ఈస్టర్ స్పెషల్ Easter Special - క్రీస్తు పునరుధ్ధానము – నీ పునరుధ్ధానము

 

Easter Special ఈస్టర్ స్పెషల్ 

క్రీస్తు పునరుధ్ధానము – నీ పునరుధ్ధానము

         సజీవ నిరీక్షణ శ్రోతలందరికి Happy Easter! ప్రపంచచరిత్ర అంతటిలో అత్యంత కీలకమైన సంఘటన క్రీస్తు పునరుధ్ధానo! దేవుని విమోచన ప్రణాళికలో కిరీటo లాంటి ఘటన పునరుధ్ధానo. క్రైస్తవ విశ్వాసానికి పునరుధానం మూలరాయి. సువార్తకు పునాదిరాయి యేసురక్షకుని పునరుధ్ధానo. పరలోకానికి పునరుధ్ధానo గ్యారంటీ. క్రీస్తు రక్షకుని పునరుధ్ధానమును బట్టి మానవ జీవితము మరణముతో అంతము కాదని స్పష్టంగా నిరూపించబడింది. జాగ్రతగా వింటున్నారా? ఈ ప్రపంచములో పుట్టిన ప్రతిఒక్కరు, కులము మతము, ఆస్తి, అంతస్తు ఈలాటి ఏ భేదము లేకుండా, యేసు క్రీస్తు ప్రభువు తిరిగివచ్చినపుడు తిరిగి లేస్తారు. కొందరు నిత్య మరణానికి, నిత్య నరకానికి పంపించడతారు. మరికొందరు నిత్యజీవముతో, పరలోకములో తండ్రి దేవునితో, యేసు క్రీస్తు ప్రభువుతో, పరిశుధ్ద్ధాత్మునితో నిత్యత్వo ఆనందంలో జీవించడానికి పంపించబడతారు. ఏదో ఆత్మ లో అందరూ జీవిస్తారనుకోవడం పొరబాటు, అపోహ. మరణించిన వారందరూ దేవునివద్దకు చేరతారు అనుకోవడం చాలా పెద్ద అపోహ, మోసపుచ్చే తలంపు. అందరూ శరీరములో లేస్తారు. కొందరికి నరకపు మహాఘోర శ్రమలు అనుభవించాడానికి సరిపడే శరీరము ఇవ్వబడుతుంది, మరికొందరికి నిత్య ఆనందముతో పరలోకములో జీవించడానికి సరిపడే శరీరము ఇవ్వబడుతుంది.     

         ఈనాడు మనo ధ్యానించే అంశం క్రీస్తు పునరుధ్ధానo – నీ పునరుధ్ధానo

         మొదటిగా పునరుధ్ధానo ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. క్రీస్తు పునరుధ్ధానం ఒక చారిత్రక సత్యము, జరిగిన సంఘటన. యేసు క్రీస్తు ప్రభువు సిలువ మరణం ఎంత చారిత్రక సత్యమో, ఆయన పునరుధ్ధానo అంత చారిత్రక సంఘటన. ప్రభువు తాను చెప్పిన విధంగానే మూడవనాడు సజీవుడుగా లేచి తన అపోస్తలులకు, ఆయనను వెంబడించిన మరికొంతమందికి హద్దులులేని శరీరముతో కనిపించాడు. చూచినవారు సాక్ష్యము చెప్పగా నాలుగు సువార్తలు వ్రాయబడ్డాయి. అపో. పౌలు I కొరింధీ 15వ అధ్యాయములో చెప్పినట్టుగా 500మందికి ఒకేసారి ప్రభువు మహిమ శరీరముతో కనిపించారు. ప్రధాన యాజకుడు, ప్రజల పెద్దలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు రోమా సైనికులకు లంచమిచ్చి ప్రభువు శవమును ఆయన అపోస్తలులు ఎత్తుకు పోయారని చెప్పించారు. మరి శవమెక్కడ కనిపించలేదే. ప్రభువు సజీవంగా కనిపించాడని ఆయనను చూచిన వారందరూ సాక్ష్యమిచ్చారు.

రెండవది, ప్రభువు సజీవంగా లేచినందుచేత మనకేమి మేళ్ళు, ఆశీర్వాదాలు, కలిగాయి?     మొదటి ఆశీర్వాదం, యేసు క్రీస్తు ప్రభువు సిలువ మీద చేసిన ప్రాయశ్చిత్తమును తండ్రి అంగీకరించాడని నిర్ధారణ అయింది. తన రక్తముతో క్రీస్తు ప్రభువు చెల్లించిన పరిహారమును తండ్రి అంగీకరించి, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చాడని ప్రభువు పునరుధ్ధానము ద్వారా నిరూపించబడింది. రోమా పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.”  నీతిమంతులుగా తీర్చబడుట అనే మాట ఒక న్యాయస్థానములో వాడేమాట. యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానమును బట్టి దేవుడు మన పాపములన్నిటిని ఎంత నిశ్చయంగా క్షమించాడంటే, నీవెన్నడూ పాపము చేయని వ్యక్తిలాగా దేవుని ముందు నిలబడతావు. హల్లెలూయ! యేసు క్రీస్తు ప్రభువు మరణించడమే కాకుండా, తిరిగి లేచినందునుబట్టి  నీకు నాకు తండ్రి విధించిన శిక్షను కొట్టివేశాడు. నీవెంత ఘోరమైన కిరాతకమైన పాపములు చేసిన వ్యక్తివైనా, యేసు ప్రభువు పునరుధ్ధానుదయ్యాడని నమ్మినట్లయితే నీ పాప దోషములన్ని తుడిచివేయబడతాయి, వెంటనే ఆ క్షణములోనే నీ పేరు జీవగ్రంధములో వ్రాయబడుతుంది.

         రెండవ ఆశీర్వాదం, క్రీస్తు ప్రభువు పునరుధ్ధానుడైనందుచేత సర్వ సార్వభౌమ అధికారముతో, బలముతో తండ్రి కుడిప్రక్కలో కూర్చొని ఉన్నాడు. ఎఫెసి 1:20. అతి బలమైన లేఖన భాగము. జాగ్రత్తగా వినండి. కంఠస్థం చేస్తే ఇంకా మంచిది: ఆయన ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగము నందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొనియున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది.” పునరుధ్ధానమునుబట్టి యేసు క్రీస్తు అందరికంటే, అన్ని యుగములలో, అత్యున్నత అధికారపు స్థానములో పరలోకములో కూర్చొని ఉన్నాడు. అంతే కాదు, ఆయన సంఘమునకు శిరస్సు. సంఘమంతటిని నడిపించేవాడు ఆయనే! ఆయనకు సంఘములో సర్వాధికారమున్నది. ఏ ఒక్కరు ఈసంఘము నాది అని చెప్పలేరు. చివరకు దాన్ని స్థాపించినవారు కాని, అన్ని పనులు చేసేవారుగాని, వారి భూమి ఇచ్చినవారు గాని ఎవ్వరూ సంఘము నాది అని చెప్పకూడదు. నీవు, నేను సంఘములో యేసు క్రీస్తు మరణ పునరుధ్ధానములద్వార భాగమైతే, అది మనకెంత ధన్యత! ఏ డినామినేషన్ అని కాదు, ఎవరు కాపరి అని కాదు. అది గ్రామములో ఉన్నదా, లేదా నగరములో ఉన్నదా అని కాదు. యేసు క్రీస్తు నీ హృదయములో జీవించడానికి నీవు ఒప్పుకొని, విశ్వాసమునకు విధేయతతో జీవిస్తున్నట్లయితే నీవు ఆయన అధికారముక్రింద ఉన్నావు.

మూడవ ఆశీర్వాదము, చాలా గొప్పది. అదేమిటి? మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆయన నిరంతరం మనతో, మనలో జీవించి, మనకు ఆదరణ, ఆలోచన, జ్ఞానము, వివేచన అవసరమైన సమస్తమును ఇవ్వడానికి మనకు అనుగ్రహించాడు. ప్రభువు పునరుధ్ధానుడైతే గాని ఇది జరగదు. యోహాను సువార్త 14:16,17. నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.”  ప్రభువు పునరుధ్ధానుడైన తరువాత, పరలోకానికి తండ్రి వద్దకు మేఘాలమీద వెళ్లిపోయాడు. కాని, పరిశుధ్ద్ధాత్ముడు మనతో, మనలో ఎల్లప్పుడు ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మ. I కొరింధీ 2:10. “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.” అనగా దేవుడే నీలో నాలో పరిశుద్ధాత్మద్వారా జీవిస్తున్నాడు. నీవు పడిపోయినప్పుడు లేపుతాడు. నీవు క్రుంగిపోయినపుడు బలపరుస్తాడు. నీకు ఎటు తోచని పరిస్థితులు ఎదురైనపుడు నీకు ఆలోచన చెప్తాడు, నడిపిస్తాడు. నీవు కన్నీటితో ఉన్నపుడు నిన్ను ఆదరించే అదరణకర్త ఆయనే!

         నాలుగవ ఆశీర్వాదము, పునరుధ్ధానమునుబట్టి ప్రభువు పరలోకములో నీకు స్థలమును సిద్ధపరుస్తున్నాడు. పునరుధ్ధానుదైన తరువాత, క్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళుతున్నాడోఏమి చేయబోతున్నాడో స్పష్టంగా ఆనాడు అపోస్తలులకు, ఈనాడు ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ మాటలు చెబుతున్నాడు. యోహాను సువార్త 14: 2-3. “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.”  నీకు ఇల్లు లేదని బాధ పడుతున్నావా? భూమి మీద అందరము పరవాసులమే, కాని మన ప్రభువు శ్రేష్టమైన స్థలములో, దుఖ:ము, మరణము, రోగము, చింత, వేదన, అన్యాయము, అక్రమము, పీడన, హింస, బాధలు లేని నిత్యరాజ్యములో స్థిర నివాసము నీకు ఏర్పాటు చేస్తున్నాడు. క్రీస్తు పునరుధ్ధానము వల్ల ఇది సాధ్యమయ్యింది.

         చివరి ఆశీర్వాదము, ఈ భూమి మీద కూడా ఆశ, నిరీక్షణ జీవo నీకోసం ఉన్నవి. యోహాను సువార్త 14:19 నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.”  ప్రభువు పునరుధ్ధానుడైనందుచేత నిరంతరం తండ్రి కుడి ప్రక్కలో కూర్చొని నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు పడిపోవద్దని, బలపడాలని, స్థిరపడాలని, శోధనలు జయించాలని ప్రభువు నీకోసం ఎడతెరిపి లేకుండా విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక. 7:25 “ఈయన తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.”  ప్రియ మిత్రమా, నీకు, ఈభూమిమీద జీవించడానికి నిరీక్షణ, ఆశ యేసు క్రీస్తు పునరుధ్ధానము వల్లనే కలుగుతాయి. 

ప్రార్థన:

 

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...