2వ కొరింధీ-9 1~15-22 మొదటి భాగము క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మొదటి భాగము

 

2వ కొరింధీ-9  1~15-22 మొదటి భాగము   

క్రీస్తులో వేరుపారి స్థిరపడడమెలాగు సాధ్యం? మొదటి భాగము

         జ్ఞానవంతుడైన ఒక గొప్ప నాయకుడు అన్న మాటలు ఇవి: జాగ్రత్తగా గమనించండి. “నేను 

చాలా కాలం జీవించాను. ఎంత ఎక్కువ కాలం జీవిస్తే, అంత బలంగా గ్రహిస్తున్న సత్యము 

ఒకటుంది. అదేమిటంటే, మానవుల క్రియలన్నిటి మీద దేవుని సర్వాధికారము ఉన్నది. 

ఆయనకు తెలియకుండా ఒక పిచ్చుక నేలరాలనప్పుడు ఆయన సహాయము లేకుండా ఒక 

రాజ్యమెలా ఏర్పడుతుంది?” జాగ్రత్తగా విన్నారా? కాబట్టి అన్నివిషయముల గూర్చి దేవునికి 

ప్రార్థన చేయమని ఆయన అందరిని హెచ్చరించాడు.

         ప్రణాళికలు, వ్యూహాలు ఏర్పాటు చేసిన తరువాత, అవి నెరవేరకుండా పోయినప్పుడు, 

వాటిని చేసినవారిని విమర్శించడం, తప్పుపట్టడం కుటుంబాల్లో సంఘాల్లో స్నేహితులమధ్యలో 

వ్యాపారాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి నిర్ణయాలు సమయానికి తీసుకోలేదని కావచ్చు, 

కష్టపడి పనిచేయలేదని కావచ్చు. శ్రధ్ధ లేదని కావచ్చు. కాని, పూర్వాపరాలు, అసలైన కారణాలు 

తెలుసుకోకుండా ఆ విధంగా స్పందించడం జ్ఞానయుక్తమైనది కాదు. ఆ ప్రణాళికలు, వ్యూహాలు 

నెరవేర్చకపోవడానికి ఆ వ్యక్తికి నిజమైనవి, బలమైనవి, సరియైన కారణాలు ఉండవచ్చు.

         ఈ దినపు లేఖనభాగములో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. II కొరింథీ 1:15-22. ఈ 

లేఖనభాగములో పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, ఈనాడు మనకు నేర్పుతున్న సత్యం 

ఏమిటంటే, క్రీస్తులో స్థిరపడి వేరుపారే మార్గాలు, పధ్ధతులు. అది ఈనాటి మన 

ధ్యానాంశం.       

         మొదటి మార్గం, పధ్ధతి, దేవుని ప్రణాళికలను అంగీకరించడం. దీనికి 

ముందు పౌలు 10వ వచనములో దేవుడు ఆయనను మరణాపాయములో నుండి ఎలా 

తప్పించాడో పంచుకున్నాడు. ఆయన ధైర్యoగా మంచి మనస్సాక్షితో పరిశుద్ధమైన ప్రవర్తనతో 

నిష్కపటంగా కొరింధీ సంఘముతో ఎలా జీవించాడో సాక్షమిచ్చిన సంగతి మనకు తెలుసు. 

ఆయన తప్పించబడడానికి కొరింధీ సంఘస్తుల విజ్ఞాపన ప్రార్ధనలు ఎంతో ఉపకరించాయి. 

సంఘముతో ఆయన సంభాషణ, ప్రవర్తన, మాట, పలుకు యధార్ధంగా సత్యమైనవిగా ఉన్నట్టు 

కూడా తెలుసుకున్నాం. 15,16 వచనాల్లో పౌలు వాళ్ళను మళ్ళీ దర్శించాలని ఆశపడుతున్నట్టు 

తెలుస్తున్నది. ఈ ప్రజలను ఆయన బాగా తెలుసుకొని ప్రేమిస్తున్నాడు. ఇక్కడి సంఘమును 

ఆయన స్థాపించాడు. అక్కడి సంఘస్తులతో మంచి సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకున్నాడు. 

ఆ సంబంధాలను పటిష్టపరచి బలపరచుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ సంఘం 

ఎదుర్కుంటున్న కొన్ని సవాళ్ళు ఆయనకు తెలుసు. ఒక జ్ఞానయుక్తమైన నాయకునిగా ఆ 

సమస్యల విషయం వారితో మాట్లాడాలనే ఉద్దేశముతో వారిని దర్శించాలని ప్రణాళిక 

వేసుకున్నాడు.

         ఆయన ఎఫెసు నుండి మాసిదొనియా వెళ్ళేటప్పుడు మధ్యలో కొరింధు లో ఆగాలని 

అనుకున్నాడు. తిరుగు ప్రయాణములో కూడా అక్కడ ఆగి, వారు ఆయనను యెరూషలేమునకు 

సాగనంపుతారని ఆశ పడ్డాడు. దీన్ని పౌలు “రెండవ కృపావరము” అని పిలుస్తున్నాడు. ఆ 

ప్రణాళిక ఎందుకు మారిందో మనకు తెలియదు. కానీ కొరింధు లో ఉన్న వ్యతిరేక పార్టీ ఆయనను 

తప్పుపట్టింది. వదరుబోతు అని, మాటమార్చేవాడని, నిలుకడలేని వాడని దుయ్యబట్టింది. కాని, 

పౌలు జీవితములోని ఇతర సమయాల్లో ఆయన ప్రవర్తనలో, ప్రణాళికల్లో దేవుని మనసును 

చిత్తమును బట్టి మలచుకున్నట్టు అర్థమవుతుంది. ఈ నింద నిలుకడలేని నింద. ఇది వీగిపొయే 

అభియోగము. అ. కా. 16లో చూస్తే, అక్కడ పౌలు సీలలు చిన్న ఆసియాలో సువార్తసేవ చేయాలని 

అనుకున్నారు, కాని పరిశుధ్ద్ధాత్ముడు వారిని అడ్డగించాడు. అదే సమయములో పౌలు 

దర్శనములో మాసిదొనియా వ్యక్తి తనను పిలుస్తున్నట్టు చూచాడు. దేవుడు ఆయనను 

నడిపిస్తున్నట్టు తెలుసుకున్నాడు. కాబట్టి వెంటనే అక్కడికి బయలుదేరాడు. ఇది ప్రణాలికలో 

పెద్ద మార్పు. కాని పౌలు పిరికివాడైకాదు. నిలుకడలేకకాదు, బాధ్యతలేని వ్యక్తికాదు.


        ఈ అభియోగానికి, పౌలు కఠినంగా జవాబిస్తున్నాడు. 17వ వచనం మధ్యలోనుండి 

గమనించండి: అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా 

యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?”   ఏదో అయోమయమైన మానసిక 

అనిశ్చితిలో తాను లేనని స్పష్టంగా చెబుతున్నాడు. కొరింధు సంఘస్తులకు తాను దేవుని 

మనసును తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా ప్రణాళిక వేసుకుంటున్నట్టు సాక్షమిస్తున్నాడు. 

మీరు, నేను మన నిర్ణయాలలో తీర్మానాలలో ఈ విధంగా ప్రవర్తించాలని ప్రభువు మనలను 

హెచ్చరిస్తున్నాడు. కాని అప్పుడప్పుడు మన తీర్మానాలు సరైనవి కాకపోవచ్చు. మరికొన్ని 

సమయాల్లో ప్రభువు మన ప్రణాళికలను మార్చవచ్చు. అన్నిటికి సిద్ధంగా ఉండడం, దేవుని 

యెదుట, తోటివిశ్వాసుల యెదుట నిజమైన దీనమనసు. మీరైనా, నేనైనా, దేవుని చిత్తానుసారంగా, 

దేవుని వాక్యపువెలుగులో సరైన నిర్ణయం తీసుకున్నామని నిర్ధారణగా తెలుసుకున్నాక, దాని 

విషయం ఇతరులు నిందించినా, దూషించినా, అభియోగాలు మోపినా, మనలను మనం 

సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఓపిగ్గా ఉండడం, తీర్పులు దేవుని వదిలేపెట్టడం 

నేర్చుకోవాలి. ఇది కూడా దేవుని యెదుట, మానవుల యెదుట దీనమనసుకు ఋజువు. ఈలాటి 

పరిస్థితుల్లో ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోవడానికి దేవుని నుండి 

జ్ఞానం అవసరం.

         దేవుడు తన ప్రణాళిక మార్చుకున్నపుడు ఏమి చేస్తున్నట్టు? ఎప్పుడైనా మీరు దీని విషయం 

ఆలోచించారా? దేవుని వాక్యప్రకారం నేను కొన్ని ప్రణాళికలు వేసుకున్న తరువాత, అవి జరగక 

పోవడం గమనించాను. “ఇదెందుకు జరగలేదు ప్రభువా?” అని అడిగిన సందర్భాలు ఎన్నో 

ఉన్నవి. కొన్ని సార్లు కారణం తెలిసింది, మరికొన్ని సార్లు కారణం తెలియలేదు. దేవుని 

ఊహించలేని, అనంతమైన జ్ఞానమును నమ్మి మౌనంగా ఉండడం నేర్చుకుంటున్నాను. 

మీరుకూడా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను.

         కొరింధులోని ఆ కొందరి లాగా మనము ఉండకూడదు. పౌలు, చెప్పిన మాట ప్రకారం 

చేయనందుకు వారు ఆయన ప్రవర్తనను విమర్శించారు. తూలనాడారు, నిందించారు. జాగ్రత్తగా 

గమనించండి శ్రోతలూ! మనము మన ప్రణాళికలు, ఉద్దేశాలు మార్చుకున్నపుడు ఇతరులు ఏ 

విధంగా అర్ధం చేసుకోవాలని ఆశపడతామో అలాగే ఇతరులు మార్చుకున్నపుడు మనము ఓపిగ్గా 

ఉండి, అర్ధం చేసుకుందాం. దీని వల్ల ఏమి జరుగుతుందో తెలుసా? ఈ విధంగా రూపాంతరం 

చెంది దేవుని ప్రణాళికల ప్రకారం నడుచుకోవడానికి మనము నిర్ణయం తీసుకున్నపుడు, మనము 

క్రీస్తు నందు వేరుపారి స్థిరపడతాం. ఆ విధంగా రూపాంతరం చెందడానికి, పరిశుద్ధ 

పరచబడడానికి ఇది ఒక మార్గం పద్ధతి. సామెతల గ్రంధంలోని లేఖన భాగం ఈ సత్యానికి ఎంత 

దగ్గరగా ఉందో గమనించారా?నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు 

ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” సామెతలు 3:6


         క్రీస్తులో నా ప్రియ సోదరీ, సోదరులారా, భక్తి, అంటే బైబిల్ చదివి ప్రార్థన చేయడం కాదు. 

హృదయములో మార్పు కలగడం. అది ఎవరు చేయగలరు? దేవుడు ఒక్కడే! పరిశుధ్ద్ధాత్ముని 

శక్తిచేత. దేవుని వాక్యములోని శక్తి చేత. కాని, మీరు నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 

మాత్రమే జరుగుతుంది. విన్నంత మాత్రాన, చదివినంత మాత్రాన, రాసుకున్నంత మాత్రాన 

జరగదు. వినాలి, చదవాలి, రాసుకోవాలి. కాని అక్కడ ఆగిపోకూడదు. అసలైన అడుగు వేయడానికి 

ధైర్యం చేయండి. తగ్గించుకోండి. ఎవరిని క్షమాపణ అడగాలో వారిని అడగడానికి వెనుకాడకండి. 

ఎవరినైనా కించపరచి తూలనాడి, అవమానించారో, వారితో సమాధాన పడడానికి నడుము కట్టండి. 

అడుగు వేయండి. తగ్గించుకునేవారు హెచ్చింపబడతారని మీకు తెలుసు. యేసు క్రీస్తును 

తిరస్కరిస్తున్న ప్రియ స్నేహితులారా, ఇవన్నీ నీ జీవితములో నీవు రుచి చూడాలనుకుంటే, మొట్ట 

మొదటి మెట్టు నీవు, నేను పాపులమని, దేవుని తీర్పు ఇప్పటికే మనమీద ఉన్నదని లేఖనం 

స్పష్టంగా హెచ్చరిస్తుంది. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు

విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాస ముంచలేదు గనుక 

వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను.”  యోహాను 3:18. నీ మీద ఉన్న దేవుని తీర్పును, 

శిక్షను కొట్టివేసినవాడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయనను నీ రక్షకునిగా నీవు విశ్వసించితే, ఆయనే 

నీ హృదయములో మహాగొప్ప మార్పు కలిగిస్తాడు. నీవు చేయవలసిందల్లా ఒక్కటే! మనస్ఫూర్తిగా, 

హృదయపూర్వకంగా యేసు ప్రభువును నీ పాపములు క్షమించమని వేడుకో, పరిశుద్ధ గ్రంధం 

బైబిల్ కావాలనుకుంటే, మీ మనవి మాకు తెలియచేయండి. 


ప్రార్థన: మీకు తోచిన మాటలతో, యధార్ధ మైన మాటల తో ప్రార్ధన చేయండి !

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...