ధరించడం సబబే అవుతుంది. ఈ కారణముచేత కొన్ని డినామినేషన్ల వారు ముసుగును ఖచ్చితంగా ఆచరించడం గమనించ వలసిన సంగతి. ఏ డినామినేషన్ అనేది ముఖ్యము కాదు, గాని, దేవుని వాక్యమును సరిగా అర్ధం చేసుకుని, విధేయత చూపిస్తున్నమా అనే విషయం ముఖ్యo.

            మరో సంగతి 15వ వచనములో ఉన్నది.స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.”  పైటచెంగుతో శరీరాన్ని కప్పుకున్నట్టే వెంట్రుకలను ముసుగుతో కప్పుకోవడం అవసరమని దేవుని వాక్యపు హెచ్చరిక. ఈ వచనములో ఉన్న కప్పుకోవ డమునకు, ఈ అధ్యాయములో మునుపటి వచనాల్లో ఉన్న కప్పుకోవడానికి వ్యత్యాసం ఏమిటి? తల వెంట్రుకలు స్త్రీకి మహిమగా, అనగా ఘనత నివ్వడానికి ఇవ్వబడినవి. ఆమె అణకువకోసం, నమ్రతకోసం అవి ఇవ్వబడినవి. ఈ లేఖన భాగమంతటిలో ఉన్న విషయం వెంట్రుకలను కప్పుదలగా భావించవద్దు. వెంట్రుకలే కప్పుదల అనుకున్నట్లయితే 5,6, వచనాలను ఎలా అర్ధం చేసుకోగలము? వెంట్రుకలే కప్పుదల అయితే, ఆమె ముసుగు ధరించనప్పుడు ఇక వెంట్రుకలు కత్తిరించుకున్నట్టే అవుతుంది. కానీ పౌలు చెబుతున్నదేమిటి? ఆమె ముసుగు ధరించుకోకపోయినట్లయితే, వెంట్రుకలు కత్తిరించుకోవాలి. లేని వెంట్రుకలను ఎలా కత్తిరించుకుంటారు? దానికి విరుద్ధంగా 15వ వచనములో ఏమని వ్రాయబడింది? వెంట్రుకలు, ముసుగు, ఒకదానితో మరొకటి దగ్గరి సంబంధం కలిగిఉన్నాయి. వెంట్రుకలు మహిళకు ఉన్నందుచేత ఆమె ముసుగు ధరించవలసిన అవసరత ఉన్నది.

         గమనించండి, శ్రోతలూ, ముసుగు కేవలం కోరింథీ సంఘానికి, బహిరంగ ప్రార్ధన, ఆరాధన సమావేశాలకు మాత్రమే చెందిన విషయం కాదు. ఇది వెంట్రుకలకు మించి ప్రాముఖ్యమైన అంశము. విశ్వాసులైన మహిళలు ధరించే ముసుగు ఆమె యొక్క ఆధ్యాత్మిక స్థితికి గుర్తు. ఆమెను చూచిన వారందరూ ఆమె క్రీస్తునకు ప్రత్యేకించబడిన మహిళ అని, ప్రభువు కోసం పరిశుద్ధపరచబడిన, ప్రత్యేకింకబడిన మహిళ అని క్రియలతో సాక్ష్యమిస్తుంది.   

ముగింపులో కొన్ని ముఖ్యమైన సంగతులు, సత్యములు:

దేవుడు తన చట్టం ప్రకారం, తన చిత్తం ప్రకారం పురుషుని బాధ్యతలు పురుషునికి, మహిళ  బాధ్యతలు ఆమెకు అప్పగించి, ఏర్పాటు చేశాడు. ఎవరి పని, పరిచర్య, బాధ్యత వారు నెరవేరిస్తేనే దేవుని వాక్యమునకు లోబడినట్టు. ఒకరి పని మరొకరు చేయకూడదు. పాపమువల్ల వాటిని తారుమారు చేసుకుంటున్నాము. అది కూడా పాప ఫలితములో ఒక భాగము. అందు చేత దైవజనుడు పౌలు దేవునిప్రత్యక్షత పొంది, పరిశుద్ధాత్మ ప్రేరితుడై దేవుని హితబోధ, ఆయన చిత్తమును స్పస్టముగా బోధిస్తు న్నాడు. కుటుంబములో కూడా ఎవరి బాధ్యతలు వారికి స్పష్టంగా దేవుని వాక్యము బోధిస్తున్నది. ఈ బోధ స్త్రీని, లేదా మహిళను కించపరచడానికి చెప్పబడిన మాటలు కానేకాదు. ఆమె సరియైన స్థానము చూపించడానికి చెప్పబడిన సత్యములు. అది మహిళ బాధ్యత అయినపుడు, పురుషునికి మరెక్కువ బాధ్యతలు ఇవ్వబడ్డాయి. తీర్పు సమయములో ఎవరి లెక్క వారు అప్పగించాలి. ఎవరికి ఇవ్వబడిన బాధ్యత ప్రకారం ప్రభువు లెక్క తీసుకుంటాడు. ఈ రెండు అనగా, మునుపటి, ఈ రోజుటి అధ్యయనముల సారాంశం గమనించండి:

1.     ముసుగునకు గల నిత్యమైన స్థిరమైన ఆధారాలు. క్రైస్తవ మహిళకు ప్రభువు ఆదేశించిన ముసుగు దేవుని పునాది ఆధారంగా ఇవ్వబడ్డ క్రమము. సామాజిక జీవితములో, పురుష, స్త్రీల మధ్య గల భేదాలను చూపుతుంది.

2.    ముసుగునకు కొన్ని విశేషమైన అర్ధములు ఉన్నవి. ముసుగు ఆమె పరిశుద్ధపరచబడిందని చెప్పడానికి, దేవునికి లోబడి ఉన్నదని,  ఆమెకు అధికారమున్నదని చెప్పడానికి గుర్తు.

3.    ముసుగునకు ప్రత్యేకమైన అన్వయము ఉన్నది. ఈ అన్వయము కేవలము కోరింథీ సంఘానికి చెందినది కాదు, బహిరంగ ప్రార్ధన, ఆరాధనలకు మాత్రమే చెందినది కాదు. ఎల్లప్పటికి అన్నికాలములకు, అన్నిసంఘములకు చెందింది. వెంట్రుకలు ఆమెకు కప్పుదలగా ఉన్నాయి.

దేవుని వాక్యమును స్పష్టముగా విని తెలుసుకున్నాము. ఇక విధేయత చూపడం మన వంతు, బాధ్యత. అది చేయడానికి ఆవరమైనంత మహా కృప సర్వకృపానిధి అయిన దేవుడే మనకందరికీ అనుగ్రహించుగాక, అమెన్!         

 

 

          

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...