రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 45 12:9-16 అనుదినజీవితానికి అనుభవపూర్వక నియమములు

 గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!

 

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 45 12:9-16  

అనుదినజీవితానికి అనుభవపూర్వక నియమములు 

     మీకందరికీ హృదయపూర్వక వందనములు! సజీవనిరీక్షణ రేడియో పరిచర్య కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నట్లయితే ఆ విషయం మాకు తెలియచేయండి. ఈ పరిచర్యకు మీ ప్రార్థన చేయూత అత్యవసరం. మనమంతా దేవుని రాజ్యములో భాగస్వాములుగా ఉన్నాము. కనుక ఒకరికోసం మరొకరు ప్రార్థన చేయడం అత్యవసరం. 

 

      జీవితానికి కొన్ని నియమాలు, మూ లసూత్రాలు అవసరం. విచ్చలవిడిగా, ఎటుతోచితే అటు అన్నట్టు జీవించినట్లయితే గందరగోళంగా ఉంటుంది. కానీ మంచి నియమాలు, మూలసూత్రాల ప్రకారం జీవిస్తే ఎంతో సంతోషం, ఫలితం, తృప్తికరంగా ఉంటుంది. బైబిల్ గ్రంధం అనుభవపూర్వకమైన నియమాలు, సూత్రాలు బోధిస్తుంది. అవి రోమా 12లో ఉన్నవి. 9-16 వచనాలు చదువుకుందాం. రండి, ఇలా రేడియొకు దగ్గరగా వచ్చి కూర్చోండి. 

 

          9. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. 10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. 11. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి. 12. నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. 13. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. 14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు. 15. సంతోషించు వారితో సంతోషించుడి; 16. ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. 

      ఆ నియమాలు, మూలసూత్రాలు ఏమిటో అధ్యయనం చేద్దాం. దేవుని పరిశుద్ధ లేఖనములను పూర్ణ మనసుతో ధ్యానం చేద్దాం. 

 మొదటిది, మెరుగైన క్రైస్తవ జీవితానికి అతిమూలసూత్రం, నియమం నిష్కపటమైన ప్రేమ చూపించడం. వేషధారణను విడిచిపెట్టండి. ఆపో. ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే ప్రేమలో కపటం ఉండకూడదు. లేనిది ఉన్నట్టు నటించడం కపటానికి గుర్తు. కపటం అనే మాటకు గ్రీకు లో వాడిన మాట నటించే నటులు వారి అసలు స్వరూపాలు కనిపించకుండా వేషమువేసుకొని చేసే నటనకు వాడిన మాట. వేషధారణ అంటే అదే! అసలు ముఖం లోపల ఉంది కనిపించదు, కానీ నకిలీ ముఖం మాత్రమే బయటికి అందరికీ కనిపిస్తుంది. మనము అలాంటి ప్రేమ చూపించవద్దని ఆపో. హెచ్చరిస్తున్నాడు. ఆ తరువాత “చెడ్డ దానినసహ్యించుకో”మనే హెచ్చరిక. అసహ్యించుకోవడం అంటే మూలాభాషలో గాఢంగా ద్వేషిoచమని అర్ధం. ఎంతగా అసహ్యించుకోవాలంటే, దానితో ఎంత మాత్రం స్నేహం, సహవాసం ఉండకూడదు. కానీ, “మంచి దానిని హత్తుకొనియుండుడి.” హత్తుకోవడం అంటే చాలా దగ్గరగా, విడదీయలేనంత సన్నిహితంగా ఉండడం. స్వంత అన్నతమ్ములను ప్రేమించినట్టు గాఢంగా ప్రేమించాలి. ఎంతో ప్రేమగల కుటుంబంలో ఒకరిపట్ల మరొకరికి శ్రద్ధ, ఆసక్తి కలిగిఉన్న కుటుంబములో ఉన్నంత ప్రేమ సంఘములోని సహోదరులమధ్యలో ఉండాలి. ఆ తరువాత ఒకరినొకరు ఘనపరచుకొని మర్యాదతో ప్రవర్తించాలి. “ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.” సంఘములో నీ తోటి సహోదరునికి మేలు కలిగేటట్టు, ఆయనకు గౌరవం ఇస్తూ ప్రవర్తించాలి. నీ తోటి సహోదరుని మెప్పు, గెలుపు నిన్ను భయపెట్టనీయవద్దు. స్వార్ధమునకు తావియ్యవద్దు. మరొమాటలో చేప్పాలంటే, మనస్ఫూర్తిగా, యధార్ధంగా ప్రేమించు. ఈలాంటి ప్రేమ సహజoగా కలుగదు. ఇది సహజాతీతమైన ప్రేమ. దీన్ని బైబిల్ “ఆగాపె” అని పిలుస్తుంది. ఇది దేవునిలో మాత్రమే ఉండే ప్రేమ. మనము దేవుని పిల్లలమైనపుడు మన హృదయాలు తెరిచి ఆగపే ప్రేమతో నింపుకొని ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. ఇది అనుదిన జీవితములో మనము పాటించాల్సిన దైవనియమము. ఇతరులను హృదయపూర్వకంగా ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు నీవు నేను ఇతరులను ప్రేమించాలి. 

 రెండవది, నిజాయితీగా యధార్ధoగా శ్రమించు, పనిచేయి. ఇది నిజమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన దైవనియమము, మూలసూత్రము. “ఆసక్తి విషయమై మందులుకాక..” అనే మాటల అర్ధమేమిటి? ఉత్సాహం తగ్గిపోనీయవద్దు. కొందరు నకిలీ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కాదు, నిజాయితీగా, నమ్మకంగా పని చేయాలి. “ఆత్మయందు తీవ్రతగలవారై..” అనే మాటలు గమనించారా? నిజాయితీ, యధార్ధత లేని వారికి మనసులో తీవ్రత, జాగ్రత్త ఉండదు. కానీ నిజాయితీ యధార్ధత కలిగినవారు దేవుని చిత్తమును జరిగించాలనే ఆసక్తి కలిగిఉంటారు. “ఆత్మయoదు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.” ప్రభువును సేవించడములో అగ్నిలాంటి ఆసక్తి, పరిపూర్ణ విశ్వాసం నిండు హృదయముతో పని చేయాలి. ఆ తరువాత 12 వ వచనములో ఉన్న మాటలు: “నిరీక్షణగలవారై సంతోషించుచు,.” గమనించండి, నిరీక్షణకు బలమైన ఆధారముంటే సంతోషము కలిగిస్తుంది. దేవుని వాక్యము మీద ఆధారపడిన నిరీక్షణ అయితే అది బలమైన ఆధారమున్నదే! “శ్రమయందు ఓర్పు గలవారై,..” అనగా పరీక్షల్లో నెగ్గటమని అర్ధము. పరీక్షలంటే మనకు తెలుసు. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదోఒక పరీక్ష, శ్రమ అనుభవించే ఉంటారు. పౌలు భక్తుడు ఇస్తున్న హెచ్చరిక ఏమంటే శ్రమలు ఎదురైనపుడు ఓర్పు, సహనంతో ఎదుర్కోవాలి. “ప్రార్ధనయందు పట్టుదల కలిగియుండుడి “ ప్రార్ధనలో పట్టుదలతో పోరాడడం మనకెంతో సహాయంగా, అండగా నిలుస్తుంది. కాబట్టి ప్రార్ధనలో పట్టుదల, నిలుకడ, అవసరము. ఇక 13వ వచనం గమనించండి. “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు,..” మీ చేతనైనంతగా సంఘములోని తోటివారి అవసరాలు తీర్చడానికి చేయి చాపడం అవసరం. దీనితో దాతృత్వం, అతిధ్యమివ్వడం నేర్చుకుంటాము. సంఘములోనే కాదు, సంఘమునకు బయటవారికి కూడా అతిధ్యమివ్వడం మంచిది. ప్రభువునందు ప్రియులారా, నిజాయితీగా జీవించడానికి ఇవి ఎంత మంచి దైవనియమాలు, మూలసూత్రాలో అర్ధం చేసుకుంటున్నారా? మరోసారి చెబుతున్నాను, ఇవి సహాజసిధ్ధంగా కలిగేవికావు. ఇవి దేవుని శక్తివల్ల మాత్రమే కలిగేవి. నిజముగా మారుమనసు పొందినవారిలో మాత్రమే కనిపిస్తాయి. మనకివ్వబడిన ఈ స్వచ్చమైన దైవ నియమాలు, మూలసూత్రాలు, అనుదిన క్రైస్తవ జీవితానికి ఎంత అవసరమో మనలో ప్రతి ఒక్కరము అర్ధం చేసుకోవాల్సిన అవసరత చాలా ఉన్నది. 

 ఇక మూడవది, క్రైస్తవ జీవితములో ప్రభువును ఘనపరిచే దిశలో నడవడానికి దీన మనసుతో తగ్గింపు గుణముతో ఉండడం అత్యవసరం. ఇది చాలా కఠినమైన విషయం. 14 వ వచనములో “మిమ్మును హింసించువారిని దీవించుడి;” అని వ్రాయబడిందిగదా! హింస కలిగినపుడు అంగీకారభావముతో ఉండమని హెచ్చరిక! ఇతరులు నిన్ను హింసించిపుడు తిరుగుబాటు చేయవద్దు, కాని వారిని దీవించండి. “దీవించుడి గాని శపించవద్దు.” గమనించండి శ్రోతలూ, దేవుని హస్తము క్రింద హింస దీవెనగా మారుతుంది. “సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి” మరో మాటలో చెప్పాలంటే ఇతరులతో సుఖములలో, దుఖములలో వారితో మన్సు కలిసిజీవించాలి. సంఘములోని వారితో వారి సంతోష సమయాలలో నీవు కూడా పాలిభాగస్తునిలాగా కలిసిపోవాలి. ముఖ్యంగా అప్పుడప్పుడే మారుమనసు పొందినవారితో ఎక్కువగా కలిసిపోవాలి. దుఖించేవారితోబాటు వారి దుఖములో పాలుపంచుకొని వారికి అండగా నిలబడాలి. “ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి.” సంఘములోని తోటివారితోబాటు ఏకీభావము కలిగిఉండాలి. సంఘమంతా కలిసి ఏదైనా దైవకార్యము మంచి పని చేస్తున్నప్పుడు, గర్వమును విడిచి వారితో కలిసిపనిచేయమని దేవుని వాక్యపు హెచ్చరిక. “హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి.” దీనులైన వారితో సహవాసము కలిగియుండాలి. నిన్ను నీవు ఊహించుకోవలసినదానికంటే ఎక్కువగా ఊహించుకోవద్దు. తగ్గువాటియందు మనసునుంచి దీనమనసుతో ఉన్నపుడు మనలో మనము గొప్పవారమని కానీ, బుద్ధిమంతులమనికాని అనుకోము. మళ్ళీ చెబుతున్నాను, ఇది సహజసిద్ధంగా కలిగేదికాదు. మామూలుగా ఎవరిలోనూ ఈ గుణగణాలు, లక్షణాలు, ఆలోచనలు కలుగవు. సైతానును వెంబడించేవారు ఈ సుగుణాలను, దైవానియమాలను ఏ మాత్రం గ్రహించలేరు. కానీ నిజమైన మారుమనసు పొందినవారు వీటిని పొందిఉంటారు. ఎందుకనగా వారికి పరలోకపు పరమతండ్రి పరిశుధ్ద్ధాత్ముని ద్వారా దైవశక్తి లభ్యమవుతుంది. మారుమనసుపొందినవారు, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవారు పరిశుద్ధాత్ముని వారి జీవితాల్లో కలిగియుండి ఆయన చేత నడిపించబడతారు. ఆయన ఆధీనములో ఉన్నవారు మాత్రమే ఈ దైవానియమాలు నెరవేర్చి, ఈ సుగుణాలను పెంపొందించు కుంటారు. యేసు రక్షకుడు వారి హృదయాల్లో జీవించడానికి నిర్ణయం చేసుకున్న వారు మాత్రమే ప్రయోగాత్మకంగా అనుదిన జీవితములో ఈ దైవనియమాలు నెరవేర్చగలుగుతారు. ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. నిష్కపటమైన ప్రేమ హృదయపూర్వకంగా చూపించండి; నిజాయితీగా, యదార్ధంగా శ్రమపడి పనిచేయండి; తగ్గింపు కలిగియుండి దీనమనసుతో జీవించండి. ఈ దైవనియమాలు, మూల సూత్రాలు కలిగియుండడానికి యేసుక్రీస్తు ప్రభువు కృప, రక్షణ ఒక్కటే మార్గం. ఆయన శక్తి పొందటానికి ఆయన దగ్గరికి రండి. దానికవసరమైనంత దైవకృప ప్రభువు మనకు అనుగ్రహించుగాక! అమెన్!!

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...