I కొరింథీ-71 15:58
చేతికందిన బహుమానం!
శ్రోతలూ, బాగున్నారా? ఇవి చాల కఠినమైన దినాలే, అయినా మనమంతా బాగా ఉండాలని దేవుని ప్రణాళిక,
ఉద్దేశ్యం. కాని అంత మాత్రాన, ఆరోగ్యం సవ్యగా ఉంటుందని కాదు, అన్ని అవసరాలు తీరాయాని కాదు, కాని, దేవుని
చిత్తం చేయాలని ఆశ మీకుందా? అలాగైతే, నాతో బాటు ఒక బైబిల్ వచనం తీయండి. I థేస్స. 5:16. “ ప్రతి
విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని
చిత్తము.” మీరు నిజంగా దేవుని చిత్తము చేయాలని ఆశించేవారైతే, మీ మనసు ఇప్పుడే మారుతుంది. సణుక్కుంటూ,
గొణుక్కుంటు, ఉండడం మానేసి ఇప్పుడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి! మీతో బాటు నేను కూడా రేడియోలో
“దేవునికి స్త్రోత్రం” అని చెబుతున్నాను. ప్రార్థన:
దేవుని పరిశుద్ధ లేఖనం చదువుకుందాం, రండి, రేడియోకు దగ్గర వచ్చి కూర్చోండి. I కొరింథీ 15:58 “కాగా నా
ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు
కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”
ఈనాటి మన అంశం: చేతికందిన బహుమానం. చాలా ఆసక్తికరంగా ఉండే అంశం కదూ! నిజమే!
బహుమానం చేతికందినపుడు ఎంత సంతోషంగా ఉక్కిరి బిక్కిరి అవుతాము కదా! ఈ ఒకే వచనం చాలా అద్భుతమైన
సత్యములతో నిండిఉన్నది.
మొదట మన ఆలోచనలను ఆకట్టుకునే మాట, “స్థిరులు” ఈనాడు మనము జీవిస్తున్న భూమి మీద మనకు
కనిపించేది ఎక్కువ శాతం రాజీ పాడేవారు, ఏదైనా ఫరవాలేదు ఎవరైనా ఫరవా లేదు అనుకునే మనస్తత్వం.
ఎన్నో ఏళ్ల క్రితం ఒక వ్యక్తితో మాటలాడుతుండగా, ఆయన అన్న మాట ఏమిటంటే, “సత్యముకంటే ప్రేమ
ముఖ్యం”. ఇది సరైనందని మీరనుకుంటున్నారా? కాదని నా అభిప్రాయం. ఎందుకంటే, ప్రేమలో సత్యము,
యధార్ధత, నిష్కాపట్యం లేకపోతే, అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రస్తుతం ప్రతిచోట మనకు కనిపించేది
ఇదేకాదా? సత్యమును సహనము అనే సిలువకు ఎక్కించి బలిచేస్తున్నారు. దాదాపు ప్రతి చోట ఇది మనకు
ఎదురవుతూనే ఉంటుంది. కాని పౌలు భద్రతను, హామీని కోరుకుంటున్నాడు. స్థిరులు అనే మాటలో
పాతుకుపోయిoది అనే భావన ఉన్నది. అటుఇటు ఊగిసలాడకుండా ఉన్నది
అని అర్ధం. దానిలాంటిదే మరోమాట తరువాత ఉన్నది. “కదలనివారు” స్థిరులు అంటే నిశ్చలంగా కూర్చొన్
నవారు అని అర్ధం. నిశ్చలంగా కూర్చోండి, దేవుని పరిశుద్ధ లేఖనాలు అధ్యయనం చేస్తున్న ఈ సమయములో
అటు ఇటు తిరగకండి, అటు ఇటుచూడకండి! మనసు సంపూర్ణంగా దేవుని మాట మీదే ఉంచండి. అదే రీతిగా
సిద్ధాంతం, సత్యము, విషయాల్లో తొణకకుండా ఉండండి. కొందరు గాలిపటం లాగా, ఏ సిద్ధాంతం, సత్యమని
ఎవరు చెప్పినా అటువైపు మొగ్గుతూ ఉంటారు. గాలి ఎటు కొడితే అటు వారు కూడా కొట్టుకుపోతారు. వీరు
ఊసరవెల్లి లాగా పరిస్థితిని బట్టి, చుట్టూ ఉన్న మనుషుల హావ భావాలను బట్టి వారి అభిప్రాయాలు
మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పౌలు బోధించే సత్యము అది కాదు. “మీరు స్థిరంగా, అటు ఇటు
కదలకుండా, నిబ్బరంగా ఉండండి అని మనకు హెచ్చరిక!
ఇక రెండవ హెచ్చరిక “ప్రభువు కార్యభివృధ్ధి యందు ఎప్పటీని ఆసక్తులునై యుండుడి” ప్రస్తుతము యేసు క్రీస్తు ప్రభువునకు మన రెండు కాళ్ళు, చేతులు, మన నోరు అవసరం. ప్రభువు తన లేఖనములను మన చేతులో పెట్టాడు. మన చుట్టూ ఉన్న వారికి మీరు, నేను యేసయ్య చేతులలాగా, కాళ్లలాగా, నోటిలాగా, మనము ఉండాలి. లేఖనమేమి సెలవిస్తున్నది? ఎల్లప్పుడ్ ప్రభువు కార్యపు అభివృధ్ధి విషయం మనలో ఆసక్తి ఉండాలి. ప్రభువు పరలోకానికి ఎక్కి వెళ్తూ ఏమని ఆజ్ఞ మనకిచ్చారో గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 28:18. “అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. 19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు 20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను” సమస్త సృష్టి మీద సర్వాధికారము కలిగిన ప్రభువు ఇచ్చిన మెగా ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ ఇది. ఆయనకు సర్వాధికారము ఉన్నదని మనము నమ్మినపుడు అది మన మీద కూడా ఉన్నదని అర్ధం. మన జీవితాల మీద యేసయ్యకు సర్వాధి కారమున్నది. అంత మాత్రాన మనమడిగినవన్ని ఇస్తాడని అనుకోవద్దు. ఆయనకిష్టమైన జీవితం, విధేయత ప్రవర్తన, మనలో ఉన్నట్లయితే ఆయన చిత్త ప్రకారం మంచివైన వాటిని ఇస్తాడు. కాని, దానికంటేకూడా, నిజమైన దేవుని బిడ్డలకు ఆయన రాజ్యమును గూర్చిన చింత ఉంటుంది. ఎక్కడికో దూరం వెళ్లవలసిన అగత్యత లేదు. మీ చుట్టే, మీ కుటుంబములోనే, మీ బంధువులు స్నేహితులలోనే, మీరు దేవుని సత్యమునకు బలమైన సాక్షిగా ఉండాలని ఆసక్తి కలిగిఉండాలి. మీరు ఏది నమ్ముతున్నారో, అది జీవిస్తున్నట్లయితే మీ జీవితమే ఒక సాక్షిగా ఉంటుంది. ఒక్క నోటి మాట చెప్పకపోయినా, సువార్త చెప్పకనే చెప్పినట్టు. ఈ సందర్భములో సత్యము కోసం స్థిరంగా, కదలకుండా నిశ్చలంగా నిలబడాలనే హెచ్చరిక ఇప్పటికే చెప్పుకున్నాము కదా! యేసయ్యకు మత క్రైస్తవులు అవసరం లేదు, ఆయనను వెంబడించే శిష్యులు కావాలి. ప్రభువు శిష్యులు సమస్తమును విడిచి పెట్టి వెంబడించారు. ఆయన వెంటే ఉన్నారు. ఆయనను చూస్తూ ఆయనలాగే జీవించారు. అప్పుడు ప్రభువు వారికి తన అధికారమిచ్చి గ్రామాల్లోనికి పంపాడు. దయ్యాలు వారు ఉచ్చరించి నమ్మి, వెంబడిoచిన ప్రభువు పేరుతోటే, దయ్యాలు విడిచిపారిపోయాయి. మహా అద్భుత క్రియలు జరిగాయి. కారణం? ప్రభువు నామం, ఆయన అధికారం!ఈ రోజుల్లో చాలామంది ఊరికే బైబిల్ చేత పట్టుకున్న ప్రతి ఒక్కరికీ, అడిగినప్రతి ఒక్కరికీ ఇస్తూ బాప్తిస్మాలు ఉన్నారు. ప్రభువే స్వయంగా ఇచ్చిన శిష్యరికపు షరతులు బాప్తిస్మాలు అడిగేవారు నెరవేర్చే వరకు ఆగండి. వారి విశ్వాసమును ప్రభువే పరీక్షిస్తాడు. విత్తువాని ఉపమానములో మనము గ్రహించేది ఆదేకదా! శ్రమలు, పరీక్షలు, నిందలు, వారు ఎదుర్కునే పరిస్థితుల్లో వారి విశ్వాసము పరీక్ష బడుతుంది. ఆ పరీక్షల్లో వాళ్ళు నెగ్గేవరకు ఆగండి. వారి కొరకు ప్రార్థన చేయండి, వారితో కలిసి ప్రార్థన చేసి మీ జీవితములో ప్రభువు ఏవిధంగా మిమ్మల్ని బలపరిచాడో వారితో పంచుకోండి. వారి విశ్వాసమును బలపరచండి. ఆ తరువాతనే బాప్తిస్మము గురించి ఆలోచించండి.
ఇక చివరిది చాలా ప్రాముఖ్యమైన విషయం, మన ప్రయాస ప్రభువునందు ఉన్నoతవరకు వ్యర్ధం
కాదు. “ప్రభువునందు” అన్న మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభువు నందు మనము ఉన్నామని అపో. పౌలు
ఎఫెసీ పత్రికలో అతిస్పష్టంగా బోధించారు. 2:7 గమనించండి. “క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి,
పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను” ఈ మాటలు భూత కాలములో అనగా జరిగినట్టి భాషలో ఉండడం
గమనార్హం. ఇది మన స్థాయి, స్థితి, గతి. మీరు, నేను పడుతున్న ప్రయసం, అది శ్రమకాని, హింస కాని, నింద,
అపనిందలు కాని, వెలివేత, త్రోసివేతలు కాని, ఇంకా ఏదైనా సరే, ఇవన్నీ ప్రభువు నందు భరిస్తున్నవని, వాటి భారము,
నొప్పి, అవమానము, అన్నింటినీ ప్రభువు నీతో ఉండి, ఆయనకూడ భరిస్తున్నాడని గుర్తుoచుకోండి. ఆ విధంగా
శ్రమపడుతున్న క్రొత్త విశ్వాసులు, లేదా సత్యమును అన్వేషిస్తున్న వారు మీతో ఉంటే వారిని ఆదరించి,
పరామర్శించండి. యేసయ్య పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలము పోనప్పుడు మీరు చేస్తున్న దేనికీ ఫలము
పోగొట్టుకోరు. మీరు మీ కుటుంబములో, సమాజములో, బంధువులలో, ఎదుర్కుంటున్న శ్రమలకు ఫలితం తప్పక
ఉంటుంది. మత్తయి సువార్త 25:21 గమనించండి. “అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ
కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో
పాలుపొందుమని అతనితో చెప్పెను.” యేసయ్య హీరోలను ఎన్నుకోడు, నమ్మకమైనవారిని
బహుమానములిచ్చేటపుడు ఎన్నుకుంటాడు. హీరోలు ఉండవచ్చు, కాని విశ్వాసములో, కోపావేశాల్లో కాదు,
జగడాలు, కొట్లాటలు ఈలాటి వాటిలో హీరోలను కాదు. ఆయన యెదుట దీనమనసుతో, సహనముతో ఓపికతో ఆయన
సమయం, ఆయన, విధానం, ఆయన శక్తి కోసం ఎదురుచూచేవారు ఆయన సహాయం తప్పక పొందుతారు, అంత్య
దినాన బహుమానము తప్పనిసరిగా పొందుతారు. పేతురు, ప్రభువు శిష్యుడు ప్రభువును అడిగిన ప్రశ్నకు ఏమి
సమాధానం చెప్పారో జ్ఞాపకం తెచ్చుకోండి. “అందుకు యేసు ఇట్లనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును
ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తలిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు
ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను
భూములను, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందు నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు
అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటి వారగుదురు అనెను.” మార్కు సువార్త 10:30 యేసు రక్షకుడు
ఇచ్చే బహుమానము కోరుకుంటారా? లేదా ప్రభువు పరలోకమునుండి వెలివేయడము కోరుకుంటారా? ఇది మీ
నిర్ణయము మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన:
No comments:
Post a Comment