I కొరింథీ అధ్యయనం-35 11:1-16~మొదటి భాగం క్రైస్తవ మహిళలు తలమీద ముసుగు ధరించడం-మొదటి భాగం

 

I కొరింథీ అధ్యయనం-35   11:1-16~మొదటి భాగం

క్రైస్తవ మహిళలు తలమీద ముసుగు ధరించడం-మొదటి భాగం

         సజీవ నిరీక్షణ శ్రోతలలో ఎక్కువ మహిళలు ఉండవచ్చని అంచనా వేస్తున్నాము. సంఘపు ఆరాధనల్లో, ప్రార్థన 

విజ్ఞాపన కూటాల్లో ఎక్కువ మహిళలు ఉండడం తెలిసిన సంగతే! సర్వశక్తిగల దేవుడు, సర్వసృష్టికర్తకు మహిళపట్ల 

ఉన్న ఉద్దేశం ఏమిటి? మహిళలు పురుషులకంటే ఎక్కువా? తక్కువా? క్రింది స్థానామా, పైస్థానమా? దేవుని పరిశుద్ధ 

గ్రంధం ఎంత స్పష్టంగా ఈ అంశమును మనకు బోధచేస్తున్నదో, ఈ పూట అధ్యయనం చేద్దాం. పురుషులు స్త్రీలు, 

అందరూ, రేడియోకు దగ్గరగా వచ్చి, నెమ్మదిగా కూర్చోండి, మీ బైబిల్ మీ ముందు ఒక పెన్సిల్తో బాటు పెట్టుకోవడం 

మర్చిపోకండి. లేఖన భాగం I కోరింథీ 11:2-16. అంశం క్రైస్తవ మహిళలు తలమీద ముసుగు ధరించడం. ముందుగా 

ప్రార్ధించుకుందాం. ప్రార్థన:

            ఈ లేఖన భాగములో ఈ నాడు కూడా ఎందుకు క్రైస్తవ మహిళలు ముసుగు ధరించాలో కొన్ని కారణాలు స్పష్టం చేయబడుతున్నాయి.  మొదటి కారణం, స్త్రీ ముసుగు ధరించడానికి గల నిత్యమైన ఆధారాలు.  మొదటిగా దైవికమైన ఆధారాలను పరిశీలిద్దాం. I కోరింథీ 11:2-3 వచనాలు మీ బైబిల్లో గమనించండి, బిగ్గరగా చదవడానికి వీలుంటే, నాతోబాటు మీరు కూడా చదవండి. 2. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. 3. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.”  ఆపో. మన ముందుంచుతూ, బోధిస్తున్న దైవికమైన క్రమము ఏమిటంటే, దేవుడు సమస్తములో సమస్తమైఉన్నాడు. ఆయన తరువాత  యేసు క్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆయనే దేవునికి మానవునికి మధ్యవర్తి. ఆదికాండములో మనము నేర్చుకునే సత్యము దేవుని సృష్టి అంతటికీ పురుషుడు కిరీటం. స్త్రీ పురుషునికి సాటియయిన సహకారి. మానవాళి అంతటికీ  ఇది దేవుని క్రమమని ఆపో. మనకు ఎత్తి చూపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు ఉన్నాడు. మానవుడు ఉన్నాడు. స్త్రీ ఉన్నది. ఈ క్రమమునుబట్టి ముసుగు దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడింది. ఒకరికంటే మరొకరు ఎక్కువ, తక్కువ అనే అంశమునకు ప్రాధాన్యత లేదు, గాని, ఒకరితో మరొకరికి ఉన్న సంబంధం ముఖ్యమైనది. తండ్రి సమస్తములో సమస్తమైనప్పటికీ, కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ఆయనకు, మానవునికి మధ్య మధ్యవర్తి. ప్రభువు ఆ స్థానములో ఉండడానికి తగ్గించుకున్నాడు, కానీ తక్కువ వాడు కాదు. అదే విధంగా పురుషులను స్త్రీలను చూచినపుడు, హోదా, అంతస్తులు లేవు కానీ సంబంధము ప్రాముఖ్యమైనది.ఈ సంబంధములో శిరసత్వము ఉన్నది, ఒకరితో మరొకరు కలిసి పనిచేయడం కనిపిస్తున్నది. ముసుగునకు ఈ దైవిక క్రమము ఒక ఆధారము. ఇప్పుడు సామాజిక సంబంధాలలో ఉన్న ఆధారాలు పరిశీలిద్దాం. 8-9 వచనాలు 8. ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు. 9. మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.  ఒక్క సారి ఆదికాండమును పరిశీలిస్తే, మొదట ఆదాము సృష్టించబడ్డాడు, ఆయన శిరస్సు అని అర్థమవుతుంది.  తరువాత హవ్వ సృష్టించబడిందని వెంటనే అర్థమవుతుంది. అప్పుడు దేవుడు స్త్రీని ఆదాము వద్దకు తీసుకొని వచ్చి, ఆయనకు సహాయకారిగా ఉండాలని నిర్ణయించాడు. ఆమె సృష్టిలో ఈ పాత్రను పోషించి ఈ బాధ్యతను నిర్వహించాలి. మనకది హాని కలిగిస్తే తప్ప, దేవుడు నిర్ణయించిన ఈ దైవిక క్రమమును మన సామాజిక సంబంధాలలో విస్మరించలేము. మన సామాజిక సంబంధాలలో దేవుడు సృష్టిలో ముసుగును నిర్దేశించాడు. ఇక స్వాభావికమైన భేదమును అధ్యయనం చేద్దాం. జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ? ఈ విషయం 14,15 వచనాల్లో ఉన్నది. 14. పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా? 15. స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.”  సృష్టి స్వభావ సిద్ధంగా మనకు బోధించేది మనము తెలుసుకుంటున్నామా? సృష్టి దగ్గర కూర్చొని సావధానంగా విని మనము నేర్చుకోవాలి. పురుషులు స్త్రీల మధ్యలో స్వాభావికంగా భేదాలున్నాయి. పురుషులు స్వభావసిద్ధంగానే వెంట్రుకలు పొడవుగా పెంచుకోరు. పొడవైన వెంట్రుకలు పురుషునికి అవమానకరంగా ఉంటాయి. స్త్రీ వెంట్రుకలు కత్తిరించుకోదు. వెంట్రుకలు ఆమెకు మహిమ, ఘనత. అదే ఆమెకు నిరాడంబరత్వమును, వినయమును సంతరింపచేస్తాయి. ముసుగు ఈ స్వాభావిక భేదమును సూచిస్తుంది. కాబట్టి, స్త్రీకి ముసుగును ప్రభువు నిర్దేశించడానికి గల నిత్యమైన ఆధారాలు, దైవికమైన ఆధారాలు, సామాజికమైన ఆధారాలు. స్వాభావికమైన ఆధారాలు, ఇంతవరకు మనము క్షుణ్ణంగా అధ్యయనం చేశాము.

         ఇక రెండవ కారణం ముసుగు యొక్క నిర్దిష్టమైన భావము, ప్రాముఖ్యత. ఒక స్త్రీ పరిశుద్ధ పరచబడినదని చెప్పడానికి ముసుగు ఒక గురుతు. 4-6 వచనాలు. “4. ఏ పురుషుడు తలమీద ముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. 5. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. 6. స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.”  మొదటి కోరింథీ పత్రిక సారాంశమును గుర్తుకు తెచ్చు కుంటే, యేసు క్రీస్తు ప్రభువు మనకు పరిశుద్ధతను అనుగ్రహించినవాడు. అదే రీతిగా ఒక స్త్రీ ధరించే ముసుగు ఆమె ప్రభువునందు పరిశుద్ధపరచబడినదని గుర్తు. పౌలు జీవించిన దినాల్లో ఒక స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకుంటే, ఆమె వ్యభిచారము చేసిన స్త్రీ అని, అపనమ్మకమైన స్త్రీ అని గుర్తు. ప్రస్తుతపు అధునాతన జీవనములో స్త్రీ వెంట్రుకలు కత్తిరించుకోవడం, నిజముగా పూర్తిగా ప్రభువునకు విధేయులైన స్త్రీల దృష్టిలో అంగీకారముకాదు. ఇది కొన్ని పాశ్చాత్య దేశాలనుండి మొదటి ప్రపంచ యుధ్ధము తరువాత అంతటా ప్రాకింది. ఆపో. పౌలు ఇస్తున్న ఉపదేశం మనమంతా గ్రహించాలి. “ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.”  5వ వచనం. ఏ స్త్రీ అయినా ముసుగు వేసుకోకుండా దైవసన్నిధిలోనికి రావడానికి తెగించినట్లైతే, ఒక వ్యభిచారిణి దైవసన్నిధిలోనికి వచ్చినట్ట్లే అని ఆ దినాల్లో భావన. 6వ వచనములో స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను” అనే మాటలు గమనించండి. ఈ ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే, వెంట్రుకలు కత్తిరించుకొనడంతో సమానం. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకోవడం ఆమెకు అవమానమని పౌలు వాదన.

         ఈ విషయం నిర్దిష్టంగా గ్రహించాలి. స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అవమానకరమా కాదా, అనే ప్రశ్నను పౌలు లేవదీయడంలేదు. అది అవమానకరమే అని తేటపరుస్తున్నాడు. ఈ దినాల్లో స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకోవడం ఆమెకు అవమానకరం కాదని వాదించే కొందరు ఉన్నారు. ఫర్వా లేదు కత్తిరించుకోవచ్చు అని చెప్పేవారుకూడా ఉన్నారు. కానీ బైబిల్ బోధించే ఉపదేశం అది కాదు. ఒక క్రైస్తవ స్త్రీకి తల వెంట్రుకలు కత్తిరించుకోవడం అవమానమని మనమంతా గ్రహించాలని పౌలు కోరుతూ ఉన్నాడు. అందుచేత ఆమె దైవసన్నిధికి వచ్చినపుడు ముసుగు ధరించాలి. అది ఆమె పరిశుద్ధతకు గుర్తు. తన ముసుగు ద్వారా క్రైస్తవ స్త్రీ తన చుట్టూ ఉన్న పాపపు సంస్కృతితో, జీవన విధానముతో తనకు సంబంధం లేదని, వారినుండి వెరైఉన్నదని సాక్షమిస్తున్నది. దాని ద్వారా ఆమె యేసుక్రీస్తు ప్రభువుకోసం పరిశుద్ధ పరచబడిందని చెప్పకనే చెబుతున్నది. అంతే కాదు, అనుదిన జీవితములో ముసుగు ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది.

         మరో విషయం, ముసుగు లోబడుటకు గుర్తుగా ఉంటుంది. 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.”   మొదటిగా సృష్టించబడినందుచేత పురుషుడు దేవుని మహిమకు ప్రతిబింబం. పురుషుడి తరువాత సృష్టించబడి, ఆయనకు సహకారిగా ఉండడానికి సృష్టించబడినందు చేత, ఆమెపురుషుని మహిమకు ప్రతిబింబం. ఇప్పుడు స్త్రీల స్వేచ్చాఉద్యమం గురించి ఆలోచించి జాగ్రతగా గ్రహించుకుందాం. స్త్రీ తన స్థానమును ఎంతగా క్రమక్రమంగా హెచ్చించుకుంటూ పోయిందంటే, అన్నింటిలో అన్నింటిని మించి ప్రతి రంగములో స్త్రీలు అత్యున్నత స్థాయి చేరాలనే ఆ ఉద్యమం ప్రయత్నిస్తున్నది. ప్రధాన మంత్రి స్థానములో ఉండి అధికారము చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న సంగతి సర్వత్ర తెలిసిందే. వారు ఆ స్థానాల్లో చేయలేరని కాదు. చేయగలరు. కానీ అలా చేయడo వల్ల స్త్రీ తానుండవలసిన స్థలములో ఉండడంలేదు. దేవుని సంఘములో కూడా వారు పురుషులతో సమానంగా పోటీ పడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. స్త్రీలు పాస్టర్ గా కొన్ని చోట్ల సేవ చేస్తూఉన్నారు. కానీ దేవుడు స్త్రీకి ఇచ్చిన స్థానం ముసుగు ధరించడం. ప్రభువు ఆమెకిచ్చిన స్థానములో ఉండి ఆయన చెప్పిన సేవ చేయడం.  

         ముసుగు యొక్క మరొక గుర్తు అధికారం. 10వ వచనం. “10. ఇందువలన దేవదూతలనుబట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను.”  స్త్రీకి ఆమె అధికారం ముసుగులో ఉంటుంది. ఈ అధికారం ఆమె తలమీద ఉండాలి. దాని అర్ధం రెండు విధాలుగా ఉంది. ఒకటి, ముసుగువల్ల ఆమె దేవుని సన్నిధికి రావడానికి అధికారం పొందుతుంది. రెండు, దేవుడు ఏర్పాటు చేసిన క్రమమును గుర్తించి ముసుగు వలన  ఆమె దేవుని క్రమము ప్రకారము పురుషుడు ఆమెకు తలగా ఉన్నాడనే అధికారమును పొందుతుంది. ఆ విధంగా ముసుగు స్త్రీలకే కాదు, సంఘములోని పురుషులకు కూడా వర్తిస్తుంది. ఎలాగంటే, దైవికమైన క్రమము ప్రకారము పురుషులు వారి స్థానములో ఉండాలని, వారి బాధ్యతలను నిర్వహించాలని, ముసుగు హెచ్చరిస్తుంది. ఈ బోధను గుర్తించి దాన్ని అంగీకరించడములో మనకివ్వబడిన బాధ్యతను చేపడుతున్నామని దీని అర్ధం. కాబట్టి, దైవిక క్రమములో పురుషులైనా, స్త్రీలైనా, మనస్ఫూర్తిగా మన బాధ్యతలను చేపట్టాలి. ఈ వాక్యములో దేవదూతలగురించి చెప్పబడినది గదా! యెషయ గ్రంధములోని 6వ అధ్యాయములో దేవదూతల గురించి వ్రాయబడిన దృక్పథమును గుర్తుంచుకోవాలి. యెషయ ప్రవక్త చూచిన దర్శనములో దేవుని సన్నిధిలో కెరూబులు తమ్మును తాము కప్పుకున్నారు. దైవ సన్నిధిలో కెరూబులు కప్పుకున్నట్టే, స్త్రీలు వారి మాదిరిని పోలి నడుచుకోవాలని పౌలు ఉపదేశం.

         ముసుగు, అధికారమునకు లోబడక పోవడం ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ముసుగు యొక్క ప్రాముఖ్యత ఈ విధంగా సంక్షిప్తంగా గ్రహింపవచ్చు. ముసుగు పరిశుద్ధపరచబడుటను సూచిస్తుంది. సరైన లోబడుటను సూచిస్తుంది, అధికారమును సూచిస్తుంది. ముసుగును స్త్రీలు ధరించడానికి గల రెండవ కారణములో ఈ మూడు ఇమిడిఉన్నాయి. దేవుని పరిశుద్ధ లేఖనములకు సరైన స్పందన, నిజమైన విధేయత, మనస్ఫూర్తిగా దేవునికి లోబడుటకు పురుషులకు వారి బాధ్యత విషయములో, స్త్రీలకు వారి బాధ్యతలో పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయము చేయుగాక, అమెన్!       

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...