I కోరింథీ-57 14:34-36
ఆదర్శమైన దేవుని సంఘం
అందరికి యేసు రక్షకుని మధురమైన నామంలో శుభములు! ఈ వారమంతా ఎలా గడిచింది? ఎన్నెన్ని ఒడుదుడుకులు, బాధ కలిగించే సమస్యలు, వేదనలు, ఇక్కట్లు అనుభవించి ఉండవచ్చు. జీవితములో ప్రతి పరిస్థితిలో మనకు కావలసిoది జ్ఞానము, వివేకము. అంటే అదేదో ఒక వస్తువని అపోహ పడుతూ ఉంటాము. దేవునికి పుట్టిన నిజమైన కుమారులు కుమార్తెలు దేవుని వాక్యమువలన, పరిశుద్ధాత్మునివలన జ్ఞానము, బుద్ధి ప్రతి పరిస్థితిలో నిజముగా ఆయనమీద ఆధారపడే వారు పొందగలరు. ప్రార్థన: ఒకరు మరొకరితో అన్నారు, “నేను ఆదర్శమైన పరిపూర్ణమైన సంఘమును చూడలేదు కాబట్టి, నేను క్రైస్తవుడను కాలేదు.” జవాబు ఏమని వచ్చింది? “ఆ పరిపూర్ణమైన లోపములేని సంఘమును మీరు కనుక్కున్నపుడు అందులో చేరకండి” అసలు విషయమేంటో బోధపడిందా? ఆ వ్యక్తి అందులో చేరితే అది లోపములేని పరిపూర్ణమైన సంఘముగా ఉండదన్న మాట! ప్రతి సంఘములో కొన్ని మంచి గుణాలు, మరికొన్ని చెడు గుణాలు, ఉంటాయి. అవి ఆ సంఘములో ఉన్నవారికి తెలుస్తాయి. ఏవి ఎక్కువ ఉంటాయి? మీరున్న సంఘములో మంచి ఎక్కువ ఉన్నాయని ఆశిస్తున్నాము. ఎందుకు ఈ భేదము కనిపిస్తుంది అని ఆలోచిస్తే, అందులో ఉన్నవారందరు మానవ మాత్రులు కాబట్టి అని గ్రహించాలి. మానవులతో ఉన్న ఏ వ్యవస్థ అయినా వారి వల్ల ఉండే మంచి చెడు గుణాలు ఆ సంఘములో కనిపిస్తూ ఉంటాయి. మనమంతా క్రైస్తవ విశ్వాసములో ఉన్నపటికి, మన బలహీనతలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కొరింథీ 14:34-40 వచనాల్లో అపో. పౌలు ఆదర్శమైన పరిపూర్ణమైన సంఘము ఎలా ఉండాలో వివరించాడు. ఈ శీర్షికన మూడు అంశాలు అధ్యయనము చేయనున్నాము. ఈలాంటి సంఘమునకు కొన్ని గుర్తులు ఈ లేఖన భాగములో అపో. స్పష్టపరిచాడు. మొదటిది, సంఘములో స్త్రీల స్థానము, పాత్ర, బాధ్యత. “34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. 35. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.
“స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను” అని చెప్తూ చాలా కఠినమైన మాట చెబుతున్నాడు. వారు సంఘములో భాగమే, సంఘములో ఉన్నారు, కాని, క్రింది స్థాయిలో ఉండమని చెబుతున్నారు. ఇదే పత్రిక 11:2-16లో ఏ విధంగా స్త్రీలు ప్రార్ధించవచ్చో, ప్రకటించవచ్చో బోధించారు. అది కేవలము ఇంటికి పరిమితము కాదు. ఆ మాటలు సంఘమునకు కూడా వర్తించవచ్చు. స్త్రీలు ముసుగు లేకుండా ప్రార్ధించవద్దు, ప్రవచించవద్దు అని మాత్రం స్పష్టపరిచాడు. ప్రస్తుతం మనము అధ్యయనం చేస్తున్న 14వ అధ్యాయములో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలని హెచ్చరించాడు. ఆయన ఎందుకిలా బోధించాడో కొంచం ఆలోచించి ధ్యానిస్తే అర్థమవుతుంది. ఒకవేళ స్త్రీలు సహజంగా భావోద్రేకాలకు కాస్త ఎక్కువ లోనవుతారని మూల కారణం కావచ్చు. పురుషులకంటే స్త్రీలు ఎక్కువ భావోద్వేగాలతో ఉంటారు. అప్పుడప్పుడు విపరీత ధోరణి, తీవ్రతలకు లోనవుతారేమో! 26వ వచనములో ఆయన బోధించిన పరిస్థితులలో విపరీతమైనవి కలుగవచ్చేమో అని భావము. 26వ వచనం “సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు.” ఇవి జరుగుతున్నపుడు స్త్రీలు ఏదైనా చేయవచ్చని పౌలు భావించాడేమో. అందుచేత ఆయన స్త్రీలు తమ భర్తతో మంచి సంబంధం కలిగియుండి భర్తతో మాట్లాడవచ్చని బోధిస్తున్నాడు. దీనిలో ఇమిడిఉన్న అర్ధం ఏమిటంటే, కుటుంబమునకు పురుషుడు శిరస్సు, లేదా నాయకుడు, బాధ్యుడు. కుటుంబము గూర్చి ఆది నుండి దేవుని హెచ్చరిక, ఆజ్ఞ ఏమిటి? ద్వితీ. 6:4-6 గమనించాలి. “4. ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. 5. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. 6. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను.”దేవుని ఆజ్ఞ ప్రకారము కుటుంబములో కుటుంబ ఆరాధన ప్రార్థన అనే బలిపీఠమును కలుగచేసి, దాన్ని ప్రతి దినం నెరవేర్చే భాద్యత తండ్రి లేదా పురుషునిదే. వింటున్న తండ్రులారా, ఈ భాద్యతను ఇంతవరకు మీరు చేయకపోయి ఉండవచ్చు. మించి పోయింది లేదు. హృదయ పూర్వకంగా ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపపడి, క్షమాపణ వేడుకొని, ఈరోజే ప్రారంభించండి. యేసు క్రీస్తు ప్రభువు పరిపూర్ణంగా క్షమించి శుద్ధిచేస్తాడు. కాని, ఈ దినం మీరు, నేను చేస్తున్న ఈ నిబంధనను అతి జాగ్రతగా నమ్మకంగా నెరవేర్చాలి. దేవునిసన్నిధిలో ఆయనతో చేసిన నిబంధనను చులకనగా తీసుకుంటే ఆయన శిక్ష తప్పదు. ఇప్పటికే ఎక్కువ శాతము క్రైస్తవ కుటుంబాలలో తల్లులు ఇది చేస్తున్నారు. ప్రభువు న్యాయపీఠము వద్ద తండ్రులమైన మీరు, నేను నిలువబడ్డపుడు, యేసయ్య లెక్క అడిగేది తల్లిని కాదు, అని దయచేసి గమనించండి. తల్లి భాద్యత, పని, పరిచర్య వేరు. తల్లి తప్పనిసరిగా తండ్రితో సహకరించాలి, తండ్రి చేస్తున్న వాక్యబోధన క్రమములతో ఆమె కూడా అదే రీతిగా చేయవలసిన సమయములో, అనగా తండ్రి అందుబాటులో లేనప్పుడు చేయవచ్చు, కాని భాద్యత తండ్రిది. లెక్క దేవునికి అప్పగించవలసింది తండ్రి. ఈ సత్యమును మనమంతా దీనమనసుతో, వినయముతో దేవుని మాటకు విధేయత చూపడానికి ముందుకు అడుగు వేద్దాము. ఒక ప్రముఖ బైబిల్ వ్యాఖ్యాత, పండితుడు ఏమని బోధిస్తున్నాడో గమనిస్తే మనకు ఇంకా ఎక్కువ వెలుగు కలుగుతుంది. జాగ్రతగా వినండి, తండ్రులూ! స్త్రీ ఇంట్లో భర్త వద్ద నేర్చుకోవాలని ఎంత బలముగా లేఖనము ఆదేశిస్తుందో, అంతే బలముగా నేర్పించే శక్తి సామర్ధ్యం పరిశుద్ధాత్మ ద్వారా భర్త కలిగిఉండాలని లేఖనము ఆదేశిస్తుంది. ఆమెలో కలిగే ప్రశ్నలకు, సందేహాలకు భర్త జవాబిచ్చే స్థాయికి ప్రతి భర్త ఎదగాలి. ఆలాంటి ఆతురత, భారము భర్తలో ఉండాలని దేవుని ఉద్దేశం. సంఘములో స్త్రీ మాట్లాడడం అవమానమైనపుడు, ఆమెకు కలిగే సందేహాలు, ప్రశ్నలకు ఆమె భర్త తగిన జవాబు, సమాధానం ఇవ్వకుండా మౌనముగా ఇంటిలో ఉన్నట్లయితే అది భర్తకు అవమానము. ఈ విధమైన హెచ్చరిక ఇవ్వడానికి మూలకారణము ఉన్నది. “వారు లోబడియుడవలసినదేగాని” అనే మాటలు 34వ వచనములో ఉన్నవి. భర్త అధికారము క్రింద భార్యను దేవుడు ఉంచాడు. ప్రభువు సృష్టించినపుడు నియమించిన స్థానముల ప్రకారము జీవించాలి. అది తప్పినపుడు అవమానమే అవుతుంది. ఈ మాటలు అపో. పౌలు ఆ దినములకు, ఆ సంస్కృతిలో ఉన్న పరిస్థితులనుబట్టి వ్రాసినప్పటికి, దేవుని సృష్టి క్రమము ప్రకారము, ఎవరి స్థానములో వారు ఉండి, ఎవరికి అప్పగించబడ్డ పని, భాద్యతలు వారు చేసి ప్రభువును మెప్పించాలి. మాట్లాడడము అంటే బోధించడము ద్వారా, పెత్తనము చేయడమని అర్ధం. ఆ దినాల్లో దేవుని లేఖనములను బోధించేవారికి నాయకత్వము అప్పగించబడేది. ఎప్పుడైతే స్త్రీ వాక్య బోధన చేస్తుందో, అప్పుడు ఆమెకు ఒక నాయకత్వపు స్థానం ఉన్నట్టు. అది కూడా సంఘములో అనగా పురుషులు స్త్రీలు కలిసి ఉన్న సంఘపు సమావేశాల్లో స్త్రీలు వాక్య పరిచర్య చేయడాన్ని అపో. పౌలు ఖండించడం ఇక్కడ మనమంతా గమనించవలసిన విషయం. ఇతర స్త్రీల సమావేశాల్లో, కుటుంబాల్లో, అలాంటి వాటిల్లో స్త్రీలు వాక్యపరిచర్య చేయడం ఎంత మాత్రము అవమానము కాదు, సరికదా, అది మంచిది. ఆమోదించి ఆనందించవలసిన విషయం. దేవుని పరిశుద్ధ సంఘము ఆదర్శ ప్రాయముగా ఉండాలంటే సరియైన స్థానములో ఎవరి స్థానములో వారు ఉండి, ఏ విధంగా ప్రభువు తన లేఖనాల్లో క్రమము ఏర్పాటు చేశారో, ఆ విధంగా ఉండడం ఆదర్శమైన సంఘము. ప్రతి కుటుంబములో భార్య భర్తలు వారి భాద్యతలు నెరవేర్చి ప్రభువునకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి అవసరమైనంత కృప ప్రభువు మనకందరికి అనుగ్రహించుగాక!
I కోరింథీ-56 14:29-33
అర్థవంతమైన సామూహిక సంఘ దైవారాధన-2
రేడియోదగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు ప్రభువు సర్వాధికారముగల నామములో శుభములు! ఈ దినాల్లో
మనము చేస్తున్న బైబిల్ అధ్యయనాలు కొన్ని ప్రకంపనలు, యోచనలు మీలో కలిగించవచ్చు. ప్రేమతో అందరిని
ఆదరించడం, ధైర్యపరచి బలపరచడం దేవుని పిల్లలుగా మనమంతా పాటించినపుడు అభిప్రాయాల్లో భేదాలున్నా,
ప్రేమలో మనమంతా కలిసి ఉండాలి. ప్రార్థన:
అర్థవంతమైన సంఘపు దైవారాధన ఎలా ఉండాలి అనే అంశమును అధ్యయనం చేస్తున్నాము కదా! జీవముగల
దేవుని సంఘము ప్రభువును ఆరాధించడానికి ఉండే అవసరతలు, సర్దుబాట్లు ఇంతవరకు నేర్చు కొన్నాం. ఈ దినం
ఆలాంటి దైవారాధన జరగడానికి ఏ నియమకాలు, ఏర్పాట్లు చేయాలో అధ్యయనం చేద్దాం. రండి రేడియోకు దగ్గరగా
వచ్చి కూర్చోండి.
I కొరింథీ 14: 29-33 వచనములు.
“29. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను.
30. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.
31. అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.
32. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.
33. ఆలాగే పరిశుద్ధుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
ఇంతవరకు భాషల్లో మాట్లాడడానికి ఉన్న విధులు, విధానాలు అధ్యయనం చేశాం, ఇప్పుడు ప్రవచనం చెప్పేటపుడు చేయవలసిన విధులు, విధానాలు తెలుసుకుందాం. ప్రవచనాలు చెప్పేవారు కూడా ఇద్దరు లేక ముగ్గురికి మించకూడదు. గమనించారా? ఈనాడు ఈ విధంగా ఇద్దరు లేదా ముగ్గురు బోధించడం మనము ఎక్కడా చూడము. సంఘ ఆరాధనాల్లో ఒక పాస్టర్ లేదా సంఘ పెద్ద, లేదా సంఘ కాపరిఆరాధనలో ఆయన వాక్య బోధన లేదా పౌలు మాటల్లో చెప్పాలంటే ప్రవచనo చెప్తాడు. కొరింథీ సంఘములో ఎక్కువ మంది బోధకులు ఉన్నట్టు, అందరూ ప్రవచనం చెబుతున్నట్టు ఇక్కడ చదువుతున్నాం కదూ! ఒకవేళ ఒక వ్యక్తి బోధిస్తున్నపుడు మరొక బోధకునికి ఏదైనా బయలుపడితే ఆ మొదటి బోధకుడు ఆపేయాలి. ఆ వ్యక్తి చెప్పేది వినాలి. వివేచించాలి. అప్పటికే మాట్లాడుతున్న వ్యక్తి మౌనంగా ఉండాలి. “అందరూ నేర్చుకొనునట్లును” అనే ప్రశస్తమైన మాటలను అతి జాగ్రతగా గమనించాలని శ్రోతలందరినీ ప్రేమతో బ్రతిమాలుతున్నాను. బోధించే వారు, వినేవారు అందరు నేర్చుకోవాలి. ఈనాడు మన సంఘాల్లో వాక్యబోధన, ప్రవచనం చెప్పడం ముగించిన తరువాత ఎవరికి ఏమని బోధపడింది, ఎవరికి ఏ ప్రశ్నలు ఉన్నాయి ఎవరికి తెలియదు. మనకు రేడియోలో ఈ అవకాశం లేదు కాని, మీకేమైనా ప్రశ్నలు, సందేహాలు కలిగినట్లయితే ఉత్తరం ద్వారా కాని, వ్హాట్సప్ లో మెసేజ్ కాని, మాట ద్వారా కాని, వ్రాసి కాని తెలియచేయండి. వాటికి సమాధానాలు లేఖనాల్లోనుండి తెలియపరుస్తాము. బైబిల్ పఠన సమయము సంఘాల్లో కూడా ఉండాలి. వ్యక్తిగత సమయములో కూడా బైబిల్ పఠన సమయము ఉండాలి. అందరు కలిసి ఉండే సమయాల్లో దేవుని వాక్యమును కలిసి పఠించి అధ్యయనం చేసే సమయoలో ప్రతి ఒక్కరు వారి తలంపులు, సాక్ష్యాలు, తెలియపరచవచ్చు. ఒకరికి ప్రశ్న కలిగితే మరొకరు సమాధానం చెప్పవచ్చు. కాని అన్నింటిని లేఖనాల్లోఉన్న సత్యం ఆధారంగా మాత్రమే మాట్లాడుకోవాలి. పోటీతత్వమునకు తావులేదు. అందుకే పౌలు అంటున్న మాటలు గమనించాలి. 32వ వచనము “ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.” అంటే ఏమిటి? లేఖనాలను బోధించేవారు వారిని వారి ఆధీనములో ఉంచుకోవాలి. నిగ్రహశక్తి, ఆశనిగ్రహము కలిగిఉండి, సామరస్యంగా, సావధానంగా మాట్లాడుకోవాలి. జాగ్రత సుమీ! అందరినీ కట్టడం, అభివృద్ధి చెందేలా చూడడం, మన పిలుపు, భాద్యత అని మర్చిపోవద్దు. మన సహోదరులను, సహోదరిలను ప్రేమతో, జాగ్రతతో, ప్రభువులో వారు బలపడేలా చూడడం మనలో ప్రతి ఒక్కరు చూడాలి.
ఈనాటి మన సంఘాల్లో ఇంతటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నాయా? ప్రార్థన మందిరాల్లో, సంఘాల్లో త్రియేక దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారు పరిశుద్ధాత్మ ప్రేరణతో హృదయపూర్వకంగా వారి రక్షకుణ్ణి ఆరాధిస్తున్నారా? ఎవరిని వారు ప్రశ్నించి చూచుకొని, పరీక్షించుకోవలసిన సమయం ఆసన్న మయిందేమో! పట్టణాల్లో సంఘాల్లో అంతా ముందే ఏర్పాట్లు చేసుకొని, ఆరాధన జరిగే రెండు, మూడు గంటల సమయములో ఎవరు ఏమి చేయాలో ముందే నిర్ణయించుకుంటారు. అదంతా దేవుని సంకల్పము, ప్రణాళిక ప్రకారం, సంఘపు శిరస్సు అయిన యేసు క్రీస్తు ప్రభువు చేత ఆజ్ఞ పొంది చేస్తున్నామా? లేదా ఎవరో ఒకరిని, లేదా కొంత మందిని సంతోషపెట్టడానికి తగినన్ని కార్యక్రమాలు తయారుచేస్తున్నారా? మరో ప్రక్కన కొరింథీ సంఘములాగా అంతా అస్త వ్యస్తంగా ఎవరికి తోచినట్టు వారు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా? విచ్చలవిడితనానికి దేవుని సంఘములో తావులేదు. అదే సమయములో ఏ మాత్రము స్వేచ్ఛ స్వాతంత్ర్యము లేకుండా నిర్ణయించిన రీతిగా ఆరాధించడము కూడా సరికాదు. ఈ రెంటి మధ్యలో మంచి సమతుల్యత రావాలి. దేవుని వాక్యమును తప్పనిసరిగా క్రమబద్ధంగా బోధించే బోధకులు సంఘ కాపరులు దేవుని కోసం లేవాలి! ఎవరెవరికి ఏ ఏ హెచ్చరికలు దేవుని ఆత్మ చేత ఇవ్వబడ్డాయో వారు నిర్భయంగా నిర్ద్వంద్వంగా నిశ్చయంగా ఆ బోధ, లేదా ప్రవచనమని పౌలు పిలిచే లేఖనములబోధన క్రమ బద్ధంగా సంఘాల్లోని ఆరాధనల్లో జరగాలి. భాషలలొ మాట్లాడేవారు కాని, లేఖనముల బోధన చేసేవారు కాని, దైవ భయము, దేవుని పరిశుద్ధతను ఘనపరుస్తూ, ప్రభువు సంఘము అంతా అభివృద్ధి, క్షేమము పొంది, ప్రతి విశ్వాసి తన విశ్వాసములో, బలపరచబడి, రూపాంతరం చెందుతూ యేసు క్రీస్తు ప్రభువు స్వరూపం మనలో ఏర్పడేవరకు శ్రమించాలి. ప్రభువును నమ్మకంగా సేవించాలి. అట్టి రీతిగా ప్రేమను పెంపొందించి, అందరూ యేసు క్రీస్తు ప్రభువును మిక్కుటముగా ప్రేమించే దేవుని పిల్లలుగా రూపాంతరం చెందాలనే గురితో పరిచర్య చేయాలి. దానికి అవసరమైనంత మహా కృప ప్రభువు మనలో ప్రతి ఒక్కొరికి, ఒక్కొక్కరికి ధారాళంగా సంఘపు శిరస్సు యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహించుగాక!
I కోరింథీ-55 14:23-28
అర్థవంతమైన సామూహిక (సంఘ) దైవారాధన-1
మీరు ప్రభువును ఆరాధించడానికి సంఘ సహవాసానికి వెళ్ళారా? ఆ సహవాసము మీకు మేలు చేస్తుందా? అక్కడ మీరు ఆనందముతో సంతోషముతో ఉన్నారా? దేవుని ఉద్దేశం సంఘముగా, దేవుని కుటుంబముగా విశ్వాసులు, అనగా ఆయన కుమారులు కుమార్తెలు ఆయనను మనసారా ఆరాధించి ప్రేమించడం. ఈ సత్యము లేఖన భాగము చెప్పినంత ఘనంగా ఎవ్వరూ చెప్పలేరు. హెబ్రీ. 10:23-25 గమనించండి: “23. వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. 24. కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, 25. ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” ప్రార్థన:
లేఖన భాగమును గమనించండి, “సమాజముగా కూడుకొనుట” అవసరం. ఎక్కడ కూడుకునేది ముఖ్యముకాదు. అక్కడ ఏమి చేస్తున్నాము? దేవుని సమాజమునకు ఏమి జరుగుతుంది? ఇవి ప్రాముఖ్యమైన సంగతులు. ఒకవేళ మీరున్న గ్రామములో చాలా కొద్ది మంది కావచ్చు. ఎందరు అనేది ముఖ్యము కాదు, విశ్వాసులు కూడుకుంటున్నారా? లేదా ఆచారముకోసం, ఆదివారము కనుక వెళుతున్నారా? మతపు ఆచారాలు దేనికి పనికిరావు. మీలో చాలామంది మీకు ఈ రేడియో బైబిల్ అధ్యయనాలు, ధ్యానాలు ఎంతగా దీవెనకరంగా ఉన్నాయో తెలుపుతూ ఉన్నారు. మేము దేవునికి మిమ్ములనుబట్టి మన మహాదేవుడైన యేసు క్రీస్తు ప్రభువునకు విస్తారమైన స్తోత్రము, ఘనత, మహిమ చెల్లిస్తూ ఉన్నాము. మీరు నేర్చుకున్నవి, వాటిని బట్టి మీ జీవితము, ప్రవర్తనలో కలిగిన మార్పు ఒక సాక్ష్య రూపములో మీ సంఘ సహవాసములో పంచుకొనండి. మాతో కూడా ఆ సాక్ష్యమును పంచుకొనండి.
అర్థవంతమైన, సార్ధకమైన సంఘపు దైవారాధన జరగడానికి కొన్ని అవసరతలు అపో. తేటపరుస్తూ ఉన్నాడు. మొదటిది, ఒకరికి మరొకరితో సంభాషణ, సహవాసము, సమాచారము, సంబంధము అవసరము. లేఖన భాగము I కొరింథీ 14:23-25.
“23. సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాటలాడుచుండగా, ఉపదేశము
పొందనివారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చినయెడల, మీరు వెఱ్ఱిమాట లాడుచున్నారని అనుకొందురు కదా?
24. అయితే అందరు ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినయెడల, అందరి బోధవలన తాను పాపినని గ్రహించి, అందరివలన విమర్శింపబడును.
25. అప్పుడతని హృదయరహస్యములు బయలుపడును. ఇందు వలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురముచేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును.”
సంఘమంతా సమావేశమై ఉన్నపుడు అందరూ ఒకటే సారి భాషలు మాట్లాడితే అప్పుడే వచ్చిన క్రొత్త వ్యక్తి ఏమనుకోవాలి? “మీరు వెఱ్ఱిమాట లాడుచున్నారని అనుకొందురు కదా?” అనే మాటలు జాగ్రతగా గమనించాలి సుమా? అందరూ ఒక్కటే సారి భాషల్లో మాట్లాడుతూ ఉంటే, సహవాసానికి, సంభాషణకు, సమాచారానికి, సంబంధానికి స్థానము ఉండదు. అవకాశము లేదు. ఇవి జరగాలంటే అందరూ ఒకే భాషలో మాట్లాడాలి.
సామూహిక దైవారాధన సమావేశాల్లో మాట్లాడేవారు అందరికి అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తు ఈభూమ్మీద జీవించినపుడు సాధారణమైన భాషలో మాట్లాడినాడు. జన సమూహాలు ఆయన మాటలు వినాలని సముద్రప్రాతంనుండి, అన్ని ప్రాంతాలనుండి తరలివచ్చే వారు. ప్రవచనం చెప్పడమంటే, మేలు, ధైర్యం, ఆదరణ, బోధ, దీవెన కలిగించే మాటలు, అభివృద్ధి, సవరణ, దిద్దుబాటు కలిగించే బోధ చేయడం. అందరూ ఇది చేస్తే ఒకే భాషలో మాట్లాడుతారు. దేవుని శరీరములోని అవయవములైన మనమంతా మేలు పొందుతాము. ఈ కారణంగా రేడియోలో చెప్పే ఈ బోధ లేదా పౌలు భాషలో చెప్పాలంటే, ప్రవచనం, సాధారణమైన భాషలో అందరికి అర్థమయ్యే రీతిగా, సులభమైన శైలిలో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. తద్వారా మనము విన్న సత్యాలు దైనందిన జీవితానికి అన్వయించుకోగలము. ప్రవచనం చెప్పడమంటే ఇతరుల జీవితాలను, విశ్వాసమును, బలపరిచి స్థిరపరిచి కట్టే ఉపదేశం, హితబోధ, వాక్యోపదేశం చేయడం. విన్న ప్రతి శ్రోత రేడియోలోనైనా, మన దైవారాధాన సమయాల్లోనైనా, వారి జీవితానికి దేవుని వాక్యమును అన్వయించుకోవడం అర్ధం చేసుకున్నపుడే సాధ్యం. ప్రవచనపు ఉద్దేశం దేవుని ప్రజలు ప్రభువును ఆరాధించాలి. అందుచేత అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. సంభాషణ, సహవాసం, సమాచారం, సంబంధాలు అన్ని జరగాలంటే ఒకే భాషలో చెప్పడం అవసరం.
రెండవ అవసరత సర్దుబాట్లు, వొదుగుదల, రాజీ పడడం, ఇమిడి ఉండడం. I కొరింథీ 14:26-28 వచనాలు.
“26. సహోదరులారా, యిప్పుడు మీలో ఏమి జరుగు చున్నది? మీరు కూడి వచ్చునప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు; మరియొకడు భాషతో మాటలాడవలెనని యున్నాడు; మరియొకడు అర్థము చెప్ప వలెనని యున్నాడు. సరే; సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనియ్యుడి.
27. భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్ప వలెను.
28. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని, తనతోను దేవునితోను మాటలాడుకొనవచ్చును.
26వ వచనము గమనిస్తే పౌలు కొన్ని వేరు వేరు అభ్యాసాలు, ఏర్పాట్లు దేవుని సంఘమునకు బోధిస్తు న్నాడు. సంఘపు సమావేశములలో ఒకరు పాట పాడాలని, మరొకరు బోధించాలని, మరొకరు ఒక క్రొత్త విషయము బయలు పరచాలని ఆశపడుతున్నారు. ఇవన్ని ఒక్కటే సారి జరిగితే ఎంత గందరగోళంగా ఉంటుందికదా! ప్రతి ఒక్కరూ, అందరూ ఒకేసారి తాను చేయాలని తలపెట్టింది చేస్తున్నారు. ఎవరికి ఏదీ అర్ధం కాదు. ఎవరికి ఏ మేలు కలగదు. పౌలు బోధించింది ఏమిటి? అన్ని కార్యాలు అందరికీ మేలు దీవెన, సవరణ, దిద్దుబాటు కలగడానికి చేయాలని. ఈ పరిస్థితుల్లో ఎవరు ఏ మేలు, దీవెన పొందగలరు? ఆలోచించండి. అప్పుడది ఆరాధన కాదు, అది ఒక పోటీలు పెట్టుకునే సమయము లాగా ఉంటుంది. అందుచేత పౌలు సమస్తము ఇతరులను, అందరినీ కట్టడానికి అన్నిచేయమని బోధించాడు.
ఆ తరువాత పౌలు ఎవరైన మాట్లాడితే, ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే చేయమని హద్దులు విధించాడు. అర్ధము చెప్పేవారు లేకపోతే భాషల్లో మాట్లాడేవారు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. ఆ వ్యక్తి తనకు తానే మాట్లాడుకోవచ్చు, దేవునితో మాట్లాడుకోవచ్చు. దైవారాధన సమయములో పోటీలు పెట్టుకోవడానికి వీలు లేదు. భావము, అర్ధం చెప్పేవారు ఉంటే సరే, భాషల్లో మాట్లాడేవారు మాట్లాడవచ్చు. అర్ధం చెప్పేవారు లేనట్లయితే భాషల్లో మాట్లాడేవారు మౌనంగా తనలో తాను భాషల్లో మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే భాషల్లో మాట్లాడే వ్యక్తి మనసుతో మాట్లాడడు. ఆత్మలో మాట్లాడుతూఉంటాడు. ఆయన మనసుకు అది అర్ధo కాదు. ఎవ్వరిని బాధపెట్టే ఉద్దేశం లేదు. కించపరిచే తలంపులే లేవు. కాని, మీకు అర్ధం కాని భాషలు మాటలు అందరిముందు చెప్పడం సమంజసం కాదు. భావ్యము అంతకూ కాదు. కాబట్టి, శ్రోతలూ, సర్దుబాట్లు, సయోధ్యలు, రాజీలు, వొదుగుదల జరగాలి.
జీవము గల దేవుని పరిశుద్ధ సంఘము సమావేశమైనపుడు దైవారాధన చేసే సహోదరులు, సహోదరిలు అర్థవంతంగా, సార్ధకంగా ప్రభువును ఆరాధించడానికి అనుకూలమైన వాతావరణం ఉండేలా చూడడం సంఘ నాయకులు, కాపరుల ఆత్మీయ బాధ్యత. ఈ రెండు అవసరతలు గమనించి అవి తీర్చాలి. సంభాషణ, సహకారము, సమాచారము సంబంధాలు సంఘపు విశ్వాసులకు కలిగేలా చూడాలి. రెండవది, సర్దుబాట్లు, వొదుగుదల, రాజీ పడడం, ఇమిడి ఉండడం జరిగేలా చూడాలి. ఈ మహా కఠినమైన భాద్యత నెరవేర్చడానికి, సంఘపు నాయకులకు, దేవుని సంఘములో అవయవములైన ప్రతి ఒక్కరికి సంఘపు శిరస్సు అయిన యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహించు గాక!
> II Cor-15 2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...