రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 43 12:1-3 దేవుని అంగీకారం పొందాలంటే ఎలా ఉండాలి?
గమనిక:
మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం,
ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి
కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!
రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 43 12:1-3
దేవుని అంగీకారం పొందాలంటే ఎలా ఉండాలి?
Praise the Lord! బాగున్నారా? మీ కుటుంబములో శాంతి నెమ్మది ఉన్నాయా? మన చుట్టూ ఉన్న చాలా కుటుంబాలలో శాంతి సమాధానము, నెమ్మది, కనిపించని దుర్దినములలో మనము జీవిస్తున్నాము. యేసు క్రీస్తు ప్రభువుతో వ్యక్తిగత సoబంధం కలిగినవారు జీవిస్తున్న కుటుంబాలలో శాంతి నెమ్మది, సమాధానము నివసిస్తాయి. మరి మీ సంగతేమిటి? ప్రార్ధించుకుందాం, తలలు వంచండి:
ఈ నాడు మన అంశం ‘దేవుని అంగీకారం పొందాలంటే ఎలా ఉండాలి?’ ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న కదూ! ప్రతి నిజమైన యెసయ్య శిష్యునికి ఈ ప్రశ్న తరచూ మెదులుతూ ఉంటుంది. మన లేఖన భాగం రోమా 12:1-3. దేవుని వాక్యము ఆధారంగా ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం, మీ బైబిల్, నోట్ బుక్ పెన్ తెచ్చుకొని రేడియొకు దగ్గరగా వచ్చి కూర్చోండి. మీ బైబిల్ తెరిచారా?
రోమా 12: 1-3
1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరముపొందుడి.
3. తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతివానితోను చెప్పుచున్నాను."
మొదటిగా, దేవుని అంగీకారం పొందాలంటే మన శరీరాన్ని దేవునికి లోపర్చి అర్పించాలి. ఇది శరీరానికి సంబంధించినది. మొదటి వచనములో చూచినట్లయితే దానికి ఆపో. పౌలు హెచ్చరిక ప్రకారము, దానికి ఆధారము దేవుని వాత్సల్యత. ఆయన మాటలు గమనించారా? “ సహోదరులారా, ....దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను.” దేవుని వాత్సల్యత, ప్రియులారా, ఎన్నో రీతులుగ, ఎన్నో రకాలుగా ఉంటుంది. నీవు, ప్రియ శ్రోతా, బ్రతికి ఉండడం, ఊపిరి పీల్చడం ఆయన
వాత్సల్యతకు గుర్తు! అది ఆయన సంరక్షణలో, ఆయన భద్రతలో, ఆయన ఏర్పాటులో, ఆయన అనుగ్రహించే ప్రతి దీవెనలో భాగం. కాబట్టి ఆయన వాత్సల్యతను బట్టి, మనము దేవునికి మన శరీరాలను సమర్పించమని హెచ్చరిక! ఏ విధంగా మనము మన శరీరాలను సమర్పించాలో ఆపో. వివరిస్తున్నాడు. మన శరీరాలను సజీవయాగముగా అర్పించాలి, అనగా కొంచెం కాదు, ఒక భాగం కాదు, ఒక రోజు కాదు, ఎల్లప్పుడూ, సంపూర్ణంగా సమర్పించాలి. “సజీవయాగము” అనే సత్యమును లోతుగా ధ్యానిద్దాం. పాత నిబంధన కాలములో దేవుడు మోషే కిచ్చిన ధర్మశాస్త్రము ప్రకారం, వేర్వేరు బలులు చేయాలని నియమించబడింది. వాటిలో ఒకటి సర్వాంగ బలి. ఈ నియమం ప్రకారం ఒక జంతువును, అది ఏదైనా సరే, ఉన్నదున్నట్టు, మొత్తం జంతువునంతటినీ బలిపీఠం మీద ఉంచాలి. దేవుని మహిమార్ధం ఆ జంతువును సంపూర్ణంగా దహించాలి. ఆపో. ఈ సందర్భములో ఆ మాట వాడినాడు. దాని అర్ధం ఏమిటంటే, మనము ఈనాడు మన శరీరాలను సంపూర్ణంగా, సజీవంగా, సంతోషంగా దేవునికి సమర్పించాలి. ఏదీ దాచుకోకుండా!
పౌలు భక్తుని మాటలను మనము జాగ్రతగా పరిశీలిస్తే, ఇది మనము దేవుని వాత్సల్యతకు స్పందించే సరియైన సేవ అని లేఖనముల భావన. “ఇట్టి సేవ మీకు యుక్తమైనది” అంటే అర్ధం ఇదే. ఇది మనము చేసినట్లయితే మనకెంత సంతోషం కలుగుతుంది కదూ! అది మనము చేసే కనీసధర్మమమని మనము గ్రహిస్తున్నమా? మనము సరిగా చేయవలసిన క్రియ మనము చేసినపుడు ప్రభువును సంపూర్ణంగా సేవించినవారమౌతాము. ప్రియులారా! మనము దేవుని చేత అంగీకరించబడడానికి ఇది మొదటి ప్రక్రియ. క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డ వారముగా, మన శరీరములను ఆయనకు అచ్చియున్నాము.
ప్రియులారా, రెండవది, దేవుడు మనలను అంగీకరించాలంటే, మనము మనసులను పరిశుద్ధపరచుకోవాలి. ఆపో. మనకిచ్చే హెచ్చరిక ఏమిటంటే, లౌకికమైన, తలంపులతో మనము జీవించడం సరికాదు. “ఈ లోక మర్యాదను అనుసరింపక” అంటూ గద్దించడం లేదా? ఈ లోకమునకు చెందిన విధానాలు, పద్ధతులు, మర్యాదలు దేవునికి చెందినవి కావని మనకు తెలుసు. ఈ లోకo దేవునికి చాలా దూరములో ఉంది. ఆపో. మరొక చోట ఈ లోకమంతా దుష్టునియందున్నదని స్పష్టపరిచాడు. దుష్టుడు అనగా సాతాను. వాడు దేవునికి ఎల్లప్పుడు విరోధి. వాడియందు ఉన్న లోకము దేవుని విరోధమైనది. మనము తల తలంపులను పరిశుధ్ధపరచుకోవాలని ఆపో. ఇక్కడ బోధిస్తున్నాడు.
దేవుడు పరిశుధ్ధపరచిన మనసులు రూపాంతరం చెందుతాయి. అది సంపూర్ణమైనది, మొత్తంగా జరిగే రూపాంతర ప్రక్రియ. ఇది అత్యవసరం. మరొక చోట లౌకికమైన మనసు లేదా శరీరానుసారమైన మనసు దేవుని విరోధమైనదని, అది దేవునికి లోబడదని, ఆపో. మనకు బోధించాడు. కాబట్టి రూపాంతరం చెందడం, సంపూర్ణంగా, మొత్తంగా రూపాంతరం చేదడం అత్యవసరం. అనగా దేవుని వాక్యం చేత మనము మన మనసులను పరిశుధ్ధపరచుకోవడంతో ముడిపడిఉంటుంది.
ఇప్పుడు 2వ వచనములో మనసును పరిశుద్ధపరచుకోవడం, రూపాంతరం చెందడం ద్వారా కలిగే ఫలితమేమిటో గమనించండి. “…..ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు” మన మనసులను పరిశ్దుధ్ధపరచుకోవడం వల్ల కలిగే ఫలితం మనము దేవునివలే మార్చబడం! అప్పుడు దేవునికి అనుకూలమనదేదో, ఉత్తమమైన దేవుని చితమేదో పరీక్షించగలుగుతాము. ఈ పరిశుధ్ధపరచబడదము దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. మనము దేవుని అంగీకారం, ఆమోదం పొందాలనుకుంటే మన మనసులు పరిశుధ్ధ పరచుకోవాలి.
విమోచించబడ్డ ప్రజలుగా మనము మన తలంపులను, ఆలోచించే విధానమును మార్చుకోవాలి, సంపూర్ణంగా మార్చుకోవాలి. దేవుని తలంపులను మనము గ్రహించి, రూపాంతరమును బట్టి దేవుని తలంపులను కోరుకోవాలి. మనసులు పరిశుద్ధపరచుకోవడం ఎల్లప్పుడు జరిగే ప్రక్రియ, మనము వాత్సల్యవంతుడైన మన దేవునితో నడుస్తూ, మాట్లాడుతూ ఉన్నపుడు ఇది జరుగుతుంది.
మూడవది, మనము దేవుని అంగీకారం పొందాలంటే మన విశ్వాసం కొరతలేనిదిగా, సంపూర్ణంగా చేయబడాలి. 3వ వచనం మనలను మనం ప్రేమించుకోవడం అనే ప్రమాదమున్నదని హెచ్చరిస్తుంది. ఆపో. ఏది ఎలా బోధించాడో గమనించాలి. “తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక...” ఈ మాటల అర్ధమేమిటి? మనలని మనం ప్రేమించుకోవడం అంటే దిగజారిపోవడమే. తన్ను తాను ప్రేమించు కోవలసినంత కంటే ఎక్కువగా ప్రేమించుకునే వ్యక్తి తన దిగజారుడును గుర్తించలేకపోవచ్చు. అతడు దేవుని యెదుట ఎలాంటి స్థానములో ఉన్నాడో గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి ఆపో. పౌలు మనము మన గురించి ఆలోచిoచుకోవలసిన దానికంటే ఎక్కువ ఆలోచించుకోవద్దని బుద్ధి చెబుతున్నాడు. ఈ ప్రమాదం ఎల్లపుడూ పొంచి ఉంటుంది సుమా!
ఇక సరియైన ఆలోచన అనే ఒక విధి మనకున్నది. పౌలు భక్తుడు మనకు సవాలు విసురుతున్నాడు. “స్వస్థబుద్ధి” కలిగిఉండాలి. అంటే సరియైన రీతిగా, మానసికంగా బుద్ధికలిగినట్టుగా ఉండాలి. నీవు నీ విశ్వాసపు, ఆత్మీయ స్థాయి కంటే ఎక్కువగా ఆలోచించుకున్నట్లయితే అది నీ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. దేవుని వాక్యము ప్రకారము మనము బుద్ధిమంతులముగా, సరియైన రీతిగా ఆలోచించుకోవాలి. అది ఔన్నత్యం కలిగిస్తుంది. మనము ఎలగున్నమో, అలాగే దేవుడు చేసినప్పటికీ,
మనలను ఒక్కొక్కరినీ, అద్వితీయంగా నిర్మించాడు. ఒకరు మరే ఇతర ఒకరిలాగా ఉండరు. మనము ఇతరులందరికీ వేరుగా ఉంటాము, ఏ ఒక్కరితో పోల్చబడలేము. అయినప్పటికీ మనకందరికీ అవే సమస్యలు, అవే ఇరుకులు, అవే శోధనలు ఉంటాయి. అయినా, మనము దేవుని క్రియద్వారా, ఆయన ఉద్దేశ్యం కోసం నిర్మించబడ్డాము. సరియైన ఆలోచన విధానము ఔన్నత్యం కలిగిస్తుంది.
ఈ వచనములోని చివరి భాగం గమనించండి. “దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము…” దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక పరిమాణములో విశ్వాసమును ఇచ్చాడు.
ప్రభువు మనలో ఒక్కొక్కరికీ ఒక పరిమాణములో విశ్వాసమును అనుగ్రహించాడు. విశ్వసించడానికి శక్తినిచ్చాడని అర్ధం. అనుగ్రహిoచబడిన ఈ విశ్వాసమును మనము పరిపక్వము లోనికి తెచ్చుకొని, దాని ప్రకారం అనుదినజీవితం జీవించాలి. విమోచించబడిన వారమైనందుచేత మనము దేవునిమీద ఆధారపడాలి. మనంతట మనకు శక్తి లేదు. మనంతట మనమే సంపూర్ణులము కాదు. ప్రభువు మానకనుగ్రహించిన విశ్వాసమును అభ్యాసము చేసుకుంటూ, ఆయనపైన ఆధారపడి మన విశ్వాసమును సంపూర్ణపరచుకోవాలి. ఇది ఎల్లప్పుడు చేస్తూనే ఉండాలి.
ప్రియులారా, మనము దేవుని అంగీకారం పొందడానికి పధ్ధతులివి. మొదటిది, దేవునికి మన శరీరాలను సర్వాంగ దహనబలి వలె సంపూర్ణంగా సమర్పించుకోవడo. రెండవది, మన మనసులను పరిశుధ్ధపరచుకొంటూ దేవుని చిత్తమును చేయడం, మూడవది, దేవుడు మనకనుగ్రహించిన విశ్వాసపు పరిమాణమును దినదినము వృద్ధిచేసుకొంటూ సంపూర్ణపరచుకోవడం. సర్వకృపానిధీయగు దేవుడు మనలో ప్రతి ఒక్కరికికీ ఆయన అంగీకారం, ఆమోదముద్ర పొందడానికి కృప అనుగ్రహించుకాక! అమెన్!!
No comments:
Post a Comment