2 కొరింధీ-7 1~3-7 - II
మరణము నుండి విడుదల – రెండవ భాగము
శ్రోతలందరికి ప్రభువు నామములో శుభములు! రండి రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి.
మీ ఇంట్లో పరిశుద్ధ గ్రంధం బైబిల్ ఉన్నట్లయితే తెరిచి ఉంచండి. క్రొత్త నిబంధనలోని 8వ
పుస్తకం, II కొరింథీ పత్రిక మొదటి అధ్యాయములోని కొన్ని వచనాలు ఈ సమయములో
అధ్యయనం చేద్దాం. పౌలును మరణము నుండి విడుదల చేయడానికి దేవుడు జోక్యం చేసుకొని
కాపాడిన విషయమును మునుపటి అధ్యయనంలో క్షుణ్ణంగా తెలుసుకున్నాము. అది మొదటి
ఆధారము. ఇప్పుడు రెండవ ఆధారము తెలుసుకుందాం.
మరణము నుండి విడుదల పొందడానికి రెండవ ఆధారం మానవుని విజ్ఞాపన.
లేఖనభాగములో అనగా II కొరింథీ 1:10లో “మాకొరకు ప్రార్థన చేయుటవలన మీరుకూడా
సహాయము చేయుచుండగా...” అని వ్రాయబడింది. పౌలు తన దేవునిమీద సంపూర్ణంగా
ఆధారపడినప్పటికి, దేవుని ప్రజలు ఆయనకోసం చేసిన ప్రార్ధనలను గుర్తించి సంతోషిస్తున్నాడు.
దేవుని శక్తిని బహిర్గతం చేయడములో, ఆయన సర్వాధికారపు ఉద్దేశ్యపు నెరవేర్పులో
ఇతరులకోసం ప్రార్థన చేయడం ప్రాముఖ్యమైనది. మీరు నేను ఇతరులకోసం ప్రార్ధించినపుడు
వాటి వల్ల ఏమి ఫలితాలు కలిగాయో మనకు తెలియదు. కాబట్టి ఆలాటి ప్రార్ధనలద్వారా కలిగే
అనుభవమునుబట్టి, దేవుడు మౌనంగా ఉన్నాడే మో అని ప్రార్ధించిన మనకు అనిపించినా,
మనము ప్రార్థన చేయడం ఆపకూడదు. పౌలు మరణాపాయపు పరిస్థితుల్లో ఉన్నపుడు కొరింథీ
సంఘపువారికి దానిగురించి ఏమి తెలిసిఉండకపోవచ్చు. అయినా, ఆయన వారి
హృదయాల్లో ఉన్నందుచేత ఆయనకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు అపో. పౌలును
ప్రేమించినందుచేత ఆయన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు. ఆయనకోసం దేవుని కృపాసనం
దగ్గర మొర్ర పెడుతూనే ఉన్నారు.
దాని ఫలితమేమిటి? 11వ వచనం. “ మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత
మావిషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.” ఇక్కడ అపో. పౌలు కళ్ళముందు
జరుగుతున్నట్టు మాట్లాడుతున్నాడు. అనేకులు వారి ముఖాలు, కన్నులు పైకెత్తి, దేవునివైపు
చూస్తూ ప్రార్థించినందు చేత మా పక్షంగా దేవునికి కృతజ్ఞత వందనాలు చేరాయి, అని
సంతోషిస్తున్నాడు. ఇక్కడ “కృపావరము” అంటే అంత భయంకరమైన మరణాపాయమునుండి
దేవుడు ఆయనను తప్పించడం. పౌలు ఎదుర్కున్న మరణాపాయము నుండి ఆయనను
తప్పించమని కొరింథీ సంఘస్తులు విజ్ఞాపన చేసినందు చేత ఆయన పొందిన విడుదల విషయం
ఆయనతో బాటు వారు సంతోషిస్తున్నారు. ఎవరి కోసమైన నీవు ప్రార్థన చేసి వారికి కలిగిన
జవాబును బట్టి నీవు సంతోషించకపోతే చాలా పోగొట్టుకుంటున్నావు.
గమనించండి శ్రోతలూ, దేవుని ప్రణాళికను మార్చమని అడగడం ప్రార్థన ఉద్దేశ్యం
కాదు. కాని, ఆ ప్రణాళికలలో దేవునికి మహిమ కలగాలని, దాన్నిబట్టి దేవునికి కృతజ్ఞత
చెల్లించడం మంచిది. మానవులమైన మనము ఇతరులకోసం చేసే ప్రార్ధనలు ఒకవైపు ఉంటే,
వాటిలో ఏవి దేవుని సార్వభౌమపు ప్రణాళిక ప్రకారం ఆయన నెరవేరుస్తాడో వాటిని బట్టి మనము
సంతోషించాలి. కొరింథీ సంఘస్తుల్లాగా మనకుకూడా ఇతరులు ఎదుర్కుంటున్న వేదనలు,
బాధలు, శ్రమలు తెలియకపోయినా కాని, వారి కోసం మనము చేసే విజ్ఞాపన ప్రార్ధనలు ప్రభువు
విని సమాధానమిస్తాడనే ధైర్యముతో మనము ప్రార్థించాలి. మరణాపాయము లాంటి క్లిష్ట పరిస్థితి
అయినా, అది శారీరిక మరణమైనా, ఆత్మీయమైన మరణమైనా, మన విజ్ఞాపనలను బట్టి
సర్వశక్తిగల దేవుడు, మన ప్రభువు విడుదల చేస్తాడని మనము ధైర్యంగా ఉండవచ్చు.
ఇక మరణము నుండి విడుదల కోసం మూడవ ఆధారం, ధైర్యవంతమైన పరిభాష ప్రకటన
ఇదేంటి అని అనుకుంటున్నారేమో! 12వ వచనము చివరి భాగము గమనించండి. “మా
మనస్సాక్షి సాక్షమిచ్చుటయే” అ. కా. 24:16 “నేనునూ దేవుని యెడలను మనుష్యుల యెడలను
నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా నుండునట్లు ఎల్లప్పుడు అభ్యాసము చేసుకొనుచున్నాను.” పౌలు
వ్యక్తిగత సాక్షమిది. మనస్సాక్షి నిర్దోషంగా ఏవిధంగా ఉంచుకోవాలో పౌలు నేర్చుకున్నాడు. II
కొరింథీ 1:12వ వచనము “మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానముననుసరింపక,
దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి
లోకములో నడుచుకొంటిమనియు, విశేషముగా మీ యెడల నడుచుకొంటిమనియు, మా
మనస్సాక్షి సాక్షమిచ్చుటయే.” దేని విషయములోనైనా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుందా?
నన్ను అనేక విషయాలలో గద్దిస్తుంది, తప్పు, పాపము ఎత్తి చూపిస్తుంది. అది ఇతరులకు
తెలియదు. ఎవరి మనస్సాక్షిని పరిశుద్ధాత్ముడు వెలిగిస్తాడో వారిని ఆయన గద్దించి, సరిచేసి,
బుద్ధిచెప్పి, దేవుని కృపవలన దేవుని సత్య మార్గములో నడిపిస్తాడు. కాని ఆయన చెప్పే
మాటలను విని దీనమనసుతో ఒప్పుకొని సరిచేసుకునే మనసు మనకుండాలి. అది
లేకపోతే, ఆయన చెప్పడు, బోధించడు. అంతే కాదు. పదే, పదే, పదే, ఎన్ని సార్లు ఆయన నీతో
మాట్లాడినా నిర్లక్ష్యము చేసి పెడచెవిని బెట్టి, తప్పించుకొని తిరుగుతుంటే, ఇక ఆయన స్వరము
నీకు వినబడదు. ఒక సంఘములో పాస్టర్ వాక్యపరిచర్య చేస్తూ, “ఎన్ని సార్లు గద్దించినను
లోబడనివాడు మరి తిరుగు లేకుండా హటాత్తుగా నాశనమగును.” అనే లేఖన భాగమును
చెబుతుండగా అతని మనస్సాక్షిని పరిశుధ్ద్ధాత్ముడు గృచ్చి ఒప్పించాడు.
ఆనాటినుండి అతడు మద్యపానమును మానివేశాడు.
ప్రియ సోదరుడా, సోదరీ, నీ పాపమేమిటో నీకు మాత్రమే తెలుసు. భార్య పాపము భర్తకు
తెలియదు, భర్త పాపము భార్యకు తెలియదు. వారిద్దరివి వారి పిల్లలకు తెలియదు.
కాని సమస్తమెరిగిన పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారులతో సరిసమానమైన ఆత్మదేవుడు
సమస్తము నెరిగిన వాడు. ఆయన పాపమును ఒప్పిస్తాడని యోహాను 16:8వ వచనములో ఈ
విషయం స్పష్టగా మన ప్రభువు బోధిస్తున్నాడు.
“ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు
లోకమును ఒప్పుకొనజేయును.”
ఆయన ఒప్పించినపుడు ఒప్పుకున్నవారు నిజమైన దేవుని పిల్లలు. యేసు క్రీస్తు
ప్రభువు వారికోసం తన రక్తం చిందించి పాపములన్నింటికి ప్రాయశ్చిత్తం చేసి తన ప్రాణముతో
పరిహారము చెల్లించాడు. సమస్తమైన పాపములన్నింటి కోసం, దోషములన్నింటి కోసం ఒక్కటే
సారి ఈ విమోచన ప్రక్రియ చేశాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పించిన ప్రతి పాపమును ఒప్పుకొని, శుద్ధి
చేసుకొని విడిచిపెట్టి ఆయన శక్తితో విజయము పొందేవారు దేవుని పిల్లలు. మనస్సాక్షిని శుద్ధి
చేసుకుందాం. దేవుని యెదుట, మనుష్యుల యెదుట మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని
దేవుని చిత్తము. ప్రతి ఒక్కరి మనస్సాక్షి!
ఒకవేళ నీ జీవితములో నీవెల్లప్పుడు నీ మనస్సాక్షిని చంపుకున్న వ్యక్తి వైతే, ప్రియ
స్నేహితుడా, యేసు క్రీస్తు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన తన నిత్యమైన నిస్వార్ధమైన
ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న రక్షకుడు, దేవుడు. మనస్సాక్షిని చంపుకొనే వారు పాపములోనే
జీవిస్తూ ఉంటారు. వారికి మొదట కావలసింది దేవునితో యేసు క్రీస్తు రక్తము ద్వారా సంబంధం.
ప్రభువు నీతో మాటలాడుతున్నాడు. ఆయన నీ పాపమును ఒప్పిస్తున్నాడు. మనసారా,
హృ దయపూర్వకంగా ఒప్పుకొంటే, వెంటనే, క్షణం ఆలస్యం లేకుండా నీ పాపములు
తుడిచి వేస్తాడు. నిన్ను శుద్ధి చేస్తాడు. నిన్ను దేవుని కుమారునిగా/కుమార్తెగా చేస్తాడు. నీలో
పరిశుద్ధాత్ముడు జీవిస్తాడు. నీ మనస్సాక్షిని వెలిగించి నిన్ను పరిశుద్ధ జీవితములోనికి నడిపిస్తాడు.
హల్లెలూయ!
ప్రభువు నీ మనస్సాక్షిని నిర్దోషంగా చేయగల పరిశుద్ధుడు ఆయన. నీ ప్రతి పాపమును,
దోషమును, అపరాధమును క్రీస్తు రక్షకుని యెదుట ఒప్పుకో, క్షమాపణ కోరుకో. నీ పాపము,
దోషము, అపరాధము, తిరుగుబాటు, సమస్తమును యేసు క్రీస్తు ప్రభువు క్షమించి, సమస్తమును
కడిగి శుద్ధి చేసి నీకు నిర్దోషమైన మనస్సాక్షిని, క్రొత్త హృదయమును ఇస్తాడు. నీవు దేవుని
కుమారుడవు అవుతావు. ఇది ఆయన వాగ్దానము. “తన్ను ఎందరంగీకరించిరో
వారికందరరికి తన పిల్లలగుటకు అధికారమిచ్చాడు.” దేవునితో నీ సంబంధమును మొదట
సరిచేసుకుంటే అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ప్రభువుతో నీ హృదయం ఐక్యపరచబుడుతుంది.
ప్రభువు అన్ని పరిస్థితుల్లో నీకు నాయకుడుగా, రక్షకుడుగా, ప్రభువుగా, విమోచకుడుగా నిత్యము
నిలిచిఉంటాడు. తన ఆత్మతో నిన్ను ముద్రించి తన శక్తితో నడిపిస్తాడు. మారు మనస్సు, రక్షణ
అనేది దేవునితో సంబంధం. అడుగు, అడుగు వేస్తూ, విశ్వాసముతో దేవుని వాక్యపు వెలుగులో
నడవాలి. పరిశుధ్ద్ధాత్ముడు నిన్ను ఆదరించి, కష్టాల్లో ఓదార్చి, సేద దీర్చి నీకు కాపరిగా ఉంటాడు.
ప్రార్థన: మీ స్వంత మాటల్లో మీరు ప్రార్ధన చేసుకోండి. వచ్చి రాని ప్రార్ధన అయినా పరవాలేదు.
యాధార్ధమైనవైతే మీ మాటలు దేవునికిష్టమైన మాటలు.
No comments:
Post a Comment