I కోరింథీ-58 14:36-38 సంఘపు నాయకత్వములోని కృప

I కోరింథీ-58 14:36-38 

సంఘపు నాయకత్వములోని కృప 

          జీవితపు సమస్యలు క్రుంగదీస్తున్నాయా? బాధలు తట్టుకోలేకపోతున్నారా? నిరాశపడకండి! మిమ్ములను 

సృష్టించిన దేవుడు మీ సమస్యలు బాధలన్నిటికన్న గొప్పవాడు. ఆయన సహాయపడితే అన్నింటిని మీరు దాటి 

ముందుకు పోవచ్చు. కాని, ఆయనతో సంబంధం కలిగిన వారికే సహాయం చేస్తాడు. ఇది ప్రతి సంబంధం విషయములో 

కూడా సత్యమే కదా! ప్రతి మానవునికి దేవునికి పాపమునుబట్టి సంబంధం తెగిపోయింది. దాన్ని కలపగలిగినవాడు 

పాపుల రక్షకుడు, లోక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయనతో మీ గురించి ప్రార్ధన చేస్తాము. రండి, రేడియోకు 

దగ్గరగా వచ్చి కూర్చోండి.  ప్రార్థన:

            ఆదర్శవంతమైన పరిశుద్ధమైన దేవుని సంఘము అనే శీర్షికను అధ్యయనము చేస్తున్నాము. ఈ శీర్షికలో 

మొదటి అంశము ఆదర్శవంతమైన సంఘములో సరియైన స్థానములో సరియైన వారు ఉండాలి. ఎవరి భాద్యత వారు 

నెరవేర్చాలని అధ్యయనం చేశాము. ఈ దినము ఆదర్శమైన సంఘములోని నాయకత్వము ఎలా ఉండాలో అధ్యయనం

చేద్దాం. లేఖన భాగం: I కొరింథీ 14:36-38

         36. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?

            37. ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల,   నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.

            38. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.

 

ఆదర్శమైన సంఘములో ఏది మూలస్తంభం? ఏది అతి ప్రాముఖ్యమైన మూలరాయి? అనే విషయమును అపో. పౌలు 

స్పష్టంగా ఆదేశిస్తున్నాడు. ఎవరికి తోచింది వారు దేవుని వాక్యము, ఆదేశము అనుకోవడం కేవలం భ్రమ అవుతుంది. 

36వ వచనములో కాస్త కటువుగా అపో. కొరింథీ సంఘపు విశ్వాసులను గద్దించడం గమనిస్తున్నారా?36. దేవుని 

వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా?”  కొరింథీలో ఉన్న సంఘస్థులు దేవుని 

వాక్యముకంటే వారి ఉద్దేశాలను, తలంపులను, అభిప్రాయాలను హెచ్చించుకునట్టు పౌలు మాటల్లో స్పష్టమవుతుంది. 

“మీకు మీరు ఏమనుకుంటున్నారు? మీకు తెలిసిందే సత్యమనుకుంటున్నారా? మీ అభిప్రాయము మాత్రమే కరెక్ట్ 

అనుకుంటున్నారా?” ఈ విధమైన అర్ధముతో అపో. వారిని గట్టిగా హెచ్చరించడంస్పష్టంగా ఉన్నది. ఇది మనకు కూడా 

ఒక బలమైన హెచ్చరిక. మనకు తోచినట్టు, మనకిష్టం వచ్చినట్టు మన అభిప్రాయాలు చేసుకోకముందు దేవుని ఉద్దేశం 

ఏమిటి? ఆయన ఆజ్ఞ ఏమిటి? అని మొదట లేఖనములను ముందుగా జాగ్రతగా తరచి చూడాలి. ప్రతి సంఘము 

ఆదర్శమైన సంఘముగా మార్చబడాలంటే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంధమును అన్ని అభిప్రాయాలకంటే, అందరి 

మాటలకంటే హెచ్చుగా, అత్యున్నత ప్రమాణముగా  పెట్టుకోవాలి. ఈ ప్రాముఖ్యమైన సత్యమును ప్రతి ఒక్కరూ 

గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా నాయకులుగా, పాస్టర్ గా, సంఘ పెద్దలుగా, పరిచారకులుగా, బోధకులుగా ఉన్నవారికిది 

అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ప్రతి విశ్వాసికు కూడా అంతే అవసరం.  

         ఆ తరువాత సంఘములోని నాయకులకు క్రమశిక్షణ ఉండాలి. ఈ విషయమును అపో. పౌలు నొక్కి 

చెబుతున్నాడు. 37వ వచనం    37. ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన 

యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.”  పౌలు 

చెబుతున్న మాటలు, ఇస్తున్న హెచ్చరికలు, దేవుని నుండి ఆయన మనకిస్తున్నట్టు మనమంతా గ్రహించాలి. ఈ 

సందర్భములో శ్రోతలందరూ, ముఖ్యంగా సంఘ పెద్దలు, నాయకులు ఒక ప్రాముఖ్యమైన విషయం మనసులో భద్రంగా 

పెట్టుకోవాలి. అదేమిటి? జాగ్రతగా వింటున్నారా? లేఖనముల రచయిత అయిన పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేరణ చేత 

వ్రాయించిన దైవ లేఖనములు పరిశుద్ధ గ్రంధము బైబిల్ లోని చివరి గ్రంధం ప్రకటనను, ప్రభువు శిష్యుడు యోహాను 

చేత వ్రాయించినపుడు దేవుని ప్రేరణ ముగిసింది. “యెహోవా ఈలాగు సెలవిచ్చెను” లేదా “యెహోవా వాక్కు ఇదే” అనే 

మాటలు పరిశుద్ధ గ్రంధం బైబిల్ లో 3500 మార్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభువు పలికిన, పంపించిన, 

వ్రాయించిన ప్రతి మాట వ్రాయబడింది. దేవుని నుండి వచ్చిన మాటలు, మనకోసం ప్రభువు నిర్దేశించిన మాటలు 

మాత్రమే మన చేతుల్లో ఉన్నాయి.

         పౌలు తాను వ్రాసిన మాటలకు అధికారమున్నదని చెప్పాడు. ఆయన దేవుని ఆజ్ఞలను వ్రాస్తున్నానని 

చెప్పాడు. అందు చేత ఆయన వ్రాసిన మాటలను ఎవ్వరు మార్చడానికి వీలు లేదు. ఒకరు ఈ విధంగా అన్నారు. 

“పౌలు ఈ దినము బ్రతికి ఉంటే ఆ మొదటి శతాబ్దములో వ్రాసినట్టు కాకుండా వేరే విధంగా రాసేవాడా?”  ఎంత 

మాత్రము కాదు. ఆలాగైతే మన చేతుల్లో ఉన్నది పరిశుద్ధ గ్రంధం కాదని చెప్పాలి. ఇవి దేవుని నుండి వచ్చిన మాటలు 

కావని చెప్పాలి. అలాగైతే నిత్యము మారని, అన్ని తరము లకు, అన్ని కాలములకు అన్ని పరిస్థితులకు అన్ని 

జనములకు ఎన్నడు మారని దేవుని మాట మన చేతుల్లో లేదా? అపో. పౌలు ఇప్పుడైనా, అప్పుడైనా, దేవుని 

మాటలు వ్రాశాడు కాని, తన మాటలుకాదు. దేవుని మాటలలో ఎంత మాత్రము మార్పు ఉండదు. భూత భవిష్యత్ 

వర్తమానాలు దేవుని దృష్టిలో ఒక్కటే! దేవుని మాటలను మనమెంత మాత్రము మార్పు చేయకూడదు. ఒక గొప్ప 

బైబిల్ పండితుడు ఏ విధంగా వ్యాఖ్యానించాడో తెలుసుకుందామా? పౌలు చెబుతున్న మాటల అర్ధమేమిటంటే, ‘నా 

స్వంత అధికారముతో నేను మాట్లాడడం లేదు. నా స్వంత పేరట నేను వ్రాయడం లేదు. నేను దేవుని పేరట 

మాట్లాడుతున్నాను.ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడం దేవుని ఆత్మకు మనము ప్రాధాన్యతనిస్తున్నామని 

చెప్పడానికి రుజువు. ఏ ప్రాంతమైన, ఏ దేశమైనా, నిజమైన భక్తి విశ్వాసాలు  ఉన్నాయని చెప్పడానికి బలమైన 

సాక్ష్యం, ఆ విశ్వాసానికి గుర్తుగా దేవుని ఆజ్ఞలపట్ల గాఢమైన ప్రేమ నిత్యము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించడానికి 

మనకుండే స్వచ్చమైన అభిలాష. ఈ ఆతురత దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తే, పరిశుద్ధ లేఖనాలను నిర్లక్షం చేస్తే, 

సంఘమునకుండే క్రమము సమాధానమును నాశనం చేస్తే, మనము చూపిస్తున్న భక్తి విశ్వాసాలు నిజమైనవి కావు,  

 అట్టి సమయములో మన విధేయత కపటమైనదని చెప్పకనే చెబుతున్నట్టు. అది మోసగించే తప్పుడు ఉత్సాహం.  

ఎంత గాఢంగా కనిపించినా, అనిపించినా, ఏ ఉద్దేశమును నెరవేర్చవు. కాస్త కటువుగా ఉన్నప్పటికి, ఎంత యధార్ధమైన 

మాటలు కదూ! అవును, శ్రోతలారా, సోదరి, సోదరులారా, ఇదే మన విశ్వాసానికి, భక్తికి, పాడే పాటలకు, చెప్పే 

బోధలకు, వినే బోధలకు, మనము చెప్పే సాక్షాలకు నిజమైన అగ్ని పరీక్ష అని చెప్పక తప్పదు.

         మన జీవితాల్లో మన స్వంత అభిప్రాయాలకు తలంపులకు ఇచ్చే ప్రాధాన్యతను ప్రక్కకు పెట్టి దేవుని పరిశుద్ధ 

గ్రంధం ఏమని మనకు ఆజ్ఞాపిస్తుందో, ఏమి హెచ్చరిక ఇస్తుందో దాని మీద మనసు స్థిరంగా ఉంచాలి. కొరింథీ 

సంఘములో వేరు, వేరు, ఆత్మ వరములు గల విశ్వాసులు ఉండవచ్చు. ఎవరికి వారు తాము గొప్పవారమని భ్రమించి 

ఉండవచ్చు. వారి వరములు చూచి విర్రవీగి వుండవచ్చేమో! అన్నిటిని పరీక్షించి చూచేది పరిశుద్ధ గ్రంధం బైబిల్. 

దేవుని నోటినుండి వెలువడిన ఆయన అగ్నివంటి మాటలు, అనగా లేఖనములకంటే ఎవ్వరూ ఎక్కువ వారు కారు. 

ఎవరి మాట చివరిది కాదు. ఎన్నయినా చెప్పవచ్చు, ఏదైనా చెప్పవచ్చు. కాని వాటన్నిటిని దేవుని వాక్యపు 

ప్రామాణికత్వానికి అప్పగించాలి. 38వ వచనం. “38. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము”  

 అంటే ఏమిటి? ఎవరైనా పౌలు బోధించిన దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆ వ్యక్తిని తిరస్కరించాలి. మరో మాటలో 

చెప్పాలంటే పౌలు ఆత్మీయ అధికారాన్ని ఎవరైనా ధిక్కరిస్తే ఆ వ్యక్తిని దేవుని అధికారము లేనివానిగా,తప్పుడు 

బోధకునిగా లెక్కకట్టాలి. దేవుని మాటలకు ఎంత అధికారం శక్తి ఉందో గమనిస్తున్నారా, శ్రోతలూ? దేవుని మాటలకు 

నిజమైన స్వచ్చమైన, యధార్ధమైన విధేయత చూపి ప్రభువు మెప్పును, ఆశీర్వాధమునైనా పొందవచ్చు, లేదా దేవుని 

శక్తిగల మాటలను ధిక్కరించి నశించి పోవచ్చు. నిర్ణయం మీదే! ప్రార్థన:

               

 

 

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...