I కొరింథీ అధ్యయనం-29 10:1-13~(1) విజయమును సంపాదించుకోవడం-మొదటి భాగము

 I కొరింథీ అధ్యయనం-29   10:1-13~(1)

              విజయమును సంపాదించుకోవడం-మొదటి భాగము
    జీవితమంటే ఒక కొండ ఎక్కినట్టే! ఎంతో కష్టతరంగా ఉంటుంది. ఎదురీదుతూనే ఉండాలి. కొంచెముసేపు అదమరచినా మునిగిపోవచ్చు. జీవితం ఎల్లప్పుడూ పోరాటమే! దానికితోడు మన ఆరోగ్య  సమస్యలు ఉండనే ఉంటాయి.  కొందరికి భయము, ఆందోళన ఎక్కువ. మరికొందరికి ఆర్ధిక సమస్యలు. మాసం చివరికిరాకముందే చేతులో డబ్బు అయిపోతుంది. ఇంకా కొందరికి ఇరుగుపొరుగు వారితో సమస్యలు. వారు మనతో సహకరించరు. మరి కొందరికి కుటుంబస్థులు, బంధువులు, హాస్పిటల్లో ఉండవచ్చు. ఈ సమస్యలతో ఎలా జీవిస్తాం? అవును, శ్రోతలూ, జీవితం కష్టతరంగా ఉంటున్న విషయం మీరు వ్యక్తిగతంగా అనుభవిస్తూ ఉన్నారేమో! కొందరు ఉత్సాహపరిచే సందేశాలిచ్చేవారు అన్ని ప్రశ్నలకు “రెడీమేడ్” సమాధాన్నలున్నట్టు బుకాయిస్తూ ఉంటారు. వారి జవాబులు మనకు సహాయం చేయలేకపోయినపుడు మీరు మానసిక వైద్యుని దగ్గరికి వెళ్ళండి, అని ఉచిత సలహా ఇస్తూ ఉంటారు.   

    రండి, ఈ పూట మనమున్న మన పరిస్థితులలో విజయమును ఎలా సంపాదించుకోగలమో అధ్యయనం చేద్దాం, రేడియోకు దగ్గరగా వచ్చి కూర్చోండి. సావధానంగా వినండి. వారిలాగా ఏదో ఒకటికాదుగాని, దేవుని పరిశుద్ధ గ్రంధములోనుండి మీరు, నేను ఎదుర్కుంటున్న పరిస్థితులలోనే ఎలా విజయము సంపాదించుకోగలమో ధ్యానించుదాము. I కోరింథీ 10:1-13 వచనాల్లోనుండి పరిశుద్ధాత్ముడు మనతో ఏమి బోధిస్తున్నాడో జాగ్రతగా నేర్చుకుందాం.
    మనమంతా క్రైస్తవ జీవితములో విజయమును సంపాదించుకోవడానికి ఆపో. పౌలు మూడు పాఠాలు నేర్పిస్తున్నాడు. మొదటి పాఠము, నీ చుట్టున్న పరిస్థితులను అంచనా వేయడం అనే పాఠం. మొదటి 5 వచనాలు: “1సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;౹ 2అందరును మోషేనుబట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;౹ 3అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;౹ 4అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే.౹ 5అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇశ్రాయేలు చరిత్రలో ఒక క్లిష్ట పరిస్థితిని ఆపో. పౌలు పరీక్షిస్తున్నాడు. అది ఎర్ర సముద్రపు సన్నివేశం. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి విమోచించబడుతున్నారు. వారి వెనుక ఫరో తన బలమైన సైన్యంతో వెంటాడుతూ  ఉన్నాడు. వారికి ముందు లోతైన ఎర్ర సముద్రం ఉన్నది. వారా సమయంలో ముందుకు వెళ్లలేరు, వెనుకకు మళ్లలేరు. అది అప్పటి జీవిత పోరాటం. కానీ దేవుడు మోషే ద్వారా వారిని సముద్రములో గుండా నడిపించాడు. దేవుని మేఘపు భద్రతలో వారు సముద్రము మధ్యలోనే ఆరిన నేలమీద నడిచివెళ్ళారని లేఖనం సెలవిస్తుంది. సముద్రమును రెండు పాయలుగా చేసి దేవుడు వారిని విడిపించాడు. వారి కుడిప్రక్కన, ఎడమప్రక్కన నీళ్ళు గోడలాగా ఉన్నాయి. ఈ అనుభవమంతా ఒక మహా అద్భుతం! దేవుడు తన ప్రజలపక్షంగా అద్భుతరీతిగా వారి పరిస్థితులలో కలుగచేసుకున్నాడు, జోక్యం చేసుకున్నాడు.
    ప్రియ సోదరీ, సోదరుడా, నీ జీవితపు పరిస్థితి ఏమిటి? ప్రభువు నీ జీవితములో ఎప్పుడైనా కలుగచేసుకున్నాడా? నీ జీవితమంతటినీ తలపోసుకొని చూడు. తీరిగ్గా కూర్చొని ఆలోచించు.
    ఆ తరువాత సీనాయి ప్రాంతంలో వారు ప్రయాణం చేస్తున్నపుడు ప్రభువు వారిని ఎలా భద్రపరిచాడో పౌలు పరీక్షిస్తున్నాడు. ఆహారము లేదు, నీరు లేదు. దేవుడు వారికి ప్రతి ఉదయం మన్నా ను ఇచ్చి పోషించాడు. అరవరోజు రెండురోజులకు సరిపడ ఆహారము దొరికేది. వారికి నీరు లేనప్పుడు బండను కొట్టమని ప్రభువు మోషేకు ఆజ్ఞాపించాడు. బండలో నుండి నీరు పెల్లుబుకింది. వింటున్నారా, శ్రోతలూ? బండలోనుండి నీటి ప్రవాహము! ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! లేఖనము సెలవిస్తున్నట్టుగా ఆ బండ వారిని వెంబడించాడు, ఆయన యేసు క్రీస్తు ప్రభువు, హల్లెలూయ! నీవు యేసు క్రీస్తునందు నిజముగా ఇప్పుడు నమ్ముకుంటున్న వ్యక్తివి, అయితే ప్రభువు నిన్ను వెంబడిస్తున్నాడు.
    అయినప్పటికీ, దేవుడు వారినిబట్టి దుఃఖపడ్డాడు. ఎందుకు? వారి విశ్వాసము క్రియలలో కనిపించలేదు. అందుచేత ప్రభువు వారిని త్రోసివేశాడు. అందుచేత, ప్రియ సోదరీ, సోదరుడా, నిన్ను నీవు జాగ్రత్తగా పరీక్షించుకోమని హెచ్చరిస్తున్నాను. నీ జీవితపు నేపధ్యం ఏమిటో గమనించిచూడు. నీ గతం పరిశుద్ధమైనది కాకపోవచ్చు. అయినా ఫర్వాలేదు. అరణ్యములో మరణించిన ఆ యూదులకు కూడా అంత మంచి నేఫధ్యం కాదు. మీ నేఫధ్యం ఏదైనా సరే, విజయము సంపాదించాలంటే, జాగ్రత్తగా నీ పరిస్థితిని అంచనా వేసుకోవాలి. మీ తల్లితండ్రులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు మీ విశ్వాసానికి దోహదకరంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కుటుంబాల్లో తల్లితండ్రులు, తాతలు, అమ్మలు, నాన్నమ్మలు బలమైన విశ్వాసులు, ప్రార్థన పరులు అయిఉండవచ్చు, మరి కొందరికి కాకపోవచ్చు. ఎవరిమీద ఆధారపడకుండా దేవుని వాక్యమే, మీ చేతిలోని పరిశుద్ధ గ్రంధమే మీకు చుక్కానిగా, మీలో నివసిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్ముని స్వరమును వింటూ శోధనలను జయించి ముందుకు సాగిపోదాం. మీ వ్యక్తిగత విశ్వాసం అత్యంత ప్రాముఖ్యమైనది. దాన్ని కాపాడుకొనండి. మీ సాక్ష్యం అన్నింటికంటే విలువైనది, దాన్ని మలినము, మచ్చ, లేని స్వచ్చమైనదిగా చేసుకొనండి.
     రెండవ పాఠము సహవాసము, సాంగత్యము అనే పాఠము. 6-10 వచనాలు: “6వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.7–జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి.౹ 8మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.౹ 9మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.౹ 10మీరు సణుగ కుడి; వారిలో కొందరు సణిగి సంహారకునిచేత నశించిరి.౹”  ఈ భాగములో సాంగత్యము, సహవాసము చేసే 5 విషయాలు ఉన్నవి. జాగ్రత్తగా వింటున్నారా, శ్రోతలూ? ఇవి విలాసవంతమైనవి కావు. ఆకర్షించేవి కావు, కానీ అవి చాలా దుర్మార్గమైనవి. 1) దురాశ లేదా అత్యాశ. వారు ఆశించినట్లు చెడ్డవాటిని ఆశించకండి. ఉన్నదున్నట్టు చెప్పాలంటే, మనకిది పుట్టుకతోనే వచ్చింది. హవ్వ, ఆదాములు తోటలో పాపము చేసినప్పటినుండి మనకు జన్మతోనే దుష్టత్వము మీద దురాశ ఉన్నది. దానిని అదుపులో ఉంచుకోవాలి, హద్దులు దాటనీయకూడదు. 2) పౌలు విగ్రహారాధకులు కావద్దని హెచ్చరిస్తున్నాడు. విగ్రహారాధనతో, విగ్రహారాధకులతో పొత్తులు పెట్టుకోవద్దు. మీకు మీరు కనిపించని ఏ విగ్రహాన్ని హృదయములో పెట్టుకోకండి. అది ఏదైనా సరే, దేవునికి మీకు అడ్డుగా వచ్చేదెదైనా అది విగ్రహమే! 3)వ్యభిచరించవద్దు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం చేస్తున్నపుడు విగ్రహారాధన చేసే మోయాబీయులతో కలిసిపోయారు. దేవుడు నిశ్చయంగా వారితో కలవవద్దని హెచ్చరించాడు. కానీ ఏది చేయవద్దని ప్రభువు చెప్పారో, అదే వారు చేశారు. వ్యభిచారములో మునిగిపోయారు. 4)ప్రభువును పరీక్షించవద్దు. కొందరు, దేవుడు నిజముగా దేవుడైతే ఇది చేయాలి, అది చేయాలి, అంటూ ఉంటారు. ఇది అవిశ్వాసులకు నిశ్చయమైన ఉదాహరణ. సాతానును వెంబడించే వారు ఇది చేస్తూ ఉంటారు. దీన్ని విడిచిపెట్టండి. 5)సణుగుకోవద్దు. ఇశ్రాయేలీయులు సణుక్కుంటూ జీవించేవారు, ఇక్కడ ఉండేబదులు  ఐగుప్తులో ఎంత బాగుండు. ఇది ఇలా ఉంటే ఎంత బాగుండు, అది అలా ఉంటే ఎంత బాగుండు. వీటన్నిటినీ చేయడం ఖచ్చితంగా విడిచిపెట్టండి. మంచి సహవాసము, సాంగత్యము దుష్టత్వముతో స్నేహము చేయదు. ఈ 5 సాంగత్యములు, స్నేహములు, సహవాసములు ఏ మాత్రము మీ జీవితాల్లో ఉండకుండా చూసుకొనండి. మంచి పళ్ళ గంపలో ఒక్క కుళ్లిపోయిన పండు ఉన్నా మిగిలినవన్నీ కుళ్లిపోవడానికి ఆ ఒక్కటి కారణమవుతుంది”. కానీ మంచి పళ్ళు కుళ్ళిపోయిన పళ్లను బాగుచేయలేవు. కుళ్ళిపోయినవే మంచివాటినికూడా కుళ్లిపోయేటట్టు చేస్తాయి. I కోరింథీ 15:33లో ఆపో. పౌలు ఇచ్చిన దృఢమైన హెచ్చరిక గమనించండి: “33మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరు పును.౹”  ప్రియ సోదరీ, సోదరుడా, నిన్ను నీ జీవితములోని పరిస్థితులని తీరికగా కూర్చొని, తలపోసుకొని, దేవుని వాక్యపు వెలుగులో అవసరమైన ప్రతి మార్పు చేసుకోవడానికి ప్రభువు కృప ఎంతో అవసరము.  ప్రార్ధన:




No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...