మంచి శుక్రవారపు స్పెషల్ Good Friday Special
సిలువ ఎందుకు? సిలువ
ఎందుకు ఆవసరమయ్యింది?
సజీవ నిరీక్షణ శ్రోతలందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు! ఈ వారము క్రీస్తు రక్షకుని పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైన వారము. “పరిశుద్ధవారమని”, “శ్రమలవారమని” కూడా ఈ వారమును పిలుస్తారు. ఉపవాసాలు
ఉండడం, మటన్, చికెన్ మానేయడం, ఈలాటి భౌతికమైన ఆచారాలవల్ల దేవుని కృప దొరకదు. ప్రభువు
చూచేది హృదయము, హృదయములోని దీనత్వము, పాపము చేసే ప్రాచీన స్వభావమును “చంపివేయడం,” పౌలు భాషలో చెప్పాలంటే. ఇవి చేస్తూ భౌతికమైన
కట్టుబాట్లు, త్యాగాలు, చేస్తే మంచిదే. భౌతికమైన ఈ క్రమశిక్షణ ఆత్మలో, అంతరంగములో క్రమశిక్షణవైపు నడిపిస్తే మంచిదే. మరో మాట.
కేవలం లెంట్ సీజన్ లోనే కాదు, అనుదినము
సిలువ నెత్తుకోవాలి. ఇదే కదా మన ప్రభువు యేసుక్రీస్తు పదే పదే బోధించింది.
ప్రార్ధనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన:
ఈగుడ్ ఫ్రైడే నాడు మనమంతా కలిసి
ధ్యానించే అంశం సిలువ ఎందుకు? మరో మాటలో
చెప్పాలంటే సిలువ ఎందుకు ఆవసరమయ్యింది?
మొదటిగా, సిలువ జగత్తు పునాదు వేయబడకముందే దేవుడు
ఏర్పాటు చేసిన విమోచన మార్గము. త్రియేకదేవుడు అప్పటికప్పుడు సిలువ గురించి ఆలోచించి చేయలేదు. బైబిల్
గ్రంధంలో మనకు “కనిపించే దేవుడు” గొప్ప ప్రణాళికలు వేసే వాడు, వాటిని నెరవేర్చే వాడు. జాగ్రత్తగా విన్నారా? “కనిపించే దేవుడు” అన్నాను. చూచే వారికి, చూడాలని ఆశ కలిగిన వారికి ఆయన తప్పకుండా
కనిపిస్తుంటాడు. దర్శనాల్లో కాదు, కలలో కాదు, ఆయన మాటలలో ఆయన స్వరములో, ఆయన గద్దింపులలో, హెచ్చరికలలో! యేసు క్రీస్తు ప్రభువునకు ప్రకటన గ్రంధంలో
కనిపించే ఒక పేరు, “అల్ఫా
ఒమేగా.” ఆల్ఫా
గ్రీకులో మొదటి అక్షరం, ఒమేగా చివరి
అక్షరం. మనకు అ, ఱ అనే అక్షరాలు తెలుగులో ఉన్నట్టు. అ నుండి ఱ వరకు ఆయనే!
మొదలు, అంతం ఆయనే, ఆయనే అయినప్పుడు ఆయనకు మొదలు అంతము తెలుసు. అంటే
సృష్టికర్త కూడా అని అర్ధం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాల్లో ఈ
సత్యము మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. యోహాను సువార్త 17:24. “తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ
నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను.
జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.” చివరి మాటలు జాగ్రతగా గమనించాలి సుమా! భూమి ఆకాశము అందులోని సమస్తమును దేవుడు సృష్టించక ముందే తండ్రి తన ఏకైక కుమారుడు యేసు క్రీస్తును ప్రేమించాడని స్పష్టంగా ప్రభువే స్వయంగా యోహాను సువార్త 17 లోని అదే వచనములో, మనందరికోసం చేసిన ప్రధాన యాజకుని ప్రార్ధనలో చేశాడు. ప్రకటన 13:8వ వచనం “ భూనివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడియున్న గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగమునకు నమస్కారము చేయుదురు” యేసు క్రీస్తు ప్రభువు మరణించిన సిలువ, సృష్టికి ముందే అనంత జ్ఞానములో ప్రణాళిక వేసుకుని దాని ప్రకారమే త్రియేకదేవుడు చేశాడు. ఆది. 3:15లో “స్త్రీ సంతానము” అని పిలువబడిన క్రీస్తురక్షకుడు సైతాను తలమీద చితుకగొట్టినవాడు. అది సిలువ వల్ల జరిగింది. ప్రియ స్నేహితుడా, సోదరీ, నిన్ను దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్ముడు సృష్టికి ముందే ఎరిగినవారు. నీవు పాపములో ఉన్నవాడవని దేవునికి అప్పుడే తెలుసు. అందుకే ఇంత గొప్ప ఏర్పాటు, ప్రణాళిక వేసి, ఇప్పుడు ఈ దినము నిన్ను కల్వరిసిలువ దగ్గరికి పిలుస్తున్నాడు.
రెండవది, యేసు క్రీస్తు శిష్యులకు తప్పనిసరి. అది తప్ప మీకు, నాకు పరలోకం చేరే మార్గము లేదు. మనకే కాదు, సీమోను పేతురుకు కూడా సిలువ ఇష్టము లేదు. ఆయనతో ఉన్న శిష్యులందరికి కూడా. మత్తయి సువార్త 16:21. “అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.” “చెయ్యి పట్టుకొని” ఎంతగా బ్రతిమాలుతున్నాడో గమనించారా? ఎందుకు? సిలువ, అవమానము, ఒక క్రిమినల్ కు వేసే శిక్ష. హింస, శ్రమలు ఆయనకు ఇష్టంలేదు. కొన్ని వచనాలు వెనుకకు వెళ్ళిచూస్తే, ఇదే పేతురు ప్రభువును “జీవముగల దేవుని కుమారుడివి, మెస్సీయావు, రక్షకుడివి” అని సాక్షమిచ్చాడు. అది పొగడ్త కాదు. ఆయన హృదయాంతరంగాల్లో నుండి వచ్చిన అనుభవం. ఇంత త్వరగా ప్రభువు ఆయనను “సాతానా”, అని పిలవడమేమిటి? “ప్రభువా నీవు రక్షకుడివే, విమోచకుడివే, దేవుని కుమారుడవే, కాని సిలువ మాత్రం నీకు వద్దు. మాకూ వద్దు” అనే భావముపేతురులో కనిపిస్తున్నది. ప్రభువు సిలువగురించి మాట్లాడినప్పుడల్లా, అప్పటివరకు ఆయనను వెంబడించిన వారు వెళ్ళిపోయారు. రొట్టెలు తిన్నవారిలో, స్వస్థత పొందినవారిలో చాలామంది వెనుకడుగు వేశారు. ఎందుకు? సిలువ ఇష్టం లేదు. యోహాను సువార్త 6:66. “అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.”
సిలువ చాలామంది మెడలో ధరిస్తారు. ముఖ్యంగా స్త్రీలు. కొంతమంది పురుషులు కూడా. దేవుని వాక్యము బోధించే పులిపీఠముల మీద, సిలువ ఉంటుంది. గోడల మీద ఉంటుంది. బైబిల్లో కూడా మీరు పెట్టుకొనిఉన్నారేమో! ప్రియ సోదరీ సోదరులారా, సిలువ అక్కడ కాదు ఉండాల్సింది. మన హృదయాల్లో. ప్రభువు చెప్పిన మాటలు గమనించండి. లూకా సువార్త 14: 27నుండి. “ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్న దమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింప గోరిన యెడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్కచూచుకొనడా? చూచుకొననియెడల అతడు దాని పునాదివేసి, ఒకవేళ దానిని కొనసాగింప లేక పోయినందున చూచువారందరు ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొన సాగింపలేకపోయెనని అతని చూచి యెగతాళి చేయ సాగుదురు. మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేల మందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసికొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.” ఇవన్నీ పాస్టర్లకు, దేవుని సేవకులకు, శిష్యులకు లెండి, మాకు కాదు అనుకుంటున్నారా? ఒక్క నిమషo ఆగండి. ఇరుకుమార్గము గురించి ప్రభువు చెప్పిన మాటలు మీకు గుర్తుకు వస్తున్నాయా? లూకా 13:23లో ఉన్న మాటలు. “ఒకడు ప్రభువా, రక్షణపొందు వారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.” ఎందుకు వారి వల్ల కాదు? సిలువ మోయడానికి ఇష్టము లేదు గనుక. ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసికి యేసుక్రీస్తు ప్రభువు ఇస్తున్న పిలుపు. లూకా. 9:23. “మరియు ఆయన అందరితో ఇట్లనెను ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.
తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించు కొనును. ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టు కొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును.” చాలామంది మేము రహస్యంగా క్రైస్తవులమండీ” “మాకులపు వారినే వివహము చేసుకుంటాము” అంటూ ఉంటారు. ఈ మాటల ప్రకారము “రహస్య క్రైస్తవులు” ఉండనే ఉండరు. ఉంటే బహిరంగంగా ధైర్యంగా అవమానము, నింద, పొరుగువారి బహిష్కరణ, రుచి చూస్తూ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వారే పరలోకరాజ్యపు అర్హులు. మీరు సిధ్ధమా? సిలువ లేనిది రక్షణ లేదు, పరలోకము లేదు. పాపక్షమాపణ లేదు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నా, బైబిల్ కావాలన్నా, ఉదయము 10 నుండి సాయంత్రం 6 లోపల ఫోన్ చేయండి.
ప్రార్థన: మీకు తోచిన మాటలతో తోచిన విధంగా మీ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడండి. చాలా మంది 'నాకు ప్రార్ధన రాదు, నేర్పించండి' అంటూ ఉంటారు. ప్రార్ధన అంటే దేవునితో, మిమ్మల్ని తల్లి గర్భములో నిర్మించిన దేవుడు. కేవలం ఒకే మాట! యధార్ధమైన మాటలతో మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడండి. మీ పాపము ఒప్పుకొనండి. క్షమాపణ హృదయపూర్వకంగా అడగండి. ఒక పాపి క్షమాపణ కోసం చేసే ప్రార్ధనను దేవుడు ఎన్నడూ త్రోసివేయడు!!
No comments:
Post a Comment