గమనిక:
మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం,
ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి
కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!
రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 44 12:4-8
అనేక సభ్యులు- ఒక్క సంఘము
అనేక ఆవయవములు – ఒక్క శరీరము
జీవితం చాలా స్వల్పమైనది. మరణం తప్పించుకోలేము. ఆ తరువాత ఉండేది నిత్యత్వము. దానికి అంతము లేదు. దేవుని తీర్పు ఎవ్వరూ తప్పించుకోలేరు. మీరు నిత్యత్వము ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? నిత్య జీవమా? నిత్య నరకమా? ఈరోజే ఇప్పుడే నీవు నిత్యత్వములో ఎక్కడ ఉంటావో నిర్ధారించుకోవచ్చు. క్రీస్తు ద్వారా నిత్యజీవం, క్రీస్తును తిరస్కరిస్తే నిత్య నరకం. రండి, ఇలా రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చొనండి.
యేసు క్రీస్తును విశ్వసించిన వారు, అనగా మారు మనసు పొందినవారు, దేవుని కుటుంబములో కుమారులు కుమార్తెలు అవుతారు. అప్పుడు మనము సంఘములోని ఇతరులకు సహోదరులు, సహోదరీలు అవుతాము. అప్పుడు మనము క్రీస్తు శరీరములో అవయములము. మనము వేరు వేరు వ్యక్తులమైనప్పటికీ, క్రీస్తు శరీరమైన సంఘములో ఒక్కటిగా ఉంటాము.
ఆపో. పౌలు రోమా సంఘమునకు పత్రిక వ్రాసినపుడు సంఘస్థులకు సంఘములోని వారితో వారి సంబంధం ఎలాంటిదో బోధించాడు. రోమా 12: 4-8 వచనములలో మనము అనేకులమైనప్పటికీ, మనము ఒక్క శరీరమని విపులీకరించాడు.
4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,
5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.
6. మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,
7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను,
8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగి యుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
ఈ లేఖన భాగములో అనేక అవయములున్నప్పటికీ శరీరం ఒక్కటే అనే సత్యపు వివరణలు తేటపరుస్తున్నాడు.
మొదటిగా, ఆయన శరీరములో ఉన్న ఐక్యతను వివరిస్తున్నాడు. సంఘమనే శరీరమును భౌతిక శరీరముతో పోల్చి చూద్దాం. మన శరీరములో ఎన్నో అవయవాలున్నాయి. మీ చేతిని ఒకసారి చూచుకొని, అది ఎలా చేయబడిందో, అది ఎలా పనిచేస్తుందో గమనించండి. మీ వేళ్ళు ముడుచుకొని పిడికిలి బిగబట్టండి. ఇప్పుడు పిడికిలి విడవండి. వంచడానికి వీలుగా, ముడుచుకునేశక్తితో నిర్మించబడిందో గమనించారా? మీ చేతిని, మణికట్టును మీరు వేరువేరు కోణాల్లో తిప్పగలరు. అవునా! మీ పాదమును పరీక్షించండి. మనము నడవడానికి వీలుకలిగేటట్టు ఎలా నిర్మించబడిందో చూడండి. చేయి కాలు రెండు చాలా జాగ్రత్తగా నిర్మించబడినవి. ఒకరు ఈ విధంగా అన్నారు: “మానవ హస్తములో అన్ని ఉపయోగాలు చేయగల సార్ధకత ఉన్నది” ఆరోగ్యవంతులైనవారు వారి చేతిని ఏ వైపైన, ఏ రీతిగానైనా, తిప్పవచ్చు. ఎందుకనగా ఎన్నో కండరాలు, ఎముకలు, నరాలు, ఒకదానితో మరొకటి కలిసిపనిచేస్తాయి. మన శరీరాలు అద్భుతమైనవి, ఆశ్చర్యo కలిగిస్తాయి. అనేక శతాబ్దాల క్రితం కీర్తనకారుడు దావీదు చెప్పినట్టు, మన శరీరాలు “భయమును ఆశ్చర్యమును కలిగించుచున్నవి.” వివిధ భాగాలు, వాటి పనులు వేరైనా, మన శరీరాలు మట్టుకు ఒక్కటిగా పనిచేస్తాయి.
మన శరీరాల్లోని వేరు వేరు అవయవాల్లోని ఐకమత్యమును గమనించి చూచినపుడు క్రీస్తు శరీరములోని, అనగా, సంఘములోని ఐకమత్యమును అర్ధం చేసుకోవచ్చు. అవయవాలు ఒకే రీతిగా ఉండవు, ఒకే పని చేయవు, ఒకే అకారములో ఉండవు. కాలు చెయ్యి కాదు, కన్ను చెవి కాదు. కానీ వీటన్నిటికీ ఒకదానికి మరొకటి అవసరం. ప్రతి అవయవమునకు ఒక ప్రత్యేక స్థానము ఉన్నది. వాటిలో ప్రతి ఒక్కదానికి ఇతర అవయవముల అవసరత ఉన్నది.
రెండవదిగా, పౌలు భక్తుడు అవయవముల పని పద్ధతులు వివరించాడు. ఆయన క్రీస్తు శరీరమైన సంఘముగురించి ఇంకా విపులంగా బోధిస్తున్నాడు. ఆపో. 6వ వచనమును ఎలా ఆరంభిస్తున్నాడో
గమనించండి. “మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము” గమనించండి, ప్రియులారా, శరీరములోని అవయవములు వేరు వేరుగా ఉన్నట్టే, క్రీస్తు శరీరము సంఘము లోని వారు, వేరు వేరు స్థానములో వేరు వేరు పని చేయడానికి ఉంచబడ్డారు. మనమంతా ఒకే రీతిగా ఉండము.
పౌలు భక్తుడు బోధించేదేమిటి? సంఘములోని వేరు వేరు సభ్యులు దేవుడనుగ్రహించిన కృపనుబట్టి వేరు వేరు కృపావరములు కలిగిఉంటారు. ఆ తరువాత ఆయన ఒక లిస్ట్ ఇచ్చి ఈ వేరు వేరు వరములు ఏమిటో వివరించాడు. ఈ వరములు కలిగినవారు సంఘము యొక్క క్షేమము, అభివృధ్హి కోసము వాటిని ఎలా ఉపయోగించాలో పౌలు భక్తుడు బోధిస్తున్నాడు.
మొదటి కృపావరం, ప్రవచించడం. 7వ వచనం గమనించండి: “ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము. “ ప్రవచించడం” అనే మాటకు రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటి, జరగబోయేది ముందే చెప్పడం, రెండు, బోధించి, హెచ్చరించడం. ఆపో. పౌలు I కోరింథీ 14:3లో ప్రవచించడమును విశదీకరించాడు. “క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు.” క్షేమాభివృద్ధి అనగా కట్టుట అని అర్ధం. హెచ్చరిక ఇవ్వడం, అనగా సూచనలివ్వడం. ఆదరించడం కూడా. ప్రవచించే వ్యక్తి దేవుని వాక్యముద్వారా, వాక్య భావములను బట్టి, వినే వారికి దీవెన, మేలు కోసం వారితో మాట్లాడే వ్యక్తి. ప్రవచించే వారికి ఆయన ఇచ్చే ఉపదేశమేమిటంటే, “విశ్వాస పరిమాణము చొప్పున” చేయాలి. విశ్వాసము సాదృశ్యముగా ప్రవచించాలి అని అర్ధం. ఎంత విశ్వాసముతో, వాక్యమునకు విధేయతతో జీవిస్తారో, అంతగా ప్రవచించవచ్చు అని అర్ధం. అంతే కాదు, వాక్య ఉపదేశం దేవుని వాక్యమంతటి సారాంశమును అనుసరించినదిగా ఉండాలి. వాక్య విరుధ్ధముగా ఉండకూడదు.
రెండవ కృపావరం, పరిచర్య చేయడం. దీన్ని సేవ అని కూడా అంటూఉంటాం. పౌలు భక్తుడు వాడిన మాట మనము ఆంగ్లంలో వాడే ‘డీకన్’ అను మాటతో పోల్చవచ్చు. ఒకరు ఇచ్చిన ఆజ్ఞప్రకారం చేసేవాడు. పరిచర్య లేదా సంఘములో సేవ చేసేవారు, “ఇతరులు” చెప్పినట్టు చేయాలి. “ఇతరులు” అంటే ఎవరు? మన ప్రభువు యేసుక్రీస్తు. ఆయనే యజమాని. ఆయనే ఆజ్ఞలు ఇచ్చేవాడు. మన పరిచర్య ఏమిటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చడమే. ఆయన చెప్పినదంతా చేయడమే!
మూడవ కృపావరం, బోధించడం. అనగా జీవించవలసిన పద్ధతి, అనుదిన జీవితమునకు అవసరమయ్యే బోధన చేయడం. ఇతరులకు నేర్పించేవాడు బోధకుడు. ఇతరుల మనస్సులను నడిపించి, సత్యము వారు గ్రహించి, అనుసరించడానికి సాయపడేవాడు బోధకుడు. 8వ వచనములో “పని కలిగి యుందము” అనే మాటను గమనించారా? అనగా బోధించడం ఆశతో, ఆసక్తితో, అలసట, నిరాశ పడకుండా విశ్వాసముతో చేస్తూనే ఉండాలి.
ఆ తరువాత8వ వచనములో నాలుగవ కృపావరం హెచ్చరించడం గురించి వ్రాయబడింది. అంటే ఏమిటి? ఇతరులను ప్రోత్సహించే పరిచర్య. క్రుంగినవారిని, బలహీనమైన విశ్వాసముగలవారిని వారి భుజం మీద చేయివేసి, ప్రోత్సహించే పరిచర్య. సహాయము అవసరమైనవారి ప్రక్కలో నిలువబడి ఒక సహకారిగా, చెలికానివలె ధైర్యపరిచే పరిచర్య.
ఆ తరువాత ఐదవ కృపావరం పంచిపెట్టడం లేదా ఇచ్చే కృపావరం అని కూడా చెప్పవచ్చు. ఈ పరిచర్య “శుద్ధ మనసుతో” చేయవలసిన పరిచర్య. సంఘపు కోశా ధికారి కావచ్చు. లేదా దాతృత్వము కలిగినవారెవరైనా కావచ్చు. గర్వము, స్వార్ధమును విడిచిపెట్టి సంతోషముతో దీనమనసుతో చేయవలసిన పరిచర్య. సంఘములోని అవసరతలకొలది పంచిపెట్టాలి.
ఆరవ పరిచర్య పైవిచారణ చేసే పరిచర్య. ఈ పరిచర్య చేసేవారు “జాగ్రత్తతో” చేయాలని వ్రాయబడింది. సంఘపు పనులు సరిగా జరుగుతున్నాయా లేదా పరీక్షించి చూచే పరిచర్య. బాధ్యతతో, ఆతురతతో చేయవల్సిన పరిచర్య.
చివరిగా,
ఏడవకృపావరం, కరుణించడం. కరుణించడమంటే దయతో సద్భావనతో ఎంతో జాలి చూపిస్తూ ప్రేమతత్వముతో చేసే పరిచర్య.
క్రీస్తునందు ప్రియులారా, అనేకమైన అవయములు కానీ ఒక్కటే శరీరము. ప్రతి ఒక్కరికీ ఒక స్థానమున్నది. ఏ ఒక్కరితో పరిచర్య అంతా జరగదు. ఏ ఒక్కరూ సంఘమంతా కాదు. మనమంతా కలిసిపనిచేయాలి. ఒకరితో ఒకరు సంబంధం కలిగిఉండాలి. మనము ఒకరిపై మరొకరు ఆధారపడిఉండాలి. శరీరములో ప్రతి ఒక్కరూ అవసరమే! మనమంతా సంఘములో ప్రతి ఒక్కరూ మరొకరికి అవసరం. ఈ కృపావరములలో ఒక్కటైనా, మరెక్కువైనా మీకు ప్రభువు అనుగ్రహించినట్లయితే, దేవుని సంఘమునకు మీ పరిచర్యలు అవసరం. దేవుని సంఘము సార్వత్రికమైనది, అనగా ప్రపంచమంతటా ఉన్నది. అయినప్పటికీ, సంఘము స్థానికంగా ప్రతి చోట ఉన్నది. మీరు నేను దేవుని సంఘములో ఆవయవ ములుగా ఉన్నాము గనుక ప్రభువు మనకు ఉద్దేశించిన పరిచర్య సంఘములో చేయాలి. మీరు ఉన్న సంఘములో కొద్ది మంది ఉండవచ్చు, లేదా చాలామంది ఉండవచ్చు. ఎందరున్నా, సంఘములో సహవాసము గలిగిఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. సంఘపు సభ్యులు శరీర ఆవయవములలాగా ఒకరికి మరొకరు పరిచర్య చేసుకోవాలి. మనము ఒకరితో మరొకరము, అలాగే సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగిఉండాలి. అట్టి సహవాసము క్రీస్తు ప్రభువుతో, సంఘముతో కలిగిఉండడానికి ప్రభువు మనకందరికీ సహాయము చేయుగాక! ఆమెన్!!
No comments:
Post a Comment