I కొరింథీ అధ్యయనం-23 7:25-40
వివాహానికి అవసరమయ్యే ఉపదేశం-2
క్రైస్తవ్యం అంటే ఒక మతము, ఆచారము అనుకుంటున్నారా? కాదు, ఇది విశ్వాసానికి హృదయానికి
సంబంధించింది. మొదటి శతాబ్దములో జీవించిన క్రైస్తవులు వారి విశ్వాసము కోసం ప్రాణాలిచ్చారు. యేసు
ప్రభువు ఈరోజో రేపో వచ్చేస్తున్నారని నమ్మి ఎంతో సంతోషంగా, విశ్వాసమును కాపాడుకుంటూ శ్రమలను
సంతోషంగా సహిస్తూ, ప్రభువును ఎదుర్కోవాలనే బలమైన కోరికతో జీవించేవారు. ఈనాటి మన క్రైస్తవ
విశ్వాసానికి ఆనాటి వారి విశ్వాసానికి ఎంత బేధముందో గమనిస్తున్నారా?
వివాహానికి అవసరమయ్యే ఉపదేశమును ధ్యానిస్తున్నాము. I కోరింథీ. 7:25-40లో వివాహము గురించి దేవుడు ఇచ్చిన ఆదేశం, ఆజ్ఞ ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని ఆలోచనలు అధ్యయనం చేస్తూ ఉన్నాము. మునుపటి అధ్యయనములో మొదటి ఆలోచనను గూర్చి తెలుసుకున్నాము. మొదటి ఆలోచన, ప్రస్తుతమున్న ఇబ్బంది. వివాహమైనప్పటికీ వివాహమే అన్నింటికంటే ప్రాముఖ్యం అనే ఆలోచనలో ఉండవద్దని పౌలుగారి ఉపదేశం. I కోరింథీ 7:29-31 గమనించండి. “సహోదరులారా, నేను చెప్పునదే మనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.” ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యము. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో సాధారణమైన జీవితం, నిరాడంబరత, నిబద్ధత దారుణంగా లోపించింది. ఆపో. పౌలు మాటలు చాలా స్ఫూర్తినిచ్చే రీతిగా ఉన్నాయి. “ఈ లోకపు నటన గతించుచున్నది” అనే మాటలను మీ చెవులలో నాటనీయండి. అది వేష భాషలలోనైనా, వ్యక్తిగత సంబంధాలలోనైనా, సరళత, సౌమ్యత, సాధుభావము క్రీస్తు రక్షకుని శిష్యులకు అత్యవసరము. పైకి కనిపించే నటన ప్రభువు తిరిగి వచ్చిన తరువాత ఉండదు. II కోరింథీ పత్రిక 5:10 గమనించండి. వ్రాసుకొని మీ తీరిక సమయములో ధ్యానించండి. II కోరింథీ పత్రిక 5:10 “దేహమందున్నను దేహమును విడిచినను, ఆయన కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.” II కోరింథీ 5:10 పౌలు ప్రభువునకిష్టుడుగా జీవించాలని
ఎంతో బలంగా కోరుకుంటున్నట్టు సాక్ష్యమిస్తున్నాడు. వివాహము విషయములో కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనమంతా లెక్క చెప్పవలసి ఉంటుంది. నటన అంతా గతించి పోయే సమయం అతి త్వరలో ఉన్నది కనుక వివాహమైనవారు వివాహము కానట్టుగా భావించుకోవాలని పౌలు ఉపదేశిస్తున్నాడు. అనగా వివాహములోని బాధ్యతలు నెరవేర్చవద్దని కాదు. వివాహములో ఉండే ఆనందము, సంతోషమును దేవునికంటే ఎక్కువగా ప్రేమించవద్దని అర్ధము. ఇది భార్య భర్తలిద్దరికీ వర్తిస్తుంది. ఇద్దరూ ప్రభువును ప్రేమించి ఆయనకోసం వారి హృదయాలు పరిపూర్ణంగా సమర్పించాలని అర్ధం. కానీ ఎందరో ప్రభువును ప్రేమిస్తున్నామని చెబుతూ కుటుంబమును విస్మరించినవారున్నారు. పాపములో పడిపోయి అపవిత్రతలో జీవిస్తున్నారు. ప్రియ సోదరుడా, సోదరీ, దేవుని వాక్యములోని శక్తిని ఆశ్రయించు. పాపమును ఒప్పుకో, పశ్చాత్తాపముతో వేడుకొని ప్రభువు యెదుట క్షమాపణ పొందు.
ప్రియ సోదరీ సోదరులారా, వ్యక్తిగత పరిశుద్ధత, పవిత్రత కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది. యేసు క్రీస్తు ప్రభువును మిక్కుటంగా ప్రాణముకంటే ఎక్కువగా మనమంతా ప్రేమించాలని ఆపో. హెచ్చరిస్తున్నాడు. మన హృదయాలు, మనసులు దేవుని పరిశుద్ధాత్మునితో ఆయన ద్వారా, యేసు క్రీస్తు ప్రభువుతో, పరమ తండ్రితో ప్రతి క్షణం సహవాసము కలిగి ఉండాలి. ఈ సహవాసములో మనము పరిశుద్ధపరచబడతాము. పరిశుద్ధ గ్రంధం ఏమని బోధిస్తుందో జాగ్రతగా గమనించాలి. I యోహాను పత్రిక 1:6-9. “ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చు కొందుము;మరియు మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” I యోహాను పత్రిక 1:6-9 వెలుగులో నడవడమంటే సత్యమును ఒప్పుకొని, పాపమును పాపముగా ఒప్పుకొని, దేవుని యెదుట క్షమాపణ పొంది ఒకరితో మరొకరు సహవాసములో జీవించడం.
భార్య భర్తలు వ్యక్తిగతముగా పరిశుద్ధంగా జీవిస్తున్నపుడే వారి వివాహము, కుటుంబము పరిశుద్ధంగా ఉంటుంది. అప్పుడే వారు వారి సంతానమును ప్రభువు శిక్షలో, బోధలో పెంచగలుగుతారు.
ప్రియ యవ్వన దంపతులారా, మీ జీవితాలను, హృదయాలను, దేవుని శక్తిగల వాక్యపువెలుగులో పరీక్షించుకొనండి. పభువు మీకు కుమారులు కుమార్తెలను అనుగ్రహించినపుడు అది చాలా విశిష్టమైన బాధ్యత. ఒక క్రొత్త తరమును ప్రభువు మీకప్పగిస్తున్నాడు. చాలా జాగ్రతగా సిద్ధపడవలసి ఉంటుంది. మీ బిడ్డలను ప్రభువు శిక్షలో, వాక్యపు క్రమములో పరిశుద్ధతలో, పెంచకపోతే దేవుడనుగ్రహించిన అతిగొప్ప బాధ్యతను మీరు విస్మరిస్తున్నట్టు. వివాహము గొప్ప బాధ్యతాయుతమైన విషయము. దేవుని వాక్యము వివాహము విషయము బోధిస్తున్న ఉపదేశమును అతి జాగ్రతగా మనమంతా గమనించాలి. ఏ వయసులో ఉన్న సరే, కుటుంబములో పరిశుద్ధత, పవిత్రత, దేవుని సన్నిధి ఉండేలా ప్రతి విశ్వాసి జాగ్రతలు తీసుకోవాలి.
I కోరింథీ 7:39-40 “కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించు చున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించు చున్నాడు. భార్య తన భర్త బ్రదికియున్నంతకాలము బద్ధురాలైయుండును, భర్త మృతిపొందినయెడల ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువు నందు మాత్రమే పెండ్లిచేసికొన వలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మనాకును కలిగియున్నదని తలంచుకొనుచున్నాను.” ఈ వాక్యభాగములోని అంశము తల్లితండ్రుల తీర్మానము. తల్లితండ్రులు వారి పిల్లల వివాహవిషయములో బాధ్యత వహిస్తూ ఉంటారు. పౌలు జీవించిన దినాల్లో తన కుమార్తెకు పెండ్లి చేయకుండా ఉండడానికి తండ్రికి అధికారముండేది. ఆ కారణాన్నిబట్టి ఆపో. పౌలు ఈ హెచ్చరిక చేస్తున్నాడు. “ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను,” అనే మాటలు గమనించారా? అవిశ్వాసులతో వివాహమునకు పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఒప్పుకోదు. కాని, ఈ దినాల్లో వివాహము విషయములో అందచందాలు, ఆకర్షణలు, ఆస్తి అంతస్తులు, కులము, రంగు, మొదలైనవన్నీ చూసుకుంటున్నారు కాని విశ్వాసము, పరిశుద్ధత, ప్రభువుతో ఎలాంటి సంబంధము ఉన్నది ఇవి పట్టించుకోవడములేదు. ఎంత దుఃఖకరమైన సంగతికదూ? దేవుని వాక్యమును జాగ్రతగా చదివి, విని, ఆయన ఆజ్ఞలను మనసులో పెట్టుకొని వాటి ప్రకారం మన నిర్ణయాలు చేసుకోవడం చాలా అత్యవసరము. వివాహములోని పరిశుద్ధతను కాపాడి ప్రభువు నందు మాత్రమే వివాహములు చేసి, చేసుకొని, దేవుని మాటలకు విధేయత చూపడానికి అవసరమైనంత కృప అతి పరిశుద్ధుడైన దేవుడే స్వయంగా మనకందరికీ, మనలో ప్రతి ఒక్కొక్కరికీ అనుగ్రహించుగాక, అమెన్!
No comments:
Post a Comment