I కొరింథీ అధ్యయనం-26 9:1-18 దైవ సేవకుని లక్షణాలు, గుణ గణాలు-2వ భాగము

 

 I కొరింథీ అధ్యయనం-26   9:1-18(రెండవ భాగము)

దైవ సేవకుని లక్షణాలు, గుణ గణాలు-2వ భాగము 

     సజీవ నిరీక్షణ శ్రోతలందరికీ, ఒక్కొక్కరికీ శుభములు, త్రియేకదేవుని నుండి కృపా సమాధాన ములు, మీకందరికీ 

కలుగునుగాక! అనుమానము భయము ఆవరించినపుడు విశ్వాసము అడుగంటుతుంది. ఇది మీ అనుభవము  

కూడానా? అది సహజమే! భయపడకండి, అనుమానమును జయించడానికి దేవుని పరిశుద్ధమైన మాటలు మహా 

బలమును విశ్వాసమును కలిగించగల శక్తిగలవి. మీతో బాటు మీ బైబిల్ ఉన్నట్లయితే హెబ్రీ 12:2 నాతో బాటు 

చదవండి. మధ్యభాగము గమనించండి. “విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు 

మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెతుదము” కర్త అంటే జన్మనిచేవాడు లేదా పుట్టించేవాడు వాడు 

అనిఅర్ధం. అనగా లేనిచోట కలిగించగలిగిన శక్తిమంతుడు. ప్రియ సోదరుడా, సోదరీ, నీలో విశ్వాసమును కలిగించగల 

శక్తిమంతుడు యేసు కీస్తు ప్రభువు. బలహీనమైన నీ విశ్వాసమును బలపర్చగల శక్తిమంతుడు. నాకు చేశాడు. మీకు 

కూడా తప్పనిసరిగా చేస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము అంతా చదవండి, ఎన్ని మారులైనా చదవండి. 

         ఈ నాటి లేఖన భాగం: I కొరింథీ 9:1-18. అంశం: దైవసేవకుని గుణాలక్షణాలు ఇది రెండవ భాగము. 

మునుపటి అధ్యయనంలో మొదటి రెండు లక్షణాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాముకదూ!  మొదటి లక్షణము ప్రభువును 

సేవించడం ఆయనకు సర్వశక్తుడు ఇచ్చిన పిలుపు అయిఉంటుంది. ఒక వృత్తి కాదు, జీవనోపాధి కూడా కాదు. అది 

ఒక జీవిత విధానము, జీవితపు పరమావధి. దాని కోసం అతడు ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడి ఉండాలి. అది 

వ్యక్తిగతమైన పిలుపు, అతనికి సర్వశక్తునితో ఉన్న వ్యక్తిగతమైన విషయానికి సంబంధించినది. దేవునితో అతడికి ఉన్న 

అత్యంత సన్నిహిత సంబంధం. రెందవది, ఆయన వ్యక్తిగతంగా ఆ పిలుపు కోసం నష్టపోవడానికి, త్యాగం చేయడానికి, 

కష్టపడడానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉండడం. హక్కులు ఉన్నా వాటిని ఉపయోగించుకోపోవడం, అధిక్యతలు 

ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టడం, కష్టాలు సంతోషంగా భరిస్తూ ఉండడం, అధికారమున్నా, దీనమనసుతో 

సాత్వికునిగా ప్రవర్తించడం, ఆ పిలుపుకు నిదర్శనాలు, ఋజువులు.I కోరింథీ 9:6-14 మీ ముందుంచుకొని జాగ్రతగా 

పరీక్షించండి. 10వ వచనం మధ్యభాగమునుండి గమనించండి: “ఏలయనగా, దున్నువాడు ఆశతో దున్నవలెను,  

కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీకొరకు ఆత్మసంబంధమైనవి మేము 

విత్తియుండగా మీవలన శరీరసంబంధమైన ఫలములు కోసికొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని యీ 

అధికారములో పాలు కలిగినయెడల మాకు ఎక్కువ కలదు గదా? అయితే మేము ఈ అధికారమును 

వినియోగించుకొనలేదు; క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటిని సహించుచున్నాము. 

ఆలయకృత్యములు జరిగించువారు ఆలయమువలన జీవనము చేయుచున్నా రనియు, బలిపీఠమునొద్ద 

కనిపెట్టుకొనియుండువారు బలి పీఠముతో పాలివారై యున్నారనియు మీరెరుగరా? ఆలాగున సువార్త ప్రచురించువారు 

సువార్తవలన జీవింపవలెనని ప్రభువు నియమించి యున్నాడు.” ఆపో.  పౌలు పాత నిబంధంలోని ద్వితీ. 25:4లో 

నున్న భాగమును ఉటంకిస్తున్నాడు. ధర్మశాస్త్రప్రకారము బలిపీఠం దగ్గర పరిచర్య చేసే వారికి బలిద్రవ్యములో కొంత 

భాగము ఇవ్వాలని దేవుని ఆజ్ఞ. పశు మాంసములో, ఆహారపు గింజలలో లెవీయులకు ఒక భాగము ఇవ్వబడుతూ 

ఉండేది. దాని వివరాలు లెవీయకాండములో సవివరంగా వ్రాయబడింది. యాజకులకు, లెవీయులకు 

భూమిరూపములో ఆస్తి ఇవ్వబడలేదు. కానీ వారికి కొన్ని ప్రాంతాలలో కొన్ని గ్రామాలలో భాగాలు ఇవ్వబడ్డాయి. కానీ 

ప్రత్యక్ష గుడారములోనికి ఇశ్రాయేలు ప్రజలు తెచ్చే బలిద్రవ్యాలలో కొంత భాగము వారికి ప్రభువు చేత ఆజ్ఞారూపకంగా 

ఇవ్వబడింది. ప్రజల కానుకలచేత వారి అవసరాలు తీరేవి. ఈ కాలములో కూడా అదే రీతిగా దేవుని సేవకుని 

అవసరాలు తీర్చబడాలని ఆపో. పౌలు ఈ ఉదాహరణను దృష్టాంతముగా వాడుకుంటున్నాడు. దేవుని ప్రజలు దేవునికి 

ఇవ్వడములో నమ్మకముగా దశమభాగమును దేవుని మందిరములోనికి తీసుకురావాలని మలాకీ 3:8-10లో ఆజ్ఞతో 

కూడిన వాగ్దానము ఉన్నది. దేవుని మందిరములో లోనికి దేవుని ప్రజలు తీసుకువచ్చిన కానుకలలోనుండి దేవుని 

సేవకులు పోషించబడతారు.

         మన ప్రభువు 70 మంది శిష్యులను పంపించినపుడు స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. లూకా సువార్త 10:5-9లో 

అవి వ్రాయబడినవి. బైబిలో గమనించండి. “మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు ఈ యింటికి సమాధానమగు 

గాక అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును;  

లేనియెడల అది మీకు తిరిగి వచ్చును. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి,  

పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటింటికి తిరుగవద్దు. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు 

వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి. అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము 

మీ దగ్గరకు వచ్చియున్నదనివారితో చెప్పుడి.”  ఆ ఊళ్ళో ఉన్నవారు వారికి ఆహారము పెట్టాలి అనే మాటను 

గమనించారా? నా జీవితములో  తెలుగు రాష్ట్రాల్లోని అనేక చిన్న చిన్న మారు మూలల్లో, ఇతర పొరుగు

రాష్ట్రాల్లో ఉన్న గ్రామాల్లోనికి సువార్త ప్రకటనకోసం, దేవుని వాక్యపు ప్రకటనకోసం వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి.   

వెళ్ళిన చోట ఆ ఊళ్ళోని సంఘకాపరి, లేదా సంఘ పెద్దలు వారి గృహాల్లో అతిధ్యం ఇచ్చారు. మీ మీ ఊళ్లలోని నిజమైన 

దైవసేవకులకు మీరు తోడ్పడాలి. ప్రత్యేకించి ఎవరి ద్వారా మీకు అధ్యాత్మిక బలము, ప్రేరణ, ఆదరణ, దేవుని వాక్య 

ఉపదేశం కలుగుతుందో వారికి, మీ స్థానిక సంఘము ద్వారా, చేయూత నివ్వాలి. ఈ విషయములో ఈ అధ్యయనాలు 

మీకు ఉపకరిస్తాయి.

         దైవసేవకుని మూడవ లక్షణము, అతని వ్యక్తిగత నిర్బంధం. I కోరింథీ 9:15-18. “15. నేనైతే వీటిలో దేనినైనను 

వినియోగించుకొనలేదు; మీరు నాయెడల యీలాగున జరుపవలెనని ఈ సంగతులు వ్రాయనులేదు. ఎవడైనను నా 

అతిశయమును నిరర్థకము చేయుటకంటె నాకు మరణమే మేలు. 16. నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు 

అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను 

ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. 17. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను 

గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. 18. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించునప్పుడు 

సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగ పరచుకొనకుండ సువార్తను ఉచితముగా 

ప్రకటించుటయే నా జీతము.”  ఆపో. పౌలునకు సువార్త ప్రకటన, దేవుని సేవించడమంటే చావో రేవో అన్నంత. ఆయన 

అంతరంగములో అతిబలమైన వాంఛ ఉన్నది. ఆదితప్ప ఇక వేరే ఏదీ ఆయనకు అవసరము లేదు. పౌలు 

ఏమంటున్నాడో గమనిస్తున్నారా, శ్రోతలూ? ప్రభువును సేవించడం ఆయన పిలుపు. ఆయన ఎందుకు చావో రేవో 

అంటున్నాడో మనకర్ధం కావాలంటే, దమస్కులోని “తిన్ననిది” అనే రోడ్డుమీద ప్రభువు ఆయనతో చెప్పిన మాటలను 

జాగ్రత్తగా పరీక్షిస్తే అర్థమవుతుంది. అ. కా. 9:13-16 జాగ్రత్తగా పరీక్షించండి. దేవుని సేవను కొలిచేది సంఖ్య కాదు, 

నమ్మకత్వము. ప్రభువు నిన్ను పిలిచిన పిలుపును బట్టి ఆయన నీకప్పగించిన పనిని, పరిచర్యను మాత్రమే చేయాలి. 

దాని కోసం పౌలు మరణమైన, జీవమైనా, సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సువార్త ప్రకటించడం ఒక అవసరత. 

16వ వచనం చూడండి. “ సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను 

ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.”  సువార్తను ప్రకటించకపోతే, తన పిలుపునకు విధేయత చూపకపోతే, దేవుని 

తీర్పు తనమీద ఉంటుందని ఆయన భావించుకున్నాడు. దేవుని సేవకు ఫలితం ఇష్టపూర్వకమైన సేవే! దేవుని 

సేవకునిగా ఉండటమంటే ఫలితమున్నా లేకున్నా చేయడమే! వచ్చే కానుకలనుబట్టి ఆయన సేవ కొలవబడలేదు. 

ఫలితము నిత్యత్వములో ఉంటుంది. అసలు ఫలితమేమిటోతెలుసా? నీ పని, పరిచర్య ద్వారా, మార్చబడిన ప్రజలు, 

రూపాంతరం చెందిన, చెందుతున్న ప్రజలే ఫలితం!  దేవుని సేవకునిది జీవితాంతముండే పిలుపు. దానిని అతడు 

నిర్వర్తించాల్సిందే! దేవుని పరిశుద్ధ గ్రంధమును పూర్ణమనసుతో, హృదయపూర్వకంగా బోధించే దేవుని సేవకులు 

ఎక్కడ ఉన్నారు? ఆటువంటి వారు కావాలి. మన రాష్ట్రాల్లో, మన దేశమంతటిలో, ప్రపంచమంతటిలో కావాలి! మీరు 

పాస్టరైనా, సంఘపెద్ద అయినా, సువార్తికులైనా, ఏ ఉద్యోగం, వ్యాపారం, పని, ఏవృతి చేసే వారైనా, దేవుని పరిశుద్ధ 

నామమునకు సేవ చేయవచ్చు. షరతు ఆయన పిలుపు కలిగి ఉండి ఆయన వాక్యమునకు నిబద్ధతతో విధేయత 

చూపించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఈలాటి ఆశ, భారము కలిగినవారికోసం ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. మీ 

బైబిల్ మీద చేయిఉంచండి. ప్రార్థన చేయండి.    



No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...