రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 46 12 17-21 ఇతరులతో సమాధానంగా ఎలా జీవించాలి?

  గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!

 

 

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 46   12 17-21  

ఇతరులతో సమాధానంగా ఎలా జీవించాలి?

     మీరు, మీ కుటుంబము క్షేమంగా, నెమ్మది, సమాధానములతో  ఉన్నారా? ఏదైనా మిమ్ములను తొలిచివేసే వేదనలు, ఆందోళనలు, శ్రమలు ఉన్నట్లయితే ప్రభువు యేసు తప్ప నిజమైన అదరణకర్త, సమాధనకర్త లేరు. ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ నెమ్మది పొందారు, సమాధానము పొందారు. మీరెందుకు  ఆయనను ఆశ్రయించి నెమ్మది పొందకూడదూ?

    ఈ లోకములో ఇతరులతో సమాధానముతో జీవించవచ్చా? కుటుంబములోని ఇతరులతో, సమాజములోని ఇతరులతో, చుట్టుపట్లఉన్నవారితో, బంధువులతో, కలిసిమెలిసి జీవిస్తున్నపుడు మనస్పర్థలు, పొరపొచ్చాలు, కలగడం సహజమే! ఆపో. పౌలు ఆది క్రైస్తవ సోదరీసోదరులకు బోధిస్తూ రోమా 12 లో ఇతరులతో సమాధానంగా ఎలా జీవించాలి? అనే ప్రశ్నకు సమాధానం తేటగా తెలియచేసారు. రోమా 12:17 నుండి చదువుకుందాం. మీ బైబిల్ నోట్ బుక్ పెన్ తెచ్చుకొని రేడియొకు దగ్గరగా వచ్చి నెమ్మదిగా, ప్రశాంతంగా కూర్చోనండి.

         17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి  ఆలోచన కలిగి యుండుడి.
            18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

            19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.

            20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే  దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
            21. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.

   

    మన కుటుంబాలలో, సమాజములోని ఇతరులతో నెమ్మది సమాధానముగా జీవించడానికి పౌలు భక్తుడు ఇచ్చిన సూచనలను, ఉపదేశమును ధ్యానిద్దాo.  

     మొదటిది, సమాధానముతో జీవించాలని ఆశిస్తే ఇచ్చి పుచ్చుకోవడానికి సుముఖంగా, యోగ్యమైన అనుగుణ్యమైన మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి. హెచ్చరిక గుర్తుంచుకొని రీతిగా ప్రవర్తించాలి. ఇందులో అనుగుణ్యమైనవి అనుగుణ్యము కాని అంశములున్నవి. 17వ వచనములో ఆపో. “కీడుకు ప్రతికీడెవనికైనను  చేయవద్దు” అని బోధించాడు. గమనించారా శ్రోతలూ? అనగా జగడమాడవద్దు అని చెప్పడం. దుష్టత్వం ఇంకొంచము దుష్టత్వమును కలిగిస్తుంది. దుష్టక్రియలు మరికొన్ని దుష్టక్రియలు ఇంకా ఇంకా కలగడానికే దారితీస్తాయి. కాబట్టి జగడమాడవద్దు. 

         దుష్టత్వము ఎదురైనపుడు నెమ్మదిగా ఉండి, దాన్ని ఎదిరించక, ప్రతికీడు చేయకపోవడమే మంచిది. దుష్టత్వము ఎదురైనపుడు, అనుగుణ్యముగా నెమ్మదిగా జగడము కలుగకుండా చూసుకోవడం మంచిది అని బోధన. ఆ తరువాత ఒక నిర్మాణాత్మక సూత్రం బోధిస్తున్నారు.

         మనుష్యులందరి దృష్టికియోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.”  మరో మాటలో చెప్పాలంటే దుష్టత్వము, జగడగొండితనమునకు బదులుగా ఘనత కలిగించే రీతిగా స్పందించండి అని అర్ధo. మనుషులందరి దృష్టిలో మెలైనది, సరియైనది, ఘనమైనది, యోగ్యమైనది చేయాలి. 18వ వచనం గమనించండి: “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.”  ఈ బోధన ఇంకాస్త పటిష్టపరుస్తూ, అందరితో సమాధానంగా ఉండడానికి వీలుగా ఏ ప్రయత్నం, సాధనము వదిలిపెట్టకుండా సాధ్యమైన అన్ని ప్రయత్నాలు  చేయమని పౌలు భక్తుని హెచ్చరిక. సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేసి సమాధానంగా సావధానంగా ఉండే ప్రతి ప్రయత్నం చేయండి. ఇంకొక్కటి చేస్తే సమాధానం, నెమ్మది వారితో ఉంటుందని తోచితే ఆ ప్రయత్నము కూడా విడిచిపెట్టవద్దు. కాని సాధ్యమైన అన్ని ప్రయత్నాలు, పధ్ధతులు ఉపయోగించిన తరువాత ఇంకా సమాధానం కుదరకపోతే ఇక ఆ విషయాన్ని దేవునిచేతికి అప్పగించి నిమ్మళంగా ఉండండి. కానీ కీడుకు ప్రతికీడు, దెబ్బకు దెబ్బ, అవమానమునకు అవమానము, నిందకు నింద బదులు జవాబు ఇవ్వవద్దు. కాని దేవుని ప్రతీకారానికి చోటివ్వండి. దేవుని తీర్పుకు విడిచిపెట్టండి. “ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి”  అని లేఖనపు  ఆజ్ఞ.  పగ, ప్రతీకారం దేవునికి వదిలేయ్యండి, ఆయన మన కంటే న్యాయబధ్ధంగా నీతిసహితంగా చేయగల నీతిమంతుడు. దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయో గమనించండి: “పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పు”  మాటలను జాగ్రతగా గమనిద్దాం. ఆ విషయాన్ని దేవునికి అప్పగించండి. అన్నిటికి తీర్పు జరిగే సమయం త్వరలోనే వస్తుంది. అందులో ఇసుమంత అనుమానము లేదు. సర్వలోకమునకు న్యాయాధిపతి అయిన ప్రభువు అన్నిటికి తీర్పు తప్పక తీరుస్తాడు. ఆయన తీర్పేసరియైనది. దేవుని న్యాయతీర్పు సత్యం ప్రకారం ఉంటుందని, ఆయన నీతిన్యాయములతో తీర్పు చేస్తాడని బైబిల్ గ్రంధం స్పష్టపరుస్తుంది.

         అప్పుడప్పుడు మానవులు వారి చేతుల్లోనికి తీసుకున్న సంగతులు సరిగ్గా చేయకపోవచ్చు. ఎవరో మన పట్ల కీడు, అన్యాయం చేశారనే తలంపులు మదనపడుతూ ఉంటాం. ఏ మాత్రం అవకాశమున్నా, ప్రతీకారం చేయాలని అనుకుంటూ ఉంటాం. కాని, ఆపో. మనలను, మనలో ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాడు. మనము ఇతరులతో సమాధానంగా జీవించాలనుకుంటే యోగ్యమైనరీతిగా ప్రవర్తించాలి. ఆలాంటి తలంపులను విడిచిపెట్టమని పౌలు ఉపదేశిస్తున్నాడు, ఎందుకంటే వాటివల్ల మరింత దుష్టత్వం కలుగుతుంది. పరిశుద్ధాత్మున్ని అటువంటి  సమయాల్లో  నీకు, నాకు నిగ్రహశక్తినిమ్మని వేడుకుందాము.

          రెండవది, సంఘర్షణ కలుగుతున్న సమయములో విజయం పొందడానికి శక్తిమంతంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిన సమయమిది. ప్రతికూలతకు వ్యతిరేకమైన రీతిగా స్పందించాలి. నీ శక్తిననతటినీ అనుకూలమైన మార్గములో ఖచ్చితమైన పద్ధతిలో వాడాలి. “నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము”  అని 20వ వచనములో ఉన్నట్టుగా, శత్రువు ఎదురైనపుడు సరియైన క్రియ చేయాలి.  శత్రువు ఆకలిగొంటే ఆకలితో చనిపోనీలే,’ అని మనమనుకోవచ్చు. కానీ ఆపోస్తలుని ఆదేశం అది కాదు. క్రీస్తునందు ప్రియులారా, శత్రువునకు మేలు చేయమని ఆపో. ఆదేశిస్తున్నాడు. సరియైన స్పందన చూపాలి. సరియైన మార్గములో శక్తివంతంగా స్పందించు. శత్రువు ఆకలి గొంటే, ఆహారం వడ్డించండి, దాహమైతే దాహమివ్వండి. మనము సర్వ సాధారణంగా ఆలోచించే విధానానానికి ఇది ఎంత విరుద్ధంగా ఉంది కదూ? ఇది దేవుని ఆజ్ఞ. శత్రువునకు మనము దయతో స్పందించినపుడు మన ధోరణి, వారి ధోరణి రెండూ మారవచ్చు. ఆ వ్యక్తి హృదయములో కొన్ని మార్పులు కలగవచ్చు. అలా చేయడం వల్ల “అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు." అని పౌలు సుబోధ. అనగా ఆ వ్యక్తి మంచి పధ్ధతిలో ఆలోచించడానికి మీరు చేసే క్రియ మార్గము చూపవచ్చు.

     ప్రభువునందు ప్రియులారా, మన శత్రువులకు మనము ఆహారము వడ్డించడం ఎంత మాత్రం సులభమైన సంగతి కాదని నేనొప్పుకుంటాను. మన స్వభావసిద్ధమైన ఆలోచనలకు ఇది విరుధ్ధమైనదని మనకందరికీ తెలుసు. అతడు లేక ఆమె ఆకలితో, దాహముతో బాధపడుతున్నపుడు, తగిన శాస్తి కలిగింది అని, మంచి తీర్పు జరిగిందని మనము సంతోషించడం ప్రతి చోట జరుగుతూనేఉంటుంది. కాని, మేలు చేయడం ద్వారా ఇతరులతో సమాధానంగా జీవించాలని అపోస్తలుడు మనలను సవాలు చేస్తున్నాడు.

    కొంతమంది ద్వేషమును ఏండ్లకొలది వారి మనసుల్లో దాచిపెట్టుకుంటారు. అది మరిచిపోవడం వారి చేతకాదు. దాని గురించి ఆలోచించండం మానేయరు. ప్రక్కకు పెట్టడo వారి వల్ల కాదు. దుష్టతము చేయడానికి బదులుగా మేలు చేయడంలో శక్తివంతంగా ప్రయత్నము చేయాలని ఆపో. మనకు నేర్పిస్తున్నాడు. ద్వేషపు తలంపులు, కీడుచేసే యోచనలు మానేసి మంచి తలంపులు, మేలుకరమైన క్రియలు చేయండి. ద్వేషము, పగ, హృదయములో దాచిపెట్టుకోవడం మన స్వంత జీవితాలను నాశనం చేస్తుంది.

     21వ చనము నిజముగా శాంతియుతంగా సమాధానంగా మనము జీవించడానికి నిజమైన మూలసూత్రము ఇస్తూ ఉంది. ఇక్కడ శ్రేష్టమైన ఆదేశం ఉన్నది: కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.”  ఈ మాటలు మనము అధ్యయనం చేస్తున్నపుడు ఒక దోషి లాగా అన్ని దెబ్బలు కొట్టించుకోమంటున్నట్టు మీరు భావిస్తూ ఉండవచ్చు. కాదు, అది కాదు ఆపో. బోధించేది. ఎవరైనా మీకు కీడు చేసినపుడు అంతా భరించమని అర్ధం కాదు. మనము మొత్తం లొంగిపోవాలని అర్ధం కాదు. పడిపోయినవ్యక్తి లాగా పౌరుషం లేని వ్యక్తి లాగా పడిఉండాలని బోధన కాదు. కాని, లేచి, నిటారుగా నిలువబడి, మేలు చేస్తూ, పగ ప్రతీకారాలను జయించమని దేవుని పరిశుద్ధ లేఖనం ఆదేశిస్తున్నది. మేలైనది, నిర్మాణాత్మకమైనది చేద్దాం. ద్వేషపూరిత క్రియలను చేస్తూ, నీకు, నాకు కీడు చేసేవారిని, ఎత్తి భుజాల మీద కూర్చోబెట్టమని కాదు ఆపో. బోధ. దుష్టత్వము, కీడు మనలను జయించనియ్యవద్దు. సరియైన క్రియతో ఎదుర్కొందాం! సరిగ్గా దేని చేత దుష్టత్వమును, పగ ప్రతీకారాలను జయించవచ్చో, ఆ మేలుతో ఎదుర్కొందాం. ఇదే పౌలు భక్తుని సుబోధ. నిర్మాణాత్మకంగా యోగ్యమైన రీతిగా ఎదుర్కొందాం.

     చివరిగా, ప్రియ సోదరీ, సోదరులారా, మనము సంఘర్షణకు కారణం కాకూడదు. మనమే సంఘర్షణ, జగడాలు, వివాదాలు కలిగించినట్లయితే, అవి ఎక్కువయ్యే రీతిగా ప్రవర్తిస్నుట్లయితే, ఇతరులతో సమా ధానంగా జీవించాలని ఆశించలేము. మన గురి సమాధానమును ప్రోత్సహించడం. ఉన్న సమాధానమును బలపర్చడం. కాబట్టి యోగ్యమైనరీతిగా జీవిస్తూ ఇతరులతో సమాధానంగా జీవించాలి. కీడు, దుష్టత్వమును మేలు చేత, మంచితనము చేత జయించాలి. ఈ గొప్ప అధ్యాత్మిక సత్యమును గ్రహించడానికి, దేవుని వాక్యప్రకారము జీవించడానికి ప్రభువే మనమందరికీ శక్తి కృప అనుగ్రహించుగాక, అమెన్!!     

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...