I కొరింథీ అధ్యయనం-15 5:1-8 అక్రమంగా అందరినీ కలుపుకుపోవడం

 

 

I కొరింథీ అధ్యయనం-15  5:1-8

అక్రమంగా అందరినీ కలుపుకుపోవడం

    రేడియోవద్ద కూర్చొన్న ప్రతి ఒక్కరికీ యేసురక్షకుని అతున్నతంగా హెచ్చింపబడిన శక్తిగల నామములో 

శుభములు! మానసిక ఒత్తిడికి లోనయ్యారా? ఇది అందరికీ సహజమే! దాన్ని జయించే మార్గముందా? దేవుని 

వాక్యమే! బైబిల్లో మనకు కనిపించే భక్తులు, విశ్వాసులు అందరూ మీరెదుర్కుంటున్న పరిస్థితులు ఎదుర్కున్నవారే! 

దేవుని వాక్యముచేత జయించి మనకు మాదిరి చూపించారు. ప్రార్ధించుకుందాం, రండి, రేడియోకు దగ్గరగా వచ్చి 

కూర్చోండి. 

 

         ఈ నాటి బైబిల్ అధ్యయన భాగం: I కోరింథీ 5:1-8. మీ బైబిల్లో జాగ్రతగా గమనించండి. నోట్ బుక్ లో రాసుకొని 

అధ్యయనం చేయండి: I కోరింథీ 5:1-8 ఈ నాటి మన అంశము “అక్రమoగా అందరినీ కలుపుకొనిపోవడం”. సంఘాల్లో 

అందరినీ చేర్చుకోవడం, అందరినీ ఆహ్వానించడం అంతటా జరుగున్నది. కానీ దేవుని పరిశుద్ధ లేఖనమేమంటున్నది?  

బైబిల్ గ్రంధం మనకు అధికారికమైనది, మన స్వంత ఉద్దేశాలు, అభిప్రాయాలు కాదు. అక్రమంగా అందరినీ 

కలుపుకొనిపోవడాన్ని సరిదిద్దడానికి ఏ విధానాలు ప్రతి సంఘము అవలంభించాలో  ఆపో. పౌలు బోధిస్తున్నాడు, 

జాగ్రతగా గమనించి నేర్చుకుందాం. మొదటి విధానం, అసహ్యమైన ప్రవర్తనను బహిర్గతం చేయడం. I కోరింథీ 5 లోని 

మొదటి రెండు వచనాలు గమనించండి. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను 

ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు. ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత 

మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసినవారు కారు” కోరింథీ సంఘములో  వావి 

వరసలు తప్పిన అక్రమ లైంగిక సంబంధం ఒక వ్యక్తి చేస్తున్నట్టు, ఆ సంగతి అంతటా పొక్కినట్టు ఆపో. 

ఎత్తిచూపుతున్నాడు. ఈలాంటి నీచమైన, అసహ్యమైన పాపము గురించి కొందరు ఉప్పొంగి ఆ వ్యక్తిని వెనకేసురావడాన్ని  

 పౌలు తట్టుకోలేకపోతున్నాడు. అందరినీ కలుపుకొనిపోవాలని బోధించే నాయకులు ఉన్నారని అర్ధం. క్రొత్త నిబంధనలో 

జారత్వము అనగా అక్రమమైన లైంగిక సంబంధం. జారత్వమనే మాట క్రొత్త నిబంధనలో 31సార్లు ఆక్రమైన లైంగిక 

పాపమని చెబుతూ, వాడబడింది. దేవునినెరుగని వారు కూడా ఈలాంటి పాపమును సమర్ధించరు. కానీ దేవుని 

పరిశుద్ధ సంఘములో దాన్ని సమర్థించడం అతిఘోరమైన పాపము. లోకములోని ప్రజలు, దేవుని పరిశుధ్ద్ధతను 

ఎరుగకపోయినా, ఈ పాపమును సమర్ధించరు, కానీ దేవుని సంఘము దీన్ని సమర్థించడం, మిక్కిలి దిగజారినస్థితి. 

సంఘములో ఈ ఘోరమైన పాపములో జీవిస్తున్న వ్యక్తితిరుగుతూ ఉన్నా, కొందరు దాన్ని సమర్థించారు. వారు 

దాన్నిబట్టి ఉప్పొంగి గర్వంగా ఉన్నారు. అందరినీ కలుపుకొనిపోవాలని ఆ వ్యక్తిని సంఘసహవాసములో ఉండనిచ్చారు. 

ఆ వ్యక్తిని సహవాసములోని నుండి బహిష్కరించవలసి ఉండగా, ఆ పని వారు చేయలేదు. అతడు సహవాసములో 

ఉండడానికి ఏ మాత్రము వీలు లేదు. ఈ నాడు సంఘము అందరినీ కలుపుకొని పోవాలంటూ, పాపమును, 

అపవిత్రతను, సమర్థించడానికి దేవుని పరిశుద్ధ లేఖనము ఒప్పుకోదు, వెంటనే పాపమును, అపవిత్రతను ఖండించి 

తగినరీతిగా సరిదిద్దాలి.

 

         రెండవ విధానము హెచ్చరిక ఇవ్వడం బాగుచేయడానికి, బుద్ధిచెప్పడము సరిచేయడానికి అని  వివరించండి.  

 3-5 వచనాలు గమనించండి: “నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి,  

మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను. ఏమనగా,  

ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున 

మీరును, నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతోకూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు 

అప్పగింపవలెను”  ఆపో. పౌలు కోరింథీ సంఘాన్ని గట్టి నిర్ణయము తీసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. “నేను ఇప్పటికే 

తీర్పు తీర్చాను. ఆలాంటి వ్యక్తిని బహిష్కరించండి, వెంటనే క్రియ చేయండి,” అని పౌలు గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ 

వ్యక్తి సంఘ సహవాసములో ఉన్నంతవరకు సంఘము అపవిత్రంగా ఉంటుంది. పళ్ల గంపలోనుండి  కుళ్ళిపోయిన 

పండును తీసివేస్తామా లేదా? అప్పుడే గదా, పళ్ళన్నీ చెడిపోకుండా ఉండేది? సంఘమునకు బాధ్యత ఉందని పౌలు 

గద్దిస్తున్నాడు. సంఘస్థూలందరూ కలిసి కూర్చొని సరియైన నిర్ణయం చేయండి. ఈ రకమైన బుద్ధిచెప్పడం చేయాలి. 

అందరూ కలిసికట్టుగా ఉండి, ఈ ప్రాముఖ్యమైన నిర్ణయo అత్యవసరంగా తీసుకోవాలని పౌలు గట్టి హెచ్చరిక.

 

         కొన్ని సార్లు బహిష్కరించడమును చాలా కఠినమైన నిర్ణయమని కొందరు అనుకోవచ్చు. కానీ ఆపో. ఈ 

నిర్ణయం సరియైన బుద్ధిచెప్పడమని తేటపరుస్తున్నాడు. మొదట ఆ వ్యక్తిని దేవుని పరిశుద్ధ సహవాసములో నుండి 

బహిష్కరించాలి. దాని ద్వారా ఆ వ్యక్తిని బాగుపరచడం మన ఉద్దేశ్యం. ఆ వ్యక్తి తన పాపమును తెలుసుకొని, 

హృదయపూర్వకంగా దేవుని యెదుట పశ్చాత్తాపపడి, ప్రభువుతో తన హృదయమును సరిచేసుకొని, ఆ పాపమును 

విడిచిపెట్టిన తరువాత తిరిగి యథాస్థితికి తీసుకొని రావచ్చు. ఈ దిద్దుబాటు సరిగ్గా జరిగినట్లయితే ఆయనను తిరిగి 

సంఘ సహవాసములో చేర్చుకోవచ్చు. దీని ద్వారా అతడు ఎంతటి తీవ్రమైన పాపము చేశాడో తెలుసుకోవడానికి 

అవకాశముంటుంది. దీన్ని బట్టి బహు భయoకరమైన దేవుని తీర్పునుండి ఆ వ్యక్తిని తప్పించడానికి మార్గం 

ఏర్పడుతుంది.  దయచేసి గమనించండి, సంఘపు నాయకత్వానికి ఈ బాధ్యత ఉన్నది. వారు ఆ బాధ్యతాయుత 

స్థానములో ఉన్నారు. ఈ పరిస్థితిని జాగ్రతగా, సున్నితంగా, ప్రేమాభిమానాలు రంగరించి చేయాలి. అప్పుడు 

సంఘములో పరిశుద్ధత పునరుద్ధరించబడి, ఆ వ్యక్తి మారు మనసుపొంది తిరిగి పరిశుద్ధ సంఘములో చేర్చబడగలడు. 

దేవుని పరిశుద్ధ సంఘము అభివృద్ధి, చెందడం దేవుని ఉద్దేశం, ప్రణాళిక. కోరింథీ సంఘములో కలుపు మొక్కలను 

శుభ్రము చేసే సమయము వచ్చింది. ఆలాంటి క్రియ జరిగితే తప్ప దిద్దిబాటు జరగదు, పునరుధ్ధరణ జరగదు.

 

         మూడవ విధానం శుద్ధి చేయబడిన పరిణామమును అనుభవించండి.  6-8 వచనాలు. “మీరు అతిశయపడుట 

మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు 

గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప 

బడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కా 

పట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.”  ఆలస్యం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకనగా 

ఆలస్యమయ్యేకొద్ది పరిస్థితి విషమిస్తుంది. ఆపో. దీన్ని పులుపుతో పోల్చాడు. పిండి ముద్దలో కొంచెం పులిపుండి పెట్టి 

ఉంచితే ముద్దంతా పులిసిపోతుంది. 6వ వచనం ఏమంటుంది? పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు 

పులియచేయును. అది సంఘమంతటికి ప్రాకుతుంది. ప్రభువు శరీరమైన సంఘమును శుద్ధి చేయండి. యూదులు 

పస్కా పండుగ లో చేసినట్టే మనము చేయాలి. యూదులు వారి ఇళ్ళలో ఎక్కడా పులిపిండి ఉండకూడదని దీపం 

వెలిగించి అంతా వెతుకుతారు. వారు ఐగుప్తును విడిచిపెట్టకముందు పస్కా పండుగ ఆచరణ మొదలైనపుడు ఆ 

విధంగా చేయాలని వారికి ఆజ్ఞ అయ్యింది.

         ఆ తరువాత పౌలు క్రీస్తే మన పస్కా బలిపశువని బోధిస్తున్నాడు. ఆయన మనకోసం బలిచేయ బడ్డాడు గనుక 

ప్రభువు శరీరములోనుండి పాపమనే పులిపిండి తొలగించబడి శుద్ధి చేయబడాలి. పండుగలో మనము శుద్ధి చేయబడి 

పాల్గొనాలని హెచ్చరిక ఇవ్వబడుతున్నది. సంఘము శరీరము లాంటిది. ప్రతి అవయవం ప్రాముఖ్యమైనది. 

శరీరములో అన్ని అవయవములు కలిసిఉన్నట్టే సంఘములో ఒకరితో ఒకరము కలిసిఉంటాము. సంఘము ఏ 

రకమైన క్లబ్ కాదు, ఆరోగ్య క్లబ్ కాదు, ఆటల క్లబ్ కాదు, విద్య క్లబ్ కాదు, చివరకు పరిశుద్ధమైన క్లబ్ కూడా కాదు, 

సంఘము జీవము గల దేవుని పరిశుధ్ద సంఘము. హల్లెలూయ! సంఘము “ఎక్లేసియా” అనే గ్రీక్ మాటలోనుండి 

వచ్చింది.

                 

        అనగా “బయటికి పిలువబడిన ప్రజలు” లోకములోనుండి బయటికి పిలువబడిన  దేవుని ప్రజలు. వారు 

లోకమునకు చెందినవారు కారు. సంఘము లోకములోనుండి వేరు చేయబడిన దేవుని ప్రజలు. దేవుని వాక్యమును 

బట్టి మనకు రెండు మార్గాలు కనిపిస్తున్నవి. ఒకటి, సంఘమును అలాగే చూస్తూ వదిలిపెట్టవచ్చు. పాపమనే 

పులిపిండి దేవుని సంఘమనే ముద్దంతటినీ పులిపిండిగా చేస్తుంది. పాపపు పరిస్థితిని పట్టించుకోకుండా దేవుని 

పరిశుధ్ధ సంఘము బ్రష్టమైపోతుంది. రెండవ మార్గము, పులిపిండిని తీసి పారేయవచ్చు, ఇప్పుడే! మొదటిగా నా 

జీవితము, హృదయములోనుండి!! నీ జీవితములోనుండి, నీ హృదయములోనుండి!! ప్రతి విశ్వాసి, యేసు క్రీస్తు 

ప్రభువు శిష్యుడు, వారి జీవితములోనుండి పాపపు పులిపిండిని తీసే వేస్తే, సంఘము పరిశుద్ధపరచబడుతుంది. నేను, 

నీవు సిధ్ధమా? అప్పుడే మనము శుద్ధిచేయబడిన పరిణామము చూడగలము. పాపములో మూర్ఖంగా జీవిస్తూ 

సంఘమును పులిపిండిలాగా అపవిస్త్రపరుస్తున్న వ్యక్తులను క్రమశిక్షణ చేయగల ఆత్మీయమైన అధికారము, spiritual   

authority, మనకు కలుగుతుంది. ప్రియ సోదరీ, సోదరులారా, మీకొక సూటియైన ప్రశ్న: మన కోసం, తన ప్రాణమును 

పస్కాబలిగా చేసిన మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువు, ఆపో. పౌలు, మన సంఘాలను దర్శిస్తే, ఏమంటారు? కనీసం 

కొందరు, అందరినీ కలుపుకొని పోవడమనే తప్పుడు సిధ్ధంతమును వ్యతిరేకించే కొందరు, దేవుని పరిశుద్ధ 

వాక్యమునకు విధేయత చూపుదురు గాక! ఈలాంటి విధేయత చూపడానికి మనలో ప్రతి ఒక్కరికీ ప్రభువు యేసు క్రీస్తు 

అనుగ్రహించే విస్తారమైన కృప అవసరం. ఇప్పటి మన సంఘాలు అప్పటి కోరింథీ సంఘానికేమీ తీసిపోవు. జీవముగల 

దేవుని సంఘమంటే మారు మనసు పొందిన, మారు మనసు పొందుతున్న, విశ్వాసుల సహవాసము. అందరినీ 

కలుపుకొనిపోయే సమాజము కాదు. యేసు క్రీస్తు ప్రభువు మహా కృప మనలో ప్రతి ఒక్కరినీ దేవుని వాక్యమునకు 

విధేయత చూపడానికి అవసరమైనంత విస్తారమైన కృప అనుగ్రహించుగాక! అమెన్!!  

  


 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...