2 కొరింధీ-5 1:3-7 - మూడవ భాగము దేవుని ఆదరణ యొక్క పరిమితి, హద్దు, పరిధి

 కొరింధీ-5   1:3-7 - మూడవ భాగము 

దేవుని ఆదరణ యొక్క పరిమితి, హద్దు, పరిధి

          వచ్చేశారా? చాలా సంతోషం! నెమ్మదిగా, ప్రశాంతంగా దైవసన్నిధిలో రేడియోకు దగ్గరగా 

వచ్చి కూర్చోండి. దేవుడు అనుగ్రహించే అదరణ విషయం అధ్యయనం చేస్తున్నాము. మనము 

ఎంతవరకు కష్ట నష్టాలు, వేదన బాధలు సహించగలమో తెలుసుకోవాలని ప్రభువు మనలను 

పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమలు లేని క్రైస్తవ జీవితం ఉండదు. ఎవరైనా, శ్రమలు లేకుండా క్రైస్తవ 

విశ్వాసo ఉంటుందని ఊహించు కుంటున్నా, అపోహ పడుతున్నా, చివరికి అది అసత్యం, 

అబధ్ధం, అపోహ అని తెలుసుకుంటారు. అది తెలుసుకునేవరకు ఎన్ని బహుమానాలు 

పోగొట్టుకుంటామో కాస్త ఆలోచించండి. శ్రమలు అనుభవిస్తున్న సహోదరీ, సహోదరుడా, 

ధైర్యంగా ఉండు! విశ్వాసమును గట్టిగా పట్టుకో! దేవుని వాక్యం శ్రమలు తప్పని సరిగా 

అనుభవిస్తామని స్పష్టంగా సెలవిస్తున్నది. కాని ఒక్క మాట! ప్రభువు నిన్ను విడువడు! నిన్ను 

తప్పనిసరిగా ఆదుకుంటాడు. అదరిస్తాడు. నిన్ను లపరుస్తాడు. అంతేకాదునీవు సహించగలిగిన 

దానికంటే ఎక్కువ శ్రమలు నీకు ఇవ్వడు. నీకు కొన్ని బాధ, వేదనలు, 

కష్ట నష్టాలు ఇస్తున్నాడంటేనేఅవి అనుభవించడానికి కావలసిన శక్తి, బలము, విశ్వాసము నీకు 

ఇస్తాడని అర్ధం. కాబట్టిశ్రమలు ఎంతవరకు సహించగలవో పరీక్షించుకొని వాటికి సిధ్ధంగా 

ఉండడం నిజమైన క్రైస్తవ విశ్వాసి లక్షణం.

         

మనము అధ్యయనం చేసిన రెండవ అంశము దేవుని అదరణకు మూలాధారం ఏమిటి? 

దేవుడు తప్ప ఏ మూలాధారం లేదు. ఆయన నమ్మకమైనవాడు. నమ్మదగినవాడు, మాట 

తప్పనివాడు. కరుణ, వాత్సల్యములలో పరిపూర్ణుడు. కొరత, తక్కువ లేని వాడు. ప్రభువు నిన్ను, 

నన్ను నిత్య నరకం, నిత్య నాశనం నుండి రక్షించింది తన అత్యంత కరుణను బట్టి మాత్రమే! ఇక 

ఏ కారణము లేదు. తీతు పత్రికలోని 3వ అధ్యాయము 5వ వచనములో తన కనికరము 

చొప్పుననే”  అని స్పష్టంగా బోధించాడు. ప్రభువే స్వయంగా అదరిస్తాడు, అక్కున 

చేర్చుకుంటాడు, తల్లి ఆదరించిన విధంగా ప్రభువు అదరిస్తాడు. గమనించండి శ్రోతలూ, 

పరిశుద్ధాత్మను మనకనుగ్రహించాడు. ఇది వినగానేక్రిందపడిపోవడం, చప్పట్ట్లు కొడుతూ 

ఊగిపోవడం, ఇలాంటివి కాదని దయచేసి గమనించండి. 

పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ. ఆయన మొదట కలిగించేది పరిశుద్ధత. పరిశుద్ధ పరచబడేది 

శ్రమలు, బాధలు, నిందలు, కష్టాలునష్టాలలోనే! రోమా పత్రిక 5:1-5 కంఠస్థం చేశారా? శ్రమలు 

మన విశ్వాసమును ధృడపరచి, స్థిరపరచి విశ్వాసములో నిలబెడతాయి. అందుకే పౌలు తన 

శ్రమలలో ఆనందిస్తున్నానని కొలస్సీ 1:24లో సాక్షమిచ్చాడు. మనకు శ్రేష్టమైన మాదిరి మన 

ప్రభువే! హెబ్రీ పత్రిక 5: 8లో “ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన 

విధేయత నేర్చుకొనెను అని పరిశుద్ధ గ్రంధం స్పష్టంగా బోధిస్తున్నది.  దేవునికే శ్రమలు 

విధేయత నేర్పించినపుడు, ఇక మనమెంత నేర్చుకోవాలో ఒక్కసారి ఆలోచించండి!

ఇక ఈ పూట అధ్యయనం చేసే అంశం, మూడవ భాగము : దేవుని ఆదరణ 

యొక్క పరిమితి, హద్దు, లేదా పరిధి. 

II కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం గమనించండి: మేము 

శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ 

పొందినను మీ ఆదరణకొరకై 

పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో 

సహించుటకు కార్యసాధకమై 

యున్నది. 


అపో. పౌలు ద్వారా ప్రభువు బోధిస్తున్నదేమిటి? దేవుడు అనుగ్రహించే ఆదరణ కేవలo 

ఈభూమి మీద జీవించే జీవితానికి మాత్రమే పరిమితం కాదు. ఇది మనకెలా తెలుసు? లేఖన 

భాగములోని “రక్షణ” అనే మాటకు అర్ధం మొదట తెలుసుకోవాలి. ఈ సందర్భములో “రక్షణ” అనే మాటకు 

ఈ జీవితము దాటినతరువాత ఉండే నిత్యత్వములో కూడా ఈ అదరణయొక్క ఫలితం ఉంటుంది. ప్రియ 

సోదరుడా, సోదరీ, దుఃఖముతో బాధతో నిండిన మనసుతో ఉన్నారా? మన దేవునికి మన పట్ల ఎంత 

ఉన్నతమైన ఉద్దేశము ఉన్నదో గమనించండి. ప్రస్తుతం మీరు, నేను అనుభవిస్తున్న శ్రమలను ఏ 

దృక్పథముతో చూడాలి? కేవలము ఈ జీవితములో, ఈ క్షణికమైన జీవితములో ఇన్ని శ్రమలా? 

అనుకుంటున్నారా? అసలు ఎందుకు ఈ శ్రమలు అనుభవించాలి? మనము చేరవలసిన గమ్యస్థానము 

చేరకుండా ఈ శ్రమలు మనలను దారి మళ్లిస్తున్నాయి అని కొందరు అనుకోవచ్చు. మరి కొందరు ఈ 

శ్రమలవల్ల ఏమి జరుగుతుంది? వీటికేమైనా ఉద్దేశముందా?’ అని అనుకోవచ్చు. రోమా. 8:28లో ప్రభువు 

వాగ్దానం చేసినట్టు, దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి

మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము.  

         తాను అనుభవిస్తున్న శ్రమలు కొరింథీ సంఘపువారి అదరణకు ఒక మార్గమని ఆపో. పౌలు వారికి 

బోధిస్తున్నాడు. అంతేకాదు, వారి రక్షణను బలపరుస్తాయని అర్ధం. ఇక్కడ రక్షణ అంటే కేవలం పాప క్షమాపణ 

మాత్రమే కాదు, పునరుత్ధానo తరువాత మనము ప్రభువును ముఖాముఖి కలుసుకునే సమయం వచ్చేవరకు, 

అంతమట్టుకు మనము పరిశుద్ధపరచబడే ప్రక్రియలో మన శ్రమలకు గొప్ప పాత్ర ఉన్నది.


కాబట్టి మన ధ్యాస, దృష్టి దేనిమీద ఉండాలి? శ్రమలమీద కాదు, ఆదరణ మీద కూడా కాదు. మరి దేనిమీద 

ఉండాలి? మీరు నేను అనుభవిస్తున్న ప్రతి శ్రమ, అనుభవము మనలను ఆత్మీయ జీవితములో పరిపూర్ణ

తలోనికి నడిపించి “పైనున్నవాటిని వెదకడానికి” ఉన్నతమైన గురి చేరడానికి మనలను సిద్ధపరు

స్తున్నాయని దృష్టించాలి. అంతేకాదు, మనము అనుభవిస్తున్న శ్రమల కారణంగా తోటి సహోదరులు వారి 

విశ్వాసములో బలపడుతున్నారని సంతోషించాలి. మన రక్షణ వారి రక్షణ స్థిరపడుతున్నదని  

సంతోషించాలి. అపో. పౌలు రోమా. 8:17లో యేసుప్రభువుతో మనము శ్రమ పడితేనే, ఆయన మహిమలో 

మనకు భాగముంటుందని స్పష్టం చేశారు. “క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల

క్రీస్తుతోడి వారసులము.”  అపో. పేతురు ఇదే బోధ చేయడం లేఖనాల్లో కనిపిస్తున్నది. క్రీస్తు మహిమ 

బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై `యున్నంతగా సంతోషించుడి.1 పేతురు 4:13 శ్రమలు అనుభవించడం మనకెంత సంతోషంగా ఉండాలంటే, 

ప్రభువుతో పాటు శ్రమపడుతున్నట్టు భావించుకోవాలి. ఎంత శ్రమపడితే అంత మహిమ కలుగుతుంది అని భావము. ఈ సత్యమును సరిగ్గా అర్ధం చేసుకుంటున్నారా? లేఖనములు బోధిస్తున్న సత్యమును ఎంతో 

మంది తప్పుడు బోధకులు, పేరు ప్రఖ్యాతులకోసం, మీ కానుకలకోసం సత్యమును ఎంత వక్రీకరిస్తున్నారో 

గమనిస్తున్నారా?

         ఇక ఈ వాక్యభాగములోని చివరి మాటల్లో అపో. పౌలు కొరింథీ సంఘపువారి విషయం  తన నిరీక్షణ స్థిరంగా 

ఉన్నట్టు సాక్ష్యమిస్తున్నాడు. 7వ వచనము చివరి భాగము గమనించండి. మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ 

స్థిరమైయున్నది.”  మరో మాటలో చెప్పాలంటే ఫీలింగ్స్ మీద ఆధారపడనని అర్ధం. వారు శ్రమలను ధైర్యంగా

బలముతో దేవుని అదరణతో ఎదుర్కుంటే,పైనున్న వాటిని వెదుకుతూ” ఉంటే, వారి జీవితాలు మన 

జీవితాలు సార్ధకమవుతాయి. పరిశుద్ధతలో అభివృద్ధి చెంది ఫలమిస్తాము. ఈలాటి అనుభవాలు కలిగినవారు 

చాలామంది ఉన్నారు. వారు ఇతరులకు ఆశీర్వాదంగా ఉన్నారు. మీరు కూడా ఆశీర్వాదంగా ఉండడo సాధ్యమే!

         నిరీక్షణ లేదా ఆశ అని మనము వాడుకభాషలో పలికే మాటకు, పరిశుద్ధ గ్రంధంలో నిరీక్షణ అనే మాటకు చాలా భేదమున్నది. “ఆశిస్తున్నాము” అనేటపుడు అది సాధ్యమవుతుందా లేదా అనే అనుమానపు భావముతో మనము మాట్లాడుతూ ఉంటాము. అనేక సందర్భాల్లో పరిస్థితులు ప్రతికూలించి అవి జరగవని మనకు తెలుసు. 

కాని, పరిశుద్ధ గ్రంధంలో “నిరీక్షణ” అంటే ఓపికగా, ధైర్యంగానిశ్చయంగా జరుగుతాయని ఎదురు చూస్తూ 

ఉండడం! పౌలు “ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు” అని ఎంత ధైర్యగా చెప్పాడు కదూ! ఈ స్థిరమైన, సిగ్గుపరచని 

నిరీక్షణ ఎలాంటిదో కీర్తన 16 చివరి వచనములో స్పష్టంగా ఉన్నది: జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు. నీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.”  కీర్త. 16:11. 

 ఇంతకంటే కావలసిందేముంది?

         ప్రియ శ్రోతలూ, “సమస్త ఆదరణ” నిచ్చే ప్రభువుతో మీకు వ్యక్తిగత సంబంధం ఉందా? లేనట్లయితే నీవు 

కోరుకునేది పొందలేవు. యేసు క్రీస్తులో తప్ప నిజమైన ఆదరణ, నిరీక్షణ ఎక్కడ లేదు. దేవుడు నీకు వ్యక్తిగతముగా 

తండ్రి అయితే, నీవు ఆదరణ బడిలో చేరి అందులో ఉన్నావన్నమాట! నీవు అనుభవిస్తున్న శ్రమలు అనుభవిస్తూ, 

ఆదరణ బడిలో పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతావా? వీటి ద్వారా, ప్రభువు అత్యంత విలువైన పాఠాలు 

మీకు నేర్పాలని కొరుతున్నావా? నీ  కష్ట నష్టాలు, వేదన బాధలు నీ చుట్టూ ఉన్న ఇతరులకు ఆశీర్వాదకరంగా 

ఉంటాయని మీరు తెలుసుకున్నారా?  అదరణయొక్క పరిధి, లేదా హద్దు ఎంతవరకు ఉందో ఈ దినపు 

అధ్యయనములో తెలుసుకున్నారా? ప్రియ సోదరీ సోదరులారా, మీకు, నాకు కలుగుతున్నవన్ని, మన రక్షణ 

పరిపూర్ణం కావటానికి ఏర్పాటు చేయబడ్డాయని తెలుసుకోవడం అతిప్రాముఖ్యం. కీస్తుప్రభువు నిన్నెన్నడు 

నిరుత్సాహపరచడు. ప్రార్థన:   మీ స్వంత మాటల్లో ప్రార్ధన చేసుకోండి. 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...