I కొరింథీ అధ్యయనం-16 5:9-13
ఇంత భయంకరమైన పాపపు ఊబి లాంటి లోకములో ఒక క్రైస్తవుడుగా, యేసయ్య శిష్యుడుగా జీవించడం
సాధ్యమేనా? ఈ ప్రశ్నకు జవాబు బైబిల్ తప్ప ఏ గ్రంధము చెప్పలేదు. క్రైస్తవుడని చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ‘మనకు
ఏ రకమైన నియమాలు బోధించే గ్రంధము లేదు’ అని చెప్పి, సువార్తలను తాను మార్చి రాస్తాననుకుని ఇశ్రాయేలు
దేశం వెళ్ళి అక్కడ పర్యటిస్తున్నాడు. ఆ తరువాత అతడు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు తెలిసిన
విషయమేమిటంటే, అతడు ఎవ్వరికీ తెలియని స్థలములో యూదయ ఎడారిలో ఎక్కడో మరణించాడు. శ్రోతలూ,
పరిశుధ్ధ గ్రంధం బైబిల్ ఒక్కటే మనకు ఆధారం. ఏ దేశమైనా, ఏ సంస్కృతి అయినా, ఏ కులమైనా, ఏ భాష అయినా,
దేవుని వాక్యమునకు కాలపరిమితి లేదు. పౌలు జీవించిన దినాలైనా, ఈనాడైనా, దేవుని వాక్యము మన
ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తుంది.
లేఖన భాగం: I కోరింథీ 5:9-13. ఈ పూట మన అంశం “మరి ఏ పద్ధతిలో జీవించాలి” ఈనాటి మన ప్రశ్నకు
సమాధానం తెలుసుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా, నెమ్మదిగా కూర్చోండి. ముందుగా
ప్రార్ధించుకుందాం.
ప్రార్థన:
లేఖన భాగం: I కోరింథీ 5:9-13. పౌలు జీవించిన దినాలు లైంగిక పాపముతో నిండిన దినాలు. కామాతురత
ఘోరంగా ఉన్న దినాలు. ఆయన ఈ లేఖన భాగములో బోధించిన మూడు మార్గాలు, పద్ధతులు అనుసరిస్తే, ఈ
నాడైనా మనము దేవుని పవిత్రతలో ఆయన పరిశుద్ధ ప్రమాణాల్లో జీవించగలము. మొదటి పద్ధతి: లోకములో
జీవించండి గాని లోకమునుండి వేరుగా దాని మలినము, అపవిత్రత అంటకుండా జీవించండి: 5:9-10 వచనాలు.
“జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈలోకపు జారులతోనైనను,
లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు;
ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?” మనము లోకములోనే జీవిస్తున్నాము, జీవించాలి
కూడా. కానీ ఈ లోకము దేవుని మార్గాలకు వ్యతిరేకమైనది. అందరూ ఒప్పుకోకపోయినా, సత్యమేమిటంటే ఈ లోకము
లౌకికమైన వాటిని, అధమస్థాయిలో ఉన్నవాటిని ప్రేమిస్తూ ఉంటుంది గనుక అది దేవుని మార్గాలకు వ్యతిరేకమైనది.
మనము జీవిస్తున్న ఈ లోకము బ్రష్టుపట్టిన, పతనమైన, మానవస్వభావము చేత నిర్దేశించబడుతుంది. ఆపో. పౌలు
మన దృష్టికి తీసుకొస్తున్న ప్రవర్తనను గమనించండి. జారులు అనగా లైంగిక అపవిత్రులు, దారి తొలిగినవారు. లోభులు
అంటే దురాశపరులు. వారికి కావాలనుకున్నదానికోసం, ఏదైనా చేస్తారు. ఏ పద్ధతిలోనైనా గెలవాలని ప్రయత్నం
చేస్తారు. దోచుకొనువారు అంటే ఇతరులు చూడనప్పుడు వారివస్తువులను, దొంగిలించేవారు. వారికి చెందని దానిని
తీసుకునేవారు. విగ్రహారాధకులు అంటే, దేవుడు కానివాటిని, మనుషులను, విగ్రహాలను దేవుడని భ్రమించి
ఆరాధించేవారు. ఈలాంటివారు జీవించేవారున్న లోకములో మనము జీవిస్తున్నాము. కానీ వారినుండి తొలిగిపోవడం
జవాబుకాదు. వారితో మాటలాడకుండా ఉండలేముకదా! అలా చేయాలంటే ఈ లోకములోనే ఉండలేము. కొందరు ఈ
లోకానికి దూరంగా వెళ్ళిపోయి, వివాహాము చేసుకోకుండా కడుపేదరికములో ఒక ఆశ్రమములో జీవితమును
వెళ్ళబుచ్చుతారు. దానివల్ల మనము పరిశుద్ధులమౌతామా? ఎంత మాత్రము కాదు. పౌలు ఏకాకిగా సమాజమునకు
దూరంగా జీవించమని చెప్పడంలేదు. కొందరు స్నేహముతో సువార్తను పంచుకోవాలని చెబుతూ లోకములోని వారితో
కలిసిపోయేవారున్నారు. జాగ్రత సుమీ! దూరంగా ఉండవద్దు, కానీ వారిలో కలిసిపోవద్దు. మనకొక మంచి మాదిరి మన
ప్రభువే, యేసు క్రీస్తే! ప్రభువు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేశాడని మార్కు సువార్త 2:15లో వ్రాయబడింది.
“అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన
శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబడించువారైరి.” ప్రభువు వారిలో
కలిసిపోలేదు, వారిలాగా జీవించలేదు, కానీ వారు యేసుప్రభువును వెంబడించారని స్పష్టంగా ప్రభువు
సెలవిస్తున్నాడు. ప్రభువు వారికి దూరంగా ఉన్నాడు. మత్తయి 16:24 లో ప్రభువు ఏమి ఆజ్ఞ ఇచ్చారో జాగ్రతగా
గమనించాలి. “అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను
ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.” మత్తయి 16:24
రెండవ పద్ధతి, మార్గము, లోకములో జీవించండి, కాని లోకమునకు వేరుగా జీవించండి. 11,12 వచనాలు.
“ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని
త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు
భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.౹ 12వెలుపలివారికి తీర్పు తీర్చుట నా కేల? వెలుపలివారికి దేవుడే తీర్పు
తీర్చును” ఇంతవరకు మనము తెలుసుకున్నట్టి వారు సంఘములో ఉంటే ఏమి చేయాలి? సరియైన ప్రశ్న కదూ!
ఈప్రశ్న మీలో ఉండిఉండవచ్చు. పౌలు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్కుగా మనకిచ్చే ఆజ్ఞ: వారితో సహవాసము,
స్నేహము చేయవద్దు. ఇటువంటి వారని, వారి విషయం తెలిసికూడా వారిని దేవునిసంఘములో ఎవరైనా
చేర్చుకుంటారా? సంఘము పరిశుద్ధంగా ఉండాలని దేవుని ఆజ్ఞ. వారు ప్రభువు బల్లలో చేయివేయకూడదు. దేవుని
వాక్కు ప్రకారం వారితో కలిసి భోజనము చేయకూడదు.కలిసి భోజనము చేయడం ద్వారా సహవాసo దగ్గరవుతుంది.
మన ప్రభువు యేసు క్రీస్తు యోహాను సువార్త 17:15-18 లో చేసిన ప్రధాన యాజకుని ప్రార్ధనలో చాలా లోతైన
అర్ధసహితమైన మనవులు చేశారు. “నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని
దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును
వారిని లోకమునకు పంపితిని” కొందరు టివిలు సీరియల్లు చూచి లోకములాగా వారుకూడా ఉండాలని ఆలోచిస్తూ
ఉంటారు. లోకములో జీవించాలి కానీ వేరుగా, విరుద్ధంగా, ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. దేవుని సంఘమును
అపవిత్రపరిచే వారిని విశ్వాసులు, సంఘస్థులు వెలివేయాలి. వారితో ఎలాంటి సహవాసము, స్నేహము పెట్టుకోకూడదు.
సంఘ నాయకత్వం వారిని వెలివేయాలి. దాని ద్వారా సంఘమును పవిత్రపరుస్తారు. “నీ నామము
పరిశుధ్దపరచబడుగాక” అని చేసే పరలోక ప్రార్థన ఈ విధంగా క్రియారూపము దాల్చాలి. నీ మట్టుకు నీవు నీ దుస్తులు
పరిశుధ్దంగా ఉంచుకోవాలి. మలినపడనీయకూడదు.
మూడవ పద్ధతి, లోకములో జీవించండి, కాని మిమ్మును మీరు దాని దోషమునుండి విడుదల చేసుకొనండి.
13వ వచనం. “మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి.” దేవుడు
న్యాయాధిపతి, Judge అని మర్చిపోవద్దు. సంఘమునకు బయట ఉన్నవారు దేవుని చేతిలో ఉన్నారు. దేవుడు తన
నీతి ప్రకారం న్యాయం చేస్తాడు. గుర్తుంచుకొనండి, వ్రాయబడ్డవి మార్పు చేయబడవు, తుడిచివేయబడవు, తక్కువ
చేయబడవు. ఏ ఒక్కరూ, “అయ్యా, నన్ను క్షమించండి, నేను మర్చిపోయాను, నేను ఏమి చేశానో నాకు గుర్తు లేదు,”
అని దేవునిదగ్గర చెప్పలేరు. భూమి అంతటి న్యాయాధిపతి దగ్గర ఎవరికి జ్ఞాపకశక్తి పోదు. అన్నీ జ్ఞాపకమొచ్చేలా
చేస్తాడు. సంఘములోని ప్రతి ఒక్కరూ సత్యమును అనుసరించి జీవించాలి. సత్యమంటే దేవుని పరిశుద్ధ గ్రంధం బైబిల్.
బైబిల్ ఎన్నడూ మారదు. మరో సారి చెప్పనివ్వండి. సత్యము మార్పులేనిది, మార్చలేనిది. ఎల్లప్పుడూ అలాగే
ఉంటుంది. దేవుని వ్యక్తిత్వములో సత్యము ఒక భాగము.
పాపములో ఉన్న వ్యక్తి వెలివేయడం కాస్త కఠినంగా ఉంటుంది. దుఖం కలుగుతుంది, కానీ తప్పదు.
సంఘములోని ఒక వ్యక్తిని వెలివేయడం ఆనందం కలిగించదు, కాని చేయవలసిఉంటుంది. దేవుడు నిన్ను ఆ
దోషమునుండి తప్పించనివ్వండి. ఒక ప్రముఖ బైబిల్ పoడితుడు లోకముతో మన సంబంధాన్ని క్రమబద్ధీకరించడానికి
కొన్ని సూచనలు ఇచ్చాడు. జాగ్రతగా వినండి. ప్రభువునకు చెందినఆయన కుమారులు, కుమార్తెలు లోకమును
అనుసరించకూడదు. లోకానికి చెందిన అభిప్రాయాలు, భావాలు, సూత్రాలను పోలినవి, వాటిలాగా కనిపించే వాటిని
నిషేధించాలి. లోకములోని ప్రజల విపరీతమైన పోకడ, వస్త్రధారణ, వినోదమిచ్చే విషయాలు, అభిప్రాయాలను
ఆమోదించే రీతిగా వారు ప్రవర్తించకూడదు. ఏ రీతిగా కూడా వారు లోకమునకు చెందినవారనే అభిప్రాయము
లోకమునకు చెందినవారిలో కలిగించకూడదు. ఈ ఉద్దేశముతో లోకములో జీవించాలి, పని చేయాలి. ఆలాంటి
సంభాషణ, ప్రవర్తనతో జీవిస్తూ, లోకములోని ప్రజల రక్షణ, పాపక్షమాపణ దిశగా ప్రతి ప్రవర్తన నడిపించేలా ఉండాలి.
లోకములోని ప్రజల అధ్యాత్మిక క్షేమము కోరుతూ మాదిరికరమైన ప్రవర్తన చూపాలి. మాట్లాడే మాటలైనా,
హెచ్చరికలైనా, దేవుని ప్రజలకు చేతనైనంతమట్టుకు వారిని క్రీస్తు రక్షణ అనుభవములోనికి నడిపించే దిశగా జీవించాలి.
దేవుని ప్రజలను ఈ భూమి మీద ప్రభువు జీవించడానికి అనుమతించి, పరలోకమునకు ఇప్పుడే ఎందుకు
తీసుకెళ్ళడం లేదంటే, ఈ ఉద్దేశము కోసమే వారి జీవితాలను సమర్పించి, ప్రత్యేకించుకోవాలి. దేవుడే మిమ్మల్ని లోకపు
దోషమునుండి విడిపించనీయండి.
మన ప్రశ్నకు సమాధానం దొరికిందా? మరి లోకములో మనమేవిధంగా
జీవించాలి?” I కోరింథీ 5:9-13లో జవాబు ఉన్నది.
1.
లో1. లోకములో జీవించండి, గాని లోకములో కలిసిపోవద్దు, మలినము అంటకుండా లోకము నిన్ను ప్రభావితము చేయకుండా జీవించాలి.
2.
లో2. లోకములో జీవించoడి గాని లోకమునుండి ప్రత్యేకించబడి, పరిశుద్ధపరచబడి, జీవించండి. యేసయ్య మనకు మాదిరి.
3.
లో3. లోకములో జీవించండి, గాని లోకములోని దోషమునుండి విడిపించబడండి, దేవుని చేత విడిపించబడండి.
No comments:
Post a Comment