I కోరింథీ-54 14:10-22 June 5, 2023
భాషలకు ఉండవలసిన సరైన స్థానం-2
రేడియో వద్ద చేరిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసు నామములో శుభములు! మీ జీవితము అర్ధసహితంగా, సంతోషంగా,
సాగుతున్నట్టు అనిపిస్తుందా? అప్పుడప్పుడు మనమెదుర్కునే పరిస్థితులు ఎటు తోచనివిగా అనిపిస్తాయి. ఎటు
పోవాలో ఏమి చేయాలో తెలియనట్టుగా ఉంటుంది. అట్టి సమయాల్లో కావలసిఉంది శాంతి, నెమ్మది, సమాధానము.
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6,7 వచనాలు కంఠస్థం చేయండి, మళ్ళీ మళ్ళీ నెమరువేసుకొనండి, జ్ఞాపకం
చేసుకొనండి. ఇవిగో, ఇది దేవుని మాటలు: “6. దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన
విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7. అప్పుడు సమస్త
జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి
యుండును.” ప్రార్థన:
భాషలకు ఉండవలసిన సరైన స్థానము అనే అంశములోని రెండవ భాగమును అధ్యయనం చేద్దాం. రండి,
రేడియోకు దగ్గరగా వచ్చికూర్చోండి. భాషలకుండే సరైన స్థానం తెలుసుకోవాలంటే, భాషల విషయం లోతైన వివరణ,
స్పష్టత తెలుసుకోవడం అవసరం. ఈనాటి అంశం అదే.
I కొరింథీ 14:20-22
“20. సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.
21. అన్య భాషలు మాటలాడు జనులద్వారాను, పరజనుల పెదవులద్వారాను, ఈ జనులతో
మాటలాడుదును; అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో
వ్రాయ బడియున్నది.
22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమైయున్నవి. ప్రవచించుట
అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై యున్నది.
ఇక్కడ కొంచెం కఠినమైన విషయమును ఎదుర్కుంటున్నాము. ఎందుకంటే భాషల్లో మాట్లాడడం పరిశుద్ధాత్మలో
బాప్తిస్మమునకు గుర్తు అని కొందరి భావన. కాని సమతుల్యత ఉండాలని అపో. పౌలు ఉపదేశం. అవగాహన
చేసుకోవడములో ఎదగాలి. అవగాహన చేసుకోవడములో చిన్నపిల్లలలాగా ఉండకూడదు. కక్ష
కార్పణ్యాలవిషయములో, దుష్టత్వము విషయములో, ద్రోహము చేయడం,దుర్గుణముల విషయములో చిన్నపిల్లల్లాంటి
అమాయకత్వము నేర్చుకోండి. ఇతరులతో మన సంబంధాల్లో ఈ విధంగా జీవించాలని ప్రవర్తించాలని దేవుని వాక్యపు
హెచ్చరిక. అలాంటివి క్షణములో మర్చిపోవాలి. పగ, ఈర్ష్య, గిట్టనితనము, అసూయ, మత్సరము వీటికి చెందిన
భావాలను మనసులో పెంచి పోషించవద్దు. సమతుల్యతతో సమభావనతో, అన్నింటిలో అందరిలో ప్రేమ ముందుండి
మనలను నడిపించాలి. సత్యము ముందుకు సాగిపోవాలి. చాలామంది ఎందుకు వినరంటే, వినవద్దని
నిర్ణయించుకున్నారు కాబట్టి. ఒక పిల్లాడు ఆడుకుంటూ ఉంటే, తల్లి, తండ్రి పిలిచారు. వాడు అంటున్నదేమిటంటే, మా
అమ్మ పిలించింది కాని అది నాకు వినబడలేదులే. మనకు ఒక సామెత కూడా ఉందికదా! నిద్రపోయేవాళ్లను
లేపొఛుకాని, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళను నిద్రలేపలేము. చాలా సార్లు, చాలా సందర్భాల్లో మనకు మనమే
అడ్డుబండలు పెట్టుకుంటాము. కాబట్టి అర్ధం చేసుకోము. అవగాహనకు తావియ్యము.
భాషలు సూచనలు అని అపో. తేటపరుస్తున్నాడు. కాని ఫలవంతమైన, బలమైన సూచనలు కావు,
ఎందుకంటే, అవి ఆశ్చర్యమును కలిగిస్తాయి. విన్నవారు నివ్వెర బోతారు. ఒకవేళ దీన్ని బట్టి కొరింథీ సంఘములో
అందరూ భాషలు మాట్లాడాలని ఆశ పడ్డారేమో! ఒక మీటింగులో ఒక బోధకుడు భాషలు మాటలాడగా విన్నాడు. ఒక
వ్యక్తి ఆయనతో మాట్లాడుతూ “భాషలు మాట్లాడ్డం మీరు విన్నారా? ఎంత ఆశ్చర్యంగా ఉందికదూ?” అన్నాడు.
బోధకుడు అన్నాడు, “అవునా? మరి అందరికీ తెలుగు వచ్చుకదా! అదైతే అందరూ అర్ధం చేసుకునేవారు కదా”
అన్నాడు. అయితే మీరు భాషల్లో మాట్లాడరా? అన్నాడు. బోధకుడన్నాడు, “నేను మాట్లాడతానా, లేదా అనేది
విషయం కాదండీ, ఇక్కడున్న అందరికి తెలుగు వస్తుoది కదా, ఇక బాషల్లో మాట్లాడ్డం ఎందుకు?”
ప్రవచనం చెప్పడం విశ్వాసులకు సూచన. అనగా దీనిలో ఉండే నాలుగు అoశాలను గతములో స్పష్టం
చేశాము. వాటి ద్వారా సంఘము క్షేమపడుతుంది, ఆరోగ్యపడుతుంది, కట్టబడుతుంది. పౌలు బోధనలోని మూలాంశం
అదే! సంఘము అభివృద్ధి చెండాలి, కట్టబడాలి, క్షేమంగా ఉండాలి. అందుచేత సమస్త్యాత్మకమైనవి ఏవైనా ముందుకు
రాకూడదు. శ్రేష్టమైనరీతిగా ఉపయోగ పడేవాటిని వాడుకుందాం. పౌలు నిర్దిష్టంగా చెప్పే బోధ, గతించిన అధ్యయనాల్లో
మనము నేర్చుకున్నది కూడా అదే! ప్రవచనము యొక్క ముందస్థు ప్రాధాన్యత. భాషలు రెండవ ప్రాధాన్యత. భాషల్లో
మాట్లాడడం ఇతరులకు నేర్పించండి అనే హెచ్చరిక లేఖనాల్లో మనకెక్కడ కనిపించదు. భాషలు మాట్లాడ్డం కొందరు
ఇతరులకు నేర్పిస్తూ ఉంటారు. ఇదెక్కడైనా పరిశుద్ధ గ్రంధములో మనకు కనిపిస్తుందా? కాని భాషల్లో మాట్లాడేవారు
వాటి భావం చెప్పేవారున్నపుడే మాట్లాడాలి అనే షరతు మాత్రం లేఖనాలు స్పష్టంగా విధించింది. కాబట్టి పౌలు ఇస్తున్న
వివరణ ద్వారా, ప్రియ శ్రోతలూ, భాషలకున్న సరైన స్థానం మనకు తేటగా అర్థమవుతుంది.
భాషలకున్న సరైన స్థానం అనే అంశమును రెండు భాగాలుగా అధ్యయనం చేశాము కదా! మరో సారి జ్ఞాపకం
చేసుకుందాం. మొదటి భాగములో రెండు అంశాలు అధ్యయనం చేశాం. మొదటి అంశం భాషల్లో మాట్లాడడానికి ఉన్న
సరిహద్దు లేదా షరతు. భాషల్లో మాట్లాడే వ్యక్తి సంఘమునకు క్షేమము కలిగించే ఉద్దేశ్యముతో చేయాలి. ఆ మాటకొస్తే
సంఘములో ఏది చేసిన, ఎవరు చేసినా, సంఘమంతటి సంక్షేమo, ఆరోగ్యము, అభివృద్ధి, సవరణ, దిద్దుబాటు కోసమే
చేయాలి తప్ప వేరే ఉద్దేశం ఉండడానికి వీలులేదు. రెండవ అంశము భాషలను గ్రహించడం, సముచితంగా
వినియోగించడం. దేవుని శరీరమైన సంఘములో ఇవి అత్యవసరం కావని లేఖనముల సారాంశం. మీ వ్యక్తిగత
అభిప్రాయం వేరుగా ఉంటే దానికి మీరే బాధ్యులు. లేఖనములను జాగ్రత్తగా, తెరిచిన మనసు హృదయముతో
అన్వేషించండి. వ్యక్తిగత సంక్షేమం, అభివృద్ధి, ఎదుగుదల కోసం వినియోగించుకోవచ్చు. మూడవ అంశం, భాషల
విషయములో స్పష్టత, లోతైన వివరణ. భాషల ఉద్దేశం అవిశ్వాసులకు సూచనగా ఉండడం. భాషల్లో మాట్లాడడం
తప్పనిసరిగా అవిశ్వాసులను విశ్వాసములోనికి నడిపిస్తాయని చెప్పలేము. ఆ సందర్భములోనే అపో. పౌలు ఒక
అవిశ్వాసి సంఘపు సమావేశములోనికి వచ్చినపుడు అతడికి అర్ధం కాదు, కాబట్టి ఏ విధంగా అమెన్ అని చెప్పగలడు
అనే ప్రశ్న అడిగాడు. ప్రియ శ్రోతలూ, దయ చేసి మీలో ప్రతి ఒక్కరూ లేఖనములోని బోధను, హెచ్చరికలను,
సిధ్ద్ధాంతములను సరిగా అర్ధం చేసుకోవాలని మీలో ప్రతి ఒక్కరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇది విమర్శ కోసం
కాదు, ఎవరినికూడా కించపరచడానికి కాదు. బాధ పెట్టడానికి అంతకూ కాదు. మనమందరము మంచి అవగాహనతో
అర్ధం చేసుకొని, లేఖనములను పరిశోధించి ఎవరి విశ్వాసమును వారు వృద్ధి, చేసుకోవాలనే మా భారము, ప్రార్థన.
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...
No comments:
Post a Comment