I కొరింథీ అధ్యయనం-27 9:19-27
జయించడమెలాగు? (మొదటి భాగము)
ఓడిపోవాలనే ఆశతో పనిచేసేవారిని మీరు చూశారా? అది పని అయినా, వ్యాపారమైనా, ఆటలైనా, మరేదైనా? లేరనే సమాధానం చెప్పాలి. క్రైస్తవ జీవితములో కూడా అంతే. ప్రభువు నందు విశ్వసించనవారికందరికీ ఇతరులను ఆయన కోసం సంపాదించాలనే గురి ఉండాలి. యేసు ప్రభువు 70 మంది శిష్యులను, 12 మంది శిష్యులను ఇద్దరిద్దరినీ తన అధికారమిచ్చి పంపించారు. వారు ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్తను అందించి, సాక్ష్యమిచ్చి వారి జీవితాల్లో ఆయన చేసిన క్రియలను పంచుకున్నారు. ప్రభువు గలిలయలో ఇచ్చిన చివరి ఆజ్ఞ, “వెళ్ళండి”. “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి” మార్కు 16:15 దీన్నిబట్టి మనము ధైర్యంగా చెప్పగలిగిoదేమిటి? క్రైస్తవ్యం దాచుకునే హృదయములోనే ఉంచుకునే విశ్వాసము కాదు. సజీవ నిరీక్షణ రేడియో కార్యక్రమము ద్వారా మేము చేస్తున్నదిదే! సువార్తను, అనగా శుభవార్తను వింటున్న ప్రతి ఒక్కొక్కరికీ, అందరికీ తెలియ చెబుతున్నాము. సువార్త బంగరువాక్యములో స్పష్టమవుతుంది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” యోహాను 3:16 హల్లెలుయా! బంగారము కంటే విలువైన ఈ వాక్యమును కంఠస్థం చేయండి, మీరు వెళ్ళిన ప్రతిచోట చెబుతూ ఉండండి. నిజముగా శాంతి సమాధానాలు వెదుకుతున్న ప్రతి హృదయమునకు దేవుని శక్తిగల మాటలు నెమ్మదిని, నిరీక్షణను, కలిగిస్తాయి.
ఈ నాటి వాక్యభాగము I కోరింథీ 9:19-27. మన అంశం “జయించడమెలాగు?” ఈ లేఖనభాగములో విశ్వ్వాసిని ఆత్మలు సంపాదించడానికి సిద్ధపరచడానికి ఆపో. పౌలు కొన్ని మార్గాలు బోధిస్తున్నాడు. శ్రోతలూ, జాగ్రత్తగా వినండి.
మొదటిది, నీ ప్రయత్నాలలో ఏ లోపము లేకుండా చేయాలి. “యూదునివలె ఉంటిని” “ధరశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని” 20 వచనములోని ఈమాటలను జాగ్త్తత్తగా గమనించండి. 21వ వచనములో “ధర్మశాస్త్రము లెనివానివలె ఉంటిని” 22వ వచనములో “బలహీనులకు బలహీనుడనైతిని” అనే మాటలు గమనించండి. ఎలాగైనా వారితో మాటలాడి సువార్త సత్యమును పంచుకోవడానికి పౌలు వారితో సంబంధం కలుపుకుంటున్నాడు. కానీ తన విశ్వాసమును కానీ, తన సాక్ష్యమును కానీ తాకట్టు పెట్టలేదు, వారితో రాజీ పడలేదని స్పష్టంగా తెలుసుకొనండి. ఈ నాలుగు గుంపులవారితో సంబంధం కలుపుకున్నట్టు సాక్ష్యమిస్తున్నాడు. 1) యూదులు, 2)ధర్మశాస్త్రమునకు లోబడినవారు 3) ధర్మశాస్త్రము లేనివారు. 4)బలహీనులు. ఈ నాలుగు గుంపుల ప్రజలతో కలిసి వారిని సత్యములోనికి నడిపించాలని ఆరాటపడ్డాడు. ఆయన కేవలము ఒకదానివిషయమే శ్రమపడ్డాడు. అది సత్యమును వారికి తెలియచేయడం. యేసు ప్రభువు జీవించిన దినములలో యోహాను 3:16 ఎంత శక్తివంతంగా పనిచేసిందో ఇప్పుడు అంతే శక్తివంతంగా పనిచేస్తుంది. ఆనాడు, ఈనాడు మానవ అవసరత ఒక్కటే! ఎక్కడ చూసినా ప్రజలు మార్పు మార్పు, మార్పు అంటూ ఉన్నారు. పారుతున్ననది లాగా అంతా మారుతూనే ఉన్నది. కానీ, ప్రియ శ్రోతలూ, ఎన్నడూ మారనది ఒకటి ఉన్నదని గమనించండి. పాప క్షమాపణకు ఒక్కటే మార్గము. రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే! దేవుని మనసులో అనాదినుండి ఇదే ప్రణాళిక. పాపమునకు క్రీస్తు రక్తము అనే ఒక్కటే పరిహారము. ఇందులో ఏ మార్పు ఎప్పుడూ లేదు. “యేసు క్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు” హెబ్రీ. 13:8 ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ అంతస్తు అయినా, ఏ ప్రాంతమైనా, ఏ ఊరైనా, ఏ పేరైనా, సందేశము ఒక్కటే! పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ఒక్కడే! సువార్తను ఏ విధంగా మార్చడానికి ప్రయత్నం చేయకండి. సువార్తను పలచన చేయవద్దు. యేసు క్రీస్తు ప్రభువు తన ప్రాణమిచ్చి సంపాదించిన విమోచనను ఉన్నదున్నట్టుగానే పంచుకొనండి. అతి ప్రాముఖ్యమైన విషయమేమిటో తెలుసా, శ్రోతలూ? మన జీవితాలు దానికి అద్దం పట్టాలి. సందర్భానికి తగినట్టుగా సువార్తను చూపించాలి అనే మాటలు మీరు వినిఉండవచ్చు. సందర్భము ప్రతిచోటా ఒక్కటే, అది ప్రతి మానవునికి ఏ భేదము లేకుండా, రక్షకుడు, పాప క్షమాపణ నిరీక్షణ అవసరం. అదే మన సందర్భము. ప్రతి సందర్భములో ప్రతి ఒక్కరికీ యేసు రక్షకుని సాక్షిగా జీవించడానికి ఇప్పుడే నిర్ణయించుకొనండి.
ఆపో. బోధిస్తున్న రెండవ మార్గము నీ శక్తినంతా కూడగట్టుకో! 24, 25 వచనములు. “ 24. పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.” పౌలు ఒక మనోరంజకమైన ఉదాహరణనిస్తున్నాడు. ఆ దినాల్లో జరిగే ఆటలపోటీలు, క్రికెట్, ఒలింపిక్ గేమ్స్ లాంటిది. ప్రియ శ్రోతలూ, మనమంతా, ఒక దీర్ఘమైన పరుగుపందెము లో ఉన్నట్టు. మారథాన్ రన్నింగ్ రేస్. ఈ పందెములో వందలాదిమంది పాల్గొంటున్నారు. కొందరు ఏదో పరుగెత్తుతున్నాము, అంతే అనుకుంటారు. మానము మీద దృష్టిఉంచుకోవాలి. ఆయన మాటలు జాగ్రత్తగా గమనించాలి. “పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురుగాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా?” అందరికీ బహుమానము పొందే అవకాశము ఉందని ఉపదేశం. “బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.” మీరు నాకంటే ముందు పరుగెత్తుతున్నా, వెనుక పరిగెత్తుతున్నా ఫర్వాలేదు. మనము యేసయ్యతో పరుగు పందెములో ఉన్నామంటే బహుమానము మీద దృష్టిపెట్టాలి. శక్తి అంతా కూడగట్టుకొని పరుగెత్తుతుదాము. మీరు నేను అందరికంటే వెనుక ఉన్నా బాధ పడవద్దు. పందెములోనే ముందుకు సాగుదాము. బహుమానము పొందేటట్టు పరిగెత్తాలంటే కొంత శిక్షణ అవసరం. అన్నింటిలో కొంత మితముగా, జాగ్రత్తగా ప్రవర్తించాల్సిఉంటుంది. ఏదికూడా హద్దుకు మించి చేయకుండా, మితిమీరి చేయకుండా జాగ్రత్తపడాలి. నిష్ణాతులు కావడానికి అధిగమించడానికి ప్రయత్నించండి. ఇవి ఆటలలో, పోటీలలో, పరుగు పందెములలో అవసరమైనప్పటికీ, అంతే మోతాదులో విశ్వాస జీవితములో కూడా అవసరం. విశ్వాసజీవితములో కూడా నిష్ణాతులు కావడానికి అధిగమించడానికి ప్రయత్నించండి. ఒక క్రైస్తవునిగా నీ విశ్వాసమునకు నీ పనిలో ప్రయత్నములలో పదును పెట్టు. నీ దృష్టి ఎల్లప్పుడూ పరిశుద్ధగ్రంధం మీదనే ఉంచుకో. కీర్తనకారుడు మొదటి కీర్తనలో అన్న మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. “దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు.” నీ శక్తినంతా నీవు కూడగట్టుకుంటున్నప్పుడు ఒక క్రైస్తవునిగా నీవు అధిగమించి, నిష్ణాతుడవు కావాలని, నైపుణ్యం సంపాదించాలనే గురిపెట్టుకొని సాగుతూ ఉండాలి. క్రికెట్లో కాని, మరేపోటీలలో కాని పాల్గొనాలని ఆశించేవారు చాలా క్రమశిక్షణతో జీవిస్తారు. ఇంకా 4 సంవత్సరాలు ఒలింపిక్ గేమ్స్ ఉండగానే ఇప్పుడే శిక్షణ ఆరంభమవుతుంది. కఠినమైన క్రమబద్ధమైన ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఆ విధంగా ప్రతిదినం చేస్తూ ఉంటారు. వారి శరీరాన్ని అణచుకొని అదుపులో పెట్టుకుంటారు. వారి మానసిక శారీరక నైపుణ్యం, సామర్ధ్యం ను అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఆటలకు, పోటీలకు అవసరమైన రీతిగా శరీరాన్ని మనసును మలచుకుంటారు. ఇవి మన క్రైస్తవ విశ్వాస జీవితానికి అన్వయించుకోవాలి. మన శక్తినంతటినీ కూడగట్టుకొని, క్రమశిక్షణ, తర్ఫీదు చేసుకొని మన విశ్వాసపు పరుగు పందెములో పరుగెత్తడానికి సిద్ధపడి ఉండాలి. అప్పుడే బహుమానము పొందడానికి మనకు అవకాశముంటుంది. ప్రియ సోదరుడా, సోదరీ, నీకు బహుమానము పొందాలని ఆశ ఉందా? అయితే ఈ దినమే, ఇప్పుడే, నేడు అనే సమయముండగానే, బలమైన తీర్మానము తీసుకొని ఈ శిక్షణ ఆరంభించండి. దేవుని వాక్యము కంఠస్థం చేయండి. వ్యక్తిగతముగా పాపము ఒప్పుకుంటూ క్షమాపణ పొందుతూ విశ్వాసములో మెట్లు ఎక్కండి. మీకు అధ్యాత్మిక జీవితములో ప్రోత్సాహం, ప్రార్థనశక్తి
కావాలంటే, ఉ|| 10 నుండి 6 లోపల ఫోన్ చేయండి, లేదా మీ ప్రార్థన మనవి మెసేజ్ ద్వారా, వాట్సప్ ఆడియో మెసేజ్ కాని, వ్రాయగలిగితే స్పష్టంగా వాట్సప్ లేదా ఒక ఉత్తరంలోనైనా మీ ప్రార్థన మనవి, వ్రాసి పంపించండి. మీకు వ్రాయడము చేతకాకపోతే, ఎవరి సహాయమైన తీసుకొని చేయండి. మీకోసము ప్రార్థిస్తాము. మీకు నిజముగా ఆశ ఉంటేనే చేయండి. మీ స్వంత ప్రార్ధనతో ఆరంభించండి, మీకు సహాయకరముగా ఉండడానికి మీతో బాటు మేము ప్రార్దిస్తాము. కాని మీరు కేవలము మా లాంటి వారి ప్రార్ధనమీద ఆధారపడి మీరు ప్రార్థన చేయకుంటే, మేమేమి చేయలేము.
No comments:
Post a Comment