I కోరింథీ-39 11:17-34
ప్రభువు బల్లను సరిగా ఆచరించి అవలంబించడం - మూడవ భాగము
శ్రోతలందరికీ ఏ తారతమ్యము లేకుండా, ప్రతి ఒక్కరికీ, ఒక్కొక్కరికీ శుభములు! వారాలు గడుస్తుంటే నెలలు
జరిగిపోతున్నాయి, త్వరలోనే సంవత్సరం కూడా ముగిసిపోవచ్చు. ఎంతగా దేవుని వాక్యమును మనము పఠించి,
లోతుగా అధ్యయనం చేస్తుంటే, అంతగా మార్పు చెందాలి. చెందడం లేదంటే, విద్యార్ధులు ఏదో ఒక టెక్స్ట్ బుక్ స్కూల్లో
చదువుతున్నట్టే. పరిశుద్ధ గ్రంధం బైబిల్లోని ప్రతి ఒక్కమాట, దేవుని నోటిమాట. దాని విలువ మీకర్ధమవుతుందా?
చదివినంత మాత్రాన ఎవ్వరూ విశ్వాసి కారు. ఎన్ని సార్లు చదివి ఏ మార్పు లేకుండా ఉంటే, మారుమనసు పొందినట్టు
కాదు. హృదయం మార్పు చెందినపుడే మారు మనసు కలుగుతున్నట్టు. ప్రార్థన:
ప్రభువు బల్ల అతి ప్రాముఖ్యమైనది గనుక ఇంత విపులంగా వివరంగా అధ్యయనం చేస్తున్నాము. ప్రభువు బల్ల
లో యోగ్యంగా పరిశుద్ధంగా పాలు పొందడానికి రెండు మార్గదర్శకాలు ఇప్పటివరకు అధ్యయనం చేశాము కదూ! ఈ
పూట మూడవ మార్గ దర్శకం అధ్యయనం చేద్దాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి, ప్రశాంతంగా నేర్చుకుందాం.
I కోరింథీ 11:28-34
“ కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.
29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.
30. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగు లునై యున్నారు; చాలమంది నిద్రించుచున్నారు.
31. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.
32. మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.
33. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చునప్పుడు ఒకనికొరకు ఒకడు కనిపెట్టుకొని యుండుడి.
34. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు, ఎవడైనను ఆకలిగొనినయెడల తన యింటనే భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును.
ఇక్కడ ఆపో. పౌలు సరిగ్గా పరిశుద్ధాత్మునిద్వారా మన హృదయాల్లో దూసుకుపోయి మాట్లాడు తున్నాడు. పభువు బల్ల దగ్గరికి నీవు, నేను సమీపించేటపుడు, ఎవరిని వారు జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఇది ఎంత అత్యవసరమో గమనిస్తున్నారా? “ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను;” ఇతరులు మిమ్మల్ని పరీక్ష చేయడం కాదు, ఎవరిని వారే పరీక్షించుకోవాలి! ఆత్మాభిమానం కాదు, అంతర్గతంగా, హృదయము లోపలి భాగాలను ఎవరంతట వారే పరీక్షించుకోవాలి. అవిశ్వాసి ఇది చేయలేడు. ఎన్నటికీ చేయలేడు. అహం అడ్డొస్తుందికదా! ప్రియ శ్రోతలూ, మనమంతా దేవుని సన్నిధిలో అయోగ్యులమే. మన ప్రభువు చెప్పిన పాపి అనబడ్డ సుంకరి లాగా రొమ్ముకొట్టుకుంటూ, అనగా వేదన చెందుతూ, “దేవా, పాపినైన నన్ను కరుణించుము” అంటూ మొరపెట్టాలి. లూకా. 18:13. అవును, మనలో ప్రతి ఒక్కరిలో అయోగ్యత ఉన్నది. స్వపరీక్ష చాలా ప్రాముఖ్యం.
ఎవరైనా ప్రభువు బల్లలో అయోగ్యంగా పాలు పొందితే, స్వంతానికి శిక్ష, దండన తెచ్చుకుంటాం. అది ప్రభువు శరీరాన్ని అపవిత్రపరుస్తుంది. పౌలు హెచ్చరిస్తున్నట్టుగా, ప్రబువు శరీరమని వివేచన, భయము, పరిశుద్ధత లేకుండా పాలుపొందితే దండన తప్పదు. ప్రభువు బల్ల ను సమీపించేటపుడు ప్రభువు బల్లలోని సాటిలేని విశిష్టతను జాగ్రత్తగా ఎవరిని వారు పరీక్షించుకోవడం అత్యవసరం.
శ్రోతలూ, ఎవరిని వారు పరీక్షించుకుంటే దేవుని తీర్పును తప్పించుకుంటాo. మనలను మనమే విమర్శించుకుంటే, మనకు విమర్శ, తీర్పు, ఉండదు. నేరారోపణ, తీర్పు, ఖండన తప్పించుకోవడానికి మార్గము దేవుని క్రమశిక్షణకు లోబడడమే! ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రభువు క్రమశిక్షణ అనుభవించాలి. మరోకచోట, అపోస్తలుడు, మనము క్రమశిక్షణ పొందకపోతే నిజమైన పిల్లలము కాదని బోధించాడు. అప్పుడు మనము దుర్బీజులమవుతాము. హెబ్రీ. 12:5-11 చదవండి.
ఆ తరువాత ఆపో. నిగ్రహశక్తి, లేదా ఆశానిగ్రహము గురించి మాట్లాడుతున్నాడు. నిగ్రహశక్తితో మనము ప్రభువు బల్ల ను సమీపిస్తాము. క్రూరమైన దుష్టమనసుతో ప్రభువు బల్ల ను సమీపించవద్దు. ప్రభువు బల్ల వద్ద మనమంతా సరియైన వాతావరణం ఉంచాలి. ఎవ్వరూ ఉన్నదున్నట్టు యోగ్యులు కారు. మనకు యోగ్యత కలిగేది ప్రభువు రక్తము చేతనే! అమెన్! లేఖనం బోధిస్తున్నట్టుగా ప్రభువు బల్ల యెదుట క్రీస్తు రక్తముతో కడుగబడి ఆయన ఎదుట నిలబడాలి.
ఒక ప్రముఖమైన బైబిల్ పండితుడు ఇచ్చే ఉపదేశం జాగ్రత్తగా విని, విధేయత చూపిద్దాం. ప్రభువు బల్ల మనకు నేర్పిచే వాస్తవమైన పాఠం ఏమిటంటే క్రీస్తు ప్రజలమైన మనము పవిత్రంగా ఆయనను సేవించాలి. అంటే పవిత్రంగా జీవించాలి. పాపమును ఏ రూపములోనైనా రూపుమాపాలి. పాపముజోలికి మనము పోతే మనమే కాదు మనతో ఉన్న ఇతరులు కూడా దేవుని దుఃఖమును రుచిచూడాల్సివస్తుంది. ఏమిటి? కోరింథు సంఘపువారు ప్రభువు బల్ల అనే ఈ నియమం, చట్టం యొక్క పరిశుద్ధ స్వభావము తెలుసుకోవాలని వారిమీద శిక్షలు, తీర్పులు ప్రభువు మోపాడు. వాటిద్వారా, క్రైస్తవులు సరియైన రీతిలో, యోగ్యముగా ప్రభువు బల్ల లో పాలు పొందుతారు.
కాబట్టి, ప్రభువు బల్ల సరియైన రీతిగా, యోగ్యంగా పరిశుద్ధoగా పాలు పొందడానికి ఇవ్వబడిన మూడు మార్గదర్శకాలు మరోసారి:
1.అక్రమకారులను హెచ్చరించి, ఖండించాలి. ఇది సంఘపెద్దలు, సంఘకాపరులు, దేవుని సేవకుల పని. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏమి లెక్క చెప్తాము? ఆలోచించండి.
2.ప్రభువు మరణమును జ్ఞాపకము చేసుకొని, పరిశుద్ధంగా పాలు పొందాలి. నీకోసం మరణించిన ప్రభువు కోసం నీవు ప్రతి దినం సిలువనెత్తుకోవాలి, శ్రమలు సహించాలి, నిందలు భరించాలి. ఇది ప్రభువు శిష్యులకు ఇచ్చిన ఆదేశం.
3.అయోగ్యంగా పాలు పొందేవారిని గద్దించాలి, దండించాలి. సరిచేయాలి. స్వపరీక్ష అత్యవసరం. స్వంతంగా విమర్శ చేసుకుంటే, ప్రభువు తీర్పు, దండన తప్పించుకోవచ్చు. కానీ ఆ విధంగా చేసుకోకపోతే, ప్రభువు క్రమశిక్షణలో పెడతాడు. కారణం, ప్రేమతో తన స్వంత పిల్లలను శిక్షిస్తాడు.
ప్రార్థన:
No comments:
Post a Comment