రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 47 13: 1-7 దేవుడు – ప్రభుత్వము

 గమనిక: మీరు ఏ రీతిగా బైబిల్ అధ్యయనాల ద్వారా దీవెన, మేలు, హెచ్చరిక, ఆశీర్వాదం, ఆత్మీయ అబివృద్ధి పొందుతున్నారో, కామెంట్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవి కూడా వ్రాయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి బలపరచుగాక!

 

రోమా పత్రిక బైబిల్ అధ్యయనం – 47   13 1-7  

దేవుడు – ప్రభుత్వము

దేవునికి స్తోత్రం, హల్లెలూయ! మీరు, మీ కుటుంబమంతా, అంటే పిల్లలు, పిల్లల పిల్లలు క్షేమంగా ఉన్నారా? ఏదైనా ప్రత్యేకమైన ప్రార్థన మనవి ఉన్నట్లయితే, మాతో పంచుకోండి! మా ఫోన్ నెంబర్ 9866341841. WhatsApp మీదనైనా తెలపవచ్చు.

     ప్రపంచం, భూమి ఆకాశం ఎలామార్పు చెందుతున్నాయో గమనిస్తున్నారా? ఊహించని వరదలు, విపరీతమైన 

వర్షాలు, ఇలా కోవిడ్  తరువాత ఎన్నెన్ని రకాలైన మార్పులు అన్ని రంగాల్లో జరుగుతున్న సంగతి మనకందరికీ 

తెలుసు. ఇవన్నీ యేసు ప్రభువు రాకడ సమీపమవుతున్నదని స్పష్టంగా చెబుతున్నాయి. ఇంకా ఆలస్యం 

చేయకుండా మారుమనసు పొందితే నిత్యనరకం తప్పించుకుంటారు. రక్షణ పొందినవారైతే రూపాంతరం చెందుదాం. 

ప్రార్ధించుకుందాం, రండి రేడియొకు దగ్గరగా వచ్చి కూర్చోండి.   

 

     ఆదికాండములో వ్రాయబడ్డట్టుగా నోవహు కాలమునాటి జలప్రళయము తరువాత ప్రభుత్వాలు ఏర్పడ్డం   

మొదలయ్యింది. దేవుడు సమాజమును ఏలడానికి మానవుడు తమ స్వంత ప్రభుత్వము ఏర్పాటు చేసుకునే 

బాధ్యతనిచ్చాడు. అన్ని ప్రభుత్వాలు సరిగా చేయలేదు. సరిగా చేయని రాజులను, అధిపతులను దేవుడు శిక్షించాడు 

కూడా. అయినా, ప్రభుత్వాలు మానవుల చేతులోనే ఉన్నది. ప్రతి జాతి ఏదో ఒకరకమైన ప్రభుత్వమును, కొన్ని 

చట్టాలు, నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకున్నాయి. అనాదికాలములాగానే, ఇప్పుడుకూడా అన్నీ ప్రభుత్వాలు 

సరియైన ప్రభుత్వములు చేయవు. కొన్ని ఈ దేశాల్లో ఈ సమస్య అధ్వాన్నంగా ఉన్నది. దేవునికి ప్రభుత్వానికి 

ఎలాంటి సంబంధం ఉన్నదో ఈ పూట అధ్యానం చేద్దాం. లేఖన భాగం రోమా 13: 1-7

     1. ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి.
2. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు.

3. ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు; నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు; వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారిచేత మెప్పు పొందుదువు.

4. నీవు చెడ్డది చేసినయెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు; కీడు చేయువానిమీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు.

5. కాబట్టి ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.

6. ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.

7. ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ­­­­­­­­---ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.

      ఈ లేఖన భాగములో విశ్వాసనులందరూ ప్రభుత్వముతో వారి సంబంధము విషయములో గమనించవలసిన మూలసూత్రాలు పొందుపరిచారు.

     మొదటిది, క్రైస్తవనికి ప్రభుత్వముతో ఉన్న సంబంధములో దైవికమైన క్రమమును గ్రహించి అనుసరించుట అనే మూల సూత్రము ప్రాథమికమైనది. అన్నింటిపైన సర్వసార్వభౌమాధికారము దేవునితో ఉన్నదని గ్రహించాలి. ఈ అధికారమును దేవుడు తన ప్రతినిధులుగా అధికారులకు అధికారమిచ్చిఉన్నాడు. అధికారులు సర్వాధికారముగాల వారు కారు. దైవికమైన అధికారము అధికారులకు ఆయనకు ప్రాతినిధ్యం వహించేందుకు ఇవ్వబడింది. ఆపో. ఈ సత్యమును ఎలా తేటపరుస్తున్నాడో గమనించండి. “ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడియున్నవి.”  అప్పుడప్పుడు ఈ లోకములోని అధికారులు వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూఉంటారు. కానీ వారికి పై అధికారము దేవునిదే! 

     అధికారమును ధిక్కరించడం నిషేధించబడింది. ఆరంభంలోనే పౌలు భక్తుడు ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను;” అని తేటపరిచాడు. రెండవ వచనములో దేవుని ఏర్పాటు అయిన ప్రభుత్వ “అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు;” అని ఆదేశించాడు. ఈ మాటలలో ఒక దాగియున్న సత్యమున్నది. అదేమిటి? అధికారులు దేవునికి భయపడి ఆయన అధికారానికి లోబడి నిర్వహించాలని దేవుని ఆశ. దేవుని అధికారం పైనున్నది కనుక అధికారులు దేవుని అధికారమునకు లోబడి అధికారం చేయడం ప్రాముఖ్యo. వారు దేవుని అధికారమును ధిక్కరించినపుడు దేవుడు శిక్షిస్తాడు. ప్రభువు నందు ప్రియులారా, ఇది ప్రాముఖ్యమైన విషయo. ఒక వేళ వింటున్న మీరు ఒక ప్రాముఖ్యమైన ప్రభుత్వ అధికారి అయి ఉండవచ్చు. అధికారులు ఎక్కడున్న, ఏ దేశములోనైనా, దేవుని అధికారమునకు లోబడి అధికారము చేయాలి. ప్రభుత్వములోని వారెవరికైనా సంపూర్ణ అధికారము లేదు. చివరి మాట, చివరి అధికారము దేవునిదే! కాబట్టి దేవుని సర్వాధికారమును గుర్తించి, గ్రహించి ఆయన అధికారమునకు లోబడి అధికారమును నిర్వహించాలి.

     రెండవది, క్రైస్తవ సోదరులకు ప్రభుత్వముతో ఉన్న సంబంధములో మూలసూత్రము క్రమశిక్షణ కలిగిన అధికారిని గౌరవించండి. దీని విషయం ఆపో. పౌలు బోధ ఏమిటంటే మేలు చేసేవారిని అధికారి కాపాడుతాడు. 3వ వచనము గమనించండి: “ప్రభుత్వము చేయువారు చెడ్డకార్యములకేగాని మంచి కార్యములకు భయంకరులు కారు;”  అధికారులు మచి కార్యములు చేసేవారిని భద్రత, భరోసా కలిపించాలి. చట్టాలు మంచిక్రియలు జరగడానికి వీలుకలిగించేలా ఉండాలి. దానిద్వారా మంచితనం అభివృధి చెంది బలపడాలి. ప్రభుత్వాలు కీడు, దుష్టత్వమును అణచి ఉంచాలి, శిక్షించాలి. మనము మంచిక్రియ, మేలుకరమైన పనులు చేసినట్లయితే అధికారుల మెప్పు పొందుతాం. కానీ కీడు దుష్టత్వము జరిగించినట్లయితే అధికారికి భయపడవలసి ఉంటుంది. ఎందుకంటే అధికారి దుష్టత్వమును శిక్షిస్తాడుకదా! అక్రమము, కీడు, దుష్టత్వము జరిగించేవారు భయపడతారు, ఎందుకంటే అధికారులను వారు ధిక్కరిస్తున్నారు. అధికారులు కొంతమేరకైన దేవుని ప్రతినిధిగా నిలబడి పనిచేస్తారు.

     4వ వచనములో పౌలు అధికారులగురించి ఏమంటున్నాడో గమనించారా?వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.”  అధికారులు దేవుని దేవుని తీర్పులను, చట్టములను నెరవేరుస్తారు, దేవుడు దుష్టత్వమునకు వ్యతిరేకి. అధికారి దేవుని ప్రతినిధిగా దేవుని న్యాయతీర్పులను దుష్టత్వముమీద నెరవేర్చాలి.

     దేవుడు దుష్టత్వమునకు విరుద్ధంగా ఉంటాడు. ఈ విషయం మనకందరికీ నిర్దిష్టంగా తెలుసు. బైబిల్ అంతటిలో ఈ సత్యం సుస్పష్టంగా ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన దుష్టత్వానికి వ్యతిరేకిగా దుష్టత్వమును జరిగించే వారి మీద తన ఉగ్రత, శిక్ష తీర్పులను విధిస్తాడు. అధికారులు వారి విధులు నిర్వహించి దుష్టత్వమును అరికట్టి మేలును, మంచితనమును ప్రోత్సహించాలి.

     మూడవది, ప్రభుత్వముతో క్రైస్తవునికి గల సంబంధములో నిజ జీవితంలో పాటించాల్సిన మూలసూత్రము వివేకపూరిత విధేయతతో స్పందించండి. క్రైస్తవ విశ్వాసులు వారి మనస్సాక్షిని అనుసరించి జీవిస్తారు. విశ్వాసులు ప్రభుత్వము క్రింద వారి మనస్సాక్షిని అనుసరించి ప్రవర్తిస్తారు. 5ఆ వచనములోని విజ్ఞాపనను జాగ్రతగా పరికించి చూడండి: “ఆగ్రహభయమునుబట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట ఆవశ్యకము.”  క్రైస్తవ పౌరులు సరియైనది ఏమిటో తెలుసుకొని ఉండాలి. తెలుసుకోవడం మాత్రమే కాకుండా అది చేయాలి. అతని మనస్సాక్షి చెడును, దుష్టత్వమును ప్రక్కకు నెట్టేసి సరియైన క్రియలు చేయాలి. క్రైస్తవ పౌరులు వారి మనస్సాక్షిని అనుసరించి జీవించడం చాలా ప్రాముఖ్యం.

    మరో ముఖ్యమైన విషయం విశ్వాసులైన పౌరులు పన్నులు కట్టాలి. 7వ వచనములో ఆపో. స్పష్టంగా ఇది సెలవిచ్చాడు. “  ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? ఏలయనగా వారు దేవుని సేవకులైయుండి యెల్లప్పుడు ఈ సేవయందే పని కలిగియుందురు.”  న్యాయంగా నిర్ణయించబడిన పన్ను చెల్లించాలి. పన్నులు ప్రభుత్వపు నిర్వహణకు సహాయపడతాయి. మనము ఆనదించే శాంతిభద్రత, స్వేచ్ఛ, క్షేమము ప్రభుత్వము వలన కలిగినవి. పన్నులు ఎగవేయడం చేయకూడదు కానీ అవి సక్రమముగా వాడబడాలని ప్రార్థన చేయాలి.  అవినీతిని మనము సమర్ధించమని, ప్రోత్సహించమని దీని అర్థంకాదు, గానీ పన్నులు కట్టడం ద్వారా ప్రభుత్వము యొక్క నిర్వహణకు మనం తోడ్పడాలి. కొందరు ప్రభుత్వ అధికారులు లంచగొండులై మనలను కష్టపెడుతూ ఉంటారని మనకు తెలుసు. అట్టి సమయాల్లో వివేకంగా ప్రవర్తించాలి. వారు దేవుని ప్రతినిధులని మరచిపోకూడదు. వారు దేశానికి, మనకు మంచి చేస్తున్నట్లయితే వారు పన్నులకు అర్హులు.

     క్రైస్తవ పౌరులు అధికారములో ఉన్నవారిని గౌరవించాలి. 7వ వచనములోని ఈ మాటలు గమనించాలి. “యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.” దేవుని అధికారమునకు లోబడి పనిచేసిన అధికారులకు వివేకముతో విధేయత చూపించడం లేఖనపు సుబోధ.

దేవుని వాక్యములోని ఈ సత్యము ఏ దేశమైన ఏ కాలమైనా వర్తిస్తాయి. వీటిని సరిగా పాటించినట్లయితే దేశం శాంతి సమాధానాలతో విలసిల్లుతుంది. దేవునిదే  సర్వాధికారమని గ్రహించి క్రమమును పాటించుదాం. మంచి, నీతి చేసే అధికారిని గౌరవించుదాం. వివేకముతో స్పందించి ఎవరికి ఏది చూపించాలో, ఇవ్వాలో అది ఇచ్చి దేవుని వాక్యమును ఘనపరచుదాం. అట్టి కృప ప్రభువు మనకందరికీ అనుగ్రహించుగాక! ఆమెన్!!

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...