I కోరింథీ-59 14:39-40
సంఘములో క్రమమునకు ఆధారము
అందరికి ప్రభువు నామములో వందనములు! శుభములు! “సజీవ నిరీక్షణ” బైబిల్ అధ్యయనాల ద్వారా మీరు
మేలు, ఎదుగుదల, ఆత్మీయ అభివృద్ధి పొందుతున్నారా? మీ అనుభవము, మీరు పొందుతున్న దైవకృప, దీవెనలు
మాతో పంచుకోండి. ఉత్తరం రాయాలని కోరితే, అడ్రసు కోరుతూ మెసేజ్ పెట్టండి. ఫోన్ చేసి అయినా, మెసేజ్ లేదా
వాట్సప్ మీదనైనా మీరు పంచుకోవాలని ఆశించిందంత పంచుకోవచ్చు. మా ఫోన్ నంబర్: 8143178111. ప్రార్థన:
ఈనాటి మన అంశం సంఘములో క్రమమునకు ఆధారం. లేఖన భాగము: I కోరింథీ14:39-40.
“39. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని,
40. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి.
సమతుల్యత నేర్చుకోవాలని, పాటించాలని అపోస్తలుని ఉపదేశం. ప్రవచించడానికి లేక బోధించడానికి ఆతురతతో ఉండoడి. ఉత్సాహముతో జీవించండి. వాక్య బోధన, సాక్షమివ్వడం, మీ వ్యక్తిగత జీవితములో హృదయములో జరుగుతున్న దేవుని కార్యములు బహిర్గతం చేయండి. మీ వ్యక్తిగత హృదయము ఏ విధంగా రూపాంతరం చెందుతుందో ప్రతి చోట, మీ సంఘములో, కుటుంబములో, స్నేహితులు, తోటి విశ్వాసుల మధ్య సాక్షం చెప్పండి. “ఆపేక్షించుడి” అనే మాటకు “మిక్కటమైన ఆసక్తితో చేయండి” అని అర్ధం. ఈ మాటల్లో పౌలు చెబుతున్నదేమిటి? దేవుని వాక్యము గురించి మాట్లాడ్డానికి ఎంత ఆసక్తి ఉండాలంటే, అందరికంటే ముందు ఉండాలి. ఉత్సాహముతో యధార్ధంగా మనసారా పంచుకొనండి. దేవుని వాక్యమును ఏ రీతిగా నైనా బోధించడము ద్వారా నైనా, సాక్షo చెప్పడం ద్వారా నైనా, ఆశతో ఉత్సాహంగా హృదయ పూర్వకంగా చేసినపుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎదుగుతుంది. ఎందుకంటే, విన్నవారి విశ్వాసము బలపడుతుంది. మీ సాక్ష్యం విన్నవారికి ఉపదేశం కలుగుతుంది. ధైర్యం వస్తుంది. ప్రభువు శిష్యరికములో వారు ఒక అడుగు ముందుకు వేస్తారు. దేవుని సత్యము అనుసరించి ప్రభువుతో నడవడములో వారికి మీరు సహాయం చేసినట్టు. అపో. పౌలు చెబుతున్నదేమిటి? ప్రవచించడం విషయములో మిక్కటమైన ఆసక్తి ఉత్సాహముతో ఉండండి, భాషలు మాటలాడడమును అడ్డగించకండి. భాషల విషయములో అపో. మునుపు ఇచ్చిన హెచ్చరికలు, ఆదేశాలు మనసులో ఉంచుకొని వాటి ప్రకారం చేయాలి. అడ్డగించకండి అంటే ఆయన ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు, ఆజ్ఞలు ప్రక్కకునెట్టేయమని కాదు. అర్ధం చెప్పే వారు లేక పోయినట్లయితే అందరి ముందు భాషల్లో మాట్లాడవద్దు. అట్టి సమయములో భాషలు మాట్లాడాలని ఆశిస్తున్న వ్యక్తి వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా భాషలు మాట్లాడే వ్యక్తి తనతో తాను, దేవునితోనూ మాట్లాడుకుంటాడు. దానికి ఏమి అభ్యంతరము లేదు.
పౌలు ఈ అధ్యాయమును ఈ శీర్షికను అతి ప్రాముఖ్యమైన వచనముతో ముగిస్తున్నాడు. అదేమిటి? 40వ వచనం. “40. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి.” నిత్యుడైన దేవుడు, సమస్త సృష్టికి మూలమైన సర్వశక్తిగల దేవుని సన్నిధిలో ఉండడమంటే, క్రమము మర్యాద, సభ్యత, అవసరము. కొందరు దేవుని సన్నిధికి వచ్చే పద్ధతి చూచినపుడు కొంత నిరుత్సాహం కలుగుతుంది. కొందరు అసహ్యమైన పద్ధతిలో ఉండి, నిర్లక్ష ధోరణితో దైవ సన్నిధిలో ప్రవేశించడం బాధ కలిగిస్తుంది. భీకరుడైన దేవుని సన్నిధానమునకు వెళ్ళేటపుడు మర్యాదగా, సరియైన వేళకు, భయముతో భక్తితో ప్రవేశించడం ఎంతో ఉత్తమమైనది. మహా పరిశుద్ధుడైన దేవాదిదేవుని సన్నిధికి వెళుతున్నామనే గ్రహింపు, జాగ్రత కలిగిఉండడం ఆయన మహిమకు తగినదిగా ఉంటుంది. మనలను ప్రభువు ఉన్నదున్నట్టుగా స్వీకరిస్తాడు, నిజమే, కాని మనమేవిధంగా ఉండాలో ఆ విధంగా రూపాంతరం చెందించడం ఆయనకు ఇష్టం.
పండితుల బోధనను ఈ విషయములో తెలుసుకుందాం. సువార్త సేవకులు వారికి మెప్పు కావాలని కోరుకోకూడదు. కాని ఉపయోగకరంగా ఉండాలని కోరుకోవాలి. వారి తలాంతులు ప్రదర్శించుకోవాలని గాని, ఎంతో చలాకీగా, చక్కగా మాట్లాడేశక్తి ని చూపెట్టాలని కాదు, వాక్చాతుర్యము బహిర్గతం కావాలని కాదు, మాటలు, ఉచ్చరణ, ఈలాంటి వాటిమీద ఆసక్తి పెట్టగూడదు. కాని, పరిశుద్ధమైన విశ్వాసములో దేవుని ప్రజలను కట్టాలని, వృద్ధి చెందించాలని, సవరించాలనే ఉద్దేశంతో ప్రవర్తించాలి. మానవాళి మీద వారి హృదయాల మీద బలమైన ముద్రలు దేవుడు వేయాలనే తపనతో పరిచర్య చేయాలి. సువార్త సేవ, వాక్య సేవ కంటే మించిన ప్రాముఖ్యమైన పని ఏది లేదు. దాని స్వభావము, ఫలితాలకొస్తే వాక్య పరిచర్యకంటే మించింది లేదు. ఈ భూమి మీద అన్నింటికంటే ఎక్కువగా ఈ పరిచర్యలో జాగ్రత్త, నిష్కాపట్యత, సరళత, స్వచ్చత, అత్యవసరము. సత్యమును అలకరించకుండా సరళంగా అసాధ్యమైన రీతిగా, మారని సత్యముగా బోధించేది సువార్త పరిచర్య అంటే. అన్ని స్థలములకంటే పులిపీఠము దగ్గర మెప్పునుగాని, జ్ఞానమును ప్రదర్శించుకోవడముగాని, యుక్తిగా చేసే తర్కవాదముగాని పేరు ప్రతిష్ఠ గాని కోరగూడదు. శ్రోతలూ, జీవముగల పరిశుద్ధమైన దేవుని సంఘములో ఏవిధముగా ప్రవర్తించాలో ఆపో. పౌలు ఎంతో స్పష్టంగా ఒక్క మాటలో బోధించారు. దేవుని సన్నిధి అంటే, క్రమము, మర్యాద, పరిశుద్ధతతో నిండి ఉండాలి. దేవుని వాక్యమును బోధించే వారు ఎవరైనా గాని, దైవ భయము కలిగిఉండి బోధించాలి. ఒక వృతిలాగా, కాదు, జీవనోపాధి కోసం ఎంత మాత్రం కాదు. డబ్బు, లేదా విన్నవారి వద్దనుండి కానుక, మెప్పు, ఈలాంటివి ఎంత మాత్రం హృదయాంతరంగాల్లో కూడా ఆశించకూడదు.
ఈ దినాల్లో ఎందరో దేవుని వాక్యమును బోధించాలని, ఆశ పడుతూ ఉండడం జరుగుతుంది. సరియైన సత్యము ఇంతవరకు మనము ధ్యానించిన రీతిగా బోధిస్తే సంతోషమే. కాని, వ్యక్తిగత జీవితములో ఒక్కొక్కరు హృదయములో వారు మార్పు చెందుతున్న సాక్ష్యం, మన హృదయపు లోతుల్లో దేవుని పరిశుధ్ద్ధాత్ముడు ఏమి బోధిస్తున్నాడు, ఏ పాపము విషయము మనలను ఒప్పిస్తున్నాడు, ఈలాంటి సంగతులు చెప్పడం చాలా అవసరం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సువార్తికుడు, లక్షలాది అనాథ పిల్లలకు యేసయ్య మధుర నామమును చూపించిన దైవ సేవకుని పేరు మీరు విన్నారా? ఆయన పేరు జార్జి ముల్లర్. ఆయన తన యవన కాలములో దొంగ, త్రాగుబోతు, సమాజానికి చీడపురుగు. ఆయన ప్రభువును ఎలా తెలుసుకున్నాడో ఆయన ప్రేమను ఎలా రుచి చూశాడో మీకు తెలుసా? ఒక చిన్న బైబిల్ పఠన గుంపులో. కొద్ది మంది ఒకచోట కూడుకొని బైబిల్ పఠన చేసి వారంతా ప్రార్థించేవారు. తనకు తెలిసిన ఒక యువకుడు మోకరించి ప్రార్థిస్తుండగా ముల్లర్ చూచి, పరిశుద్ధాత్ముని చేత తన పాపము గూర్చి ఒప్పించబడి, ప్రభువును రక్షకునిగా హృదయములో చేర్చుకున్నాడు. అప్పటినుండి ఆయనకు దేవునితో సంబంధం ఏర్పడింది. ఆ తరువాత క్రమంగా ఆయన గొప్ప విశ్వాస వీరుడుగా మార్పు చెందాడు. దేవుని వాక్యము బోధించడం ఒక యెత్తు. దేవుని వాక్యము నీ జీవితములో ఎలాంటి క్రియ చేస్తుందో అది మరొక యెత్తు. పరిశుద్ధాత్ముని క్రియలు ఆశ్చర్యమైన గంభీరమైన క్రియలు. ఎవరు ఎన్నడూ ఊహించని మార్పులు ఆయన చేస్తూ ఉంటాడు. దేవుని పరిశుద్ధ గ్రంధపు అధ్యయనాల ద్వారా, ఆయన మీలో అలాంటి క్రియలు చేస్తున్నాడని ధృడముగా నమ్ముతున్నాము. వాటిని మీ కుటుంబములో, సంఘములో, ఇతర బైబిల్ పఠన గుంపులలో ప్రార్థన కూడికలలో తెలియచెప్పండి. ఇతరుల విశ్వాసమును బలపరచండి. ప్రభువునెరుగని వారితో మీకు ప్రభువు చేసిన క్రియల గూర్చి చెప్పండి. సిగ్గు పడవద్దు, యేసు క్రీస్తు ప్రభువు తాను తిరిగి వచ్చినపుడు నిన్ను చూచి సిగ్గు పడవలసి వస్తుంది. ముఖం చాటేయవలసి వస్తుంది. దానికి కారణం మనo సిగ్గుపడడమే! గమనిస్తున్నారా, శ్రోతలూ? భయపడవద్దు, అది దుష్టుడు కలిగించేది. అపోస్తలులు, ఆదిమ విశ్వాసులు, యేసురక్షకుణ్ణి యెరిగిన వారు ఎంతో ధైర్యముగా సాక్షమిచ్చారు. పరిశుద్ధాత్ముడు ధైర్యమిస్తాడు. సైతాను భయమును కలిగిస్తాడు. మీరు మీ ఇంటిలో బైబిల్ పఠన ప్రార్థన గుంపును ప్రారంభించవచ్చు. ఇద్దరితోనైనా ఆరంభించండి. ప్రభువు మీకు విశ్వాసమునివ్వగల శక్తిమంతుడు. ప్రభువు మీకు ధైర్యం, శక్తి, చొరవ, ఉత్సాహం తన ఆత్మ ద్వారా ఇవ్వాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు కూడా మీ కోసం ప్రార్థన చేస్తాము. మీ బైబిల్ తో బాటు సిద్ధంగా ఉండండి.
దానికంటే ముందు ఈ శీర్షికలో మనమంతా కలిసి అధ్యయనం చేసిన మూడు అంశాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యయనం సంఘములో స్త్రీ పురుషుల స్థానం, బాధ్యతలు. 14వ అధ్యాయం 34-36.
రెండవ అధ్యయనం, సంఘపు నాయకత్వములో కృప అనే అంశం. 36-38 వచనాలు.
మూడవ అధ్యయనం సంఘములో క్రమమునకు ఆధారము 39-40 వచనాలు.
మీ చేయి మీ బైబిల్ మీద ఉంచి, హృదయపూర్వకంగా మీరు ప్రార్థన కోరినట్లయితే మీ కోసం ప్రార్థిస్తాము. ప్రార్థన:
No comments:
Post a Comment