I కోరింథీ-45 12:27-31 సంఘ శరీరపు పరిచర్యలలోని మెట్లు

 

I కోరింథీ-45 12:27-31

సంఘ శరీరపు పరిచర్యలలోని మెట్లు  

         సజీవ నిరీక్షణ కార్యక్రమములోని బైబిల్ పఠనలు ఆసక్తితో ఆతురతతో వింటున్న మీ అందరికీ శుభములు 

వందనములు! ప్రతి అధ్యయనం వినడమే కాకుండా ఇంకాస్త లోతుగా దేవుని వాక్యపు అధ్యయనం చేయడానికి 

సమయo తీసుకొనండి. I కోరింథీ లోని మునుపటి పఠనలు, రోమా పత్రికలోని పఠనలు మళ్ళీ మళ్ళీ చదవి, వినే 

అవకాశం ఉన్నది. దానికోసం పెద్ద ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ అవసరం. లేదా చిన్న ఫోన్ కలిగిన వారు ఆడియో బైబిల్లో 

రోమా పత్రిక అధ్యయనాలు, I కొరింథీ పత్రిక అధ్యాయాలు మళ్ళీ మళ్ళీ వినవచ్చు.  ఫోన్ చేసి వివరాలు తెలుసుకొనండి.

ప్రార్ధించుకుందాం, ప్రార్థన:

ఒక ముఖ్య ప్రకటన:

    ఆడియో బైబిల్ గురించి విన్నారుగదా! ఈ చిన్ని పరికరము దానంతట అదే పనిచేస్తుంది. పరిశుద్ధ గ్రంధమంతా 

వినడానికిది మంచి అవకాశం. రోమా పత్రిక పఠనలు అన్నీ ఇందులో మెమొరీ కార్డ్ ద్వారా పొందుపరిచాము. కావాలని 

ఆశించేవారు, వివరాలకోసం ఫోన్ చేయండి.

         ఇక ఈ పూట బైబిల్ అధ్యయనం. సంఘమంటే పనిచేసే వ్యవస్థ. మన శరీరములాగానే ప్రతి అవయవం 

అవసరం. ప్రతి ఒక్కరూ ఒకే రీతిగా సంఘములో చేరతారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఆర్ధిక 

అంతస్థువారైనా. సంఘము, పరలోకం కులాలవారీగా విభాగించబడడానికి వీలు లేదు. ఆ విధంగా చేసినట్లయితే, బైబిల్ 

గ్రంధమును మీరు నమ్మనట్టే అవుతుంది. మన శరీరమిలో ప్రతి ఒక్క అవయవానికి వేరు వేరు పని, స్థానము, 

ఉన్నట్టే, సంఘములో కూడా ప్రతి ఒక్కరికీ ఒక పని ఉంటుంది. ఈ సత్యము I కోరింథీ 12 అధ్యాయములో విపులంగా 

బోధించబడింది. కొన్ని బాధ్యతలు, కొన్ని పదవుల్లో ఉండే వారికి ఇవ్వబడ్డాయి. పదవి అనే కంటే, బాధ్యత అనడం 

ఉత్తమం. పదవి అనగానే మన మనస్సుల్లో అధికారం మెదులుతుంది. అధికారానికి సంఘములో స్థానము లేదు. ఈ 

బాధ్యతలను ఆపో. పౌలు స్పష్ట పరచండం అవసరమని భావించాడు. సంఘములోని సభ్యులు అందులోని క్రమము, 

నాయకత్వమును గ్రహించాలని ఆయన ఆరాటపడుతున్నాడు. మన శరీరాలను మనము చూసుకుంటే, అన్నీ 

అవయవాలు ఏ విధంగా ఒక్కటి కావో, అలాగే సంఘ సభ్యులు ఒక్క రీతిగా ఉండరు. ఏ విధంగా పౌలు పార్టీ, అపోలో 

పార్టీ, పేతురు పార్టీ అనే విభజనలు చేయకూడదని, హెచ్చరించినట్టే, సంఘములోని పరిచర్యలను వివరించడానికి 

పౌలు పూనుకున్నాడు. I కోరింథీ 12: 27-31 వచనాలు:

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు

28. మరియ దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని  ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

            29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు   చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

            30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

            31. కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన  మార్గమును మీకు చూపుచున్నాను.

            ఈ చిన్ని లేఖన భాగములో సంఘపు పరిచర్యలోని మెట్లను తేటగా పౌలు వివరిస్తున్నాడు. జాగ్రతగా వినండి, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. ఈ విషయమును గ్రహించాలంటే మొదటి మెట్టు ఏమిటో తెలుసుకోవాలి. పరిచర్యలు గుర్తించబడినవి: 27,28 వచనములలో వరములు ఏమిటో, వాటి ఉద్దేశం ఏమిటో స్పష్టంగా బోధించాడు. మొదటిగా, అపోస్తలులు ఉన్నారు. వీరొక ప్రత్యేకమైన నాయకులు. మత్తయి సువార్త 10:2-4 వచనాల్లో మన ప్రభువు యేసు క్రీస్తు తన శిష్యులను పంపించిన సందర్భంలో ఈ మాట వాడారు. అప్పుడు ప్రభువు 12 మంది శిష్యులను తన దద్దరికి పిలిచాడు. పేతురని పేరు పెట్టబడిన సీమోను, ఆయన సహోదరుడు ఆంద్రెయ, జెబదయి కుమారుడు యాకోబు, ఆయన సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, మత్తయి అనే సుంకరి, అల్ఫాయి కుమారుడు యాకోబు, లెబ్బయి, కనానీయుడైన సీమోను, యూద ఇస్కరియోతు. మత్తయి 10:5 లో ఉన్నట్టుగా, “యేసు ఆ పండ్రెండుగురిని పంపుచు....” వారికి వెళ్ళమని ఆదేశాలిచ్చాడు. అపోస్తలుడు అంటే అర్ధం అక్కడనుండి వచ్చింది. “పంపబడిన వాడు” అని అర్ధo. క్రొత్త నిబంధనలో “అపోస్తలుడు” అనే మాట 81సార్లు వాడారు. వేరు వేరు సందర్భాల్లో పరిస్తుతుల్లో ఈ మాట వాడబడింది. పాత నిబంధనలో ఈ మాట వాడబడనే లేదు. దానికి సాటి అయిన మాటే లేదు. అపోస్తలుడు కానివాడు తాను అపోస్తలుడు అని చెప్పుకునే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. II కోరింథీ 11:13లో వారి గురించి పౌలు ప్రస్తావించాడు. “క్రీస్తుయొక్క అపోస్తలుల వేషము ధరించుకొనువారైయుండి దొంగ అపోస్తలులును, మోసగాండ్రగు పనివారునైయున్నారు.” అబద్ధ ప్రవక్తల నైజము, వారి క్రియారూపక స్వరూపము ఇక్కడ స్పష్టమవుతున్నది.

         రెండవది, ప్రవక్తలు. ఈ బాధ్యత, పరిచర్య పాత నిబంధనలోని ప్రవక్తల వంటిది కాదు. క్రొత్త నిబంధన పాత నిబంధనలోని ఏలియా, యిర్మీయా, యెషయా, యోనా, యోవేలు, సమూయెలూ, దానియేలూ మొదలైన ప్రవక్తల విషయం ప్రస్తావిస్తుంది, ప్రవక్తలుగా వారిని గుర్తిస్తుంది. క్రొత్త నిబంధనలో మొట్ట మొదటిసారి ప్రవక్త అనే మాట మత్త.1:22లో వాడబడింది. దేవదూత యోసేపుతో మరియను తన భార్యగా అంగీకరించి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబోయే శిశువునకు యేసు అని పేరు పెట్టాలని బోధించినపుడు “ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు” అని వ్రాయబడింది. క్రీస్తుకు 700 సం|| పూర్వం యెషయా ప్రవక్త యేసు ప్రభువు కన్య మరియ గర్భములో జన్మించనున్న విషయమును ప్రవచించాడు. ప్రవక్త అనే ఈ మాట పాత నిబంధన లోనుండి క్రొత్త నిబంధన లోనికి తీసుకొనబడింది.

         ప్రవక్త అంటే జరగబోయే సంగతులు ముందే చెప్పేవాడు. ప్రవక్త అంటే జరగబోయే చెప్పేవాడు. లేదా దేవుని వద్దనుండి తాను తీసుకొచ్చిన మాటలు చెప్పేవాడు. పాత నిబంధనలో ప్రవక్తను దేవునివద్దనుండి వచ్చిన మాటలు చెప్పేవాడు అనే వారు, లేదా చూచేవాడు అని పిలిచేవారు. సాధారణంగా ఒక వ్యక్తికి తెలియని సంగతులు ప్రవక్త దేవుడు చూపించింది చూచి చెప్పేవాడు. క్రొత్త నిబంధనలో ప్రవక్త అంటే గ్రీకు భాషలో జరగబోయేది చెప్పేవాడు. అది క్రొత్త నిబంధనలో 161సార్లు వాడబడింది.

         మూడవది, బోధకులు. ఇది కూడా ప్రాముఖ్యమైన పరిచర్య. దీనికి సరియైన గ్రీకు మాట “డిడాస్కాలస్” 57 సార్లు వాడబడగా, “బోధ” అనే మాట 91 సార్లు వాడబడింది. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన నికోదేము ఏమన్నాడు: యోహాను సువార్త 3:2 లో ఉన్నది. బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధ కుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేదని ఆయనతో చెప్పెను.” అనగా ఒక బోధకుడు సత్యమును బోధించాలి. బోధకుడు ఎవరు అనగా కేవలం బోధ మాత్రమే కాకుండా, ఇదిగో చూడు చేసి చూపిస్తాను అని చేసేవాడు.

         ఆ తరువాత మహత్కార్యముల గూర్చి వ్రాయబడింది. అదే మాట అ. కా. 1:8లో శక్తి అనే మాటకు కూడా వాడబడింది. లేదా బలము పొందడం అని అర్ధం. ఆ తరువాత, స్వస్థపరచు కృపావరముగలవారు. ఈ వరమును ఎవరు ప్రభువుకు ఇస్తే వారు చేతులుంచినపుడు ప్రజలకు స్వస్థత కలుగుతుడి. ఇక ఆరవ పరిచర్య, ఉపకారములు చేయువారు. అనగా పరిచర్య పని భారము ఎక్కువైనపుడు కొంత సాయపడి భారము తగ్గించేవారు. సంఘ పెద్దలు, పరిచారకులు ఈ విధంగా సంఘ కాపరులకు తోడ్పడాలి. వారు కాపరి అధికారంకు క్రింద, ఆయన అనుమతి, అంగీకారముతో సంఘములో సహాయము అవసరమైనవారికి సహాయము చేయాలి. ఆ తరువాత ప్రభుత్వము చేయువారు. ఈ వరము కలిగిన వారు పరిస్థితికి తగట్టుగా సలహా ఇచ్చి పరిస్థితులను బాగుపరిచేవారు. నిజానికి ఈ మాట ఏ అర్ధమిచ్చే మాటో మనము గ్రహించాలి. ఒక పడవకు, చుక్కాని వద్ద కూర్చొని పడవను చేరవలసిన చోటికి చేర్చడానికి సరియైన పని చేసే వ్యక్తికి ఇదే మాట వాడబడింది. అ.కా. 27:11; ప్రక. 18:17. ఇక చివరలో భాషలు మాట్లాడే వరం, లేదా పరిచర్య. “నా నా భాషలు” అనే మాటకు వాడబడిన మాట “జాతులు” అనే అర్ధమిచ్చే మాట. భాషలు అనగా ఏదో భావోద్రేకాలతో ఎవరికీ అర్ధం కానీ భాష మాట్లాడడం అని కాదు, గాని వేరు వేరు భాషలు నేర్చుకొని వాటిలో నైపుణ్యం సంపాదించడమని అర్ధం.

         కాబట్టి, ఎనిమిది రకాలైన పరిచర్యలు గుర్తించబడ్డాయి. అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, అద్భుతములు చేసేవారు, స్వస్థపరిచే వరము కలిగినవారు, సహాయము చేసేవారు, ప్రభుత్వము చేసేవారు, వేరు వేరు భాషలు మాట్లాడేవారు. మీకు దేవుడు ఏ వరము, శక్తి, కృపావరము ఇచ్చాడో, ఇస్తున్నాడో తెలుసుకోవాలంటే చాలా భారముతో ప్రభువు సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టవలసి ఉంటుoది. దానికి అవసరమైనంత మహా కృప సంఘపు శిరస్సు అయిన యేసు క్రీస్తు ప్రభువే మనకందరికీ ఒక్కొక్కరికీ అనుగ్రహించుగాక!

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...