I కొరింథీ అధ్యయనం-22 7:25-40 వివాహానికి అవసరమయ్యే ఉపదేశం

 

 

 

I కొరింథీ అధ్యయనం-22   7:25-40

వివాహానికి అవసరమయ్యే ఉపదేశం

         మీ పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ పరీక్షించి బుద్ధిమాటలు, హెచ్చరికలు, మరుసటిసారి ఎలాంటి రిజల్ట్ కావాలో చెబుతూ 

ఉంటారుకదా! మరి మన ప్రోగ్రెస్ రిపోర్ట్ సంగతేమిటి? గత కొన్ని నెలలుగా మన ఆత్మీయజీవితములో, ప్రార్థన 

జీవితములో, దేవుని వాక్య పఠనకు విధేయత చూపుతున్నామా? దీని విషయం దేవుడే స్వయంగా తన ఆత్మ ద్వారా 

మనలను గద్దిస్తూఉంటాడు. ఎంతవరకు ప్రభువులో నిలిచి నిలుకడగా ఉన్నామో మనలను మనమే పరీక్షించుకుందాం. 


          దేవుడు హవ్వను నిర్మించి, ఆదాము వద్దకు తెచ్చాక, ప్రభువు చెప్పినదేమిటి? ఆది. 2:24. “కాబట్టి 

పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును….”  “హత్తుకొనును” అనే మాటకు గట్టిగా 

అతికించి, వెల్డింగ్ చేస్తే ఎంత విడదీయలేకుండా ఉంటుందో ఆ విధంగా ఉండాలని.  వివాహమునకు అవసరమైన దేవుని 

వాక్యములోని ఉపదేశమును ఈ పూట అధ్యయనం చేద్దాం. లేఖన భాగము. I కోరింథీ. 7:25-40. వివాహము గురించి 

దేవుడు ఇచ్చిన ఆదేశం, ఆజ్ఞ ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని ఆలోచనలు అధ్యయనం చేద్దాం.

         మొదటి ఆలోచన, ప్రస్తుతమున్న ఇబ్బంది. 25-31 వచనాలు: “కన్యకల విషయమై, ప్రభువుయొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైనవాడనై యుండుటకు ప్రభువు వలన కనికరము పొందినవాడనై నా తాత్పర్యము చెప్పు చున్నాను. ఇప్పటి ఇబ్బందినిబట్టి పురుషుడు తానున్న స్థితిలోనే యుండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై యుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు. అయినను నీవు 

పెండ్లిచేసికొనినను పాపము లేదు, కన్యక పెండ్లిచేసి కొనినను ఆమెకు పాపము లేదు; అయితే అట్టివారికి 

శరీరసంబంధమైన శ్రమలు కలుగును; అవి మీకు కలుగకుండవలెనని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పునదే 

మనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు 

ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఈ లోకము 

అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.”   

రేపటిగూర్చి ఏమీ గట్టిగా చెప్పలేము. నిన్న మనతో ఉన్నవారు ఈరోజులేరు. పౌలు దినాలు కూడా అంతే, ఇంకా 

గడ్డుదినాలు అవి.  ఆదినాల్లో ఎన్నో భయానక పరిస్థితులు ఉండేవి. రోమా ప్రభుత్వము క్రైస్తవ్యానికి విరోధమైనది. 

వారిని వెంటాడి అరెస్టు చేసేవారు. వారిని మైదానాల్లో ఉంచిక్రూరమృగాలతో ఆట ఆడించేవారు. ఎంతోమంది 

చనిపోయేవారు. ఆపో. శరీరములో ఉన్నందుచేత వచ్చిన కష్టాలన్నీ భరించాడు. బలహీనతలు ఎప్పుడూ 

అవరిస్తూనేఉండేవి. ఏదో ఒక మూలనుండి అనారోగ్యతలు చుట్టుముట్టేవి. శరీరములోని బలహీనతలనుబట్టి దినదినం 

ఒక గండంలా గడుస్తూఉండేది.

            శ్రోతలూ, ఇప్పటి ఇబ్బంది ఏమిటో తెలుసా?సమయము మించిపోవడం. తిరిగి జన్మించి, బైబిల్ ను నమ్మి వాక్యప్రకారం జీవించే  ప్రతిఒక్కరూ యేసు ప్రభువు రెండవ రాకడ ఏ క్షణమైనా రావచ్చు అని ఎదురు చూస్తూ ఉండేవారు. సమయము తక్కువగా ఉంది అనే భావనలో మరొక సత్యమున్నది. “ఒక్కటే జీవితం. అది త్వరగా గతించిపోతున్నది. క్రీస్తు కోసం ఏది చేస్తామో అదే చిరకాలముంటుంది.Only One life, it will soon be past. Only what’s done for Christ will last.” దేవుని కాలెండర్ లో ఈ జీవితం ఒక రేణువంత కూడా కాదు. మన ప్రాధాన్యతలను మార్చుకోవాలి.  30,31 వచనాల్లో పౌలు తన ప్రాధాన్యతలు ఏమిటో చెప్పాడు. ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.” జీవితములో అతిప్రాముఖ్యమైన వాటికి మీ ధ్యానమివ్వండి. వాటిని ముందుపెట్టుకొని లౌకికమైన వాటిని, భౌతికమైనవాటిని వెనక్కి నెట్టండి. ఒక ప్రఖ్యాత దైవజనుడు బోధిస్తున్నది గ్రహించుకుందాం. సంతోషాల్లో పాలు పొందినా, మనము శ్రమలపాలైనా, ఈ భూమి మీద మనకు నిలువరమైన పట్టణం లేదని గుర్తు పెట్టుకొని వాటిని మితముగా ఆనందించాలి. త్వరలో మన సుఖసంతోషాలన్నీ ఆగిపోతాయి. మన శ్రమలు కూడా ముగుస్తాయి. లౌకిక సుఖాలకోసం ప్రాకులాడకుండా ఉండడానికి, వాటిమీద ధ్యాస పెట్టుకోకుండా ఉండడానికి, ఈ జీవితము క్షణికము అనే నమ్మకము ప్రేరణ నిస్తుంది. అప్పుడు మన శ్రమలు మనకు అంతపెద్ద శ్రమలుగా అనిపించవు.

         వివాహపు ఉపదేశములో రెండవ ఆలోచన, వ్యక్తిగతమైన సమర్పణ. 32-37 వచనాలు. మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది. మీకు ఉరియొడ్డవలెనని కాదుగాని మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై యుండవలెనని యిది మీ ప్రయోజనము

నిమిత్తమే చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయినయెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చినయెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచినయెడలను, అతడు తన యిష్టముచొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లిచేయ నవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహములేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనినయెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు.  ఒక వ్యక్తి వివాహము చేసుకున్నపుడు కొన్ని బాధ్యతలు ఉంటాయని గ్రహిస్తాడు. తన భార్య విషయo అతనికి బాధ్యత ఉంటుంది, ఆమె అవసరతలు తీర్చడం ఆయన బాధ్యత. సరియైన సమతుల్యం ఉండాలి, ఇది ఎంతో ముఖ్యమైన సంగతి. చాలామంది పురుషులు వారి ఉద్యోగం, వృత్తిని ముందు ఉంచుకుంటారు. చాలామంది భర్తలు ఆర్ధికంగా స్థిరపడాలని వారికొక రాజ్యము కట్టుకున్నట్టుగా శ్రమపడుతూ ఉంటారు. వారి భార్యలు వారంతట వారే ఇబ్బందులు పడుతూఉంటారు. ఇక్కడ ఆపో. చెబుతున్నదేమిటంటే, ఒక వ్యక్తి వివాహము చేసుకున్నపుడు, తన భార్య విషయమైన బాధ్యతలు నిర్వహించాలి. భర్త వ్యక్తిగతంగా చేయవలసిన విధి. అదే రీతిగా, మరో కోణములో చూస్తే, భార్య తన భర్త అవసరాల విషయం ఆలోచించాలి. భర్తను ఎలా సంతోషపెట్టాలో చూడాలి. ఇది శ్రేష్టమైన, ఉత్తమమైన ఉపదేశం. భార్య తన భర్త విషయం, తన పిల్లల విషయం అన్ని జాగ్రతలు వహిస్తుంది. మీరు వివాహమైన వారైతే వివాహములో, కుటుంబములో క్రీస్తు రక్షకుణ్ణి వెంబడిస్తున్న శిష్యునిగా జీవించడం చాలా అవసరం. అది ఘనమైన పరిచర్య.

         వారి గృహాల్లో వారి భర్తతో కలిసి జీవిస్తూ, పిల్లలను ప్రభువునందు పెంచే తల్లితండ్రులు అతి ఘనమైన పరిచర్య చేస్తున్నారు. దుఃఖకరమైన విషయమేమిటంటే ఈ నాడు ఆచారపు భక్తి అంతటా చలామణి అవుతుంది. దానిని నిజమైన విశ్వాసము అనుకుంటూ లక్షలాది క్రైస్తవులు భ్రమ పడుతున్నారు. ఓ ప్రియ సోదరీ, సోదరుడా, ప్రభువు తిరిగి వచ్చినపుడు నీ విశ్వాసము ఎక్కడ వుంటుంది? యేసు క్రీస్తు ప్రభువు స్వయానా లూకా సువార్త 18:8లో అడిగిన ప్రశ్న ఏమిటి? జాగ్రతగా వింటున్నారా, శ్రోతలూ? మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?  ప్రభువు తిరిగి వచ్చేసమయానికి విశ్వాసానికి కరువు ఏర్పడుతుంది. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో ఉండే భార్య భర్తలు వారి దాంపత్యజీవితమును ప్రభువు వాక్య ప్రకారం క్రమబద్ధంగా, పరిపూర్ణమైన పరిశుద్ధతతో, లోకములో మనలను చూచేవారికి ఆశ్చర్యం కలిగించేవిధంగా జీవించాలని ప్రభువు కోరిక. ప్రభువు చెప్పిన మాట గమనించండి: “దీపమును వెలిగించి కుంచము క్రింద పెట్టరు కానీ అది యింటనుండువారికి వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు.” మత్తయి 5:15. కనబడేటట్టుగా, కనబడాలని చేయవద్దు, అది వేషధారణ అవుతుంది. మన పరిశుధ్ద జీవితము, విధేయత ఉన్నదున్నట్టుగా దేవుని యెదుట జీవిస్తున్నట్టుగా లోకములో జీవించాలి. దాచి పెట్టకూడదు, సిగ్గుపడి, భయపడి ఉండడం దేవునికిష్టమైనది కాదు. కుంచము అంటే గంప లేదా బుట్ట అని అర్ధం. మన జీవితాలను చూచి ప్రజలకు వెలుగు కలగాలని, వారి చీకటిని విడిచిపెట్టి యేసయ్య వెలుగులోనికి రావాలని ప్రభువు కుటుంబాలను ఏర్పాటు చేశాడు. వివాహము కేవలం శారీరక ఆనందము కోసమే కాదు, క్రీస్తును ఘనపరిచే కుటుంబము ఏర్పాటు చేయాలని దేవుని ప్రణాళిక. పిల్లలను దేవుని వాక్యపు వెలుగులో పెంచడం, క్రమము, పద్ధతి, వాక్యపు నియమం తల్లితండ్రులిద్దరూ పిల్లలకు నేర్పించాలి. సాధారణంగా తండ్రి పిల్లలను పట్టించుకోడు. అది తల్లి బాధ్యత అని అపోహ పడుతూఉంటాడు. దేవుని వాక్యం ఏమని ఆజ్ఞాపిస్తుందో గమనించండి: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” ఎఫెసీ. 6:4 గమనించండి, ప్రియ తండ్రులూ, ఇది మనకివ్వబడిన ఆజ్ఞ. తల్లులకు కాదు. తండ్రులు చేస్తున్నపుడు, తండ్రులు లేని సమయములో అదే పద్ధతిలో తల్లులు చేయవచ్చు. కానీ అది కేవలం తల్లుల బాధ్యతకాదు. దేవుని వాక్యపు వెలుగులో మన కుటుంబాలను పరీక్షించుకొని సరిదిద్దుకోవడానికి సర్వకృపానిధి అయిన ప్రభువు మనకందరికీ అవసరమైనంత కృప అనుగ్రహించుగాక, అమెన్!      


 


No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...