I కొరింథీ అధ్యయనం-17 6:1-11 సంఘపు కోర్టు కేసులు

 

 

I కొరింథీ అధ్యయనం-17   6:1-11

సంఘపు కోర్టు కేసులు 

By Pastor Vijay Bhaskar  S.  -  9849037535

          సంఘమంటే కట్టడమా లేదా దేవుని ప్రజలా? ఈ దినాల్లో చాలామంది కట్టడం లేదా బిల్డింగ్ అనుకుంటారు. 

ఎంత అందమైన బిల్డింగ్ అయితే అంత సంతోషంగా వెళ్ళేవారున్నారు. ప్రజలు ఎంత పేద వారైనా, వారు నిజమైన 

విశ్వాసము కలిగి, రక్షణ పొందిన వారైతే వారే సంఘము. వారి మధ్యలో ఉంటే అది గొప్ప సంతోషం! హల్లెలూయ! కాని 

సంఘములోని నాయకులు కోర్టుకేసు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే, జగడాలు, కొట్లాటలు జరుగుతుంటే 

అది సంతోషమా? ఈ పూట I కోరింథీ 6లోని మొదటి 11 వచనాలు అధ్యయనం చేసి దేవుని కృపను కోరుకుందాం, 

ప్రార్ధించుకుందాం. ప్రార్థన: ఈ నాటి మన అంశం సంఘపు కోర్టు కేసులు. లేఖన భాగము I కోరింథీ 6:1-11.

          

    మన మధ్యలో కలిగే మనస్పర్థలను శాంతియుతంగా, సున్నితంగా తీర్చుకోవాలని దేవుని కోరిక. కాని అలా 

జరగనప్పుడు ఓపిక, దైవభయము లేని ఒకరు పరిష్కారము కోసం కోర్టుకు ఈడ్వాలని ప్రయత్నము చేస్తారు. నాకు 

కావలసిoది కోర్టులో దొరుకుతుంది అనుకుంటారు కాని, చివరికి అదేమీ జరగదు. అందరూ నష్టపోతారు. సంఘములో 

అలాంటి పరిస్థితి కలిగినపుడు ఏమి చేయాలి? ఈ విషయం ఈ పూట మనము మన లేఖన భాగము I కోరింథీ 

6:1-11ను అద్యయనం చేసి నేర్చుకుందాం, రండి రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చోండి.

         

     వివాదాలు కలిగినపుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆపో. పౌలు కొన్ని ఆదేశాలు దేవుని వాక్యములో 

మనకందిస్తున్నాడు. వాటిలో మొదటిది, జాగ్రతగా, జాగరూకతతో వ్యవహరించాలి. I కోరింథీ 6:1-4 వచనాలు 

చదువుకుందాం, మీ బైబిల్లో మీరు కూడా గమనించండి: మీలో ఒకనికి మరియొకనిమీద వ్యాజ్యెమున్నప్పుడు వాడు 

పరిశుద్ధులయెదుట గాక అనీతిమంతులయెదుట వ్యాజ్యెమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు 

తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీవలన లోకమునకు తీర్పు జరుగవలసి యుండగా, మిక్కిలి అల్పమైన 

సంగతులనుగూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా?  

ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా? కాబట్టి యీ జీవన 

సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని 

కూర్చుండబెట్టుదురా? 

     లేఖనమిచ్చే హెచ్చరిక, అవిశ్వాసి అయిన న్యాయమూర్తి వద్దకు వెళ్ళడం మానుకోండి. కోరింథీ సంఘములో 

కొందరు ఆ విధంగా చేసినందునుబట్టి పౌలు కొంత కఠినంగాగద్దిస్తున్నాడు. రక్షింపబడిన దేవుని ప్రజల వద్ద కాకుండా 

దేవుని నెరుగని వారి వద్దకు వెళ్లారు. ఇక్కడ ముఖ్యమైన ప్రమాణము ప్రభువు చూపిస్తున్నాడు. అవిశ్వాసులు ఈ 

ప్రమాణాలను లెక్క చేయరు, అవి వారికి తెలియదు. వారి దృష్టిలో సరియైన దాన్ని లేదా ఇంతకు ముందు జరిగినవాటి 

ఆధారంగా వారు తీర్పు తీరుస్తారు. మనము గ్రహించి అనుసరించవలసిన దేవుని ఉన్నతమైన ప్రమాణము ఇక్కడ 

బోధింపబడుతున్నది. దేవుడు మొదట మానవుణ్ణి సృష్టించినపుడు ఇచ్చిన ఆజ్ఞ, “ఫలించి...ఏలుడి”. ఆది. 1:28. ఈ 

ఆజ్ఞను దేవుడిచ్చి, దాన్ని మానవుడు నెరవేర్చాలని ఆదేశించాడు. మంచిచెడ్డల తెలివినిచ్చు చెట్టు పళ్ళు తప్ప 

తోటలోని ప్రతి చెట్టు పళ్ళు తినడానికి పురుషునికి స్త్రీకి దేవుడు అధికారము, అలాగే కట్టుబాటు కూడా ఇచ్చాడు. 

చట్టము ఏవి మనము చేయకూడనివి ఉన్నాయో తెలియచేస్తుంది. దేవుని చట్టము ఉండగా కోరింథీ క్రైస్తవులు వారి 

వివాదాలు తీర్చుకోవడానికి అవిశ్వాసులైన న్యాయమూర్తుల వద్దకు వెళ్ళడం ఆపో. పౌలును బాధపెట్టింది. ఆయన 

మాటలు జాగ్రతగా అలకించండి. పౌలు ఏమంటున్నాడు? మీరు నిద్ర మేల్కొని మీరెవరో, మీరో స్థానములో ఉన్నారో 

తెలుసుకొనండి. లోకానికి, దేవదూతలకు తీర్పు చేసేంత శక్తి ప్రభువు మీకిచ్చాడు. కానీ మీ చిన్న సమస్యలను, 

వివాదాలను లోకము లోనికి తీసుకువెళ్తారా? మీలో ఒక తక్కువవాడైన విశ్వాసి ముందు మీ వివాదము తీర్చుకోవాలి, 

గాని అవిశ్వాసుల దగ్గరికి, దేవుని నెరుగనివారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారనని వారిని వారిస్తున్నాడు.

         క్రైస్తవ సంఘస్థులు కోర్టుకు వెళ్లవచ్చా లేదా అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. 

ఎవరి అభిప్రాయము కాదు, దేవుని వాక్యం అధికారికo. ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించండి. చాలా సార్లు 

ఉన్నత విద్యావంతులు, మేధావులు, తెలివితేటలు కలిగినవారు సరియైన పరిష్కారం మార్గము చూపిస్తారు 

అనుకుంటారు. కాని, సాధారణమైన, సామాన్యమైన వారు, మంచి బుద్ధి కలిగినవారు, సరిగ్గా సరిపోయే సలహా, 

పరిష్కారం చూపిస్తారు. గొప్ప వేదాంత వేత్త కంటే, మోకాళ్లమీద ఉండే సామాన్య విశ్వాసి, క్రీస్తులో చురుకైన, 

నమ్మకమైనవారు చాలా మంచి పరిష్కారం చూపిస్తారు. దేవునికి వారి మనసును తెరిచినవారికి దైవ జ్ఞానము 

లభిస్తుంది. ఉన్నత విద్య, పదవి, 

అంతస్థు వారికి లేకపోవచ్చు.

         రెండవ ఆదేశం, అన్యోన్యంగా సమ్మతంగా ఉండండి. 5-8 వచనాలు: మీకు సిగ్గు రావలెనని చెప్పు చున్నాను. 

ఏమి? తన సహోదరులమధ్యను వ్యాజ్యెము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు 

సహోదరునిమీద వ్యాజ్యెమాడు చున్నాడు, మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడు చున్నాడు. ఒకనిమీద ఒకడు 

వ్యాజ్యెమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ 

సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ 

సహోదరులకే యీలాగు చేయుచున్నారు అడ్డుబండ వేయకండి. అంతరాయం కలిగించేకంటే సమాధానమే మేలు. ఒక 

సహోదరుడు మరొక సహోదరునిమీద లోకములోని న్యాయమూర్తులవద్ద వ్యాజ్యెము వేయడం కంటే వారు చేసిన కీడు 

సహించడమే మేలని దేవుని వాక్యపు హెచ్చరిక. పరిస్థితిని సుదీర్ఘంగా ఆలోచనాపూర్వకంగా సమీక్షించండి. అంతా 

మీరు కావాలనుకున్నట్టు జరగాలనుకుని మూర్ఖంగా ఉండకూడదు. మన రక్షకుడు చెప్పినట్టు ఒకచెంపమీద కొడితే 

మరొకచెంప చూపించవలసినంతగా ఓపిక వహించాలి. ఇక్కడ పౌలు కూడా అదే రీతిగా ప్రభువు మాటలననుసరించి 

బోధిస్తున్నాడు. మత్తయి 18:15-17 వచనాల్లో సహోదరుల మధ్య వివాదమున్నపుడు ఏ విధంగా వ్యవహరించాలో 

దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మొదట వంటరిగా అతనితో మాట్లాడ్డం, వినకపోతే, సాక్షుల సమక్షములో 

మాట్లాడ్డం, ఇంకా వినకపోతే సంఘముతో చెప్పడం, అతడు సంఘము మాట కూడా వినకపోతే ఇక అతణ్ణి సుంకరి 

లేదా పాపిగా భావించి వదిలేయడం. రోమా 12:18 లో ఉన్నట్టు మన చేతనైనంతమట్టుకు అందరితో సమాధానంగా 

ఉండాలి. ఉండలేనంత కఠినపరిస్థితి అయితే, వదిలేయడమే. కీడు, అపకారం  చేయడం కన్నా వాటిని సహించడమే 

మేలు. కోరింథీయులు దీన్ని ఒప్పుకోలేదు. వారి హక్కులకోసం పొరాడి, వివాదాలు, జగడాలు చేయాలనుకున్నారు. 

సమ్మతంగా ఉంటే ఈ పరిస్థితి రాదు కదా! నీ హక్కు నీవు పొందే కంటే సమాధానంగా ఉండడం మేలు.

         మూడవ ఆదేశం, పూర్తిగా శుభ్రపడండి. 9-11 వచనాలు అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర 

రని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవా రైనను 

పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని 

రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన 

దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి. ఈ భాగమును 

అతి జాగ్రతగా పరిశీలించండి. ప్రభువు శిష్యులకు, శిష్యులు కానివారికి స్పష్టమైన మధ్యగీత ఇక్కడ ఉన్నది. మొదటి 

గుంపు జారులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఆడంగితనముగలవారు, పురుషసంయోగులు’. ఈ గుంపులో ఒక్క 

విగ్రహారాధకులు తప్ప మిగిలినవారందరూ లైంగిక విషయాల్లో పాపము చేసేవారే. పాపమును ప్రేమిస్తూ దానిలో 

సంతోషంగా జీవించేవారు వారు దేవుని రాజ్యములో చేరరు అని స్పష్టంగా చెప్పండి.శుద్ధి చేయబడండి! తరువాత 

గుంపు, దొంగలు,  లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొనువారు.” వీరు కూడా దేవుని రాజ్యములో చేరరు. 

దేవుని రాజ్యములో చేరేవారు ఎవరు, చేరని వారెవరు, స్పష్టంగా మధ్యలో విభజించే గీత గీయబడింది. మీలో కొందరు 

అట్టివారైయుంటిరి వారికి ఏమి జరిగింది? కడుగబడి పరిశుద్ధపరచబడ్డారు! నీతిమంతులుగా తీర్చబడ్డారు! దేవుని 

స్తోత్రం! ప్రియ శ్రోతలూ, ఇది మీ అనుభవము కూడానా? ఒక్కటే ఈ విధంగా చేయగలదు, అది పరిశుద్ధుడైన యేసు 

క్రీస్తు రక్తము! ఆయన రక్తంలో మలినమైన మన వస్త్రములను శుద్ధి చేసుకుందాం! పాపములను శుద్ధి చేయడానికి 

కల్వరి సిలువ మీద ఆయన రక్తమును చిందించాడు. క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాలకు ముందే యెషయ ప్రవక్త 

ప్రకటించాడు. “మీ పాపములు రక్తమువలె ఎర్రనివైనను అవి హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎర్రనివైనను అవి 

గొర్రెబొచ్చువలె తెల్లనివగును యెషయ 1:18 మీరు పరిశుద్ధపరచబడ్డారు అనగా పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లోనికి 

వచ్చి మీ జీవితవిధానము మార్చుతున్నాడని అర్ధం. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అనగా మీరు నిర్దోషిగా 

చేయబడ్డారని మాత్రమే కాదు, అంత కంటే ఎక్కువ. అనగా ఎన్నడూ పాపము చేయని వారని లెక్క కట్టబడతారు. 

ఇదెలా సాధ్యం? “యేసుక్రీస్తు నామమునను, మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి ” యేసు క్రీస్తు నామము 

తప్ప వేరే నామము లేదు. ఆయన నామముననే పరిశ్దుద్ధాత్ముడు కడిగివేస్తాడు, క్రొత్త జీవిత విధానమును మీలో 

కలిగిస్తాడు. మీరీవిధంగా మార్చబడాలని ఆశ పడుతున్నారా? వెంటనే యేసు నామమున ప్రార్థించండి. దేవుని 

వాక్యముద్వారా మార్చబడుతున్నట్లయితే మీ సాక్షం మాతో పంచుకోండి.

         శ్రోతలూ, నిజముగా ఈ విధంగా మార్చబడినవారు పగతీర్చుకోవడానికి కోర్టు కేసులు పెట్టరు. వారిది క్రొత్త 

జీవితం కదా! మీరొకవేళ పెట్టిఉంటే, ఉపసంహరించుకోండి, ప్రభువును ఘనపరచండి.

 

మూడు దైవిక ఆదేశాలు:

1.     1. జాగ్రతగా ఉండండి, ఏది సరియైనదో ఆలోచించండి, వివాదాలు దేవునినెరుగని వారి ముందు తీర్చుకుంటారా?             సంఘము ముందు తీర్చుకుంటారా?

2.    2. అన్యోన్యoగా సమ్మతంగా ఉండండి. పంతాలకు, మెండితనానికి క్రీస్తునందు తావులేదు. దానికంటే అన్యాయం సహిస్తే,     ప్రభువును వెంబడించేవారౌతారు.

3.    3. శుబ్రపడండి. గత జీవితమును విడిచిపెట్టండి. యేసు క్రీస్తు నామమున, పరిశుద్ధాత్మ యందు కడుగబడి నూతన         జీవితాన్ని వివాదాల్లో కూడా చూపించడం క్రీస్తునందు సాధ్యమే! అంతటి మహాకృప యేసు క్రీస్తు రక్షకుడు         మనకందరికీ అనుగ్రహించుగాక! అమెన్!!    


 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...