2వ కొరింధీ-8 1~8-14 మూడవ భాగము
మరణము నుండి విడుదల - మూడవ భాగము
శ్రోతలకు యేసు ప్రభువు శక్తిగలిగిన నామములో శుభములు! II కొరింథీ పత్రిక పఠన
ద్వారా దేవుని పరిశుద్ధ లేఖనములలోని హెచ్చరిక, ఆదరణ, ధైర్యం, నిరీక్షణ పొందుతున్నారా?
మీరు మీ వ్యక్తిగత జీవితములో ఏ విధమైన దీవెనలు పొందారో స్పష్టంగా తేటగా తెలియచేయండి.
ఒక ఉత్తరం, లేదా వాట్సప్ మెసేజ్ అయినా, ఫోన్ కాల్ ద్వారానైనా తెలియచేయండి. ఉదయం
10 నుండి సాయంత్రం 6 లోపల ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాము. ప్రార్థన:
మరణమునుండి విడుదల పొందడానికి ఆధారాలు అనే అంశమును ధ్యానం చేస్తున్నాము.
ఈ రోజున మూడవ ఆధారం ఏమిటో తెలుసుకుందాం. మొదటి ఆధారం, దేవుడు కలుగజేసుకొని
జోక్యం చేసుకోవడం. రెండవది మానవుల విజ్ఞాపన, లేదా మధ్యవర్తిత్వపు ప్రార్థన ద్వారా.
మూడవది, ధైర్యముగా మంచి మనస్సాక్షితో జీవించడం. దీనికి మరణము నుండి
తప్పించబడ్డానికి సంబంధం ఏమిటి? అనుకుంటున్నారా? కాసేపట్లో అర్థమవుతుంది. జాగ్రతగా
వినాలి సుమా! 12వ వచనం “మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక,
దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి
లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా
మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే.” అతిశయము అంటే గర్వమని కాదు, ధైర్యమని అర్ధం. ఇది ఒక
పాతకాలపు మాట, కాని దాని అర్ధం ఎప్పటికి ఒకటే! అపోస్తలుని ధైర్యాని కి కారణం ఏమిటి?
ఆయనలోపల ఉన్న మంచి మనస్సాక్షి. అది ఏ విధంగా కలిగింది? పరిశుద్ధతను బట్టి.
నిష్కపటమైన ప్రవర్తనను బట్టి. దానికి మూలం దేవుని కృప. ప్రియులారా, దేవుడు కృప
అనుగ్రహించేది దీనులకు మాత్రమే. నా ఇష్టమొచ్చినట్టు నేను జీవిస్తాను అనుకునేవారికి ఆయన
కృప దొరకదు. లోకములో ఉన్నప్పటికి లౌకికమైన కపటము అబద్ధము, మోసముతో నిండిన లౌకిక
జ్ఞానము వల్ల కలిగింది కాదు. అది ప్రభువు తన కృపచేత అనుగ్రహించింది. అపోస్తలునికి ఇది
జీవిత విధానం అని మనము గ్రహించడానికి ఇతర లేఖన భాగాలు కూడా ఉపకరిస్తాయి. అ. కా.
24:16 గమనించండి. “ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను
ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.”
రోమా ప్రభుత్వపు గవర్నర్ ఫేలిక్స్ తో అపో. తన వ్యక్తిగత సాక్ష్యం చెబుతూ తాను ఈ దోషం,
అపరాధం చేయలేదని సాక్షమిస్తున్న సందర్భం ఇది. ఫేలిక్స్ న్యాయమూర్తి కూడా. “అభ్యాసము
చేసుకొనుచున్నాను” అనే మాటలు జాగ్రతగా గమనించాలి. అనగా ఆయన అను దినం, ప్రతి
విషయములో ప్రతి ఒక్కరితో, కుటుంబమైన, బజారులోనైనా తాను ఎక్కడ ఉన్న తన మనస్సాక్షీ
కల్మషం తోచకుండా అతి జాగ్రత్తగా ప్రవర్తించానని సాక్షమిస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, సోదరీ,
నీవు నేను ఈ సాక్ష్యమివ్వగలమా? ఇంతవరకు పాపములో సైతాను శక్తుల ప్రభావముతో నీ
మనస్సాక్షిని నీవు అణచి ఉండవచ్చు. పరిశుద్ధాత్మను దుఖ:పరచి ఉండవచ్చు. నిరాశ పడవద్దు.
యేసు క్రీస్తు ప్రభువు నీ కోసం చిందించిన పరిశుద్ధ రక్తములో క్షమాపణ ఉంది. ప్రతి పాపమునకు
క్షమాపణ ఉంది. దీనమనసుతో ఉన్నదున్నట్టుగా ప్రభువు ఎదుట ఉప్పుకొని పశ్చాత్తాపపడినట్లైతే
నీ గతమంతా యేసు రక్షకుడు తుడిచివేస్తాడు. క్రొత్త జీవితం ఆరంభించి నీ మనస్సాక్షిని దేవుని
పరిశుద్ధ వాక్యముతో బలపరచుకోవచ్చు. నీ జీవితములో యేసు క్రీస్తు ప్రభువనకు ఎన్నడు
స్థానమివ్వని వ్యక్తివయితే ప్రభువు యేసు క్రీస్తు రక్తముద్వారా నీవు పరిశుద్ధుడైన దేవునితో
సమాధానపడి, ఆయన కుమారుడవు కుమార్తెవు కావచ్చు. అది విశ్వాసముతో సువార్తకు
విధేయతతో జీవించడమునుబట్టి జరిగే బలమైన పరిశుధ్ద్ధాత్ముని ప్రక్రియ. నీవిది చేసిన వెంటనే
పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా నీలో జీవిస్తాడు, నీ జీవితమంతటిని పరిపూర్ణంగా
మార్చగల శక్తిమంతుడు ఆయన. కేవలం నీవు ఎంత హృదయపూర్వకంగా చేస్తావో దాన్నిబట్టి ఈ
ప్రక్రియ జరుగుతుంది. మీకు దీని విషయములో ఇంకా ఆత్మీయసహాయం కావాలనిపిస్తే 10 నుండి
6 మధ్యలో మాకు ఫోన్ చేసి మాట్లాడండి. ఆత్మీయ సహాయం చేయడానికి మేము సిద్ధమే!
అపో. పౌలు జీవించిన మంచి మనస్సాక్షి కలిగిన నిష్కపటమైన పరిశుద్ధమైన జీవితం
జీవించాలంటే ఇంకా ముందుకు ధ్యానం చేసుకుందాం. రండి రేడియోకు దగ్గరాగా వచ్చి
కూర్చోండి. జాగ్రత్తగా వింటున్నారా శ్రోతలూ? మంచి మనస్సాక్షితో జీవించాలంటే కావలసిoది
పరిశుద్ధత అనే అద్భుతమైన సత్యమును మనము ధ్యానిస్తున్నాము. ఇది మనకు స్వాభావికంగా
మనమనసుల్లో కలుగదు. మనము పాప స్వభావముతో పుట్టినవారమని మన ఒక్కొక్కరి జీవితాలు,
ప్రవర్తన స్పష్టంగా బిగ్గరగా చెబుతున్నది. విశ్వాసులైనా, ఇంకా విశ్వాసము ఉంచని వారైనా. మన
స్వభావాలు వెంటనే మారవుకదా! కాని, యేసు క్రీస్తు ప్రభువు రక్తముద్వారా దేవునితో సంబంధం
కలిగినవారు రూపాంతరం చెందుతూ ఉంటారు, అనగా మార్చబడుతూ ఉంటారు. ఈ ప్రక్రియ
నీలో జరగడం లేదంటే, నీవు ఇంకా దేవునితో సంబంధము లేని వాడవైనా అయిఉండాలి. లేదా
దేవునితో సంబంధం కలిగిఉన్నా, ఇంకా పాపపు స్వభావమును ప్రభువుకు అప్పగించకుండానైనా
ఉండాలి. దీని విషయం నీతో మాట్లాడి నీకు సత్యము బోధించేవాడు పరిశుధ్ధా త్మ దేవుడు.
మన ప్రవర్తన మన నిర్ణయాలమీద ఆధారపడుతుంది. మనమేవిధంగా జీవించాలని
నిర్ణయాలు చేసుమంటామో, ఏది ఎంపిక చేసుకుంటామో వాటి మీద మన ప్రవర్తన ఆధారపడి
ఉంటుంది. తన ప్రవర్తన “లౌకిక జ్ఞానము” నుoడి కాదు గాని, అది దేవుని కృపచేత కలిగిందని
అపో. పౌలు సాక్షమివ్వడం ఎంత సంతోషకరమైన విషయం కదూ! తాను బోధించిన రీతిగానే, తన
ప్రవర్తన ఉందని సాక్షమిస్తున్నాడు. ఈ సాక్షo నేను, మీరు ఇవ్వగలమా? ఒక బోధకునిగా, దేవుని
సేవకునిగా నాకిది ప్రతి దినం ఒక సవాలు. ప్రభువు కృపతో పరిశుద్ధాత్మ దేవుని మహాకృపతో మీకు,
నాకు, ఇది సాధ్యమే! పౌలు కొరింథు పట్టణములో 18 నెలలు జీవించాడు. మరేచోట ఇంత కాలం
ఒక్కటేసారి ఆయన జీవించలేదు. అనగా ఆయన జీవితం, ప్రవర్తన, మాట, పలుకు, చూపు, క్రియ,
అన్నింటినీ కొరింధీ సంఘస్తులు చూస్తూనే ఉన్నారు. మీరు సంఘకాపరి అయినా, సువార్తికుడు
అయినా, సంఘ పెద్ద అయినా, లేదా సాధారణమైన ఒక యేసయ్య శిష్యుడివైనా, సంఘము,
లోకము మనలను ఎల్లప్పుడు చూస్తూనే ఉంటుంది. మనము చెప్పే బోధలకంటే మన జీవితాలు,
ప్రవర్తన ఎక్కువ ప్రభావము చూపుతాయని జ్ఞాపకముంచుకుందాం.
అపోస్తలుడు తన సంభాషణ, సంబంధం విషయం కూడా ధైర్యంగా మంచి మనస్సాక్షితో
ఉన్నట్టు మనకు లేఖన భాగములో తెలుస్తున్నది. నిజానికి కొరింథీ సంఘపువారు పౌలు మీద
కొన్ని అభాండాలు, నిందలు మోపారు. ఆయన మోసగాడని, స్వార్థపరుడని అన్నారు. కాని,
ఆయన మాత్రం, తన ప్రవర్తన, సంభాషణ, మాట, పలుకు, అన్ని తాను బోధించిన విధంగానే
ఉన్నట్టు చెబుతున్నాడు. అబద్ధాలు, మోసకరమైన నిందలు ఎవరు ఎన్ని నీ మీద మోపినా,
అభాండాలు వేసినా, నీ మట్టుకు నీకు మంచి మనస్సాక్షిఉంటే, పరిశుద్ధాత్మ సాక్షముతో
బాటు నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకుంటే, పౌలులాగా ధైర్యంగా మంచి మనస్సాక్షితో
జీవించవచ్చు. పౌలు వారికి ఏది దాచలేదు. అంతా వారితో స్పష్టంగా దాచుకోకుండా చెప్పి
విశదపరిచాడు. అది ఆయన ధైర్యానికి రహస్యం. దీన్ని పరిశుద్ధ గ్రంధం బైబిల్ “యధార్ధత” అని
పిలుస్తుంది. ఇది దేవుని గుణం. దేవుని పిల్లలమైన మనలో ఈ గుణము ఉండాలి. ఈ దినాల్లో
సంఘాల్లో, కుటుంబాల్లో, భార్య భర్తల మధ్యలో, పిల్లలు, తల్లితండ్రుల మధ్యలో ఎంతో ఘోరమైన
దాపరికాలు ఉన్నవి. ఇది దేవుని పిల్లలకు చెందిన ప్రవర్తన, గుణము కాదని మీకు ప్రేమతో
జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా దేవునితో సరిచేసుకోండి, ప్రభువు యెదుట మీ హృదయమును
తెరవండి, క్షమాపణ కోరండి. క్షమించబడని పాపము లేదు. సమస్త పాపము యేసు రక్తమందు
శుద్ధి చేయబడుతుంది. ప్రియులారా, మీరు నేను మరణము నుండి, నిత్య నరకము నుండి
తప్పించ బడాలంటే, మన మనస్సాక్షిలో కల్మషము ఉండకూడదు. ప్రవర్తనలో భేదము
ఉండకూడదు. నీవు ఏది నమ్మితే, బోధిస్తే, మాట్లాడితే అది చేయాలి. నీ మాటలకు నీవు కట్టుబడి
ఉండడం దేవుడు కోరుతున్నాడు. క్రైస్తవ విశ్వాసులు వారి మాట చెపితే చేయాలి, లేదా ఆమాట
చెప్పకూడదు. సంభాషణ, సంబంధాలలో నిష్కాపట్యం, పరిశుద్ధత ప్రభువు కోరుతున్నాడు.
పౌలు చివరిగా, 14వ వచనములో ఆ సంఘస్తులు, ఆయన, ఒకరి విషయం మరొకరు
సంతోషిస్తున్నట్టు చక్కటి బాంధవ్యాన్ని బహిర్గతం చేస్తున్నాడు. అది ఎప్పటిదాకా? మన ప్రభువు
యేసు క్రీస్తు తిరిగివచ్చే దినం వరకు ఈ ప్రేమానురాగాలు, ఆదరాభిమానాలు సంతోషం
నిలిచిఉండాలని అపో. మిక్కటంగా ఆకాంక్షిస్తున్నాడు. ఇప్పుడే ఆదినము కోసం సిద్ధపడదాం!
ప్రార్థన: మీ స్వంతమాటల్లో అత్యంత ప్రేమ గల పరిశుద్ధుడైన దేవుడు వింటున్నాడనే విశ్వాసముతో, మీ మనస్సాక్షి మిమ్మలను ప్రేరణ చేసినట్లుగా, యధార్ధమైన నిష్కపటమైన మనసుతో ప్రార్ధన చెయ్యండి.
No comments:
Post a Comment