I కోరింథీ-57 14:34-36
ఆదర్శమైన దేవుని సంఘం
అందరికి యేసు రక్షకుని మధురమైన నామంలో శుభములు! ఈ వారమంతా ఎలా గడిచింది? ఎన్నెన్ని ఒడుదుడుకులు, బాధ కలిగించే సమస్యలు, వేదనలు, ఇక్కట్లు అనుభవించి ఉండవచ్చు. జీవితములో ప్రతి పరిస్థితిలో మనకు కావలసిoది జ్ఞానము, వివేకము. అంటే అదేదో ఒక వస్తువని అపోహ పడుతూ ఉంటాము. దేవునికి పుట్టిన నిజమైన కుమారులు కుమార్తెలు దేవుని వాక్యమువలన, పరిశుద్ధాత్మునివలన జ్ఞానము, బుద్ధి ప్రతి పరిస్థితిలో నిజముగా ఆయనమీద ఆధారపడే వారు పొందగలరు. ప్రార్థన: ఒకరు మరొకరితో అన్నారు, “నేను ఆదర్శమైన పరిపూర్ణమైన సంఘమును చూడలేదు కాబట్టి, నేను క్రైస్తవుడను కాలేదు.” జవాబు ఏమని వచ్చింది? “ఆ పరిపూర్ణమైన లోపములేని సంఘమును మీరు కనుక్కున్నపుడు అందులో చేరకండి” అసలు విషయమేంటో బోధపడిందా? ఆ వ్యక్తి అందులో చేరితే అది లోపములేని పరిపూర్ణమైన సంఘముగా ఉండదన్న మాట! ప్రతి సంఘములో కొన్ని మంచి గుణాలు, మరికొన్ని చెడు గుణాలు, ఉంటాయి. అవి ఆ సంఘములో ఉన్నవారికి తెలుస్తాయి. ఏవి ఎక్కువ ఉంటాయి? మీరున్న సంఘములో మంచి ఎక్కువ ఉన్నాయని ఆశిస్తున్నాము. ఎందుకు ఈ భేదము కనిపిస్తుంది అని ఆలోచిస్తే, అందులో ఉన్నవారందరు మానవ మాత్రులు కాబట్టి అని గ్రహించాలి. మానవులతో ఉన్న ఏ వ్యవస్థ అయినా వారి వల్ల ఉండే మంచి చెడు గుణాలు ఆ సంఘములో కనిపిస్తూ ఉంటాయి. మనమంతా క్రైస్తవ విశ్వాసములో ఉన్నపటికి, మన బలహీనతలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కొరింథీ 14:34-40 వచనాల్లో అపో. పౌలు ఆదర్శమైన పరిపూర్ణమైన సంఘము ఎలా ఉండాలో వివరించాడు. ఈ శీర్షికన మూడు అంశాలు అధ్యయనము చేయనున్నాము. ఈలాంటి సంఘమునకు కొన్ని గుర్తులు ఈ లేఖన భాగములో అపో. స్పష్టపరిచాడు. మొదటిది, సంఘములో స్త్రీల స్థానము, పాత్ర, బాధ్యత. “34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. 35. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.
“స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను” అని చెప్తూ చాలా కఠినమైన మాట చెబుతున్నాడు. వారు సంఘములో భాగమే, సంఘములో ఉన్నారు, కాని, క్రింది స్థాయిలో ఉండమని చెబుతున్నారు. ఇదే పత్రిక 11:2-16లో ఏ విధంగా స్త్రీలు ప్రార్ధించవచ్చో, ప్రకటించవచ్చో బోధించారు. అది కేవలము ఇంటికి పరిమితము కాదు. ఆ మాటలు సంఘమునకు కూడా వర్తించవచ్చు. స్త్రీలు ముసుగు లేకుండా ప్రార్ధించవద్దు, ప్రవచించవద్దు అని మాత్రం స్పష్టపరిచాడు. ప్రస్తుతం మనము అధ్యయనం చేస్తున్న 14వ అధ్యాయములో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలని హెచ్చరించాడు. ఆయన ఎందుకిలా బోధించాడో కొంచం ఆలోచించి ధ్యానిస్తే అర్థమవుతుంది. ఒకవేళ స్త్రీలు సహజంగా భావోద్రేకాలకు కాస్త ఎక్కువ లోనవుతారని మూల కారణం కావచ్చు. పురుషులకంటే స్త్రీలు ఎక్కువ భావోద్వేగాలతో ఉంటారు. అప్పుడప్పుడు విపరీత ధోరణి, తీవ్రతలకు లోనవుతారేమో! 26వ వచనములో ఆయన బోధించిన పరిస్థితులలో విపరీతమైనవి కలుగవచ్చేమో అని భావము. 26వ వచనం “సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు.” ఇవి జరుగుతున్నపుడు స్త్రీలు ఏదైనా చేయవచ్చని పౌలు భావించాడేమో. అందుచేత ఆయన స్త్రీలు తమ భర్తతో మంచి సంబంధం కలిగియుండి భర్తతో మాట్లాడవచ్చని బోధిస్తున్నాడు. దీనిలో ఇమిడిఉన్న అర్ధం ఏమిటంటే, కుటుంబమునకు పురుషుడు శిరస్సు, లేదా నాయకుడు, బాధ్యుడు. కుటుంబము గూర్చి ఆది నుండి దేవుని హెచ్చరిక, ఆజ్ఞ ఏమిటి? ద్వితీ. 6:4-6 గమనించాలి. “4. ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 5. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. 6. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.”దేవుని ఆజ్ఞ ప్రకారము కుటుంబములో కుటుంబ ఆరాధన ప్రార్థన అనే బలిపీఠమును కలుగచేసి, దాన్ని ప్రతి దినం నెరవేర్చే భాద్యత తండ్రి లేదా పురుషునిదే. వింటున్న తండ్రులారా, ఈ భాద్యతను ఇంతవరకు మీరు చేయకపోయి ఉండవచ్చు. మించి పోయింది లేదు. హృదయ పూర్వకంగా ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపపడి, క్షమాపణ వేడుకొని, ఈరోజే ప్రారంభించండి. యేసు క్రీస్తు ప్రభువు పరిపూర్ణంగా క్షమించి శుద్ధిచేస్తాడు. కాని, ఈ దినం మీరు, నేను చేస్తున్న ఈ నిబంధనను అతి జాగ్రతగా నమ్మకంగా నెరవేర్చాలి. దేవునిసన్నిధిలో ఆయనతో చేసిన నిబంధనను చులకనగా తీసుకుంటే ఆయన శిక్ష తప్పదు. ఇప్పటికే ఎక్కువ శాతము క్రైస్తవ కుటుంబాలలో తల్లులు ఇది చేస్తున్నారు. ప్రభువు న్యాయపీఠము వద్ద తండ్రులమైన మీరు, నేను నిలువబడ్డపుడు, యేసయ్య లెక్క అడిగేది తల్లిని కాదు, అని దయచేసి గమనించండి. తల్లి భాద్యత, పని, పరిచర్య వేరు. తల్లి తప్పనిసరిగా తండ్రితో సహకరించాలి, తండ్రి చేస్తున్న వాక్యబోధన క్రమములతో ఆమె కూడా అదే రీతిగా చేయవలసిన సమయములో, అనగా తండ్రి అందుబాటులో లేనప్పుడు చేయవచ్చు, కాని భాద్యత తండ్రిది. లెక్క దేవునికి అప్పగించవలసింది తండ్రి. ఈ సత్యమును మనమంతా దీనమనసుతో, వినయముతో దేవుని మాటకు విధేయత చూపడానికి ముందుకు అడుగు వేద్దాము. ఒక ప్రముఖ బైబిల్ వ్యాఖ్యాత, పండితుడు ఏమని బోధిస్తున్నాడో గమనిస్తే మనకు ఇంకా ఎక్కువ వెలుగు కలుగుతుంది. జాగ్రతగా వినండి, తండ్రులూ! స్త్రీ ఇంట్లో భర్త వద్ద నేర్చుకోవాలని ఎంత బలముగా లేఖనము ఆదేశిస్తుందో, అంతే బలముగా నేర్పించే శక్తి సామర్ధ్యం పరిశుద్ధాత్మ ద్వారా భర్త కలిగిఉండాలని లేఖనము ఆదేశిస్తుంది. ఆమెలో కలిగే ప్రశ్నలకు, సందేహాలకు భర్త జవాబిచ్చే స్థాయికి ప్రతి భర్త ఎదగాలి. ఆలాంటి ఆతురత, భారము భర్తలో ఉండాలని దేవుని ఉద్దేశం. సంఘములో స్త్రీ మాట్లాడడం అవమానమైనపుడు, ఆమెకు కలిగే సందేహాలు, ప్రశ్నలకు ఆమె భర్త తగిన జవాబు, సమాధానం ఇవ్వకుండా మౌనముగా ఇంటిలో ఉన్నట్లయితే అది భర్తకు అవమానము. ఈ విధమైన హెచ్చరిక ఇవ్వడానికి మూలకారణము ఉన్నది. “వారు లోబడియుడవలసినదేగాని” అనే మాటలు 34వ వచనములో ఉన్నవి. భర్త అధికారము క్రింద భార్యను దేవుడు ఉంచాడు. ప్రభువు సృష్టించినపుడు నియమించిన స్థానముల ప్రకారము జీవించాలి. అది తప్పినపుడు అవమానమే అవుతుంది. ఈ మాటలు అపో. పౌలు ఆ దినములకు, ఆ సంస్కృతిలో ఉన్న పరిస్థితులనుబట్టి వ్రాసినప్పటికి, దేవుని సృష్టి క్రమము ప్రకారము, ఎవరి స్థానములో వారు ఉండి, ఎవరికి అప్పగించబడ్డ పని, భాద్యతలు వారు చేసి ప్రభువును మెప్పించాలి. మాట్లాడడము అంటే బోధించడము ద్వారా, పెత్తనము చేయడమని అర్ధం. ఆ దినాల్లో దేవుని లేఖనములను బోధించేవారికి నాయకత్వము అప్పగించబడేది. ఎప్పుడైతే స్త్రీ వాక్య బోధన చేస్తుందో, అప్పుడు ఆమెకు ఒక నాయకత్వపు స్థానం ఉన్నట్టు. అది కూడా సంఘములో అనగా పురుషులు స్త్రీలు కలిసి ఉన్న సంఘపు సమావేశాల్లో స్త్రీలు వాక్య పరిచర్య చేయడాన్ని అపో. పౌలు ఖండించడం ఇక్కడ మనమంతా గమనించవలసిన విషయం. ఇతర స్త్రీల సమావేశాల్లో, కుటుంబాల్లో, అలాంటి వాటిల్లో స్త్రీలు వాక్యపరిచర్య చేయడం ఎంత మాత్రము అవమానము కాదు, సరికదా, అది మంచిది. ఆమోదించి ఆనందించవలసిన విషయం. దేవుని పరిశుద్ధ సంఘము ఆదర్శ ప్రాయముగా ఉండాలంటే సరియైన స్థానములో ఎవరి స్థానములో వారు ఉండి, ఏ విధంగా ప్రభువు తన లేఖనాల్లో క్రమము ఏర్పాటు చేశారో, ఆ విధంగా ఉండడం ఆదర్శమైన సంఘము. ప్రతి కుటుంబములో భార్య భర్తలు వారి భాద్యతలు నెరవేర్చి ప్రభువునకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి అవసరమైనంత కృప ప్రభువు మనకందరికి అనుగ్రహించుగాక!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment