ఈస్టర్ బైబిల్ పఠన 2023 "నిజమైన ఈస్టర్ అంటే ఏమిటి?"

 ఈస్టర్ సందేశం 2023

 "నిజమైన ఈస్టర్ అంటే ఏమిటి?"

    ఎంత త్వరగా ఈస్టర్ వచ్చేసింది కదూ! ఈస్టర్ పండుగ ఒక ఆచారముగా మారినట్లుగా ఉన్నది.
సిలువ శ్రమల కాలము కూడా ఆచారముగా మారిందేమో అని భయమవుతున్నది. ఎందుకనగా కాలము జరుగుతున్నకొద్దీ, దేవుని పరిశుధ్ధ వాక్యము వింటున్నకొద్దీ, వింటున్న మన హృదయాలు, జీవితాలు రూపాంతరం చెందకపోతే ఇది నిజమే! మారుతున్నాయని మనము చెప్పుకుంటే సరిపోదు. అది క్రియల చేత నిరూపించబడుతుంది. చూచేవారు దానిగురించి సాక్ష్యమిస్తారు. ప్రార్థన:
    మన ప్రభువు యేసు క్రీస్తు మరణమును జయించి సమాధిని గెలిచి సజీవుడుగా మహిమ శరీరముతో లేచిన తరువాత 40 రోజులపాటు, తన శిష్యులకు కనీసం 10 సార్లు కనిపించి వారిని ధైర్యపరచి, గద్దించి, ఓదార్చి హెచ్చరించాడు. సజీవుడైన ప్రభువును కళ్ళారా చూచిన తరువాత వారి జీవితాలు పరిపూర్ణంగా మారిపోయాయి. పునరుధ్ధానానికి ముందు ఎంత భయపడ్డారో దాని తరువాత అంత ధైర్యంగా అన్నిటిని అందరిని ఎదుర్కున్నారు; ఎంత దాక్కోవడానికి ప్రయత్నించారో అంతగా బహిరంగంగా తిరిగారు, ప్రభువు ఆజ్ఞలు నెరవేర్చారు. ఈ విషయాలు వివరంగా అపో. కా. గ్రంధములో పరిశుద్ధాత్ముడు వివరించాడు. మూడు ప్రాముఖ్యమైన మార్పులు అధ్యయనం చేద్దాం.
    మొదటిది, సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువును ముఖాముఖి చూచిన తరువాత శిష్యులు గొప్ప ధైర్యం, తెగింపు పొందారు. 

అ. కా. 4:1 నుండి.
    “వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును
    2 వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని           ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి
    3 వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.
    4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించుమించు అయిదు వేలు ఆయెను.

    5 మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.
    6 ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితో కూడ ఉండిరి.
    7 వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, --మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా
    8 పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను, "ప్రజల అధికారులారా, పెద్దలారా,
    9 ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక
    10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసిన దేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.
    11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.
    12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
    13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.
         ఈ మాటల్లో ఎంతటి ధైర్యము కనిపిస్తుందో గమనిస్తున్నారా? శిక్షించాలని నిలబెట్టిన అధికారులతో అపోస్తలులు చెబుతున్న మాటలు ఇవి! ఏ యూద మత పెద్దలకు వారు భయపడి తలుపులు మూసుకొని ఉండిరో అదే యూద పెద్దలు, అధికారుల యెదుట వారి ధైర్యం తెగింపు మనకు స్పష్టంగా కనిపిస్తున్నవి. యేసు క్రీస్తు ప్రభువును గూర్చి వారు చెబుతున్న మాటలు ఎంత గంభీరంగా సాహసము ఉట్టిపడుతూ ఉన్నాయో గమనించి చూడండి. దానికి కారణం వారి విద్యకాదు, ఐశ్వరం కాదు, వేదాంతపు డిగ్రీలు కాదు, బిషప్, ఆర్చ్ బిషప్ డిగ్రీలు కాదు. అంతస్తు, కులము అంతకూ కాదు. కేవలం యేసు క్రీస్తు ప్రభువును వారు చూచి ఆయన తిరిగి లేచి సజీవుడుగా ఉన్నాడని హృదయపూర్వకంగా నమ్మారు. 13వ వచనంలో ఎంత స్పష్టత ఉందో గమనించారా? “వారు పేతురు యోహానుల ధైర్యము చూచినపుడు....” ఈ ధైర్యానికి కారణం యేసు క్రీస్తు ప్రభువు పునరుధ్ధానమే! విశ్వాసులమని చెప్పుకుంటున్న మనము, సంఘ పెద్దలమని అతిశయించే మనము, దేవుని వాక్యమును నమ్మి ఆశ్రయించే మనము ఆయన కోసం ఎంత ధైర్యంగా మన గ్రామాల్లో మన పొరుగువారి మధ్యలో, మనలను ఎదిరించే వారి యెదుట ఎంత ధైర్యంగా నిలబడుతున్నాము? ప్రభువు మరణమును గూర్చి గట్టిగా నమ్మే మనము ఆయన పునరుధ్ధానమును మరి యెక్కువగా విశ్వసించి నిండు ధైర్యముగా జీవించాలి. 'పిరికివారు దేవుని రాజ్యము చేరరు' అనే సత్యమును మరచిపోకండి!
    

    రెండవది, పునరుధ్ధానుడైన ప్రభువును చూచిన శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఆ శక్తితో జీవించి ఆయనలో  జీవించారు. పాత నిబంధన కాలములలో పరిశుద్ధాత్ముడు  చేసినవాటన్నిటికంటే అత్యద్బుతమైన క్రియలు, మార్పులు, క్రొత్తనిబంధనలో మన రక్షకుడు యేసు క్రీస్తు పునరుధ్ధానం తరువాత చేశాడు. సృష్టి ఆరంభములో పరిశుధ్ద్ధాత్ముడు ఉన్నవాడు. "దేవుని ఆత్మ జలమునపైన అల్లాడుచుండెను."  ఆది. 1:2. అనగా ఆయన దేవుని సృష్టి అంతటినీ నిర్వహిస్తున్నవాడు. ఆది. 6:3 లో మనకు కనిపించే పరిశుద్ధాత్ముడు ఆయనే! పరిశుద్ధాత్ముడు మనతో “ఎల్లప్పుడును వాదించడు” అని ఏ విధంగా దేవుడు తన హృదయము నొచ్చుకున్నపుడు ఆది మానవులతోను, ఈనాడు మనతో కూడా ఎలా మాట్లాడుతూ ఉన్నాడో గమనించాలి. దావీదు మాటలు గమనించండి.  II సమూ. 23:2 “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది.”  న్యాయాధిపతులందరిలో ఆయనే నివసించి ప్రత్యేక మైన శక్తి, జ్ఞానము, ధైర్యము నిచ్చి దేవుని కార్యములు చేయడానికి వారిని తనతో నింపాడు. యోహాను సువార్త 16:7 “అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. 8 ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. 9 లోకులు నాయందు విశ్వాస ముంచలేదు గనుక పాపమును గూర్చియు, 10 నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, 11 ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన జేయును.”  ఆయన పెంతెకొస్తు దినాన శిష్యులందరి మీద, ఆ తరువాత విశ్వసించిన వారందరిమీద తన మహా బలమును శక్తిని, పరిశుద్ధతను వర్షింపచేశాడు. ఇదేదో శక్తి అని మీరనుకుంటే పొరపాటే! కాదు, పరిశుద్ధాత్ముని సంబోధిస్తూ, ప్రభువు అన్న మాటలు ఏమిటి? “ఆయన” వ్యక్తిత్వము కలిగినవారిని గూర్చి మాట్లాడేటపుడు మనము "ఆయన" అంటాం కదా! పరిశుద్ధాత్ముడు అపోస్తలులందరినీ అద్భుతంగా మార్చి వేశాడు. ప్రియ శ్రోతా, నీలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? సువార్త ప్రకటన, సంఘ స్థాపన, అపోస్తలుల చేత ఆయన జరిగించిన మహా శక్తిగలిగిన క్రియలు, అ. కా. గ్రంధమంతటా ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నవి. దేశ దేశాలు, ప్రతి ప్రాంతము దేవుని మహాశక్తితో కదిలించబడింది. పౌలు సీలలను గూర్చి అ. కా. 17:6 లో ఉన్న మాటలు ఏమిటి? “భూలోకమును తలక్రిందు చేసినవారు ఇక్కడికి కూడా వచియున్నారు.”  యేసు క్రీస్తు పునరుధ్ధానము పరిశుద్ధాత్ముని సంపూర్ణ పరిచర్యకు తెరతీసింది. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే! దేవుని వాక్యమును మనకు రచింప చేసి, భద్రపరచి, తరతరాలుగా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నప్పటికి ఏ మాత్రం శక్తి తగ్గకుండా ఉన్న దేవుని లేఖనములకు ఆయనే రచయిత. ఈనాటికి, ఏ నాటికైనా యెసయ్య రెండవ రాకడవరకు పరిశుద్ధ గ్రంధం అ. కా. నాటి శక్తి తోనే ఉంటుంది! హల్లెలూయ!
        

    ఇక మూడవది, యేసు క్రీస్తు ప్రభువు పునరుధానము తరువాత అపోస్తలులు, శిష్యులు, విశ్వాసులు, క్రైస్తవులు అని పిలువబడిన ప్రతి ఒక్కరూ ఘోరమైన హింస, శ్రమలు, అవమానము, తిరుగుబాటు, వ్యతిరేకతలను సంతోషగా అనుభవించారు. అపోస్తలులు, అనగా ప్రభువు శిష్యులు వారి ప్రాణాలు అర్పించారు, భూమి మీద ఉన్న దేశాలన్నిటిలో ప్రభువు సిలువను, సువార్తను మోసుకుపోయారు. స్తెఫను క్రొత్తనిబంధనలోని మొదటి హతసాక్షిగా ప్రాణాలు అర్పించారు.  పౌలును రాళ్ళతో కొట్టారు. వీధుల మీద ఈడ్చారు. సంఘ చరిత్రలో వేలాదిమంది హతసాక్షులు ఉన్నారు. యేసయ్య పునరుధ్ధానము నిన్ను, నన్ను, ధైర్యముతో నింపుతుంది, శ్రమలు, హింసలు, వ్యతిరేకత, తిరిగుబాటు, నింద అపనిందలు ఎదుర్కొని సంతోషంగా అన్నింటిని సహించడానికి స్ఫూర్తి నిస్తుంది. చివరకు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి! నీ చెడు వ్యసనాలు, నీ చేతిలో ఉన్న మద్యపు సీసా, నీ చేతిలో ఉన్న సిగరెట్, నీ జేబులో ఉన్న అన్యాయపు సొమ్ము అన్నింటిని నీవు విడిచిపెట్టడానికి సిధ్ధమా? అదే నిజమైన ఈస్టర్!!    

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...