I కోరింథీ-46 12:29-31
సంఘపు పరిచర్యలు వర్గీకరించబడ్డాయి
మన సంస్కృతిలో, మన ఆలోచన విధానాల్లో ఆధ్యాత్మిక సంగతులు నలుగురిలో చెప్పడం, పంచుకోవడం జరగడం లేదు. ఇది చాలా విచారకరమైన సంగతి. ‘ఏ విధంగా మీకు ఈ లేఖన భాగం’ లేదా బైబిల్ అధ్యయనం సహాయ పడుతుంది?’ అని ప్రశ్నిస్తే, నవ్వి దాటేయడమో, ‘బాగుంది’, అని ముక్తసరిగా చెప్పడం, లేదా ‘సరిగ్గా నాగురించే చెప్పినట్టు ఉన్నది’ అని ఇలా పరోక్షంగా చెప్పి చెప్పనట్టు చెప్పడం మన ఆత్మీయ సంస్కృతిగా మారిపోయింది. ఇదే ఆనాటి పరిశుద్ధులు, విశ్వాసులు చేసినట్లయితే ఈ నాడు మీ బైబిల్ మీ చేతులో ఉండకపోయేది! బైబిల్లో మీరు చదివే ప్రతి ఒక్కటీ వారి నిజ జీవితాల్లో జరిగినవే! అది మేలైనా, కీడైనా, జయమైనా, అపజయమైనా, సంతోషమైనా, దుఃఖమైనా, శ్రమైనా, హింసైనా, ప్రతి ఒక్కటీ జరిగినవి జరిగినట్టు వ్రాశారు. మీరు ఇప్పటికైనా, మీ ఆత్మీయ జీవితములోని అనుభవములు వివరంగా పంచుకోవడం నేర్చుకోవాలని మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ప్రయత్నించండి, మాతో పంచుకోండి. అడ్రస్ కావలసినవారు అడ్రస్ పంపమని మెసేజ్ పెట్టినట్లయితే, పంపగలము. మీకు చేతనైన రీతిగా పంచుకోవచ్చు.
ఒక ముఖ్య ప్రకటన: ఆడియో బైబిల్ గురించి విన్నారుగదా! ఈ చిన్ని పరికరము దానంతట అదే పనిచేస్తుంది. పరిశుద్ధ గ్రంధమంతా, అనగా ఆదికాండము నుండి ప్రకటన వరకు వినడానికిది మంచి అవకాశం. రోమా పత్రిక పఠనలు అన్నీ ఇందులోనే మెమొరీ కార్డ్ ద్వారా పొందుపరిచాము. కావాలని ఆశించేవారు, వివరాలకోసం ఫోన్ చేయండి.
ప్రార్ధించుకుందాం: ప్రార్థన
ఈనాటి అంశం: సంఘపు పరిచర్యలు వర్గీకరించబడ్డాయి, సహేతుకమైనవిగా నిర్ధారించబడ్డాయి.
లేఖన భాగము: I కోరింథీ 12:29-31.
మొదటిగా సంఘపు పరిచర్యలు ఎలా వర్గీకరించబడ్డాయో అధ్యయనం చేద్దాం. 29, 30 వచనాలు:
“29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?
30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా”
ఆపో. పౌలు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన అడిగే విధానం వింతగా వుంది. ఈ ప్రశ్నలకు కాదని సమాధానం చెప్పే పద్ధతిలో అవి ఉన్నాయి. అందరూ అపోస్తలులు కాదు గదా! అందరూ బోధకులు కాదుగదా! అందరూ అద్భుతాలు చేసేవారు కాదుగదా! అందరూ స్వస్థపరచు కృపావరము గలిగినవాళ్లు కాదుగదా! అందరూ బాషలు మాట్లాడరు గదా! అందరూ భాషలకు అర్ధము చెప్పేవారు కాదుగదా! అని ఈ ప్రశ్నల అసలు భావము. ఏ వారము కలిగినవారు ఆ స్థానములో ఉండి పరిచర్య చేస్తే, సంఘములో సమతుల్యత, సమరస్యము ఉంటుంది. వీటిలో ఏ ఒక్క వరమునకైనా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, సమంజసంగా ఉండదు, సమతుల్యత తప్పుతుంది. ఏ ఒక్కరైనా ఈ అన్ని పరిచర్యలు చేయలేరని పౌలు తేటపరుస్తున్నాడు. అవసరతను బట్టి ఏ వరము ద్వారా, ఏ పరిచర్య జరగాలో పరిశుద్ధాత్ముడు నిర్ణయిస్తాడు.
ఇక ఈ అధ్యాయపు ముగింపులో అన్ని పరిచర్యలు ఏ విధంగా సహేతుకమైనవని నిర్ధారించబడ్డాయో తెలుసుకుందాం. 31వ వచనం:
“31. కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.”
సహేతుకమైనదిగా నిర్ధారిచబడుట అనే మాటను కావలసి ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే కృపావరములలో శ్రేష్టమైనవాటిని కోరుకోవాలని పౌలు బోధిస్తున్నాడని మనమంతా గ్రహించాల్సిన అవసరము చాలా ఉన్నది. పౌలు చెబుతున్నదేమిటి? కృపావరములన్నిటిలో శ్రేష్టమైన వాటిని పొందాలని బలమైన కోరిక, ఆశ కలిగియుండాలని ఆయన హెచ్చరిక. ఈ పరిచర్యలు వాటి ప్రాముఖ్యత ఆధారంగా వరుసలో ఆయన వ్రాశాడని మనము గ్రహించాలి. అపోస్తలుల దగ్గరనుండి మొదలు పెడితే, భాషల అర్ధము చెప్పేవారి వరకు ఒక పరిచర్య తరువాత మరొకటి వాటి ప్రాముఖ్యత తగ్గుతూ క్రిందికి వస్తుంది. ఒక నిచ్చెన ఊహించుకోండి. శ్రేష్టమైనది అనగా అపోస్తలత్వము మొదట ఉన్నది. ఇక మన మనసులో మెదులుతున్న ప్రశ్నలు ఏమిటి? “ఇక్కడ బోధించబడుతున్న ఈ వరములు లేదా పరిచర్యలు ఇప్పుడు కూడా ఉన్నాయా?” “రెండు నిబంధనలలో మనకు కనిపిస్తున్న ప్రవక్తలు ఇప్పుడు కూడా ఉన్నారా?” ఈలాటివి. ప్రవక్తలు దేవునికి ఎంత దగ్గరగా జీవించేవారంటే, దేవుడు వారితో మాట్లాడేవాడు, వారు జరగబోయేవి, వెంటనే జరగబోయేవైనా, దేవుడు ప్రకటించమని ఆజ్ఞ నిచ్చినవి ప్రకటించేవారు. ప్రియ శ్రోతలారా, జాగ్రతగా అలకించండి: దేవుడు ప్రత్యక్షపరచి, మనకు ప్రకటించదలచినదంతా, ప్రకటన గ్రంధములోని చిట్టచివరిమాటతో ముగిసింది. పరిశుద్ధ గ్రంధం బైబిల్ ను మించిన ఏ ప్రత్యక్షత, ప్రకటన, ఇప్పుడు లేదు, ఇక ఉండదు కూడా! కాబట్టి ఆ నాటి ప్రవక్తల లాంటి ప్రవక్తలు ఈ నాడు ఉంటారని భ్రమ పడకూడదు. ఈ నాడు ప్రవక్తలు అనగా పరిశుద్ధ గ్రంధమును సరియైన క్రమములో, పద్ధతిలో, నమ్మకముగా, ఏ ప్రలోభములకు లోనుకాకుండా నిర్భయంగా బోధించేవారే! వింటున్నారా, తోటి దైవసేవకులారా, సంఘ పెద్దలారా, పరిచారకులారా? ఇది అత్యవసరమైన సత్యము.
దేవుడు బోధించ దలంచిన సమస్తమునూ బోధించడం ఇప్పటికే అయిపోయింది. మీ బైబిల్ చేవరి పేజ్ లో ప్రకటన చిత్త చివరి అధ్యాయము అయిపోయిన తరువాత ఏమని రాయబడింది. ఒక్కసారి పేజీలు తిరగేసి చూడండి. “సమాప్తం” అంటే అర్ధం ఇదే చివరి అంకం. ఇక ఏమి లేదు. చెప్పవలసిందంతా చెప్పము అని అర్ధం. ద్వితీ. 29:29 మీ బైబిల్లో గమనించండి, త్వరగా పేజీలు తిప్పలేనివారున్నట్లయితే వ్రాసుకొని తప్పనిసరిగా, జాగ్రతగా ఈ మాటలు మనమంతా గ్రహించుకోవడం అత్యవసరం. “రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” రెండు మాటలు గమనించాలి. 1. రహస్యములు, 2. బయలుపరచబడినవి. చాలామంది రహస్యాలు తెలుసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తెలిసినవి మాత్రం లెక్క చేయకుండా జీవిస్తూ ఉంటారు. తెలుసుకోవడంతోనే మన బాధ్యత ఆరంభమవుతుంది. లేఖనాల్లో బయలు పరచబడనివి, అనగా మనకు తెలియనివి చాలా ఉన్నవి. వాటి విషయం బెంగ పెట్టుకోకండి, ప్రశ్నల వర్షం కురిపించకండి. సర్వాధికారి అయిన దేవుడు మనకు అవసరమైనవన్నీ, అవసరమైనదంతా భద్రంగా తర తరాలుగా ఏ మాత్రం కల్తీ లేకుండా, మానవ హస్తము దేవుని పరిశుద్ధ మాటలను మార్చలేనంతగా భద్రపరిచాడు. దేవుని మాటలను నీవు, నేను అపార్థం చేసుకొని, అపోహలు పెట్టుకొని మన స్వంత బైబిల్ మనం రాసుకుంటే, తీర్పు దినాన ఎంతో పశ్చాత్తాప పడవలసివస్తుంది. ఇక పశ్చాత్తాప పడడానికి సమయము ఉండకపోవచ్చు. మీ మీద మిక్కుటమైన ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాము. ఇంకా సమయముండగానే, ఇంకా ఊపిరి ఉoడగానే, దేవుడు బయలు పరచిన సత్యమును నమ్మి యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే మీ పాపములకు పరిహారము చెల్లించి ప్రాయశ్చిత్తము చేసిన విమోచకుడని నమ్మి ఒప్పుకొని, మీ జీవితపు సారధ్యం, ఆయన కివ్వండి. సర్వాధికారము ఆయనకిచ్చి పరిపూర్ణ విశ్వాసము ఉంచి ఆయన వాక్కు ప్రకారమే జీవిస్తానని నిర్ణయం తీసుకొనండి.
ఇక మరొక ప్రాముఖ్యమైన అంశం. కృపావరములు ఇప్పుడు ఉన్నాయా? ఒక వేళ కృపావరములు ఇప్పుడు మనకు మన సంఘాల్లో మన జీవితల్లో కనిపించడము లేదంటే, దానికి కారణము యేసు క్రీస్తు ప్రభువునకు సర్వాధికారము ఇవ్వ లేదు. యేసు క్రీస్తు ప్రభువునకు మీ జీవితము మీద, సంఘము మీద, సర్వాధికారము ఇవ్వకపోతే, ఏ కృపావరములు ఉండవు. ప్రభువునకే స్థానము లేనిది ఆయన వాగ్దానము చేసి పంపించిన పరిశుద్ధాత్మునికి ఎలా స్థానముంటుంది? మీ జీవితములో పరిపూర్ణంగ ప్రభువునకు సర్వాధికారమిచ్చి ఆయన పరిశుద్ధమైన వాక్కు ప్రకారం పరిపూర్ణ విధేయత చూపించండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు తన ప్రక్రియ అద్భుతంగా ఆరంభిస్తాడు. ప్రియ సోదరీ, సోదరులారా, ఇది చాలా కఠినమైన విషయం. ఆది సంఘములోని విశ్వాసులు, లేదా అప్పుడు వారిని శిష్యులు అని పిలిచారు. అవును, శిష్యులు యేసు క్రీస్తునకు కావాలి. అ. కా. లోని విధేయత, సమర్పణ, త్యాగముతో హింస, శ్రమ, నింద, అవమానము, నష్టము, కీడు, మనమంతా భరిస్తే అప్పుడు పరిశుద్ధాత్ముని కృపావరములు చూడగలము. ఇది బహుకష్టతరమైనా, ఒక్కరు చేస్తే వారి ద్వారా, అందరికీ వ్యాపించవచ్చు. అ ఒక్కరు మీరేనా? ప్రార్థన:
No comments:
Post a Comment