I కొరింథీ అధ్యయనం-30 10:1-13~ (2)
విజయమును సంపాదించుకోవడం-2
హల్లెలూయ! మీచుట్టూరా మిమ్మల్ని వేధించే వాళ్ళున్నా, మీ ఆరోగ్యం సరిగా లేకపొయినా, ఆర్థికసమస్యలు బాధ పెడుతున్నా, మనశ్శాంతి లేక గందరగోళంగా ఉన్నా, దేవునికి స్తోత్రం చెప్పండి, నాతో బాటు, బిగ్గరగా హల్లెలూయ అని మనసారా, “సజీవుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువునకు స్తోత్రం, మహిమ ఘనత కలుగునుగాక!” అని చెప్పండి! మీరు దేవుని చిత్తమును చేయాలనుకుoటున్నారా? Iధెస్స. 5:16 “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.” అవును, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాo, తలలు వంచండి, ప్రార్థన:
ఈ నాటి లేఖన భాగము I కోరింథీ 10:1-13. అంశం: విజయమును సంపాదించుకోవడం. విజయమంటే ఇష్టపడనివారుండరు. కానీ పొందేలేమేమో అనే అనుమానమునుబట్టి ప్రయత్నాలు గట్టిగా చేయరు. విజయమును సంపాదించుకోవడానికి అవసరమైన పాఠాలు గతించిన అధ్యయనములో ఇప్పటికే రెండు పాఠాలు ధ్యానించాము. ఒకటి, మన చుట్టున్న పరిస్థితులను అంచనా వేయడం. మీ గురించి, మీ కుటుంబము గురించి మీకు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. కుటుంబపు ప్రభావం మనమీద చాలా ఉంటుంది. మన నేపధ్యాన్ని పరీక్షించుకోవడం అవసరం. మన నేపధ్యపు ప్రభావం మన మీద ఉంటుంది. కానీ దాన్ని అధిగమించడం సాధ్యమే. దేవునినెరుగని వారు సహితం వారి నేపధ్యాన్ని దాటుకొని ఎంతో ఉన్నత శిఖరాలనెక్కారు. దేవుని కలిగిన మనము నేఫధ్యము దోహదకారిగా ఉన్నా, లేకపొయినా, సహాయకారిగా ఉన్నా, లేకపోయినా, విజయము సంపాదించుకోగలము. ఒక త్రాగుబోతు కుమారుడు అయినంత మాత్రాన అదే బాటలో నడవవలసిన అవసరం లేదు. విగ్రహారాధకుల కుటుంబములోనుండి వచ్చినంత మాత్రాన మీరు కూడా అలాగే జీవించవలసిన అవసరం లేదు. అవును, విశ్వాసమువలన, దేవుని కృప చేత విజయం సాధ్యమే! ఎర్రసముద్రపు సన్నివేశంలో ప్రభువు కలుగచేసుకున్నట్టు, ఇశ్రాయేలీయుల జీవితాల్లో జోక్యం చేసుకున్నట్టు, మన జీవితాల్లో కూడా చేయగల సజీవుడు, సమర్థుడు. ముదడుగు వేయడానికి నీవు సిద్ధమా? రెండవ పాఠము, సహవాసాలు, సాంగత్యాలు, స్నేహాలు. ఈ పాఠము చాలా ప్రాముఖ్యమైనది. ఇది పరిస్థితులు, నేపధ్యము కాదుగానీ మన స్వంత నిర్ణయాలమీద ఆధారపడి ఉంటుంది. నీ స్నేహాలు ఎవరితో ఉన్నాయి? నీ తోటివారెవరు? విశ్వాసులా? అవిశ్వాసులా? దుష్టులా? ప్రభువుతో నడుస్తున్నవారా? దేవుని వాక్యమును ప్రాణముకంటే ఎక్కువగా ప్రేమించేవారా? పేరుకు మాత్రమే దేవుని వాక్యమును పట్టుకునే “విశ్వాసులా”? ఒక అద్భుతమైన సామెత ఉన్నది. “మీ స్నేహితులెవరో చెప్పండి, అప్పుడు మేరేలాంటి వారో చెప్తాను.” మన స్నేహాలు, సహవాసాలు చెడ్డవైతే, మీరు విజయము సంపాదించా లనుకుకోవడం గొంతెమ్మ కోరిక అవుతుంది. పరిశుద్ధ గ్రంధములోని కొన్ని మాటలు మీ మనసుల్లో నాటాలని వాటిని మీ ముందుచుతున్నాను. 6వ వచనములో “చెడ్డవాటిని ఆశించకుండునట్లు” అనే మాటలు, 7వ వచనములో “విగ్రహారాధకులై ఉండకుడి” అనే మాటలు: 8వ వచనములో “వారివలె వ్యభిచరించకయుందము” అనే మాటలు, 9వ వచనములో “మనము ప్రభువును శోధింపకయుందము” అనే మాటలు, 10వ వచనములో “మీరు సణుగకుడి” అనే మాటలు జాగ్రతగా గమనించి మీ బైబిల్లో అండర్లైన్ చేసుకొని కంఠస్థం చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతమంతటినీ ప్రక్కకు పెట్టి ఇప్పటినుండి మీ స్నేహాలు, సాంగత్యాలు, సహవాసాలు పరిశుద్ధమైన సంఘముతో నిజమైన విశ్వాసులతో మీలాగా విజయము సంపాదించుకోవాలనే ఆశ ఉన్న వారితో చేయండి. ఒక ప్రార్ధనగుంపుగా ఏర్పడి ప్రార్థన, బైబిల్ పఠన, ప్రోత్సాహం కలిగించే సహవాసములో సమయము గడపండి. ఒకరికొకరు ధైర్యము, ప్రోత్సాహము, ఇచ్చిపుచ్చుకొనే బైబిల్ సహవాసముగా ఏర్పడండి. ప్రభువు మీ మార్గమును మరల్చి మిమ్మల్ని తన మార్గములో నడిపిస్తాడు.
ఇక మూడవ పాఠము ఈ పూట విపులంగా అధ్యయనం చేద్దాం. 11-13 వచనాలు
I కోరింథీ 10:11-13 “11ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయ బడెను.౹ 12తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.౹ 13సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.”
విజయము సంపాదించుకోవాలంటే నేర్చుకోవలసిన మూడవ పాఠము ధృడమైన నిశ్చయత. ప్రియశ్రోతలూ, మీకు తెలిసినదానిని హృదయములో మననం చేయండి, మళ్ళీ, మళ్ళీ తలపోసుకొనండి. జ్ఞాపకం చేసుకొనండి, చరిత్ర, ప్రత్యేకించి బైబిల్లోని దేవుని ప్రజల చరిత్ర, మనకు బుద్ధి చెప్పడం కోసం వ్రాయబడింది. దానితో సుపరిచితులు కావాలి. జాగ్రతగా మళ్ళీ మళ్ళీ ఆ భాగాలు చదవండి. దాని మీద లోతుగా ధ్యానించండి. అవి ఎక్కువగా పాత నిబంధనలోని గ్రంధాల్లో ఉన్నాయి. “నీకు తెలియనిది నిన్ను బాధపెట్టదు” అని కొందరు అంటూ ఉంటారు. కానీ, ప్రియ సోదరుడా, సోదరీ, సత్యమేమిటో మీకు తెలుసా? మీకు తెలియనిది మిమ్మల్ని బాధ పెట్టగలదు. గతములో జరిగినవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిని బాగా గ్రహించాలి. యూదులకు ఒక నినాదం ఉన్నది. అదేమిటి? మీరు మీ గతమును మర్చిపోతే మీ భవిష్యత్తును ప్రణాళిక వేయలేరు.” అంచేత మనకు తెలియనిది మనకు కీడు చేస్తుందని, నష్టం కలిగిస్తుందని మనమంతా, మనలో ప్రతి ఒక్కరూ, ఒక్కొక్కరూ తెలిసుకోవలసిన అవసరత చాలా ఉన్నది.
మీ ఆత్మాభిమానాన్ని కాస్త అదుపులో ఉంచుకొనండి. భ్రమలో జీవించకండి. లేఖనమేమి సెలవిస్తుంది? 12వ వచనం. “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” పడిపోయేది ఎప్పుడంటే, “నేను పడిపోనులే’ అనుకున్నప్పుడు. ఆత్మాభి మానమును గూర్చి చెప్పేవారేమంటున్నారు? “నేనే నంబర్ వన్” అని నీకు నీవు చెప్పుకుంటూ ఉండు, అని అంటారు. నేనేమంటానంటే, “నేనే నెంబర్ వన్” అని చెప్పుకోవద్దు. “యేసయ్య నెంబర్ వన్” “ఆయనే నెంబర్ వన్” అని చెప్పుకుంటూ ఉండు. ఎల్లప్పుడూ ఆయనే నెంబర్ వన్! హల్లెలూయ! ఆయన గురించే ఆలోచిస్తూ ఉండు. లేకపోతే, నీమీద నీవు ఆధారపడితే, పడిపోతావు, జాగ్రత! నీ స్వంత తలంపులే నిన్ను పడవేయగలవు. ఆత్మాభిమానమును ఆశ్రయించిన ఎందరో ఇప్పటికే పడిపోయారు. దుష్టత్వము ముందు మీరు స్వంతగా నిలబడలేరు, ఎందుకంటే అది ఎల్లప్పుడూ మీ ప్రక్కనే ఉంటుoది.
గమనించండి, దేవుని వద్ద మార్గమున్నది. అదేమిటి? 13వ వచనం. “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింప గలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.” ప్రియ సోదరీ, సోదరులారా, ఎన్నో మార్గాలు లేవు. నిజం చెప్పాలంటే, రెండే ఉన్నవి. మీ మార్గం లేదా ప్రభువు మార్గం. ఆయన మార్గం ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు. ప్రభువే మార్గం ఏర్పాటు చేస్తాడని సంపూర్ణంగా ధృడంగా నమ్మండి. “ “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప” అనే మాటలు గమనించండి. మానవులoదరికి కలిగే సాధారణమైన శోధనే మీకు కూడా కలుగుతున్నది. ఇవి మానవులందరికీ కలిగేవే! క్రొత్తవేమీ కావు. దేవదూతలకు కలిగే శోధనలేమీ ఉండవు, అలాంటివి ఉండవు. “నన్నెవరూ అర్ధం చేసుకోవడం లేదు” అని ఎన్నడూ అనుకోవద్దు. ప్రస్తుతం మీరెదుర్కుంటున్న శోధన ప్రతి మానవుడు ఎదుర్కొన్నదే! మనము పడిపోతే అది దేవుని తప్పు కాదు. నీవెదుర్కుంటున్న శోధన ప్రభువునకు బాగా తెలుసు. ఎంత ఒత్తిడి శోధన ద్వారా కలుగుతుందో ప్రభువుకు బాగా తెలుసు. ఆయన నిన్ను అర్ధం చేసుకుంటున్నాడు. దేవునికి బాగా తెలుసు, హల్లెలూయ!
ఒక గొప్ప బైబిల్ పండితుని హెచ్చరికను స్వీకరించుదాం. తన ప్రజలు ఎంతటి శోధనను ఎదుర్కొనగలరో, ఏది ఏ విధంగా తన ప్రజలను ప్రభావితం చేస్తుందో, దేవునికిబాగా తెలుసు. ప్రతి శోధనను వారి శక్తికి తగ్గట్టుగా మారుస్తూ ఉంటాడు. వారికి ఆయన నిర్ణయించిన శోధనలను జయించే శక్తినిస్తాడు. ఈ వాగ్దానము కేవలం కోరింథీ క్రైస్తవ విశ్వాసులకు మాత్రమే కాదు, అందరికీ వర్తిస్తుంది. ఇది మేలు కలిగించే వాగ్దానము. ఈ పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కొక్కరికీ అదే మేలు చేస్తుంది. కాబట్టి శోధన, పరీక్షలు ఎదుర్కుంటున్న వారికి ధైర్యం, ప్రోత్సాహం ఇవ్వటానికి ఈ వాగ్దానము శ్రేష్టమైన ఆధారము. ప్రభువు వారి శోధనల్లో వారిని నిలబెడతాడు. ఎంత కఠినమైన పరీక్ష అయినా, ఎంత కాలము ఎదుర్కుంటున్నా, ఎంత బలహీనంగా వారు ఫీలవుతున్నా, శోధనలు, పరీక్షలు అనుమతించిన దేవునికి వారిని బలపరచడానికి శక్తిగలవాడు. అందుచేత పరిస్థితి అంతటినీ ప్రభువు సన్నిధిలో ఉంచి, ఆయన సంరక్షణకు అప్పగించుకోవచ్చు. కాబట్టి, ప్రియ శ్రోతలూ, విజయమును సంపాదించుకోవడానికి ఈ మూడు పాఠాలు మనము నేర్చుకోవాలి.
1. మన చుట్టూ ఉన్న పరిస్థితులను అంచనా వేయడం. మన నేపధ్యములో ఉన్న మంచివి ఏవో పరీక్షించి వాటి మీద కట్టుకోవడం. ఏ నేపధ్యం అయినా, దేవుని వద్దనుండి కృపను పొంది, పరిస్థితులను మలచుకోవడం.
2. మన సహవాసాలు, స్నేహాలు, సాంగత్యాలను నిర్దేశించే పాఠము విజయమును సంపాదించుకోవాలనే ఆశ కలిగిన వారితో మంచి స్నేహాలను ఏర్పాటు చేసుకోవడం.
3. ధృడమైన నిశ్చయత కలిగి ఉండాల్సిన పాఠము. దేవుడు ఏర్పాటు చేసిన తప్పించుకునే మార్గము సరియైనది, మన స్వంత మార్గము కాదు.