2వ కొరింధీ-10 1~15-22 రెండవ భాగము - క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? రెండవ భాగము

https://drive.google.com/file/d/17gI5_8KWZOe7Uf0zKhrGiVeUGHTi-IHv/view?usp=sharing

 

2వ కొరింధీ-10  1~15-22 రెండవ భాగము  

క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం?

రెండవ భాగము

ప్రియ శ్రోతలందరికి యేసు క్రీస్తు ద్వారా కృపాసమాధానములు కలుగుగాక! క్రీస్తులో వేరుపారి స్థిరపడడానికి మార్గాలు అనే శీర్షికన రెండవ అధ్యయనం చేస్తున్నాము. ఈ శీర్షికలోని మొదటి భాగమును ఇంతకు ముందు తెలుసుకున్నాము. దేవుని అధికారానికి మన ప్రవర్తన, నిర్ణయాలు, తీర్మానాలు, ప్రణాళికలు అప్పగించుకోవడమని తెలుసుకున్నాము. పౌలు జీవితములోని ఉదాహరణను స్పష్టంగా వివరించుకున్నాము.

         క్రీస్తులో వేరుపారి స్థిరపదాలనుకుంటే రెండవ మార్గము, పద్ధతి, దేవుని వాగ్దానములద్వారా.

లేఖన భాగo II కొరింధీ 1:15-22. మీ బైబిల్ తెరిచి జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను.

పౌలు తనను సమర్ధించుకోవడానికి యేసు క్రీస్తు మాదిరిని ఉదహరిస్తున్నాడు. పౌలు తన జీవితమంతటిని, ఆయన వ్యక్తిత్వాన్ని యేసుక్రీస్తును సేవించడానికి, ఆయనను ప్రకటించి ప్రదర్శించడానికి, అర్పణగా ఇచ్చాడు. ఆయన “నిన్న నేడు ఒకేరీతిగా ఉన్నవాడు.”  నిజాయితీ లేదని, నిలుకడలేదని పౌలు మీద వారు మోపిన అభియోగాలు ఆధారాలు, రుజువులు లేని పనికిమాలినవి. యేసు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడు “అవును” అని చెప్పే “అమెన్” అనువాడు. ఆయన శిష్యులు పౌలు, తిమోతి సిల్వాను కూడా ప్రభువులాగే అవునంటే అవును కాదంటే కాదని నోటితో చెప్పడమే కాకుండా ఆ రీతిగా ప్రవర్తించినవారు. ఏది మనసులో ఉందే చెప్పారు, ఏది చెప్పారో అదే చేశారు! రెండు మాటల మధ్యలో అటుఇటు ఊగిసలాడలేదు. హల్లెలూయ!! మన ప్రభువు యేసు క్రీస్తు స్వయానా బోధించిన పరమసత్యము మత్తయి సువార్త 5:37లో ఎంత స్పష్టంగా నిర్ద్వంద్వంగా బోధించారో చూడండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను; వీటికి మించునది దుష్టునినుండి పుట్టునది.”  చివరి మాటలు ఎంత కఠినంగా ఉన్నాయో గమనించారా? చాలా మండి క్రైస్తవులని, విశ్వాసులమని, దేవుని సేవకులమని చెప్పుకునేవారు కూడా వారి మాటను ఎంతో సులభంగా మార్చుతూ ఉంటారు. ఇది దేవుని పిల్లల లక్షణం కాదని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. మీ ప్రవర్తన మార్చుకుంటే దేవుని మెప్పు పొందుతారని వేరే చెప్పనవసరం లేదు.

         యేసు క్రీస్తును ఆ రకమైన అనిశ్చిత రీతిగా కొరింధీ విశ్వాసులు రుచి చూడలేదని పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువు పలికిన మాటలు ఏమిటి? “నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును...”   ఈ మాటలు ప్రభువు జీవితములో ప్రవర్తనలో నిరూపించాడు. తన విషయం లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చాడు. పాపులమైన మనలను విమోచించడానికి తన క్రియలు సమాప్తం చేశాడు. ప్రభువే సిలువ మీద మరణించక పోయి ఉంటే మన పాపములు, వాటి శిక్ష, తీర్పులను, నిత్య నరకం సంగతి ఏమై ఉండేదో, మనమేమైపోయో వారమో ఒక్కసారి ఆలోచించండి. ఆయన పిల్లలమని చెప్పుకునే మనము మన మాట ప్రకారం చేయడం, నిలబడడం, ఎంత అత్యవసరమో గమనిస్తున్నారా? 20వ వచనము గమనించండి: దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.”  ఈ మాటల అర్ధమేమిటి? దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానము నిజమయ్యేది, నెరవేరేది తండ్రిఅయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తులోనే! ఈ ఒక్క వాక్యములో సువార్త అంతా ఇమిడి ఉన్నది.

         ఆదిమ సంఘములోని సమావేశాల్లో చెప్పబడిన సిధ్ద్ధాంతము ఎంత సత్యవంతమైనదో సాక్షమివ్వడానికి అందరూ కలిసి “అమెన్” అని చెప్పడం ఆనవాయితీ అని మనకు తెలుసు. ఎవరికి అపోస్తలుడైన పౌలు సువార్తను అందించాడో, వారిలో కొందరు,  ఆయననే అనుమానించడం, అపోహలు పెట్టుకోవడం, నిందించి అభియోగాలు మోపడం విడ్డూరంగా లేదూ? “అమెన్” అనే మాటను ఎవరు పరిచయం చేశారో, ఆ మాటను ఎలా వాడాలో బోధించిన ఆయననే వారు తప్పుపట్టడం చాలా దుఃఖకరమైన స్థితి. నిలుకడ లేదనే సంగతి నిజమే అయితే అది కొరింధీ సంఘపు వారిలో ఉన్నది కాని పౌలులో లేదు.

         అవును, ప్రియ సోదరీ సోదరులారా, దేవుని వాగ్దానములు మనలను క్రీస్తులో స్థిరపరుస్తాయి. అపోస్తలుడు పేతురు తన రెండవ పత్రికలో పలికిన మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది. తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆ మహిమ గుణాతిశయములనుబట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను

         మన విశ్వాసము అమూల్యమైనదని మనము జాగ్రత్తగా జ్ఞాపకముంచుకోవాలి. “ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున,” అనే మాటలలో ఎంత పరిపూర్ణత ఉందో మనమందరము గమనించాలి. శక్తి మన శక్తి కాదు, మానవశక్తి కాదు, రాజకీయ నాయకుల అధికారము కాదు, అది దేవుని అపరిమితమైన ఊహించలేని అద్భుతమైన శక్తి. కావలసినవన్ని ప్రభువు ఇచ్చాడు. ఇస్తాడు కాదు. మరొకటి అమూల్యమైనది ఉన్నది. అవి దేవుని వాగ్దానములు. అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు” దేవుని వాగ్దానములద్వారా మనకేమి లభిస్తుంది? లోకమందున్న బ్రష్టత్వమును తప్పించుకోగల శక్తిని పొందుతాము. బ్రష్టత్వానికి మూలము దురాశ. దీనంతటిద్వారా కలిగేది ఏమిటి? మనము దేవ స్వభావము అనగా దేవుని స్వభావమును పొందుతాము. II పేతురు 1:2-4 వరకు కంఠస్థం చేసి మనసులో భద్రము చేసుకొని ధ్యానిస్తే ఎంత శక్తి మనమంతా పొందుతాము కదూ!

         కొరింధు లో పౌలు పరిచర్య ద్వారా, దేవుని వాగ్దానములన్నిటికి యేసు క్రీస్తు ప్రభువు “ఆమెన్” అని చెబుతూ నెరవేర్చే శక్తిమంతుడని బోధించాడు. దీని ద్వారా తండ్రికి మహిమ కలుగుతుంది. దేవుని వాగ్దానాలన్ని, అనగా గతము, ప్రస్తుతము, భవిష్యత్తు కోసం ఇవ్వబడిన ప్రతి వాగ్దానము శరీరధారి అయిన దైవకుమారుడు యేసు క్రీస్తులో మన కన్నులకు కనిపించే ఋజువు.

         దేవుని వాగ్దానముల “ఆమెన్” అయిన యేసు క్రీస్తు ప్రభువును నీవు రుచి చూశావా? జీవితములో ప్రతి దినం జరిగే వాటన్నిటిలో నీవు వాటి నెరవేర్పు గమనిస్తున్నావా? దేవుని వాగ్దానములు నీలో నెరవేరి, కనిపించి నిజమయ్యే దినములు ఉన్నాయా? ఈ విధంగా దేవుని నమ్మకమైన స్థిరమైన వాగ్దానములు, వాటి నిశ్చయత్వం ద్వారా ఎంతైనా నమ్మదగినవి. వీటి ద్వారా మనము క్రీస్తులో వేరుపారి స్థిరపడతాము. ప్రియ సోదరీ, సోదరులారా, దేవుని వాగ్దానములను నీవు నమ్ముతున్నావా? కొన్నిటిని కంఠస్థం చేశావా? దేవుని వాగ్దానముల ద్వారా నీ విశ్వాసము బలపడుతుందా? నేను వ్యక్తిగతంగా దేవుని నమ్మకత్వాన్ని రుచి చూశాను. నీవు రుచి చూశావా?

         ప్రియ స్నేహితుడా, యేసు క్రీస్తుతో నీకు వ్యక్తిగత సంబంధం లేకపోతే దేవుని వాగ్దానములు ఒక్కటికూడా నీకు వర్తించవు, ప్రాప్తించవు. ఇంత అద్భుతమైన దేవుని శక్తి గలిగిన వాగ్దానములు నీకు వ్యక్తిగతంగా కావాలంటే, యేసు క్రీస్తును నీ పాపమునుండి విడిపించమని నీవు ప్రార్థించాలి. ప్రభువు నీ పాపములు శుద్ధిచేసి, నీలో జీవించాలి. అంతవరకు యేసు క్రీస్తుతో నీకు వ్యక్తిగత సంబంధము లేదు. దేవుని వాగ్దానములు నీవికావు. ఇంత శ్రేష్టమైన అవకాశం జారవిడుచుకోవద్దని నిన్ను ప్రేమతో బతిమాలుతున్నాము. మీకు ఆత్మీయమైన సహాయము, ప్రార్ధన, కావాలంటే ఫోన్ చేయండి, లేదా ఉత్తరం వ్రాయండి. మెసేజ్ చేయండి. మీకు బైబిల్ కావాలంటే మీ మనవి తెలియచేయండి.  

ప్రార్ధన: 

    

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...