I కొరింథీ అధ్యయనం-21 7:17-24
మీరున్న చోటనే సేవ చేయండి
మీరు మానవులను నమ్ముతున్నారా? దేవుని నమ్ముతున్నారా? నేను దేవుని నమ్ముతున్నాను అని సమాధానం
చెప్పినా, క్రియలు దానికి వ్యతిరేకమైన సమాధానం చెప్తాయి. ఎవరైనా చెప్పిన దేవుని వాక్యమును పరిశ్దుద్ధాత్ముడు
వాడుకొని నీ హృదయములో ప్రేరణ కలిగిస్తే, వారివైపే చూస్తూ ఉండడాన్నిఏమoటారు? ఎవరైనా నీ మీద కాస్త శ్రద్ధ
చూపిస్తే ఇక వారిమీదనే ఆశలు పెట్టుకుంటారు. ఇది దేనికి సూచన? మానవులను నమ్ముకోవడమే! దేవుడు యేసు
క్రీస్తు ప్రభువు ద్వారా మనలను తనవైపునకు మళ్లుకోమని హెచ్చరిస్తున్నాడు. ఇది చాలమందికి పెద్ద శోధన,
మోసమునకు దారితీస్తుంది. ప్రార్ధించుకుందాం.
ఈ నాటి మన అంశం: మీరున్న చోటనే సేవించండి. లేఖన భాగము I కోరింథీ 7:17-24. మీరున్న చోటనే మీరు
సేవ చేయడoలో మిమ్మల్ని ప్రోత్సహించడానికి కొన్ని ముఖ్య విషయాలు జాగ్రతగా పఠించుదాం, రండి రేడియోకు
దగ్గరగా వచ్చికూర్చోండి.
మొదటిది దైవికమైన విభజన. 17-19 వచనాలు గమనించండి. “అయితే ప్రభువు ప్రతివానికి ఏస్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏస్థితియందు పిలిచెనో, ఆ స్థితియందే నడుచుకొనవలెను; ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు.” ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో...అనే మాటలలో మౌళికమైన శక్తి సామర్ధ్యాలు మన వ్యక్తిత్వాలలో ఇమిడి ఉన్నాయనిపిస్తున్నది. మనoదరిలోలో పుట్టుకతోనే వచ్చిన కొన్ని శక్తి సామర్ధ్యాలు ఉండవచ్చు. కళాకారులలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రతి మౌళిక శక్తి సామర్ధ్యాలను వృద్ధి చేసుకోవచ్చు. మెరుగు చేసుకోవచ్చు కూడా. ప్రస్తుతం క్రైస్తవ ప్రజల నోళ్లలో నానుతున్న మాట, మన వరమేమిటో తెలుసుకోవాలి. ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తికి దానికి అవసరమైన వరము, శక్తిశామర్ధ్యాలు లేకపోతే అది మంచిదికాదు. ఆపో. ఈ సందర్భములో సున్నతిని ఒక ఉదాహరణగా మాట్లాడుతున్నాడు. ఆదిమ సంఘములో సున్నతి ఒక సమస్య. అ. కా. 15వ అధ్యా యములో యూదేతరులలో నుండి దేవుని సంఘములో చేర్చబడినవారు క్రైస్తవులుగా మారడానికి సున్నతి తీసుకోవడం అవసరమా? అనే ప్రశ్న విషయం వ్రాయబడింది. అబహాము కాలమునుండి యూదులు యూదుల సమాజమునకు, దేవుని నిబంధనకు చెందిన వారికి గురుతుగా సున్నతిని భావించారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ ఆపో. చెప్తున్నదేమిటి? నీవు సున్నతి పొందిన స్థితిలో ఉన్నప్పుడు పిలువబడితే, సున్నతి లేనివానిగా ఉండాలని ప్రయత్నించవద్దు. సున్నతి లేని స్థితిలో నీవు పిలువబడినట్లయితే సున్నతి చేయబడాలని కోరవద్దు. దేవుని ఆజ్ఞాలకు విధేయత చూపించడం ముఖ్యము కానీ సున్నతి పొందడమైనా, సున్నతి పొందకపోవడమైనా, ఏ భేదము లేదు. కాబట్టి పిలుపు దేవుని వద్దనుండి వస్తుందని గమనించాలి. దేవుడు ఆ విధమైన స్థితిలో ఉంచాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలోనే ఉండాలి. అక్కడే దేవునికి సేవ చేయాలి. మన జీవితాలను చూసుకున్నట్లయితే, మనమే వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారములో ఉన్నా, ఏ ఉద్యోగములో ఉన్నా, ఏ గ్రామములో ఉన్నా, అక్కడనే దేవునికి బలమైన సాక్షిగా జీవించాలి. క్రీస్తు నామమునకు మహిమా, ఘనత కలిగించే దేవుని పిల్లలవలే పరిశుద్ధతలో ప్రేమలో సహనములో, వెలుగులో జీవించడములో శ్రద్ధగా జాగ్రతగా జీవించాలి.
రెండవది, ఆ పిలుపు కోసం మానవ సహకారం కావాలి. 20-22 వచనాలు గమనించండి: “ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను. దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.“ ఇక్కడే సంతృప్తి అనే అంశం కానవస్తుంది. ఎందరో వారున్నా స్థితిలో ఉండడమును గూర్చి విసుగు చెంది, వేదనపడి జీవితాలను వృధా చేసుకున్నారు? వారున్నా చోట ఉండడానికి వారు ఇష్టపడలేదు. మరెక్కడో ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు ఇతరులను ఈర్ష్యతో చూస్తారు. ఎందుకంటే వారి పనిని తాను ఇంకా బాగా చేయగలను అనుకుంటారు. అసంతృప్తితో వారు నలిగిపోతారు. పౌలు ఇస్తున్న బోధ ఏమిటంటే నీవున్న చోటనే తృప్తిగా ఉండు. ఇక్కడ పౌలు బానిసలు గా ఉండడాన్ని ఒక ఉదాహరణగా వాడుకుంటున్నాడు. పౌలు జీవించిన దినాలలో బానిసలు ప్రతి చోట ఉండేవారు. అలాంటి బానిసలకు పౌలు ఇచ్చిన హెచ్చరిక ఏమిటంటే నీవు అక్కడే ఇంకా సాధ్యమైనంత మంచి బానిసగా జీవించు. నీవేలాగు ఉండాలో అలాగే నీవున్న చోటనే ఉండు.
పాతనిబంధన కాలములో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు యూద దేశము నుండి చెరగొని పోయిన యూదులలో దానియేలు ప్రవక్త ఉన్నాడు. దానియెలును నపుంసకుణ్ణి చేశారు. ఆయన మగత్వము నశించిపోయింది. ఆయన నెబుకద్నేజరు ఉద్యోగిగా ఉండి ఆయన సేవకులందరిలోకెల్ల శ్రేష్టమైన వాడుగా జీవించాడు, సేవించాడు. దానియేలు బానిస అయినప్పటికీ ఏ సమయములో ఎట్టి పరిస్థితిలో తన పరిశుద్ధతను తాకట్టు పెట్టకుండా, తన విశ్వాసము విషయములో రాజీ పడకుండా, అద్భుతంగా సేవ చేశాడు. నిజానికి నెబుకద్నేజరు దానియేలు మీద ఎక్కువగా ఆధారపడేవాడు. నెబుకాద్నెజరు తరువాత వచ్చిన చక్రవర్తులు కూడా దానియేలును ఉన్నతంగా ఘనపరిచారు, హెచ్చించారు. ఉదాహరణకు దర్యావేషు అనే చక్రవర్తి తన సామ్రాజ్యమంతటిపైన అధికారిగా నియమించాడు. దానియేలు బానిస అయినప్పటికీ అద్భుతంగా సేవ చేశాడు.
క్రైస్తవ విశ్వాసులముగా మనకు కూడా మన యజమానికి నమ్మకంగా ఉండాలి. మన మొదటి నమ్మకత్వము యేసు క్రీస్తు ప్రభువునకే! పౌలు ఇస్తున్న బోధ అదే! నీవు బానిసగా ఉండడానికి పిలువబడ్డావా? మంచి బానిసగా ఉండు. కానీ మనము క్రీస్తునకు బానిసలుగా భావించి జీవించాలి. పౌలు చెబుతున్న మాటలు జాగ్రతగా గమనించాలి. “ ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు.” మన ధ్యానము, నడవడి, ప్రవర్తన అంతా క్రీస్తు కోసమే మార్చబడాలి. మనము క్రీస్తు కోసం స్వతంత్రులము, అదే సమయములో బానిసలము కూడా. కాబట్టి మన సేవ మొదటైనా, చివరలోనైనా, క్రీస్తు కోసమే! అందరిలో అన్నిటిలో మనకు క్రీస్తే ప్రధానమైన వాడు. ఇది మన మానవులముగా క్రీస్తు ప్రభువు కోసం చేసే సేవ.
మూడవది, ఈ పిలుపు వ్యక్తిగత ప్రతిస్పందనను ఆజ్ఞాపిస్తుంది. 23,24 వచనాలు గమనించండి: “మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను.” మనమంతా విలువపెట్టి కొనబడినవారమని ఆపో. బోధిస్తున్నాడు. సిలువ మీద యేసు క్రీస్తు ప్రభువు మరణమే ఆ విలువ. మనమంతా దానికి చాలా దూరాన ఉన్నమేమో అనిపిస్తుంది. దాన్ని కన్నులారా మనము చూచినట్లయితే ఒకవేళ మన మనసులమీద ఎక్కువ ప్రభావము చూపించవచ్చేమో! మత్తయి సువార్తలో సిలువ మరణము స్పష్టంగా చిత్రీకరించబడింది. అక్కడ మీరున్నట్లే అనుకోని ఊహించుకోండి. మీ మనసుల్లో దానికి అత్యంత సన్నిహింతంగా ఉండండి. మత్తయి సువార్త 27:33-50 మీ బైబిళ్లలో గమనించండి. “వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి. ఆ మార్గమున వెళ్లుచుండినవారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము; నీవు దేవుని కుమారుడవైతే సిలువమీదనుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుము. వాడు దేవునియందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. {కీర్తనల గ్రంథము 22:8} ఆయనతో కూడ సిలువవేయబడిన బందిపోటు దొంగలును ఆలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను. {ఆమోసు 8:9} ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. {కీర్తనల గ్రంథము 22:1} అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను; తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి. యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.” ప్రియ సోదరీ సోదరుడా, ఇదే ఆ విలువ. మనము ఆయనకు ఎంత ఋణపడి ఉన్నాముగదా? ఆయనకిచ్చే కానుకల కంటే ఆయనకు హృదయం, ఆత్మ అప్పగించి విధేయత చూపడం ముఖ్యం. నేను కట్టలేని ఋణమును నాకు బదులుగా ఆయన కట్టాడు. అది నేనెన్నడూ కట్టలేని నా ఋణము. మనము విలువపెట్టి కొనబడ్డాము. అది ఆయన స్వంత రక్తము. పౌలు మనలను పిలుస్తున్నాడు. దయచేసి యేసు రక్షకుడు కట్టిన విలువను గూర్చి, అనగా అది ఎంత అసమానమైనదో, దీర్ఘంగా లోతుగా ఆలోచించండి. మరి ఆయనకోసం నీవేమి చేశావు? అక్కడే, వస్తుంది ప్రతిస్పందన! మన ప్రతిస్పందన మన సమస్తము! ప్రియ మిత్రమా? మీరు యేసు క్రీస్తును మీ రక్షకునిగా స్వీకరించారా? లేకపోతే, మీరు కూడా నేను ప్రభువును నా రక్షకునిగా స్వీకరించినట్టు మీరు కూడా చేయవచ్చు. ఇప్పుడే! ముఖ్యమైనది, మీ పాపములు అపరాధములు ఆయన ఎదుట ఒప్పుకొనండి. అ. కా. 8:37లో ఇథియోపీయుడు అన్నట్టు, “నేను యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను.” మీరు కూడా మనసారా చెప్పండి. అట్టి కృప ఆయనే మీకు, ఇప్పుడు విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రతిస్పందన ఆయనకు చేయడానికి విస్తారమైన కృప అనుగ్రహించు గాక! అమెన్!!
No comments:
Post a Comment