I కొరింథీ అధ్యయనం-28 9:19-27
జయించడమెలాగు ? (రెండవ భాగము)
రేడియో వద్ద కూర్చొన్న ప్రతి ఒక్కరికీ, ఒక్కొక్కరికీ యేసు క్రీస్తు ప్రభువు శుభకరమైన నామములో శుభములు! మీరు బాగున్నారా? మీరే స్థితిలో ఉన్నారో, మన సృష్టికర్త యేసు క్రీస్తు ప్రభువునకు బాగా తెలుసు. ఆత్మహత్య విషయం ఆలోచిస్తున్నారా? ఆగండి! నిరాశలో కూరుకుపోయిన మీ మనసుకు ఉపశమనం కలిగించే శక్తి యేసు క్రీస్తు ప్రభువునకు సమృద్ధిగా ఉన్నది. ఆయనకు నిరీక్షణ కర్త అని పేరు. రోమా. 15:13 “కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.” నిరీక్షణకర్తయగు దేవుడు” అనే మాటలు సావధానంగా అలకించండి. అవును, మీలో నిరీక్షణను ఇప్పుడే కలిగించగల శక్తిమంతుడు. ప్రార్ధించుకుందాం, తలలు వంచండి. ప్రార్థన:
“జయించడమేలాగు?” అనే అంశమును I కోరింథీ 9:19-27 ఆధారంగా అధ్యయనము చేస్తున్నాము కదూ! రండి రేడియోకు దగ్గరాగ్గా వచ్చి కూర్చోండి, రాలేనివారు మీరున్నచోటనే సావ ధానంగా అలకించండి. పోటీలలో పాల్గొనే వారితో క్రైస్తవ విశ్వాస జీవితము పోల్చబడుతున్నది. శక్తినంతా కూడగట్టుకొని పోరాటానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. వారి గురి మెడల్ సాధించడమే! బహుమానము చేత పట్టుకోవడమే! మీరు నేను, మన విశ్వాస జీవితములో బహుమానము సాధించడానికే నిర్ణయించ బడ్డాము. బహుమానము పొందడానికే మనము పరుగెత్తాలి. మన ప్రభువు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభువు మనతో ఉన్నాడు. మీరే స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిపోయినా, యేసయ్య మిమ్ములను బలపరచగల సమర్ధుడు. మీరు పరుగెత్తడానికి సిద్ధంగా ఉన్నంతవరకు అను క్షణం ఆయన శక్తిని, జ్ఞానమును, తన అపరిమితమైన కృపను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. I కోరింథీ 9:24,25 వచనాలు. “24. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.” ఈ లేఖన భాగపు వివరణ ఒక గొప్ప దైవజనుని ద్వారా నేర్చుకుందాం. ‘ఒక వ్యక్తి తాను నమ్మినదాని విషయములో నిజముగా యధార్ధముగా ఉండడం సాధ్యమా? అతడు చిత్తశుద్ధితో మనఃపూర్వకంగా పోరాడుతూ, తన మనసు, శక్తివంచన లేకుండా జీవిస్తే ఇతరులకు అభ్యంతరంగా ఉండడు. పరిమితులతో జీవిస్తూ, క్రమశిక్షణలో ఉండడమంటే ఇదే! దేవుని నెరుగని వారు సహితము ఏదైనా సాధించడానికి నైపుణ్యం, శక్తి, బలము, శారీరక సమర్ధత, మానసిక స్థిరత్వముతో పోరాడుతూ, అన్నిటిలో పరిమితులతో జీవించడం అవసరమని భావించినపుడు, నిత్యత్వము, నిత్య జీవము, పరలోకమునకు సంబంధించిన విషయాల్లో ఇంకెంత అవసరo? అన్ని ప్రయోగాలలో నిరూపించబడిన సత్యమేమిటంటే, ఎవరైనా గొప్పది ఏదైనా సాధించాలనుకుంటే, మితముగా ఉండడం, పరిమితులతో మెలగడం, తప్పనిసరి. మత్తు పానీయాలకు, సుఖభోగాలకు, భోజనప్రియత్వానికి ఇక మరేదైనా మీరు, నేను, బహుమానము పొందడానికి అడ్డుగా ఉంటే దాన్ని విడిచిపెటాడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియ సోదరీ, సోదరుడా, బహుమానము పొందడానికి ఏది ఆటంకముగా ఉన్నా, దాన్ని నశింపచేయడం తప్పనిసరి. మన ముఖ్యమైన గురిని విస్మరించకూడదు. మీ తోటి విశ్వాసిగా ఈ మాటలు చెబుతున్నాను.
ఇక ఆపో. పౌలు వివరించే మూడవ మార్గము మీ సామర్ధ్యమును కుదిర్చి సర్దిపెట్టుకొనండి. 26,27 వచనాలు. “26. కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడనుకాను, 27. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.” లేఖనము చెబుతున్నదేమిటి? అవసరమైన వాటిమీద మాత్రమే దృష్టించండి. నేను గురిలేనివానిలాగా పరుగెత్తడం లేదని ఆపో. సాక్ష్యమిస్తున్నాడు. గురివైపే పరుగెత్తుతుదాం. క్రైస్తవ విశ్వాసము విషయములో చేయవలసినవి ముందే నిర్ణయించబడ్డాయి. మనము త్రోవను వెతుక్కునే అవసరము లేదు. మీ విశ్వాసము నిజమైనదైతే ఇప్పుడు త్రోవలోనే ఉన్నట్టే! మన ప్రభువు చెప్పిన ఇరుకుద్వారము ఇదే! “జీవమునకు పోవుద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది” మత్త. 7:14 మనము ప్రస్తుతమున్న ద్వారము ఇదే! వెతుక్కోవలసిన అవసరములేదు. కాని, గట్టి నిర్ణయముతో పోరాడాలి. “గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు” అనే పౌలు మాటల్లో ఎంత పట్టుదల కనిపిస్తున్నది? పౌలు దినల్లో “బాక్సింగ్” అనే ఆట ఉండేది. దానిలో ఎదురాడు తున్న శత్రువును మట్టుమెట్టడమే గురి. ఎదురుగా శత్రువుండగా ఆ శత్రువును ఎదిరించకుండా గాలిలో ముష్టియుద్దం చేసే వ్యక్తిని మీరేమంటారు? బుద్ధిహీనుడేగదా!
మీ శరీరాన్ని అదుపులో పెట్టుకొనండి. “నా శరీరమును నలగగొట్టి దానిని లోపరచు కొనుచున్నాను” అనే మాటలు గమనించరా? తన శరీరాన్ని సుఖానికి బానిసగా పౌలు చేయలేదు. తన శరీర స్వభావములోని దురాశలకు పౌలు దాసోహమనలేదు. తలదించలేదు. కాబట్టి వ్యక్తిగత క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. నిన్ను నీవు అదుపులో పెట్టుకో. కొంచెం బలహీనంగా ఉండే ఘడియలలో కలిగే పాపపు కోరికలను జయించాలి. మనము చేసే క్రియలు మన మాటలకంటే బిగ్గరగా మాట్లాడతాయి. ఎంత బిగ్గరగా అంటే మన మాటలు ఎవ్వరూ వినరు. అంచేత శరీరమును సంపూర్ణంగా అదుపులో పెట్టుకోవడం అత్యవసరం.
ప్రియ సోదరుడా, సోదరీ, ఈ నాటి లేఖనభాగములోని చివరి మాటలు ఎంత సవాలును మనలో ప్రతి ఒక్కరిముందు ఉంచుతుందో తెలుసుకున్నారా? పౌలు మాటల్లోనే విందాము. “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో....” మనము బోధించేది ఏదో అది మనము జీవించాలి. గమనించండి, ఎల్లప్పుడు మన మొదటి సవాలు, “ప్రస్తుతము” గతమంతా అయిపోయింది, దానిగురించి చింతిస్తూ కూర్చొంటే, ప్రస్తుతమును పోగొట్టుకుంటాము. కాని భవిష్యత్తు ముందు ఉన్నది. అది రానున్నది. కాబట్టి మనము చేయగలిగిందంతా ప్రస్తుతములోనే! ప్రియ సోదరుడా, సోదరీ, ప్రస్తుతము మీద ఏకాగ్రతతో, గట్టి నిర్ణయముతో దృష్టి సారించి మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. శ్రద్ధతో, శ్రమతో ప్రతి అడుగు జాగ్రత్తతో వేస్తూ ప్రతి నిమిషము మన ప్రభువు యేసు క్రీస్తు వారిని సంతోష పెట్టడానికి జాగ్రత్తపడాలి. ఈ పరుగు పందెములో అదే ప్రాముఖ్యమైన విషయం!
కొందరినైనా ప్రభువు కోసం సంపాదించగలమా? 22వ వచనం గమనించండి. “ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని...” “సజీవ నిరీక్షణ” యొక్క గురి ఇదే! నా వ్యక్తిగత లక్ష్యం అదే! ప్రతి క్రీస్తు శిష్యుని గురి అదే కావాలని ప్రభువు మిక్కుటముగా కోరుతూ ఉన్నాడు. అప్పుడే జయించినట్టు, బాప్తిస్మము తీసుకోగానే అయిపోలేదు. బైబిల్ పట్టుకోగానే రక్షించబడ్డట్టు కాదు. దేవుని సంఘముతో బాటు పాటలు పాడినంత మాత్రాన స్తుతి ఆరాధన కాలేదు. చివరకు దేవుని వాక్యమును బోధించినంత మాత్రాన సిద్ధించలేదు. ప్రియ సోదరీ, సోదరుడా, కొందరినైనా దేవుని రాజ్యము కోసం సంపాదించాలి. నీవు నిజమైన విశ్వాసివి అయితే ఇదే నా సవాలు:
• నశించిన వారిని సంపాదించడానికి నీ ప్రయత్నాలలో ఏ లోపము లేకుండా చేయాలి.
• సత్యము మీద ఏకాగ్రతను పొందడానికి నీ శక్తినంతా కూడగట్టుకో!
• ప్రతి ఒక్క అడుగును ఆచి తూచి వేసి ప్రతి నిమిషం ప్రభువు కోసం అర్ధవంతగా జీవించేలా మీ సామర్ధ్యమును కుదిర్చి సర్దిపెట్టుకొనండి. నీవింకా యేసు ప్రభువును నీ జీవితానికి హృదయానికి బయటనే ఉంచినట్లయితే, మిక్కటమైన ప్రేమతో మీకీ మాటలు చెప్పాలి. ఇవి స్వయానా యేసు క్రీస్తు ప్రభువు మాటలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము “ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.” 12వ వచనం “ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.” యేసు క్రీస్తును నిర్లక్ష్యం చేసినవారికి తీర్పు తప్పదు. ఎందుకంటే తీర్పు ఇప్పటికే ప్రతి ఒక్కరిమీద ఉన్నది. “ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను.” యోహాను సువార్త 3:18 విశ్వాసముతో విధేయతతోయేసు క్రీస్తు ప్రభువు వద్ద నీ పాపమును నీవు ఒప్పుకొని ఆయన అనుగ్రహించే క్షమాపణను అంగీకరిస్తే నిత్య తీర్పును, నరకమును తప్పించుకొని నిత్య జీవమును పొందుతావు. మీ స్వంత మాటలతో ప్రార్థన చేసికొనండి. మీకు దేవునితో సంబంధం ఎలా కలిగి ఉండాలో సహాయం కావాలంటే ఫోన్ చేయండి: 8143178111.
No comments:
Post a Comment