Program # 133 I కోరింథీ-60 15:1-4 July 17, 2023
యేసు ప్రభువు పునరుధ్ధానం సువార్తకు పునాది రాయి
శ్రోతలందరికి యేసు రక్షకుని కృప సమాధానములు కలుగునుగాక! I కొరింథీ 15వ అధ్యాయము లోని మొదటి 11
వచనాలు “క్రీస్తు ప్రభువు సజీవుడుగా ఉన్నాడు” అనే శీర్షికన అధ్యయనం చేద్దాం. రండి రేడియోకు దగ్గరగా వచ్చి
కూర్చోండి. “క్రీస్తు” పునరుధ్ధానమును గూర్చి సంశయవాదులు, అనుమానముతో వాదించేవారు మొదటినుండి
అనుమానిస్తూనే ఉన్నారు. ఎందుకు “క్రీస్తు” అనే మాట వాడుతున్నామంటే, ఈ మాటకు దేవుని చేత అభిషేకించబడిన
వాడని అర్ధo. మెస్సీయ అంటే కూడా అర్ధం ఇదే! ఇది యేసు ప్రభువునకు మాత్రమే వర్తిస్తుంది. ఆయన ఈ భూమి
మీదికి వచ్చినపుడు ఒక ప్రత్యేకమైన గురితో పనితో ఈ లోకానికి వచ్చాడు. జాగ్రతగా వినండి, మెస్సీయ అంటే అర్ధం
చాలా లోతైనది. ప్రపంచమంతటిలోని పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసి పరిపూర్ణమైన
పరిహారం చెల్లించడానికి దేవుడు అభిషేకించిన ప్రభువు నజరేయుడైన యేసు. ఈ విశ్వాసము ఎవరిలో క్రియారూపకంగా
నివసిస్తుందో వారి విషయములో ఆయన చేసిన సిలువబలి వలన వారి పాపములు క్షమించబడతాయి. సృష్టి
ఆరంభములోనే ఏదేను తోటలో సర్పము లేదా సైతానుతో వాడి తలను “స్త్రీ సంతానం” అనగా యేసు క్రీస్తు ప్రభువు
చితక కొడతాడని దేవుడు ప్రవచించాడు. ఆ వాగ్దానము ఏకైక దైవ కుమారుడు యేసు క్రీస్తుకోసం ఎదురు చూచింది.
ఆయన కన్య గర్భములో జన్మించాడు. ఆయనే స్త్రీ సంతానమంటే! కాని ఆయన పునరుధ్ధానమును తరాలనుండి
మానవాళి తిరస్కరించింది. మొదట్లోనే ప్రభువు శిష్యులు ఆయన శవాన్ని ఎత్తుకెళ్లారని లంచమిచ్చి పుకారు
పుట్టించారు. కాని, పరిసయ్యులు ప్రభువును పాతి పెట్టడాన్ని ఒప్పుకోక తప్పదు. అది వారికి తెలిసినసంగతి. ఏ
సమాధిలో ప్రభువు శవాన్ని ఉంచారో వారికి తెలుసు. ఆ సమాధిని రోమా ప్రభుత్వపు అధికారిక ముద్రతో వారు
పట్టుబట్టి ముద్రవేయించారు. సైనికులను కాపలా పెట్టిoచి ప్రభువు శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకెళ్లారని
చెప్పించాలని పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూడండి! వాళ్ళే ప్రభువు
పునరుధ్ధానుడైన తరువాత సైనికులకు లంచమిచ్చి ఆ విధంగా ప్రజలతో చెప్పమని కుట్ర పన్నారు. రోమా ప్రభుత్వపు
ముద్రను పగులగొట్టి ప్రభువు దేహాన్ని ఎత్తుకెళ్లడమంటే అది మరణశిక్షకు తగిన నేరము. అంత పెద్ద నేరాన్ని
కప్పిపుచ్చడానికి ప్రధాన యాజకుల వర్గం ఎంత డబ్బు వృధా చేశారో మనకు తెలియదు కాని, ఈ విధమైన అసాంఘిక
శక్తులు ఎంతకైనా తెగిస్తాయని అర్థమవుతుంది.
క్రైస్తవ్యం యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానమనే పునాది రాయిమీద ఆధారపడి ఉంటుంది. పడిపోవాలన్నా,
లేచి గట్టిగా నిలువబడాలన్నా పునరుధ్ధానం కీలకమైనది. ఒకవేళ యేసు క్రీస్తు ప్రభుని దేహం పాలస్తీనా దేశములోని
సమాధిలో కుళ్ళు పట్టి ఉంటే, నీ రక్షణ, నా రక్షణ ఆయన మరణం పునరుధ్ధానముమీద ఆధారపడి ఉన్నదని మీకు
చెప్పడంలో విలువ లేదు. కాని క్రీస్తు సజీవుడుగా ఉన్నాడని మనము ధైర్యంగా చెప్పడానికి పౌలు చూపించే ఆధారాలు
చూచినపుడు ఈ సత్యము రుజువవుతుంది. రోమా పత్రిక 15:1-4ను గమనించి చూద్దాం.
“మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
2. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
` 3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,
4. లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.”
ఈ అధ్యాయములో మూడు తిరస్కరించలేని ప్రతిజ్ఞలు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభువు మరణము వలన కలిగే
మేలులు మనము ఆనందించాలనుకుంటే ఈ ప్రతిజ్ఞలు మనము నమ్మి వాటిని గట్టిగా చేపట్టడం అత్యవసరం. మొదటి
ప్రతిజ్ఞ ఈ నాలుగు వచనాల్లో స్పష్టం చేయబడింది. అదేమిటి?
యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానo సువార్తకు పునాదిరాయి.
ఈ అధ్యాయమును పౌలు ఎలా ఆరంభిస్తున్నాడో గమనించండి. ఆయన అందించిన వర్తమానం అందరికీ తెలిసిందే.
కొరింధులో ఉన్నవారు దాన్ని సంతోషంగా స్వీకరించారు. సువార్త సత్యము ఆయనకు ఇవ్వబడిందని అపో. పౌలు
చెబుతున్నాడు. మరో మాటలో చెప్పాలంటే సువార్త ఆయన కల్పించింది కాదు, తాను ఆలోచించి కనిపెట్టింది కాదు.
ఆయనకు సువార్త అనుగ్రహించబడింది. అది దమస్కుకు ప్రయాణం చేస్తున్నపుడు ప్రభువు ఆయనను ఎదుర్కొని
కలిసినపుడు జరిగింది. ఆ తరువాత అరేబియాలో ఆయన ఉన్నపుడు ఇంకా ఎక్కువ స్పష్టత ప్రభువునుండి పొందాడు.
ఆ సువార్త కొరింధు లోని ప్రజలను రక్షించింది. సువార్తను వారు ఉన్నదున్నట్టు స్వీకరించితే రక్షించబడతారు. ఒకవేళ
మనస్ఫూర్తిగా కాకుండా, నిజమైన క్రియపూర్వక విశ్వాసముతో కాకుండా, మనుషులకోసమో, లేక ఇతరులకోసమో
చేసినట్లయితే దానివలన ఏమి జరగదు. పౌలు అంతియొకయలో ఉన్న యూదులకు సువార్తను ప్రకటించాడు. ఎలా
చేశాడో గమనించండి: అ. కా. 13:26-35
“26. సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.
27. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచన ములను నెరవేర్చిరి.
28. ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి.
29. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.
30. అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.
31. ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.
32. దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము.
33. ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.
34. మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటను బట్టిదావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.
35. కాబట్టి వేరొక కీర్తనయందునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యౌవని చెప్పుచున్నాడు.”
మరొకచోట పౌలు ఏ విధంగా సువార్తను ప్రకటించాడో చూడండి. ఈ సారి యూదులకు కాదు, యూదులు కాని
అన్యజనులకు. అది ఏథెన్స్ అనే మహానగరంలో చేశాడు. అ. కా. 17:29-31 గమనించండి.
“29. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
30. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”
గమనిస్తున్నారా, అర్ధం చేసుకుంటున్నారా? పునరుధ్ధానము అనే ఈ ప్రతిజ్ఞలో మూడు సంగతులు ఉన్నాయి.
వాటినిక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. 1. యేసు క్రీస్తు ప్రభువు లేఖనముల ప్రకారము, అనగా ప్రవచనములలో
ఆయనగూర్చి వ్రాయబడిన ప్రకారము మరణించాడు. 2. లేఖనముల ప్రకారము, ఆయన మన పాపముల పరిహారము
చెల్లించడానికి మరణించాడు. 3. ఆయన లేఖనముల ప్రకారము సమాధి చేయబడి, మూడవ దినమున సజీవుడై తిరిగి
లేచాడు. ఇది తిరస్కరించలేని ప్రతిజ్ఞ. యేసు క్రీస్తు పునరుధ్ధానము సువార్తకు పునాదిరాయి. ఈ సరళమైన
సాధారణమైన సత్యములద్వారా మన రక్షణ స్తిరపరచబడినదని మనము జ్ఞాపకం చేసుకోవడం మంచిది. అదే
సమయములో ఈ సత్యములు అత్యంత లోతైన సత్యములు. ఇవి సర్వ సృష్టికర్త అయిన దేవుని అసమానమైన
అనంత జ్ఞానముచేత ఏర్పాటు చేయబడినవి. యేసు క్రీస్తు ప్రభువు లాగా ఏ సాధారణ మానవుడు మూడవ నాడు
పునరుధ్ధానుడు కాలేడు. మరణమును జయించలేడు. ఆయన పునరుధ్ధానo ఆయన పరిశుద్ధతకు, దైవత్వానికి
గుర్తు. ఆయనలో ఏ పాపములేదని ఆయన పునరుధానము రుజువు చేసింది. మనమీ సత్యమును నమ్మినట్లయితే
మన హృదయాలు ధైర్యముతో నింపబడతాయి. ప్రభువు తన పునరుధ్ధాన శక్తిని మనకందరికి సర్వ సమృద్ధిగా
అనుగ్రహించుగాక!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment