క్రిస్మస్ ప్రత్యేక ధ్యానము “దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి-2 ?”
క్రిస్మస్ ప్రత్యేక ధ్యానము-2
“దేవుడే మానవుడుగా జన్మించవలసిన అవసరత ఏమిటి?”
శ్రోతలందరికీ క్రిస్మస్ శుభము, సంతోషము, సమాధానము కలుగునుగాక! క్రొత్త బట్టలు, ఇంటికి క్రొత్త పేయింట్, అలంకరణ, డెకరేషన్ ఉంటేనే క్రిస్మస్ కాదు, ఇవేవీ లేకున్నా క్రీస్తు రక్షకుడు నీ హృదయములో జీవితములో, కుటుంబములో జీవిస్తున్నట్లయితే అదే అసలు క్రిస్మస్! దేవుడు మానవుడుగా, మానవ స్వభావముతో మన మధ్యలో యేసు క్రీస్తుగా జన్మించడానికి గల కారణాలు కొన్నింటిని అధ్యయనం చేశాం. ఈ క్రిస్మస్ రోజున మరి కొన్ని అధ్యయనం చేద్దాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి.
మూడవ కారణం: యేసు క్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి మానవ శరీరమును ధరించాడు. అది పాపములేని మానవ శరీరము, స్వభావము. మత్తయి సువార్త 5:17,18 గమనించండి: “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పి పోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” ధర్మశాస్త్రములోని ప్రతి ఆజ్ఞను, ప్రతి చట్టమును నెరవేర్చిన ఏకైక దైవ మానవుడు యేసు క్రీస్తే! మానవులు ప్రతి ఒక్కరూ, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారే! అందులో నీవు నేను కూడా ఉన్నాము. ఆయనలో ఏ పాపము లేదని లేఖనాల్లో అనేక చోట్ల రుజువయ్యింది. పాపములేని పరిశుద్ధమైన, నిష్కళంకమైన జీవితము ప్రభువు జీవించి ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా నెరవేర్చాడు.
నాలుగవ కారణము: ఈ భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపమునకు పరిహారముగా మరణించడానికి యేసు క్రీస్తు ప్రభువు శరీరధారి అయ్యాడు. గమనించండి శ్రోతలూ, మొట్టమొదట పాపము లోకములో ప్రవేశించినపుడు దేవుడు పాపికి బదులు మరొకరు పరిహారము చేయడాన్ని మొదలు పెట్టాడు. కొందరు ‘నాకొరకు మరొకరు పరిహారం చేయడమేమిటి, అది నేనొప్పుకోను’, అంటూ ఉంటారు. లేవీయకాండము లోని బలులు ప్రత్యామ్నాయ పరిహారమును సూచిస్తున్నాయి. జంతువుల రక్తము పాపమును పరిహరించదు. నీ పాపము కోసం నీవే మరణించినా నీ పాపము పరిహరించబడదు. ఏ మానవుడు మరణించినా పాపమునకు పరిహారము కలుగదు. ఎందుకు? పరిశుద్ధమైన బలి, పరిహారము చెల్లించాలి. అది కేవలము పరిపూర్ణమైన పరిశుద్ధుడైన రక్షకుడు యేసు క్రీస్తు మాత్రమే చెల్లించగలడు. అందుకే ఆయన మానవునిగా జన్మించవలసి వచ్చింది. మత్తయి సువార్త 20:28 “మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.” అనేకులకు ప్రతిగా అన్న మాటలను గమనించారా? వారి స్థానములో, వారికి బదులుగా అని అర్ధం. ప్రియ మిత్రమా, యేసు క్రీస్తు నీ స్థానములో నీ పాపమునకు పరిహారము చెల్లించడానికి మానవునిగా జన్మించాడు.
5వ కారణము, ఆయన క్రొత్త నిబంధనను తీసుకురావడానికి శరీర ధారి అయ్యాడు. యేసు క్రీస్తు ప్రభువు పాత నిబంధనలోని ప్రతి ఆజ్ఞను, ప్రతి చట్టమును నెరవేర్చడమే కూకుండా, క్రొత్త నిబంధనను ఆరంభించి నెరవేర్చాడు. మత్తయి 26:28 గమనించండి: “వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” ఇది క్రొత్త నిబంధన రక్తము, ఆయనతోనే ఆరంభమయ్యింది. హెబ్రీ. 9:22లో లేఖనమేమి చెబుతున్నది? “రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును.” నీ పాపపు క్షమాపణ కోసం యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమును చిందించాడు. ఆయన జన్మించింది అందుకే! నీవు ఈ నిబంధన యేసు క్రీస్తుతో చేసి నీ పాపములకు క్షమాపణ పొందావా?
6వ కారణము, మన బధ్ధ శత్రువు సైతాను, అపవాది క్రియలు నశింపచేయడానికి యేసు క్రీస్తు ప్రభువు మానవడుగా జన్మించాడు. I యోహాను పత్రిక 3:8 “అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.” సైతాను దేవునికి, ఆయన ప్రజలకు శత్రువు. ప్రస్తుతము వాడు, వాని దూతలు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు జన్మించక ముందు ఇంకా చాలా ఘోరంగా నాశనమును కలిగిoచారు. మార్కు సువార్తలోని మొదటి కొన్ని అధ్యా యాలు ఒక్కసారి చదవండి, ప్రభువు వెళ్ళిన ప్రతిచోట దయ్యములను వెళ్లగొట్టాడు. సాతాను శక్తులనుండి వేలాదిమందిని విడిపించాడు. 5వ అధ్యాయములో దయ్యముల సైన్యం పట్టి పీడిస్తున్న మనిషిని రాత్రి ప్రయాణం చేసి కేవలం ఆయనను విముక్తుణ్ణి చేయడానికే గదరెనీయుల దేశం వెళ్ళాడు ప్రభువు. 2000 పందులకంటే ఆ ఒక్కణ్నే విలువైన వ్యక్తిగా చేసుకున్న ప్రభువు మనలను కూడా సైతాను శక్తులనుండి విడిపించడానికి శక్తిమంతుడు. హల్లెలూయ!
7వ కారణం, లోకమును నీతియుక్తముగా తీర్పు తీర్చడానికి యేసు క్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. యోహాను 5:22. “తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు;…” తీర్పు తీర్చే సర్వాధికారం యేసు క్రీస్తు ప్రభువునకు తండ్రి ఇచ్చాడు. ఆయనను న్యాయాధిపతిగా ఒప్పుకోక తప్పదు. అదే అధ్యాయము 27వ వచనములో లేఖనమేమి సెలవిస్తున్నది? “ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.” ఆయన మానవ శరీరము ధరించాడు, మానవునిగా జీవించాడు గనుక ఆయన తీర్పులు న్యాయమైనవి. మనుష్యకుమారుడు అని తనవిషయం తాను ఎంతో ఇష్టపూర్వకంగా ప్రభువు సంబోధించుకున్నారు. మనుష్యజాతితో ప్రభువునకున్న సంబంధాన్ని స్పష్టంగా బోధించేది ఈ మాటే! ప్రభువు మానవ శరీరం ధరించకపోతే ఆయనకు మనుష్యకుమారుడు అనే బిరుదు ఉండదు. ఆయన జడ్జ్ గా ఈభూమ్మీద అడుగుపెట్టినపుడు, మానవాళి అంతా ఆయనముందు మోకరిల్లేటపుడు నీవెక్కడ ఉంటావు? నీవిప్పుడు యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా విశ్వసించి మనుష్యులముందు ఒప్పుకుంటే, ఆయన నిన్ను తనకుమారుడుగా ఒప్పుకుంటాడు.
8వ కారణం, తన యందు విశ్వాసముంచిన వారితో సహానుభవము, సానుభూతి కలిగిన ప్రధాన యాజకుడుగా ఉండడానికి యేసు క్రీస్తు మానవుడుగా జన్మించాడు. యేసు క్రీస్తు ప్రభువు మానవ శరీరపు బంధకాలతో పరిమితులతో జీవించినందు చేత, మీరు, నేను ఎదుర్కుంటున్న ప్రతి శోధన, బాధ, నింద, వ్యతిరేకత, క్లిష్టసమస్యలు అన్నీ ప్రభువు స్వయంగా ఎదుర్కొని జయించినవాడు. హెబ్రీ. 4:14-16 “ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.”
9వ కారణము, విశ్వాసులైన వారికి మాదిరిగా మార్గదర్శకంగా ఉండడానికి ప్రభువు మానవుడుగా జన్మించాడు. I యోహాను 2:6. “ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.” ప్రభువు మనకోసం శ్రేష్టమైన మాదిరి చూపించాడు. ఈ లోకములో ఎవరిని చూచి, వారిని వెంబడించలేము, కానీ ప్రభువును చూస్తూ, ఆయన చూపించిన మాదిరిని వెంబడిస్తూ జీవించవచ్చు. I పేతురు 2:21. “ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను”
10వ కారణము, యేసు క్రీస్తు ప్రభువు మానవజాతిని పరలోకపు భాగ్యము, భావిజీవితం కోసం సిద్ధపరచడానికి మానవుడుగా జన్మించాడు. దేవుని కుమారుడు మానవుడుగా జన్మించి, మరణించి, పునరుధ్ధానుడై తండ్రి కుడిప్రక్కలో కూర్చొని తనవారికోసం విజ్ఞాపన చేస్తున్నందుచేత ఆయనను పరిపూర్ణంగా విశ్వసించి నమ్మకంగా వెంబడించే వారిని తనతో బాటు పరలోకములో చేర్చుకోవాలని ప్రభువు మానవశరీరం ధరించాడు. ప్రభువు పరిపూర్ణుడైనట్టు ఒకానొక రోజు మనము ఆయనలాగా మార్చబడతాము, హల్లెలూయ! I యోహాను పత్రిక 3:2లో మన భవిష్యత్తు నిర్ణయించబడింది. “ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.” ఇది ఎంతగొప్ప నిరీక్షణ! ఇదే సజీవ నిరీక్షణ!! ఆదాము మనకిచ్చిన పాపపు స్వభావముతో ఉన్న మనలను యేసు క్రీస్తు ప్రభువు తన పరిశుద్ధ, నూతన స్వభావములోనికి మనలను మార్చడానికి ప్రభువు మానవడుగా జన్మించాడు. ఆపో. పౌలు ఫిలిప్పీ 3:21లో మన మంటి శరీరములను యేసయ్య ఏ విధంగా మార్చబోతున్నాడో చెప్పాడు. “సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.”
యేసు క్రీస్తు ప్రభువు, పరిపూర్ణ పరిశుద్ధుడైన దైవ కుమారుడు, మానవుడుగా జన్మించడానికి 10 కారణాలు అధ్యయనం చేశాం. ప్రభువు చేసిన ఈ అత్యంత ఘనమైన క్రియను హృదయపూర్వకంగా గ్రహించి, నమ్మి, ప్రభువుతో అనుదినము నడవడానికి అవసరమైనత కృప ప్రభువే స్వయంగా మనలో ప్రతి ఓక్కరికీ అనుగ్రహించుగాక!
No comments:
Post a Comment