I కోరింథీ-56 14:29-33
అర్థవంతమైన సామూహిక సంఘ దైవారాధన-2
రేడియోదగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభువు సర్వాధికారముగల నామములో శుభములు! ఈ దినాల్లో
మనము చేస్తున్న బైబిల్ అధ్యయనాలు కొన్ని ప్రకంపనలు, యోచనలు మీలో కలిగించవచ్చు. ప్రేమతో అందరిని
ఆదరించడం, ధైర్యపరచి బలపరచడం దేవుని పిల్లలుగా మనమంతా పాటించినపుడు అభిప్రాయాల్లో భేదాలున్నా,
ప్రేమలో మనమంతా కలిసి ఉండాలి. ప్రార్థన:
అర్థవంతమైన సంఘపు దైవారాధన ఎలా ఉండాలి అనే అంశమును అధ్యయనం చేస్తున్నాము కదా! జీవముగల
దేవుని సంఘము ప్రభువును ఆరాధించడానికి ఉండే అవసరతలు, సర్దుబాట్లు ఇంతవరకు నేర్చు కొన్నాం. ఈ దినం
ఆలాంటి దైవారాధన జరగడానికి ఏ నియమకాలు, ఏర్పాట్లు చేయాలో అధ్యయనం చేద్దాం. రండి రేడియోకు దగ్గరగా
వచ్చి కూర్చోండి.
I కొరింథీ 14: 29-33 వచనములు.
“29. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.
30. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.
31. అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.
32. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.
33. ఆలాగే పరిశుద్ధుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
ఇంతవరకు భాషల్లో మాట్లాడడానికి ఉన్న విధులు, విధానాలు అధ్యయనం చేశాం, ఇప్పుడు ప్రవచనం చెప్పేటపుడు చేయవలసిన విధులు, విధానాలు తెలుసుకుందాం. ప్రవచనాలు చెప్పేవారు కూడా ఇద్దరు లేక ముగ్గురికి మించకూడదు. గమనించారా? ఈనాడు ఈ విధంగా ఇద్దరు లేదా ముగ్గురు బోధించడం మనము ఎక్కడా చూడము. సంఘ ఆరాధనాల్లో ఒక పాస్టర్ లేదా సంఘ పెద్ద, లేదా సంఘ కాపరిఆరాధనలో ఆయన వాక్య బోధన లేదా పౌలు మాటల్లో చెప్పాలంటే ప్రవచనo చెప్తాడు. కొరింథీ సంఘములో ఎక్కువ మంది బోధకులు ఉన్నట్టు, అందరూ ప్రవచనం చెబుతున్నట్టు ఇక్కడ చదువుతున్నాం కదూ! ఒకవేళ ఒక వ్యక్తి బోధిస్తున్నపుడు మరొక బోధకునికి ఏదైనా బయలుపడితే ఆ మొదటి బోధకుడు ఆపేయాలి. ఆ వ్యక్తి చెప్పేది వినాలి. వివేచించాలి. అప్పటికే మాట్లాడుతున్న వ్యక్తి మౌనంగా ఉండాలి. “అందరూ నేర్చుకొనునట్లును” అనే ప్రశస్తమైన మాటలను అతి జాగ్రతగా గమనించాలని శ్రోతలందరినీ ప్రేమతో బ్రతిమాలుతున్నాను. బోధించే వారు, వినేవారు అందరు నేర్చుకోవాలి. ఈనాడు మన సంఘాల్లో వాక్యబోధన, ప్రవచనం చెప్పడం ముగించిన తరువాత ఎవరికి ఏమని బోధపడింది, ఎవరికి ఏ ప్రశ్నలు ఉన్నాయి ఎవరికి తెలియదు. మనకు రేడియోలో ఈ అవకాశం లేదు కాని, మీకేమైనా ప్రశ్నలు, సందేహాలు కలిగినట్లయితే ఉత్తరం ద్వారా కాని, వ్హాట్సప్ లో మెసేజ్ కాని, మాట ద్వారా కాని, వ్రాసి కాని తెలియచేయండి. వాటికి సమాధానాలు లేఖనాల్లోనుండి తెలియపరుస్తాము. బైబిల్ పఠన సమయము సంఘాల్లో కూడా ఉండాలి. వ్యక్తిగత సమయములో కూడా బైబిల్ పఠన సమయము ఉండాలి. అందరు కలిసి ఉండే సమయాల్లో దేవుని వాక్యమును కలిసి పఠించి అధ్యయనం చేసే సమయoలో ప్రతి ఒక్కరు వారి తలంపులు, సాక్ష్యాలు, తెలియపరచవచ్చు. ఒకరికి ప్రశ్న కలిగితే మరొకరు సమాధానం చెప్పవచ్చు. కాని అన్నింటిని లేఖనాల్లోఉన్న సత్యం ఆధారంగా మాత్రమే మాట్లాడుకోవాలి. పోటీతత్వమునకు తావులేదు. అందుకే పౌలు అంటున్న మాటలు గమనించాలి. 32వ వచనము “ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.” అంటే ఏమిటి? లేఖనాలను బోధించేవారు వారిని వారి ఆధీనములో ఉంచుకోవాలి. నిగ్రహశక్తి, ఆశనిగ్రహము కలిగిఉండి, సామరస్యంగా, సావధానంగా మాట్లాడుకోవాలి. జాగ్రత సుమీ! అందరినీ కట్టడం, అభివృద్ధి చెందేలా చూడడం, మన పిలుపు, భాద్యత అని మర్చిపోవద్దు. మన సహోదరులను, సహోదరిలను ప్రేమతో, జాగ్రతతో, ప్రభువులో వారు బలపడేలా చూడడం మనలో ప్రతి ఒక్కరు చూడాలి.
ఈనాటి మన సంఘాల్లో ఇంతటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నాయా? ప్రార్థన మందిరాల్లో, సంఘాల్లో త్రియేక దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హృదయపూర్వకంగా వారి రక్షకుణ్ణి ఆరాధిస్తున్నారా? ఎవరిని వారు ప్రశ్నించి చూచుకొని, పరీక్షించుకోవలసిన సమయం ఆసన్న మయిందేమో! పట్టణాల్లో సంఘాల్లో అంతా ముందే ఏర్పాట్లు చేసుకొని, ఆరాధన జరిగే రెండు, మూడు గంటల సమయములో ఎవరు ఏమి చేయాలో ముందే నిర్ణయించుకుంటారు. అదంతా దేవుని సంకల్పము, ప్రణాళిక ప్రకారం, సంఘపు శిరస్సు అయిన యేసు క్రీస్తు ప్రభువు చేత ఆజ్ఞ పొంది చేస్తున్నామా? లేదా ఎవరో ఒకరిని, లేదా కొంత మందిని సంతోషపెట్టడానికి తగినన్ని కార్యక్రమాలు తయారుచేస్తున్నారా? మరో ప్రక్కన కొరింథీ సంఘములాగా అంతా అస్త వ్యస్తంగా ఎవరికి తోచినట్టు వారు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా? విచ్చలవిడితనానికి దేవుని సంఘములో తావులేదు. అదే సమయములో ఏ మాత్రము స్వేచ్ఛ స్వాతంత్ర్యము లేకుండా నిర్ణయించిన రీతిగా ఆరాధించడము కూడా సరికాదు. ఈ రెంటి మధ్యలో మంచి సమతుల్యత రావాలి. దేవుని వాక్యమును తప్పనిసరిగా క్రమబద్ధంగా బోధించే బోధకులు సంఘ కాపరులు దేవుని కోసం లేవాలి! ఎవరెవరికి ఏ ఏ హెచ్చరికలు దేవుని ఆత్మ చేత ఇవ్వబడ్డాయో వారు నిర్భయంగా నిర్ద్వంద్వంగా నిశ్చయంగా ఆ బోధ, లేదా ప్రవచనమని పౌలు పిలిచే లేఖనములబోధన క్రమ బద్ధంగా సంఘాల్లోని ఆరాధనల్లో జరగాలి. భాషలలొ మాట్లాడేవారు కాని, లేఖనముల బోధన చేసేవారు కాని, దైవ భయము, దేవుని పరిశుద్ధతను ఘనపరుస్తూ, ప్రభువు సంఘము అంతా అభివృద్ధి, క్షేమము పొంది, ప్రతి విశ్వాసి తన విశ్వాసములో, బలపరచబడి, రూపాంతరం చెందుతూ యేసు క్రీస్తు ప్రభువు స్వరూపం మనలో ఏర్పడేవరకు శ్రమించాలి. ప్రభువును నమ్మకంగా సేవించాలి. అట్టి రీతిగా ప్రేమను పెంపొందించి, అందరూ యేసు క్రీస్తు ప్రభువును మిక్కుటముగా ప్రేమించే దేవుని పిల్లలుగా రూపాంతరం చెందాలనే గురితో పరిచర్య చేయాలి. దానికి అవసరమైనంత మహా కృప ప్రభువు మనలో ప్రతి ఒక్కొరికి, ఒక్కొక్కరికి ధారాళంగా సంఘపు శిరస్సు యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహించుగాక!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment