రోమా పత్రిక అధ్యయనం-19 - 5:12-21 పాపమునకు దేవుని నివారణ


  • దేవుని వాక్య పారాయణం చేసి దైవాశీస్సులు  పొందండి.  మీరు ఏ విధమైన దీవెనలు పొందారో కామెంట్స్ లో   వ్రాయండి,  మీ ప్రార్ధన మనవులు తెలియ చేయండి. మీకోసం ప్రార్ధిస్తాం.  sajeevanireekshana@gmail.com ఇ-మెయిల్  లేదా వాట్సప్ 9866 341 841 ద్వారా నైనా తెలియచేయండి. 
  • Please let us know your prayer requests. We will pray for you. Please send an e-mail to sajeevanireekshana@gmail.com. 
  • Or send a message by Whats App to 98663 41841
 
రోమా పత్రిక అధ్యయనం-19 - 5:12-21 పాపమునకు దేవుని నివారణ 

      కొన్ని వ్యాదులకు డాక్టర్లకు తెలిసిన నివారణ లేదు. ఎవరైనా దురదృష్టవశాత్తు అలాంటి వ్యాధి బారిన పడితే మరణం తధ్యం. కానీ మరికొన్ని వ్యాదులకు డాక్టర్లు ఔషధమును కనుక్కోగలిగారు గనుక దానివలన శరీరం నయం కావచ్చు. 

     కానీ ప్రపంచమంతటా వ్యాపించిన ఒక వ్యాధికి ఏ డాక్టర్ ఔషధము కనుక్కోలేరు. పాపపు వ్యాధికి దేవునివద్ద మాత్రమే ఔషధమున్నది. ఈ ఆధ్యాత్మిక వ్యాధికి మందు ఉన్నది. ఈ పూట పాపమునకు దేవుని నివారణ గురించి మనము తెలుసుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి, సావధానంగా వినండి. మరో మాట, దేవుని నివారణ ఏమిటో తెలుసుకొనేవారు మాత్రమే, ఈ వ్యాధినుండి నివారణపొందే అవకాశము ఉన్నది. 

      రోమా 5:12-21 లో దేవుని సజీవమైన మాటలు ఏమని సెలవిస్తున్నాయో తెలుసుకుందాం. మనమంతా కలిసి ఈ అన్వేషణ చేద్దాం, ఎందుకంటే ఈ వ్యాధి మనందరికీ సోకింది. 
    12 ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. 13 ఏలయనగా ధర్మ శాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. 14 అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను, 15 అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును, అనేకులకు విస్తరించెను. 16 మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగ లేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. 17 మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదాన మును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు. 18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మను ష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను. 19 ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడు దురు. 20 మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, 21 ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.

 

     పౌలు గారు బోధించిన సత్యములు గ్రహిస్తే, పాపమునకు నివారణ ఏమిటో మనకు అర్ధమవుతుంది.

 

      మొదటిగా, పాపమనే సత్యమును మనము పరీక్షించాలి. పాపమునకు ఆరంభమున్నది. ఎప్పుడు ఎలా పాపము ఆరంభయయ్యింది? పరిశుద్ధగ్రంధం బైబిల్ ఆపో. పౌలు ద్వారా మనకు సెలవిస్తున్నదేమిటంటే, అది ఒక వ్యక్తి ద్వారా ప్రవేశించింది. “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో,..” ఆదాము అ “ఒక మనుష్యుడు”. మొదట హవ్వ మంచిచెడ్డల తెలివినిచ్చేచెట్టు నుండి పండు తీసుకొన్నది, తరువాత ఆదాము కూడా తిన్నాడు. ఏదేను తోటలో మన మొదటి తల్లితండ్రులు సైతాను శోధనకు లొంగిపోయి పాపములో పడ్డారు. అది పాపము ప్రవేశించిన ఘడియ.

 

     ఈ పాపము మనలో కూడా ఉంది. ఎందుకనగా అపో. పౌలు “మరణము అందరికీ సంప్రాప్తమాయెను”అని తేటపరిచారు. గమనించండి, అందరూ పాపము చేశారు. ఈ సూత్రము అందరిలోకూడా పుట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతటి సమస్య. దేవుని నివారణ తప్ప ఇక వేరే నివారణ మార్గం చెప్పుకున్నాము కదా!

 

     మీరు గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, ఆదాముచేసినటువంటి పాపం మోషేవరకు జీవించినవారు చేయకపోయినా, అందరిలో పాపము ఏలుతూవస్తుంది. ఇది రాయబడిన చట్టము కాకపోయినా, మానవాళి అంతటిలో ఉండే చట్టము. దేవుడు మోషేకు ధర్మశాస్త్రము ఇచ్చేంతవరకు ధర్మశాస్త్రము లేదు. ఆదాము నుండి మోషేవరకు పాపపుచట్టమును బట్టి మరణము ఏలుతూవచ్చింది. ఈ పాపపు నియమం అందరికీ ప్రాకింది. ఇది ప్రతి ఒక్కరి అంతరంగములో ఉంది అందరినీ తిరుగుబాటు, ఆవిధేయతలోనికి నడిపించింది.

 

     నా ప్రియ స్నేహితుడా, సోదరీ, ఈ సత్యమును మనము ఒప్పుకోవాలి. కీర్తన కారుడు దావీదు, “పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను” అని చెప్పాడు. కీర్తన 51:5 యేసు క్రీస్తు రక్తము తన పాపమును పరిహరించేవరకు ఎవ్వరూ నేను పాపము లేని వాడను అని చెప్పలేరు. ఆమెన్! అంచేత మనము పాపపు సత్యమును ఒప్పుకోని దాని నుండి క్షమాపణ, పరిహారం పొందాలి.

 

     రెండవదిగా, నీతి అనే సత్యమును మనము పరిశీలించాలి. పౌలు చెబుతున్నదేమిటంటే, పాపము ఒకరి ద్వారా ప్రవేశించినట్టే, నీతి మరొకరి ద్వారా, అనగా యేసు క్రీస్తు ద్వారా, కేంద్రీకృతమైనది. 15వచనములో ఉన్నట్టుగా “యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృప చేతనైన దానము” గా నీతి అనుగ్రహించబడింది. ఒక్క అపరాధమునుబట్టి మరణము, తీర్పు, కానీ అనేకమైన పాపములకు క్షమాపణ మరొకరిద్వారా! 16వ వచనం మీరు జాగ్రత్తగా గమనిస్తే, “కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను” ఇది ఎంత అద్భుతం కదూ! ఎంతటి కృపగల ఆశీర్వాదం! ప్రియ స్నేహితుడా, సోదరీ, ఇది నీతి అనే సత్యము! అనగా పాప క్షమాపణ పొందడం!

 

     ఇది మన అవగాహనకు ఎంతటి కేంద్రబిందువో గమనించారా? ఎంతటి ఔదార్యమో, ధారాళమో గమనిస్తున్నారా? 15వ వచనములో నేను కృప యొక్క సమృధ్ధిని నీతి యొక్క ధారాళత్వమును గమనిస్తున్నాను. మీ బైబిల్ తెరిచిఉంచారా, గమనిస్తున్నారా? ఒక వ్యక్తి పాపము ఫలితము మరణము, మరొకరి నీతిమంతత్వపు ఫలితము జీవము. ఇందులో కృప యొక్క ఔదార్యము, ధారాళత ఉన్నవి. యేసుక్రీస్తు వలన నీతి లేదా పాపక్షమాపణ జీవముతో ఏలుతుంది.

 

     ఈ ముఖ్యవిషయం మీతో చెప్పక తప్పదు. ఈ నీతి, పాపక్షమాపణ నిజముగా లభించగలిగేది యేసుక్రీస్తు వలన మాత్రమే! ఆయన ఒక్కడే పాపములేని పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పాపములేని పరిపూర్ణమైన జీవితం జీవించాడు. అందుకే ఆపో. పౌలు మనకు స్పష్టంగా బోధపరచాలని ప్రయత్నిస్తున్నాడు. ఆదాము వలన కలిగిన ఒక అపరాధము, యేసు ప్రభువు వలన కలిగిన నీతి. ఈ దినం యేసు క్రీస్తు వలన కలిగే నీతిని మనము గ్రహించాలి. ఆయన ఇచ్చేదే నిజమైన నీతి, పాపక్షమాపణ.

 

     ఇక మూడవది, కృప అనే సత్యమును పరిశీలిద్దాం. రండి, మీ పనులు కొంచెం సేపు ప్రక్కకు పెట్టి ప్రశాంతంగా దేవుని వాక్యమును గ్రహించుదాం. కృప విధేయతపైన ఆధారపడిఉంటుంది. ఒకరి తిరుగుబాటు, ఆవిధేయత శిక్షను, తీర్పును, తీసుకొచ్చింది. ఆదాము ఒకని పాపమువలన అందరికీ శిక్ష, మరణము కలిగింది. కానీ యేసు క్రీస్తు ఒక్కనివలన అందరికీ క్షమాపణ, నీతిమంతత్వము అనే ఉచితమైన వరము కలిగింది. అవిధేయత శిక్ష, మరణము తెచ్చినప్పటికీ, విధేయత జీవమును, నీతిమంత్వమును తెచ్చింది. కృప అవిధేయతను అధిగమించి దాన్ని కొట్టివేసింది. ధర్మశాస్త్రము రావడం వలన అపరాధం విస్తరించిది అని మనకు చెప్పబడుతుంది. అనగా పాపము ఎంత ఘోరంగా విస్తరించిందో దానివలన తెలిసింది. ధర్మ శాస్త్రము వచ్చినందుచేత పాపము విస్తరించింది.

 

     కానీ ఆపో. ఇంకా “పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.” అంటున్నాడు. ధర్మశాస్త్రము పాపమును నిర్వచిస్తుంది, బట్టబయలు చేస్తుంది. కానీ కృప పాపమును అదుపుచేసి, ఆపి దాని హద్దులు ఏమిటో మనకు చూపిస్తుంది. కృప పాపమును అధిగమించి దాటిపోయి మరణమును జయించింది. పాపము మరణము ద్వారా ఏలుబడి చేసింది, కానీ కృప నీతిమంతత్వము ద్వారా నిత్యజీవమును ఇచ్చింది. దేవునికి స్తోత్రం! హల్లెలుయ!!

 

     స్నేహితుడా, సోదరీ, ఇది ఎంత అద్భుతమైన సత్యం! కృపను గ్రహించి ఒప్పుకొని ఆస్వాదించడానికి ఈ రోజే మంచి సమయం. మీకు, నాకు, యేసు క్రీస్తులో ఈ మంచి ఏర్పాటు ప్రభువు చేశాడు. ఈ సత్యముల ద్వారా మనము గ్రహించేది ఏమిటంటే, పాపమునకు దేవుడు చేసిన నివారణ తప్ప ఇక వేరే లేదు. ఈ సత్యాల శ్రేష్టత్వమును మీరు గ్రహించాలని ఆశిస్తున్నాము. పాపము అనే సత్యము, నీతి అనే సత్యం, కృప అనే సత్యము. ఈ కృపను ఆస్వాదించి ప్రభువు అనుగ్రహించే నీతిని పొంది నీ పాపమునుండి నీవు విమోచబడుదువు గాక! అమెన్!

 

ప్రార్ధన: నీతిమంతుడవైన పరలోకపు తండ్రీ, నీ పరిశుద్ధత పాపమును పాపముగానే చూస్తుంది, గనుక మానవాళిలో భాగమైన మేమంతా మీ సన్నిధిలో పాపులమే. ఈ సత్యమును గ్రహించుటకు సజీవ నిరీక్షణ శ్రోతలకు కృప నివ్వండి. పాపమునకు నీవు చేసిన నివారణ తప్ప వేరొకటి లేదు గనుక మీ కృప చేత మీ నీతిని, పాపక్షమాపణను పొంది నిత్యజీవమును ఇప్పుడే ఇక్కడే ఆస్వాదించుటకు మా అందరికీ సహాయము చేయుమని యేసురక్షకుని నామమున వేడుకుంటున్నాము తండ్రీ, అమెన్!

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...