2 కొరింధీ-6 1~8-14 మొదటి భాగము
మరణము నుండి విడుదల మొదటి భాగము
శ్రోతలందరికి, ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికీ మన ప్రభువు యేసు క్రీస్తు నామమున శుభములు!
సర్వాధికారి అయిన దేవుని కృప సమాధానములు మనకందరికి విస్తరించునుగాక! అమెన్!!
మీరెప్పుడైనా మరణాపాయమునుండి తప్పించుకున్నారా? ఆలాంటి పరిస్థితులు మన
మెన్నడు మరచిపోలేము కదూ! మీలో చాలా మందికి అలాంటి అనుభవాలు ఉండి ఉంటాయి.
అపో. పౌలు జీవితము మీద ఆశను పోగొట్టే ఎన్నో సంఘటనలు సందర్భాలు ఎదుర్కున్నాడు.
ఆలాటి వాటిలో ఒక సందర్భమును రెండవ కొరింథీ బైబిల్ అధ్యయనాల్లో భాగంగా మనము
తెలుసుకుందాము.
ఈనాటి అధ్యయనము శీర్షిక “మరణము నుండి విడుదల” లేఖన భాగము 2 కొరింథీ 1:8-14.
“ 8. సహోదరులారా, ఆసియ లో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు
తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక
యుండునట్లుగా, మా
శక్తికి మించిన అత్యధిక భారమువలన
క్రుంగిపోతివిు.
9. మరియు మృతులను లేపు దేవునియందేగాని,
మాయందే మేము
నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను
నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.
10. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును
తప్పించెను, ఇక
ముందుకును తప్పించును. ఆయన
ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము. ఆయన ఇక ముందుకును
మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము. మరియు మాకొరకు
ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము
చేయుచుండగా, ఆయన
ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.
11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.
12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే
అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
13. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన
సంగతులు తప్ప, మరేవియు
మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని
నిరీక్షించుచున్నాము.
14. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.
ఈ లేఖన భాగములో మరణము నుండి మనము
విడుదల ధైర్యంగా పొందడానికి గల
ఆధారాలు
స్పష్టమవుతున్నాయి.
మొదటి ఆధారం, దేవుడు కలుగచేసుకోని జోక్యం చేసుకోవడం గతించిన
3,4 అధ్యయనాల్లో మనమెదుర్కొనే అన్ని శ్రమలకు బాధ వేదనలకు సరిపడా ఆదరణను దేవుడు
అనుగ్రహిస్తాడని బోధించాడు. ఈ సత్యమును ఇంకా హృదయపు లోతుల్లో స్థిరపరచడానికి పౌలు
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఆసియాలో తనకు సభవించిన దాన్ని
ప్రస్తావిస్తున్నాడు. దాని వివరాలు మనతో చెప్పడం లేదు, కాని కొరింథీయులకు అది
తెలిసిఉండవచ్చు. ఎఫెసిలో జరిగిన అల్లరిమూక దాడి కావచ్చు. లేదా ఆకుల ప్రిస్కిల్ల ఆయన
ప్రాణానికి తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నది కావచ్చు. లేదా ఆయనకు కలిగిన మరణపు
బెదిరింపులు
కావచ్చు. ఇవి ఏవో చిన్న చిన్న బెదిరింపులు కావుగదా!
ఈ మాటల ద్వారా మించిన హింసకాండ జరిగించడానికి పన్నాగం చేయడం
జరిగినట్టుగా భావించవచ్చు. నలుగగొట్టాలని చేసిన ప్రయత్నాలు, సాధారణ పరిస్థితులకు
మించిన పరిస్థితులు అక్కడ ఉన్నట్టు తెలుస్తున్నది. ఇవి ఎంత ఘోరమైన పరిస్థితులంటే, పౌలు
తన ప్రాణం తనకు దక్కుతుందనే ఆశను పోగొట్టుకున్నాడు. వాడబడిన గ్రీక్ మాటకు అర్ధం
డెడెండ్. లేదా దారిలేదు, మార్గములేదు, ఇరుక్కుపోయిన పరిస్థితి. ఈ పరిస్థితి ఇంతకుముందు
పౌలు ఎదుర్కొన్నప్పటికి, ఇప్పటి పరిస్థితి ఇంకా క్లిష్టపరిస్థ్థితి. నాకు మీకు ఈలాటి పరిస్థ్థితి
కలిగిఉండవచ్చు.
కాని, అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించండి. మునుపటి వచనాల్లో పౌలు వ్రాసినట్టుగా
దేవుడు తన క్రియతో కలుగజేసుకున్నాడు, జోక్యం చేసుకున్నాడు. పౌలు ఉన్నది
మరణాపాయమైనప్పటికి, దేవుడు కలుగజేసుకున్నాడు. ఇది పౌలు ప్రాణము కాపాడింది.
ఆయనకు ఒక గొప్ప పాఠము నేర్పించింది. ఈ పాఠము మీరు, నేను కూడా నేర్చుకోవాలి.
అదేమిటి? పైపైకి అసాధ్యంగా కనిపించే పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు.
ఎందుకంటే, మన మేధస్సు, శక్తియుక్తులు, గొప్పవారితో మన సంబంధాలు, పలుకుబడి, మన
ఆస్తి, అంతస్థు, ఏమీ చేయలేవని మనము నేర్చుకోవాలి. పౌలు లాగా దేవుణ్ణి సంపూర్ణంగా
నమ్మడం మనము నేర్చుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువును మరణపు కోరలలోనుండి బ్రతికించిన శక్తి
మన క్లిష్టపరిస్థితులలో మనకు అందుబాటులో ఉంది. హల్లెలూయ!
వేధించే పరిస్థితులలో పౌలు జీవితములో దేవుడు కలుగజేసుకున్నాడు. కాని, ఇంతకంటే
గొప్ప విషయం జరిగింది. 10వ వచనం గమనించండి. “ఆయన అట్టి గొప్ప మరణమునుండి
మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును...... ఆయన ఇక ముందుకును
మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.”
జాగ్రతగా వింటున్నారా? పౌలు అంటున్నాడు, దేవుడు మమ్ములను గతములో తప్పించాడు,
ఇప్పుడు తప్పిస్తున్నాడు, ఇక ముందుకు కూడా తప్పిస్తాడు. ఎంత ధైర్యం, స్ఫూర్తి, చొరవ
కలిగించే మాటలు కదూ! ప్రియ శ్రోతలారా, మీరు కూడా ఇటువంటి, ధైర్యముతో, నిరీక్షణతో
జీవితాన్ని ఎదుర్కోవచ్చు! మందులమీద, మనుషుల మాటల మీద, ఇతరులు మీకు చెప్పే నీతి
బోధలమీద, ఆధారపడకండి!
ఈలాటి పరిస్థితులు ఎదురైనపుడు ఏ విధంగా స్పందిస్తున్నామో అది ప్రాముఖ్యం.
కోపావేశాలతో నశించిపోవచ్చు. నిరాశకు బానిస కావచ్చు. ద్వేషం అసూయఅనే చేదుతో
మనసును నింపుకోవచ్చు. కాని పౌలు మాత్రం ఆలాచేయలేదు. కొందరు వారి హృదయ వేదన,
అపాయము, శ్రమలు అనుభవిస్తున్న సమయమంతా ప్రభువును హత్తుకొని, శ్రమల కొలిమిలో
కూడా యేసయ్యకు బలమైన సాక్షిగా నిలువబడ్డారు. పౌలు లాగా దేవుడు వారి పరిస్థితుల్లో జోక్యం
చేసుకొని వారి కొలిమి అనుభవాలను బట్టి దేవుని మహిమ కలుగుతుందని ఆనందించారు.
ప్రియ శ్రోతలూ, మీరు కూడా తీవ్రమైన భయపెట్టే శోధనలో, వేదనలో ఉన్నారా? ఇక ఈ
పరిస్థితి మారదు అని అనుకుంటున్నారా? వాటిలో దేవుడు జోక్యం చేసుకొని కలుగజేసుకుంటాడని
ఎదురు చూస్తున్నారా? లేదా మీ స్వంత ప్రయత్నాలు చేస్తూ వాటి మైకములో ఉన్నారా? ప్రభువు
ఇంకా ఎందుకు చేయడం లేదు అనుకుంటున్నారేమో! మీరు, నేను పరిపూర్ణంగా ఆయనమీద
ఆధారపడాలని ప్రభువు ఎదురుచూస్తున్నాడు. నీ సహాయం, ప్రమేయం ఏమి లేకుండా దేవుని శక్తి
మాత్రమే చాలని నీవు, నేను తెలుసుకోవాలని మనము గ్రహించాలని ఆయన ఉద్దేశ్యం. ప్రియ
సోదరీ, సోదరులారా, ఆయన శక్తి, జ్ఞానము, అధికారము, బలము అపరిమితమైనది. నీవు, నేను
పరిపూర్ణంగా ఆయనమీద ఆధారపడేవరకు ఆయన ఎదురుచూస్తున్నాడు. ముగింపులో
మరోమాట! శోధన, పరీక్షలోనుండి మీరు నేను బయటికి రాకపోవచ్చు కూడా! ఆపో. పౌలుకు అదే
జరిగిందికదా. ఆయన చివరికి తన ప్రాణము సువార్త కోసం హతసాక్షిగా ఇచ్చివేసిన విషయం
మనకు తెలుసు. అందులోకూడా ఆయన దేవుని పూర్తిగా నమ్మాడు. మరణమునకు
అప్పగించినా, మరణమునుండి విడిపించినా, ఏదైనా సరే, ఆయన మార్గములో నడవడానికి మీరు,
నేను సిధ్ధమా?
ప్రార్థన: మీ స్వంత మాటల్లో అవి, ఏ ఏవైనా ఫరవాలేదు, మీ మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడండి. ప్రార్ధనలో మీ హృదయములో ఉన్నదున్నట్టుగా దేవునికి మీ మనసు తెలియచేయండి. దేవుడు తప్పక మీ మనవి అలకిస్తాడు, కాని, మొట్ట మొదటిగా పరిశుద్ధుడైన దేవునితో నీవు సమాధానపడాలి. 'నేనెందుకు సమాధానపడాలి?' అనుకుంటున్నారేమో! నా ప్రియమైన స్నేహితుడా, నీవు, నేను దేవునికి శత్రువులము. నేను దేవునితో యేసు క్రీస్తు ప్రభువు రక్తమును బట్టి నా పాపమును శుద్ధి చేసుకొని సమాధాన పడ్డాను. నీవు కూడా సమాధాన పడితే నీ ప్రార్ధన కూడా వింటాడు. 'నన్ను క్షమించు, ప్రభువా, నేను పాపిని,' అని నీవు నీ పాపమును ఒప్పుకుంటే, దేవునితో ఇప్పుడే సమాధానపడవచ్చు.
No comments:
Post a Comment