I కోరింథీ-49 13:8-13 ప్రేమ పరిశీలించి పరిశోధిస్తుంది

 I కోరింథీ-49  13:8-13
ప్రేమ పరిశీలించి పరిశోధిస్తుంది

    పైపైన ప్రేమ ఆప్యాయత చూపించేవారంటే మీకిష్టమా? కాదని వెంటనే సమాధానం వచ్చేసింది. కొందరు పైపైన ఎంతో ప్రేమ చూపించి లోలోపల క్రూరద్వేషముతో అసూయతో నిండి ఉంటారు. కాని కొందరు పైన కఠినంగా ఉంటారు, కాని లోలోపల నిజమైన ప్రేమ, యధార్ధమైన అప్యాయతతో మీ మేలుకోరి కఠినంగా మాట్లాడతారు. “మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.” సామెతలు 27:6  చూశారుగా, కఠినగా చెప్పిన మాటల వెనుక ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నవారు ధన్యులు. అది తల్లి తండ్రి అయిన, భార్య, భర్త అయినా, మన స్వంత పిల్లలైనా, పాస్టర్ అయినా, ఇరుగు పొరుగు అయినా, తోటి విశ్వాసి అయినా, సంఘ పెద్దలైనా దీనమనసుతో కోపగించుకోకుండా, ఒప్పుకొoటే, ఎంతో మేలు పొందుతారు.
            మీలో వాట్సప్ వాడుతున్నవారు, మా వాట్సప్ నంబర్ ద్వారా సంప్రదించండి. ఏదో ఒక రీతిగా మీరు మీ స్పందన, మీ ప్రార్థన మనవి, తెలియచేయండి. ఆడియో మెసేజ్ గాని, ఏదైనా వేరే మెససేజ్ గాని పంపి మీరు దీవించబడుతున్న సంగతులు, హెచ్చరికపొందుతున్న విషయాలు పంచుకొనండి. దైవచిత్తమైతే, అక్టోబర్లో కృతజ్ఞత, మూడు సంవత్సరాల ముగింపు సందర్భములో “సజీవ నిరీక్షణ శ్రోతల సదస్సు” హైదరాబాద్ లో జరిపించాలని ఆశపడుతున్నాము, ప్రార్థిస్తున్నాము. ఈ సదస్సుకు మీరు వచ్చి మీ సాక్షము పంచుకొని, అందులో పాల్గొనాలని ఆశిస్తే, ప్రార్థించి సిద్ధపడండి.
ఈ నాటి మన ధ్యానాంశం, ప్రేమ పరిశోధించి పరిశీలిస్తుంది, లేఖన భాగము I కొరింథీ 13:8-13.
    8 ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును;
    9 మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని
    10 పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థక మగును.
    11 నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
    12 ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము
    పూర్తిగా ఎరుగుదును.
     13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.

             

        ప్రేమ శాశ్వతకాలముంటుంది. అనగా ప్రేమ లక్షణమేమంటే, అది ఎంతకాలమైనా ఓపికగా నిలిచి ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ ప్రేమ అనే ఈ మూడితిలో దేవుని గుణలక్షణము, స్వభావము ప్రేమే! దేవుని విశ్వాసము అవసరము లేదు ఎందుకంటే ఆయనకు సార్వభౌమ అధికారము చిత్తము ఉన్నది. దేవుని నిరీక్షణ అవసరం లేదు, ఎదుకంటే ఆయన సమస్తము, అనగా భూత, భవిష్యత్ వర్తమానాలు పరిపూర్ణంగా ఎరిగినవాడు. కాని ఆయనలో ఉన్న అతి ప్రాధమికమైన స్వభావము ప్రేమ. దేవుని ప్రేమలో ఆయన పరిశుద్ధత కలిసిఉంటుంది గనుక అది స్వచ్చమైనది, పరిపూర్ణమైనది. ఎందుకంటే, దేవుడు ఎన్నడూ మాట తప్పదు. ప్రేమ కూడా ఎన్నడూ మాట తప్పదు. అది ఎన్నడూ తగ్గిపోదు. దేవునికి స్తోత్రం! తన కుమారుణ్ణి ఆర్పిస్తానని మన పాపూ ప్రాయశ్చిత్తం కోసం వాగ్దానం చేసినట్లే, యోహను 3:16 ను దేవుడు నెరవేర్చిన దినములో ఉన్న ప్రేమలాగానే అంతటి ప్రేమ ఇప్పుడు కూడా వుంది. అమెన్!
    ప్రవచనములైనను నిరర్ధకములగును.  అంటే ఏమిటి? ప్రయోజనము లేని స్థితిలో ఉంటాయని అర్ధం. ప్రవచనాలు నెరవేరిన తరువాత వాటి వల్ల ఇక ఏమి ప్రయోజనముంటుంది? అవి ఒక ప్రక్కన ఉండ వలసిందే కదా! ఇక్కడ ప్రవచనములు అంటే భవిష్యత్తును గూర్చిన ప్రవచనములని అర్ధo. కొన్ని వందల ప్రవచనాలు ఇప్పటికే నెరవేరిఉన్నవి. ఉదాహరణకు, గలతీ, 4:4,5 తీసుకోండి. “4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, 5 మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను.”  కాలము సమీపమైన సమయాన్ని జ్ఞాపకం చేసుకోండీ. మరోమాటలో చెప్పాలంటే ప్రవచనము దేవునిచేతిలో ఉండింది. దేవుని సమయానికి అది ప్రభువు నెరవేర్చాడు. ఈ ప్రవచనం ఇప్పటికే నెరవేరింది కనుక దానిప్పుడు మనము ప్రక్కకు పెట్టేస్తాము. “నెరవేరింది” అనే మాటను గమనించండి. అన్ని లెక్క పెట్టడం సాధ్యము కాదుగాని, ఆదికాండము, నిర్గమకాండములలో 110 అలాటివి ఉనాయి. యెషయ గ్రంధములో 36 ఉన్నాయి. ఈ ప్రవచన్నలాన్ని నెరవేరిన తరువాత ఇక వాటిని మనము ప్రక్కకు పెట్టేస్తాము.
    భాషలైనను నిలిచిపోవును. ఈ మాటల భావము తెలుసుకోవడం కాస్త కష్టమనే చెప్పాలి. మునుపటిలాగే, అనగా బాబెలుకు ముందు ఉన్నట్టు ఒక్కటే భాష ఉండేలా ప్రభువు చేస్తాడా? అప్పుడు అందరూ ఒకేభాష మాట్లాడతారా? లోకములో ఎన్నెన్ని భాషలున్నా, నిత్యత్వములో, ప్రభువుతో మనమంతా ఉన్నపుడు, ఒకరి భాష మరొకరు అర్ధం చేసుకోవడం కష్టంగా ఉండదు!
    జ్ఞానము కూడా నిష్ప్రయయోజనమవుతుంది. పరిపూర్ణమైన జ్ఞానము దొరికినపుడు ఇప్పుడున్న అజ్ఞానము ఉండదు. ఆ తరువాత మాటల్లో పౌలు బోధిస్తున్నది జాగ్రతగా గమనిస్తే, ఇప్పుడు మనకున్న జ్ఞానము కొంత మాత్రమే! మనమిప్పుడు ప్రభువుతో ఉండడంలేదు గనుక మన ప్రవచనం, అనగా వాక్యబోధ, కొంత మాత్రమే. సమస్తమూ పరిపూర్ణంగా తెలిసినవాడు, దేవుడొక్కడే! ఆయనకు అన్నీ తెలిసినా, ప్రస్తుతం అవన్ని మనకు మరుగు పరిచాడు. పరిపూర్ణత రానున్నది. “పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థక మగును.”  దేవుడే పరిపూర్ణుడు గనుక ఆయన పరిపూర్ణత ప్రత్యక్షమయ్యే ఘడియ రానున్నది. 11వ చనం జాగ్రతగా గమనించాలి సుమా! “నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.”  పెద్దరికం వచ్చాక, వయసు పడ్డాక,  చిన్న పిల్ల తలంపులను, చేష్టలను విడిచిపెట్టాలి. అయినప్పటికి, పెద్దలైనవారు కూడా ఇంకా నేర్చుకోవలసి ఉంటుంది. అంతా నేర్చుకున్నాను, ఇప్పుడు నేను ఆత్మీయ జీవితములో పెద్దవాన్ని అని ఎన్నడూ అనుకోవద్దు. కానీ ఇంకా చిన్న పిల్లల మనస్తత్వములో ప్రతి చిన్న దానికి కోపగించుకొని, ఆవేశపడి, వివాదాలు, పెడుతూ ఉంటే, ఇంకా చిన్న పిల్లలే! దీనికి స్ఫూర్తి, మూలం ప్రేమ! మన ప్రేమ ఎంత మంచిదో మన వైఖరి, ప్రవర్తన తెలుపుతుంది. ఇక చివరలో, చూడడం విషయం. ఇప్పుడు అద్దములో బొమ్మ చూస్తున్నాము, కానీ ప్రేమ మనలను పరిశీలించి, పరిశోధించి సంపూర్ణ పరుస్తుంది. “అప్పుడు నేను ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును” ఇప్పుడున్న కొద్దిపాటి జ్ఞానము, ఆత్మీయత, పరిపూర్ణత, ప్రేమ, అన్నీ పరిపూర్ణమయ్యే శుభ దినము రానున్నది. ప్రియ శ్రోతలారా, మనమంతా ఇంకా ఎంత ఎదగవలసి ఉన్నదో, గమనిస్తున్నారా? ప్రేమ పరిశోధిస్తుంది, పరిశీలిస్తుంది. అప్పుడు పరిపూర్ణమవుతుంది. నీవు, నేను యేసు క్రీస్తు ప్రభువును ఎంత ప్రేమిస్తున్నమో తెలుసుకున్నామా? ప్రేమకున్న ఈ గుణ గణాలు మనలో ఏర్పడాలంటే, దేవుని కుమారుడు యేసు క్రీస్తు  ప్రభువు నీ హృదయానికి, నీ మనసుకు, నీ శరీరానికి రాజు, ప్రభువు, అధిపతి అయి ఉండాలి, లేకపోతే ఇది అసాధ్యం.
    పౌలు మూడింటిని ఎత్తి చూపిస్తున్నాడు, జాగ్రత్త గా చూడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు నిత్యమూ నిలిచేవి. చిరస్థాయిగా నిలిచి ఉండేవి. అన్ని వరాలు, అన్ని శక్తులు, అన్ని అద్భుతాలు, గతించిపోయేవి. కానీ ఎప్పటికీ కదలకుండా, నిలిచిఉండేవి ఈ మూడే! విశ్వాసము ఇప్పుడు ఒకప్పుడు ఇక అవసరం ఉండదు, నిరీక్షించేవి అప్పుడు ఎదురగానే ఉంటాయి, కానీ ప్రేమ అప్పుడు కూడా ఉంటుంది. ప్రేమ ఎల్లప్పుడూ సాగిపోతూనే ఉంటుంది. అందుకే ప్రేమ అన్నింటిలో శ్రేష్టమైనది. దాన్ని పొందడానికి, పరిపూర్ణం చేసుకోవడానికి, పరిపక్వం చేసుకోవడానికి, అన్ని పరిస్థితులలో కలిగి ఉంది, చూపించి ఇంటిలో, సంఘములో, వీధిలో, పనిచేసే చోట, ఎల్లప్పుడు, ఎల్ల వేళల కలిగి ఉండడానికి ప్రయాసపడదాం!     
 



No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...