I కోరింథీ-50 14:1-3
ప్రవచనం అనే మాటకు నిర్వచనం
మహా పరిశుద్ధుడు, యేసు క్రీస్తు ప్రభువు నామములో మీకoదరికీ శుభములు! రోమా పత్రిక అధ్యయనా లన్నీ
పుస్తక రూపములో ముద్రణ జరుగుతూ ఉంది. ప్రార్థించండి. చాలా సమయము ఖర్చు పెట్టవలసి వస్తుంది. చాలా
ఆర్ధికమైన భారముకూడా ఉన్నది. దైవచిత్తమైతే, త్వరలో ప్రెస్ లో నుండి బయటికు వచ్చి అందుబాటులోనికి
వస్తుందని ఆశిస్తున్నాము.
కొరింథీ పట్టణములోని సంఘపు చరిత్రను పరికించి చూస్తే అందులో చాలా కలతలు అల్లకల్లోలములు కలిగిన
సంఘమని తెలుస్తున్నది. దాని ఆరంభములోనే వ్యతిరేకించిన యూదులు ఈ సంఘమును స్థాపించిన అపోస్తలులను
గల్లియోను అనే న్యాయాధిపతి వద్దకు చేత ఈడ్చిన సంగతి అ. కా. 18:12లో వ్రాయబడింది. నుండి. కాని గల్లియోను
14,15 వచనాల్లోని మాటలతో ఆ కేసును వినటానికి నిరాకరించాడు. ఏమన్నాడు? అ.కా. 18:14,15 “పౌలు నోరు తెరచి
మాట లాడబోగా గల్లియోను యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను
మీమాట సహనముగా వినుట న్యాయమే. 15. ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన
వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో
చెప్పి 16. వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను.” ఈ హింసాత్మక అల్లరి వెనుక ఏమి దాగి ఉందో
తెలుసుకోవడం అవసరం. కొందరు కొన్ని విషయాలని ఎంతో జాగ్రతగా భావించి ఎంతో శ్రద్ధతో చూస్తారు. మరి కొందరు
దేన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు వారు నమ్మినదాన్ని ఎంతో గట్టిగా
నమ్ముతారు. ఈ రెండు అభిప్రాయాలు సరికాదు కాని, దేని ప్రాముఖ్యత దానికి ఇవ్వడం మంచిది. అదే సమయములో
కొన్ని విశ్వాసాలకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని నా అభిప్రాయం. మీరు నమ్మినదాన్ని నమ్మండి. క్రొత్త
సత్యం తెలిసినపుడు దాన్ని లెక్కలోనికి తీసుకోవాలి. కాని, తెలిసిన ప్రతి సత్యము, సత్యముగా కనిపించినా,
అనిపించినా, అది సత్యము కాదు. I కొరిoధీ 14 లోని సారాంశము కొంతమేర వివాదాస్పదమైంది. కొన్ని సంఘాలను
విడదీసింది. కాని సరిగ్గా అర్ధం చేసుకుంటే, అంతపని జరగనవసరం లేదు. ఈ రానున్న మూడు అధ్యయనాలను ఒక
శీర్షిక క్రింద అధ్యయనం చేద్దాం. శీర్షిక పేరు ప్రవచనము యొక్క ముందస్తు ప్రాముఖ్యత. ఈ పూట మొదటి 3 వచనాలు
అధ్యయనం చేద్దాం.
ఈనాటి ధ్యానాంశం: ప్రవచించడం అనే మాటకు నిర్వచనం.
1. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.
2. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు; మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకు చున్నాడు.
3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు.
సర్వ సాధారణంగా ప్రవచనం అనగానే మనమంతా ఆలోచించేది జరగబోయేది. పరిశుద్ధ గ్రంధ బైబిల్లో జరగబోయేది ప్రవచించిన వందలాది ప్రవచనాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు గమనించుదాం. తెరిచిన బైబిల్ తో మీ నోట్ బుక్ పెన్ తో సిద్ధంగా ఉండండి. ఆది. 17:19.
19. దేవుడు -- నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను.
ఈ ప్రవచనం నెరవేరిందని మనకు తెలుసు. ఆది. 21:1-2 గమనించండి:
1. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారాను గూర్చి చేసెను.
2. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను.
మరో ఉదాహరణ చూద్దాం. దేవుడు ఏలీయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ I రాజులు 17:1 లో ఒక ప్రవచనం చెప్పాడు:
“1. అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.”
ఈ ప్రవచనం ఎప్పుడు ఎలా నెరవేరిoదో తెలుసుకోవాలంటే, I రాజులు 18:41-45 చదవాలి. “41. పిమ్మట ఏలీయావిస్తార మైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా
42. అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
43. తరువాత అతడు తన దాసుని పిలిచినీవు పైకిపోయి సము ద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడుఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.
44. ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయానీవు అహాబు దగ్గరకు పోయినీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధ పరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.
45. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రె యేలునకు వెళ్లిపోయెను.
కాబట్టి జరగబోయేవి ముందే ప్రవచించే ప్రవచనాలు పరిశుద్ధ గ్రంధం బైబిల్లో ఉన్నాయి. వాటి నెరవేర్పు కూడా ఉన్నది. వoదలాది ఈలాటి ప్రవచనాలు ఉన్నా, కేవలం రెంటిని మాత్రమే ఇక్కడ ఉదహరించాము. ప్రవక్తలు చెప్పినవి చెప్పినట్టే నెరవేరినవి. క్రొత్త నిబంధనలోని ఒక ప్రవచనం ఉదహరించాలంటే, యోహాను సువార్త 14: 1-3 వచనాలు చూడాలి. ఇది ఇంకా నెరవేరవలసి ఉన్నది. ఈ లేఖన భాగము సమాధి కార్యక్రమాల్లో ఆదరణ కోసం చదువుతూ ఉంటారు. ఈ మాటలు మీకు కంఠస్థం వచ్చని ఆశిస్తున్నాను, లేనట్లయితే కంఠస్థం చేస్తే మంచిది.
“1. మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి.
2. నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.
3. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
ఈ లేఖన భాగపు నెరవేర్పు కోసం మనమిప్పుడు ఎదురు చూస్తున్నాము. దీనికి భిన్నంగా I కొరింథీ 14:3లో మరో ప్రవచనం కనిపిస్తున్నది. “క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు, ప్రవచించువాడు మనుష్యులతో మాట లాడుచున్నాడు.” ఇక్కడ ప్రవచనం అనే మాటకు నిర్వచనం, అనగా సరియైన అర్ధం ఏమిటి? ఇతరులకు మేలు, ధైర్యం, క్రీస్తును గూర్చిన జ్ఞానము వ్యక్తిగత విశ్వాసములో, పరిశుద్ధత, పవిత్రతలలో అభివృద్ధి
కావడానికి సహాయపడే హెచ్చరిక, ఆదరణ, ఓదార్పు కలిగించే రీతిగా మాటలాడడం. దానికి వాడిన గ్రీకు మాట
“ఆయికాడేమెఓ”. దానికి అర్ధం ఒక ఇల్లు కట్టినట్టు, లేదా ఒక వ్యాపారం, లేదా ఒక సంస్థను జాగ్రతగా కట్టినట్టు కట్టడం.
ఓదార్పు, ధైర్యం, హెచ్చరిక జాగ్రత్తలు బోధించే రీతిగా మాట్లాడడమే ప్రవచనమంటే! మన ప్రభువు యేసు క్రీస్తు
యోహాను సువార్త 14:16 లో చెప్పిన పరిశుద్ధాత్ముడు అనే మాటకు వాడిన గ్రీకు మాట “పారక్లేసిస్” అనగా ప్రక్కలో
నిలుచుండి, సహాయం చేసే వానిలాగా
ధైర్యం, ఆదరణ ఓదార్పు, హెచ్చరికనందించే మాటలు చెప్పడం. “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు
నుండు టకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును.” బోధించుట, లేదా
ప్రవచించుట అంటే హెచ్చరిక, జాగ్రత్తలు బోధించడం. ప్రవచించడమంటే, ఆదరణ, ఓదార్పు, హెచ్చరికమాటలు
బోధించడం. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే, ఎవరైనా, నిరుత్సాహపడి, వెనుకకుమళ్లి, కూలబడిపోయినట్టుగా
ఉన్నపుడు, ధైర్యం, ఆదరణ, బోధించి, ఓదార్చి, ముందుకు సాగిపోవడానికి ఉపకరిoచే మాటలు చెప్పడం. చల్లని
ధైర్యకరమైన మాటలు, ఓదార్చే మాటలు, మనిషికి ఊరటనిస్తాయి. క్రుంగినపుడు నిలబడడానికి ఉపకరిస్తాయి. ఆపో.
పౌలు చెబుతున్న ప్రవచనం అనే మాటకు మూడు రకాలైన అర్ధాలు ఉన్నాయి. ఒకటి, కట్టుట, లేదా అభివృద్ధి, క్షేమం,
ధైర్యం కలిగించే రీతిగా బోధించడం, రెండు, హెచ్చరిక, ప్రమాదాల్లో పడబోయే పరిస్థితులు గమనించి హెచ్చరిక చేసి
జాగ్రత్తలు బోధిచడం, మూడు క్రుంగినపుడు, ధైర్యం, నిబ్బరం, నిలుకడ కలిగించే బోధ చేయడం. మనలో ప్రతి ఒక్కరూ
పరిశుద్ధాత్ముని శక్తి, నింపుదల పొందినవారు ఇతర విశ్వాసులకు ఈ ప్రవచన బోధ చేయవచ్చు. దానికి
అవసరమైనంత మహా కృప సర్వకృపనిధియగు దేవుడే మనలో ప్రతి ఒక్కరికీ సమృద్ధిగా అనుగ్రహించుగాక!
_______________________
No comments:
Post a Comment