I కొరింథీ అధ్యయనం-14 4:16-21
సరియైన క్రమశిక్షణ
మీ పిల్లలు మార్గము తప్పిపోయారని బాధ పడుతున్నారా? ఎంతో క్రమశిక్షణలో పెంచాము ఇలా పతన మయ్యారని
వేదన చెందుతున్నారా? వేదన చెందడం పరిష్కారము కాదు, ప్రభువు సన్నిధిలో వేచిఉండి, ఎందుకలా జరిగిందే
ఆయన వద్ద తెలుసుకోవాలి. ప్రభువే స్వయంగా వారిని తనవైపు మళ్లించుకోగల శక్తిమంతుడు. ఒకవేళ ఇంటిలోనే
వారికి తప్పుడు మాదిరి కనబడిందేమో. మన పాపము ఒప్పుకొని ప్రభువు వద్ద క్షమాపణ వేడుకుందాం, రండి
రేడియోకు దగ్గరగా వచ్చి ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చోండి.
ఆపో. పౌలు I కోరింథీ 4:16-21లో సరియైన క్రమశిక్షణకు మార్గదర్శక సూచనలు బోధించాడు. పౌలు మాటల
ద్వారా సరియైన క్రమశిక్షణ చేసుకోవడానికి కొన్ని మార్గదర్శక సూచనలు నేర్చుకోవాలి, రండి, రేడియోకు దగ్గరగా
వచ్చి కూర్చోండి.
మొదటి మార్గదర్శకం ఉత్తమమైన యోగ్యమైన మాదిరిని పెట్టుకోవాలి. I కోరింథీ 4, 16, 17 వచనాలు. “మీరు నన్ను
పోలి నడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.౹ 17ఇందునిమిత్తము ప్రభువునందు నాకు
ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను
నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము
చేయును.” పౌలు ధైర్యంగా చెప్పే మాట, “నన్ను పోలి నడుచుకొనుడి” I కోరింథీ పత్రిక 11:1లో “నేను క్రీస్తును పోలి
నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” మనలో ప్రతి ఒక్కరికీ ఎవరో ఒకరు మాదిరిగా
మనసులో ఉంటారు. చిన్న పిల్లలను నీవు పెద్దయ్యాక ఏమవుతావు? అని అడుగుతూ ఉంటాము కదా! పిల్లలకు
ఎవరో ఒక మాదిరిని మనసులో ఉంచుకొని అవ్యక్తి లాగా కావాలని చెబుతూ ఉంటారు. మీరైనా, నేనైనా, ఏదో ఒక
మాదిరిని మనసులో పెట్టుకొని ఆవ్యక్తి లాగా కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కాబట్టి, ప్రియ శ్రోతలూ, మీరు
ఎవరిని ముందు మాదిరిగా పెట్టుకుంటారో, వారు ఉత్తమమైన మాదిరిగా ఉన్నారో లేదో జాగ్రతగా చూసుకోవలసి
ఉన్నది.
పౌలునకు రెండవ మిషనరీ ప్రయాణములో దెర్బే అనే పట్టణములో తిమోతి అనే యువకుడు క్రీస్తును తన
స్వరక్షకునిగా చేసుకున్నాడు. అతని తల్లి ఒక యూదురాలు పేరు యూనీకే. తండ్రి గ్రీకువాడు. తిమోతి సువార్తలో
అత్యంత ఆసక్తి చూపించి, బలమైన విశ్వాసిగా మారినందుచేత పౌలు ఆయనను ప్రభువు పరిచర్యలో వాడుకోవాలని
ప్రభువు చేత నడిపించబడ్డాడు. యూదులకోసం పౌలు అతనికి సున్నతి చేయించి తనతో బాటు ప్రభువు సేవలో
వాడుకోవడానికి వెంట తీసుకుని వెళ్ళాడు. ఆపో. ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం వ్రాస్తూ “2:19లో “మీ క్షేమవిషయమై
నిజముగా చింతించువాడు అతనివంటి వాడేవడును నాయొద్ద లేడు,” అన్నాడు. ఈ సాక్ష్యమును బట్టి తిమోతి ఎంతగా
పౌలును అనుసరించి, ఆయనను మాదిరిగా పెట్టుకొని జీవించి, ప్రభువు ప్రరిచర్యను చేశాడో మనకు స్పష్టంగా
అర్థమవుతుంది. తిమోతి పౌలును అనుసరించిన విధానము గురించి 17వ వచనములోని రెండవ భాగములో ఎంతో
స్పష్టంగా ఉన్నది. “అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను
నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.” దీనివల్ల పౌలునకు తిమోతితో ఎంత దగ్గరి సంబంధము
ఉన్నదో, తిమోతి పౌలును ఎంత దగ్గరగా అనుసరించి వెంబడించాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తిమోతిని
గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యము ఎంత సంతోషకరంగా ఉందో గమనించారా, శ్రోతలూ? మనమేలాంటి మాదిరిని మన
చుట్టూ ఉన్నవారికి, సాటి విశ్వాసులకు సంఘస్తులకు ఇస్తున్నామో పరీక్షించుకోవడం మంచిది.
ఆ తరువాత పౌలు యొక్క బోధనలో ఉన్న నిలకడగలగలిగిన స్థిరత్వం. పౌలు బోధించిన సత్యములు ఏ
సంఘమునకు వ్రాసినదైనా, ఏ సందర్భములో వ్రాసినదైనా, ఎప్పుడు వ్రాసినదైనా, ఏ మాత్రము భేదము లేకుండా, ఒకే
సత్యమును ఒకే రీతిగా ప్రతి సంఘములో బోధించడం బైబిల్ గ్రంధములో ఆయన వ్రాసిన పత్రికలన్నింటిలో మనము
గమనించవచ్చు. శ్రోతలూ, మనుష్యులు మారినా, తరాలు మారినా, లౌకిక జ్ఞానము మారినా, దేవుని వాక్యం
ఏమాత్రము మార్పు లేకుండా ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. దేవుని మాట “నిరర్ధకం కానేరదు” అనే మాటలు మీరు
బైబిల్లో అనేక చోట్ల చదివి ఉండవచ్చు. అంటే అర్ధమేమిటి? “నిష్ప్రయోజనము కాదు” అని అర్ధం. “అర్ధం” అంటే
ప్రయోజనమని అర్ధం.
ఏ ఉద్దేశ్యముతో చెప్పబడినదో, ఆ ఉద్దేశ్యమును నెరవేరుస్తుంది అని అర్ధం. యెషయ 55:11లో దేవుని మాటల
గురించి ప్రభువు ఏమని చెప్పాడో జాగ్రతగా తెలుసుకుందాం. “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు
అనుకూలమైనదాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును.” నిష్ఫలముగా అనే మాటలను
గమనించారా? దేవుని వాక్యమును వచనము వెంబడి వచనం ఇంత విపులంగా విశదీకరించి ఎందుకు ప్రసారం
చేస్తున్నామంటే దేవుని వాక్యములో శక్తి ఉన్నది, అది ఎన్నటికీ తరగదు, మారదు, తక్కువ కాదు. దేవుని
వాక్యములోని శక్తిని మీరు అనుభవించి ఆనందిస్తున్నారా?
రెండవ మార్గదర్శకం పనిచేస్తూ ఉండే పరిచర్యను చేయాలి. “నేను మీ యొద్దకు రానని అనుకొని
కొందరుప్పొంగుచున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి
మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.” ఆపో. కోరింథీకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. కానీ కొందరు అక్కడ
ఉప్పొంగే వారున్నారు. అనగా కప్ప ఉబ్బినట్టుగా ఉబ్బి తాను ఎద్దునైపోయా ననుకునేవారు. కప్ప ఉబ్బి, ఉబ్బి,
పగిలేపోయేదాక ఉబ్బిపొతుందేమే! కొందరు అధికారమును అపహరించి దేవుని సంఘముమీద ఆధిపత్యం
చలాయిస్తున్నారు. వారే ఉప్పొంగేవారు. ఆపో. సంఘస్తుల అభివృద్ధి, క్షేమము గురించి భారముతో ఉన్నాడు. ఉప్పొంగే
వారు, ఆపో. రాడు, ఎక్కడ అవమానం పాలు కావలసివస్తుందోనని భయపడిపోతాడు, అనుకుంటున్నారు. కానీ ఆపో.
ప్రభువు చిత్తప్రకారము వస్తానని వారికి తేటపరుస్తున్నాడు. ఆపో. పౌలు దేవునికి అతిసమీపంగా జీవించాడు. ఉప్పొంగే
వారి శక్తి ఎంతో, తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. వారివి వట్టిమాటలేనా, లేక ఏమైనా శక్తి ఉందా?
తెలుసుకోవాలని, సమస్యలను ఎదుర్కోవాలని పట్టుదలతో ఉన్నాడు. “శక్తి” అనే మాట బలమైన మాట, ఇదే మాట
అ.కా. 1:8లో “శక్తి”కి వాడబడింది. ఈ “శక్తి” దుష్టశక్తులను జయించగల శక్తి కలిగినది. కొన్ని సార్లు అనుభవములేని
క్రొత్తవారు అధికారమును చేపట్టి సంఘమును నాశనం చేస్తారు. అందుకే పౌలు అలాంటి పరిస్థితిని అరికట్టాలని
ప్రయత్నము చేస్తున్నాడు. వారికి భాష వచ్చిఉండవచ్చు, గాని, దేవుని అభిషేకము లేదు. వారు స్కేవ
కుమారులలాంటి వారైఉండవచ్చు. ఒక యూదజాతి యాజకుని కుమారులైన వీరు భాష నేర్చుకొని అద్భుతం
చేయాలని ప్రయత్నము చేసి పెద్ద అపాయములో పడ్డారు. దీని విషయం అ. కా. 19:11-16లో ఉన్నది. అ. కా.
19:11-16. ఈ రెండవ మార్గదర్శకమేమిటి అనగా దేవుని అభిషేకము, శక్తి కలిగి, పని చేసే పరిచర్య కలిగి ఉండాలి.
ఇక మూడవ మార్గదర్శకము స్పష్టము చేయబడిన పద్ధతి కలిగిఉండాలి. 20-21 వచనాలు. “దేవుని రాజ్యము
మాటలతో కాదు శక్తితోనేయున్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీయొద్దకు రావలెనా? ప్రేమతోను
సాత్వికమైన మనస్సుతోను రావలెనా?” ఈ రెంటిలో ఉన్న భేదమును గమనించాలి. మాటలకు శక్తికి భేదము ఏమిటి?
దేవుని రాజ్యము దేవుని శక్తితో పనిచేస్తుంది, మానవుల మాటలతో కాదు. ఈ రెంటిమధ్యలో ఎంతటి భేదమున్నదో
గమనిస్తున్నారా, శ్రోతలూ? భాష వచ్చినoత మాత్రాన సరిపోదు. క్రమశిక్షణతో కూడిన ప్రార్ధన, దేవుని వాక్యమునకు
విధేయత చూపించే జీవితము, ప్రవర్తన ఉన్నపుడు, దేవుడు తన శక్తిని అనుగ్రహిస్తాడు. క్రీస్తు ప్రభువు యొక్క
శిష్యులుగా జీవిస్తూ, ఆయనను అనుదినం వెంబడించే వారికి ప్రభువు తన శక్తిని అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో కనిపించే
ఆర్భాటాలు, రంగుల లైట్లు మొదలైన వాటికి, యేసు క్రీస్తు ప్రభువు శిష్యరికానికి ఏ మాత్రం సంబంధముందా? దేవుని
పరిశుద్ధ మార్గమును విడిచిపెట్టి కంటికి కనిపించే వాటివైపు అవి ఆకర్షించవచ్చు, కానీ దేవుని శక్తికి అవి నిదర్శనాలు
కావు. ఏదో ఒకటి చెప్పాలని చెప్పడం వలన ఏమి ప్రయోజనము లేదు. ఏది చెప్పవలసి ఉన్నది? యేసు క్రీస్తు
ప్రభువు తన పరిశుధ్ద రక్తము చిందించి, ప్రాణమిచ్చి, మరణించి, తిరిగిసజీవుడై లేచి, తండ్రివద్దకు ఆరోహణుడై, తండ్రి
కుడిప్రక్కలో సర్వాధికారిగా సింహాసనాశీనుడై ఉన్నాడని సాక్షమిచ్చిఆయనకు సంపూర్ణ మహిమనిచ్చేది సువార్త. ఈ
సత్య సువార్తకు మనమంతా సాక్షులమేనా? ఆపో. పౌలు హెచ్చరిక చేసిన “వేరొక” సువార్తను బోధిస్తున్నమా?
ఎందుకు బోధిస్తున్నాము? బ్రతకడానికా? జీవనోపాధికోసమా? లేదా పరలోకపు దర్శనమునకు విధేయత
చూపడానికా? ఏ విధంగా బోధిస్తున్నాము? పౌలు చూపించిన మాదిరి ప్రభువు రక్షించిన వారిని ప్రేమతో,
సాత్వికముతో సాటివిశ్వాసులుగా, తోటి సహోదరులుగా భావించి “ప్రేమతో సత్యమును” బోధిస్తున్నామా?
ఖండించవలసిన అవసరము వచ్చినప్పుడు ప్రభువు వాక్యమునకు విధేయులమై మెత్తని మనసుతో, సాత్వికముతో,
వారి విశ్వాసమును అభివృద్ధి చేసి తప్పుడు మార్గములోనుండి విడిపించాలనే ఉద్దేశముతో చేస్తున్నామా? లేదా ఇతర
తోటి సహోదరులను అవమానపరచి, కించపరచి, బాధ పెట్టేరీతిగా చేస్తున్నామా?
మన ప్రభువు, రక్షకుడు యేసుక్రీస్తు చూపించిన మాదిరిని ఎల్లప్పుడూ మన దృష్టిలో మన కన్నుల యెదుట
ఉంచుకొని ఆయనను మాత్రమే అనుసరించి వెంబడించవలసిన సమయం ఆసన్నమైంది. ప్రభువు అతి త్వరలో తిరిగి
మేఘాలముల మీద ఆయనకు చెందిన వారిని తనతో బాటు తీసుకొనివెళ్ళటానికి వస్తున్నాడు. ఆయన తలుపు దగ్గరే
ఉన్నాడు.
1. మొదటి మార్గదర్శకం ఉత్తమమైన యోగ్యమైన మాదిరిని పెట్టుకోవాలి.
2. రెండవ మార్గదర్శకం పనిచేస్తూ ఉండే పరిచర్యను చేయాలి.
3. మూడవ మార్గదర్శకము స్పష్టము చేయబడిన పద్ధతి కలిగిఉండాలి.
యేసు క్రీస్తు ప్రభువును వెంబడించే శిష్యుడుగా, శిష్యురాలిగా జీవించడానికి అవసరమైనంత మహా కృప సర్వ కృపానిధి
అయిన ఆ ప్రభువే మనకందరికీ, ప్రతి ఒక్కరికీ అనుగ్రహహించుగాక! అమెన్!!
No comments:
Post a Comment