- దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు పొందండి. మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో వ్రాయండి, మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం. sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్ లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి.
- Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com.
- Or send a message by WhatsApp to 98663 41841
రోమా పత్రిక అధ్యయనం – 18 (5:6-11) దేవుని అసమానమైన ప్రేమ
దేవునికి స్తోత్రం! మీరు, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారా? ఈ దినాలలో నిజమైన ప్రేమ కరువైపోయింది కదూ! అంతా స్వార్థమే! అన్నీ ప్రేమలు రుచిచూచి నిజమైన ప్రేమకోసం అన్వేషిస్తున్నావా? అది యేసు క్రీస్తులో నీకు కనిపిస్తుంది. ఈ పాట వింటూ ఏసయ్య ప్రేమ ఎలాంటిదో గ్రహించి, ఆయన ప్రేమను ఆస్వాదించు.
దేవుని ప్రేమ ఏ విధంగా అన్ని ప్రేమలను అధిగమించినదో బైబిల్ మనకు బోధిస్తుంది. అది అసమానమైనది. ఆపో. పౌలు రోమా. 5:6-11లో వివరిస్తూ ఉన్నాడు. లేఖనభాగం మీ బైబిల్లో గమనించండి, నాతోబాటు చందవండి.
6 ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.
7 నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.
8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.
9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము.
10 ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
11 అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము.దేవుని అసమానమైన ప్రేమను మనము అర్ధం చేసుకోవడానికి వీలుగా, దేవుడు మనలను ప్రేమించిన సమయంలో మనము ఎటువంటివారమో పౌలు వివరిస్తూన్నాడు. మనము భక్తిహీనులము. అనగా మనకు దేవుడు లేడు. ఇది ప్రపంచమంతటా ఉన్న అందరి పరిస్థితి. పౌలు రోమా 3:19,20 లో ప్రపంచమంతా ఆయన సన్నిధిలో అపరాధులు అని బోధించాడు. మనమందరమూ భక్తిహీనులమే, రోమా 3:23 చెప్పినట్టుగా, “అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.
కానీ దేవుడు ఈ నిస్సహాయస్థితిలో మనలను వదిలిపెట్టలేదు. 6వ వచనములో క్రీస్తు యుక్తకాలములో మనకోసం చనిపోయాడని బైబిల్ గ్రంధం మనకు తెలియచేస్తుంది. “యుక్తకాలము” అంటే ఏమిటి? దేవుని సమయం. దేవుడు నిర్ణయించిన సరియైన ఘడియ. దేవుడులేనివారి కోసం, అనగా భక్తిహీనులకోసం పరిశుద్ధుడైన దైవకుమారుడు యేసుక్రీస్తు మరణించాడు. సాధారణంగా ప్రజలు ఆలోచించే పద్ధతి ఉంటుంది. ఒక నీతిమంతుని కోసమైనా మరొకరు మరణించడానికి ముందుకురావచ్చు.
పౌలు ఈ విధంగా వ్రాశాడు: “నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు”. కానీ, ఒక నీతిమంతుడు మరణించవలసిన అవసరము లేదు. మరి ఎందుకు ఎవరైనా ఒక నీతిమంతునికోసం మరణించాలని కోరుకుంటారు? ఇంకా ముందుకు చెప్తూ, ఒకవేళ “మంచివానికొరకు ఎవడైన .. చనిపోవ తెగింపవచ్చును.” అంటూ ఉన్నాడు కదా! నైతికంగా మంచివాడైన ఒక వ్యక్తికి ఏదో పాపముచేసిన వానిలాగా మరణశిక్ష విధిస్తే అది అన్యాయమే అవుతుంది కదా! ఒకవేళ అటువంటి వ్యక్తి స్థానంలో ఎవరైనా మరణించడానికి ముందుకు రావచ్చునేమో. ఎందుకనగా ఆ వ్యక్తి దోషము చేయలేదు, కానీ ఆయనకు మరణశిక్ష విధించబడింది. కానీ మన పరిస్తితి ఇది కాదని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. మనము ఎటువంటి ప్రజలమంటే భక్తిహీనులము. మనము నీతిమంతులము కాదు, మంచివారమూ కాదు.
రెండవది, మనము పాపులము. మనము గురితప్పినవారము. అనగా చేయవలసినవి చేయలేదు, చేయగూడనివి చేసినవారము. కాబట్టి దేవుని మహిమను పొందలేకపోయాము. దేవుని ప్రమాణాలను అందుకోలేనివారము. మన చేతుల్లో ఉన్న బైబిl ధములో ప్రమాణము స్పష్టముగా చెప్పబడింది, కానీ దాన్ని మనము చేరుకోలేము. దయచేసి గమనించండి, కేవలం ఇటువంటి వారికోసమే యేసుక్రీస్తు ప్రభువు మరణించింది. “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” 8వ. ఈ సత్యమును మీరు సరిగ్గా అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను.
యేసు క్రీస్తు ప్రభువు చనిపోయింది పాపులైనవారికోసం మాత్రమే. మనము పాపులము. దాని అర్ధం ఏమిటంటే, ఆయన మన అందరికోసం మరణించాడు. ఒకే ఒక్క మార్గమున్నది: అది ఆయన రక్తము. ఇది చాలా ప్రాముఖ్యము. “ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము.”
ప్రియ స్నేహితుడా, సోదరీ, ఆయనో, నేనో, ఎవరో ఒక్కరు తప్పక మరణించాలి! ఆయన నా స్థానంలో మరణించి తన రక్తము అర్పించినందుచేత, మనము నీతిమంతులము కాగలము. మనము విడిపించబడగలము. మన పాపములన్ని క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం! ఆయన పునరుధ్ధానము మన పూచీకత్తు. “ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింప బడుదుము.”10వ. ఆయన మరణించి తిరిగి సజీవుడైనందుచేత మనము దేవుని ఉగ్రత, కోపమునుండి విమోచింపబడుతున్నాము. మనమింక పాపములో ఉన్నపుడే యేసు క్రీస్తు ప్రభువు మన స్థానములో మరణించాడు.
మూడవది, మనము శత్రువులము. “ఏలయనగా శత్రువులమై యుండగా, …..మనము దేవునితో సమాధానపరచబడిన”వారము. దేవుని శత్రువులతో దేవునికి సంభంధము లేదు. దేవునికి తిరుగుబాటు చేసినవారు ఆయన శత్రువులు. అయినా, దేవుడు మన పక్షంగా నిలబడ్డాడు. మనము శత్రువులముగా ఉన్నపుడు, దేవుని కుమారుని ద్వారా మనము ఆయనతో సమాధానపరచబడ్డాము. అవును, దేవుడు మన పక్షముగా నిలబడ్డాడు. అలా కాకపోయినట్లయితే మనకు ఆశ లేదు. ప్రభువు మన పక్షంగా నిలబడినందువలన సమాధానపరిచే ప్రణాళిక సంపూర్ణమయ్యింది. దేవుని కుమారుని మరణమువలన మనము దేవునితో సమాధానపరచబడ్డాము. “ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.” అనే మాటలను గమనించారా? ఇది ఆనందమునకు ఊటలాంటిది. మన ప్రశస్తమైన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరచుకున్నాడు కాబట్టి మనము ఆనందముతో నిండియున్నాము.
దయచేసి, ప్రియ సోదరీ, సోదరులారా, 11వ వచనమును జాగ్రతగా పరిశీలించండి. “అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొందియున్నాము.” ఓ దేవునికి స్తోత్రం! మనమేలాంటివారమో దేవునికి తెలుసు. మనమ శత్రువులమని దేవునికి తెలుసు. మనము ద్వేషముతో నిండినవారమని ఆయనకు తెలుసు. ఇవన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలిసినప్పటికీ, దేవుడు తన కుమారుణ్ణి మన ప్రాయశ్చితంకోసము బలి చేశాడు. ఇప్పుడు మనము సమాధానపడగలము. అనగా మనము పరస్పరము కలిసి ఉండవచ్చు. శతృత్వం, ద్వేషమును విడిచిపెట్టి, ఆనందము, సమాధానము కలిగిఉండవచ్చు. తన కుమారుని మరణము ద్వారా దేవుడు సమాధానపరచినందుచేత మనము ఆయనలో ఆనందిస్తూ ఉన్నాము.
దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనదో ఇప్పుడు మీరు గ్రహించారా? లోకములోని అన్నీ ప్రేమలను ఎలా అధిగమించినదో తెలుసుకున్నారా? మనము భక్తిహీనులముగా ఉన్నపుడే, పాపులుగా ఉన్నపుడే, శత్రువులుగా జీవిస్తున్నప్పటికీ, ఆయన ప్రేమ మనవద్దకు వచ్చింది. ఆయన ప్రేమను స్వీకరించమని నిన్ను ఆహ్వానిస్తున్నాను, ప్రియా మిత్రమా? నీ హృదయమును తెరిచి అసమానమైన దేవుని ప్రేమను అందుకో, ఆస్వాదించు. అట్టి కృప ప్రభువు నీకనుగ్రహించుగాక!
ప్రార్ధన: ప్రేమ స్వరూపుడవైన పరమ తండ్రీ, నిన్ను తండ్రీ అని పిలిచే ధన్యత మాకు లేదు. మా స్థితి ఎంతో స్పష్టంగా గ్రహించాము. మీ అసమానమైన ప్రేమ పరలోకమునుండి మమ్ములనందరినీ సమీపించింది. ఈ ప్రేమను దీన మనస్సుతో అంగీకరించడానికి ఆస్వాదించడానికి మాకు సహాయము చేయండి, మీ కృప లేకుండా మావల్ల ఇది చేతకాదు. మీ పరిశుధ్ధాత్మ ద్వారా ఈ కార్యము మా అందరిలో జరిగించమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రీ, అమెన్!
No comments:
Post a Comment