I కొరింథీ అధ్యయనం-7 2:11-16 తెలుసుకోలేనివి తెలుసుకుందాం

 

I కొరింథీ అధ్యయనం-7  2:11-16

తెలుసుకోలేనివి తెలుసుకుందాం

       మీరంతా బాగున్నారా? అన్నీ సరిగా జరగడం వల్ల మనకు సంతోషము కలుగదు. అన్నింటినీ ఇచ్చిన యేసు 

క్రీస్తు ప్రభువును అన్నింటిమీద సర్వాధికారం కలిగిన ప్రభువును మీరు వ్యక్తిగతంగా తెలుసుకొని విశ్వసించి ఉంటే 

ఆయనవల్ల సంతోషం కలుగుతుంది. ప్రార్ధించుకుందాం, రండి, మీ బైబిల్ నోట్ బుక్ తో సహా రేడియోకు దగ్గరగా వచ్చి, 

ప్రశాంతమైన మనసుతో నెమ్మదిగా కూర్చోండి. ప్రార్థన:

         మానవ మనసు అగాధమైన మహా సముద్రము లాంటిది. దాంట్లోనుండి వేదాంతాలు,  తాత్వికతలు, పుట్టాయి. 

అవన్నీ చేసిన పరిశోధనలు, యోచనలు ఏ మేలు మనకు చేయలేదు. కాని మానవమనసుకు దేవునితో సంబంధం 

పెట్టుకోగలిగిన శక్తి కూడా ఉన్నది. మనము తెలుసుకోలేనంత ఉన్నత స్థాయిలో దేవుడు ఉన్నప్పటికీ మన మనసుతో 

ఆయనతో సంబంధం కలిగించుకునే శక్తిని సృష్టికర్త ఇవ్వడం ఎంత గొప్ప విషయంకదూ! దేవునికి స్తోత్రం! అయినప్పటికీ 

దేవునికీ మనకూ ఉన్న దూరం కలవలేనంతదూరం. కానీ దేవుడు కలుగచేసుకొని చొరవతీసుకుంటే అది సాధ్యమే! 

చాలామంది తత్వవేత్తలు, వేదాంతవేత్తలు వారి స్వంత జ్ఞానo మీద ఆధారపడినందుచేత వారెక్కడికీ చేరుకోలేక 

పోయారు. I కోరింథీ 2:11-16లో ఆపో. పౌలు తెలుసుకోలేనివి ఎలా తెలుసుకోవచ్చో బోధించారు. ఇది వింటుంటే, 

“ఇదేంటి? ఇదెలా జరుగుతుంది?” అని మీరనుకోవచ్చు. కొంచెం ఓపిక పడితే, అర్థమవుతుంది. మొదట 

లేఖనభాగమును చదువుకుందాం,  మీ బైబిల్ తెరిచి I కోరింథీ 2:11-16 మీ ముందుంచుకోండి. పెన్, నోట్ బుక్ కూడా 

ప్రక్కలో పెట్టుకొనండి.

         ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి          తెలియును?  

ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.
 

              12 దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక          దేవుని  

యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.
 

              13 మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో 

సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము.
 

              14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి  

వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
               

15 ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింపబడడు.
 

              16 ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు              

కలిగినవారము.

___________________________________________________________________________

    తెలుసుకోలేనివి తెలుసుకోవడానికి కొన్ని ప్రాముఖ్యమైన స్థాయిలగుండా వెళ్ళవలసివస్తుందని ఆపో. పౌలు ఈ 

లేఖనభాగములో వివరిస్తున్నాడు.

మొదటి స్థాయి, తెలుసుకోవలసినవాటి సరిహద్దులు వర్గీకరించుకోవడం . 11,12 వచనాలు గమనించండి. “ఒక 

మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి     తెలియును? ఆలాగే దేవుని 

సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు.
 

12 దేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక           దేవుని యొద్దనుండి 

వచ్చు ఆత్మను పొందియున్నాము.  తెలుసుకోవలసినవాటిని ఆపో. పౌలు కేవలం రెండుగా విభజిస్తున్నాడు. ఒకటి 

మనుష్య ఆత్మ, రెండవది దేవుని ఆత్మ. మొదటిది మానవుని ఆత్మకు చెందినవి, అవన్నీ మానవుని పరిధిలోనే 

ఉంటాయి. ఇది ఎల్లప్పుడూ విస్తరిస్తూ, సాగిపోతూ, మారుతూ ఉంటుంది. వీటి సరిహద్దును ముందుకు నెట్టుతూ 

మానవ జ్ఞానము, తెలివితేటలు నిరంతరం ఎక్కువవుతూ ఉన్నవి. శ్రోతలూ, ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఇంకా 

అంతకంటే ఎక్కువ తెలుసుకోవలసినది ఉంటుంది. మానవ సంగతులు మనకు అంతుపట్టవు. దేవుని సంగతులు 

మనము గ్రహించలేనంత గొప్పవి. దేవుని సంగతులు మానవ జ్ఞానపు పరిధికి బయట ఉన్నవి. 12వ వచనము 

మొదట్లో “దేవునివలన మనకు దయచేయబడినవాటిని...” అనే మాటలను జాగ్రత్తగా గమనించాలి సుమా! దేవుని 

సంగతులు మనము కనిపెట్టేవీ కాదు, ఆవిష్కరించేవీ కాదు. అవి “మనకు దయచేయబడినవి దేవుని అనుగ్రహము, 

కృప  చేత వాటిని నేర్చుకుంటాము. తెలుసుకోవలసినవాటిలోని హద్దులు మీరు తేటగా తెలుసుకోవాలని 

ఆశిస్తున్నాను. మొదటిది మానవ జ్ఞానము, రెండవది ఆత్మీయ, దేవుని జ్ఞానము.

         రెండవ స్థాయి సాధారణ మానవునికి గల హద్దులను గుర్తించడం.   13, 14 వచనాలు గమనించండి: 

మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో 

సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించు చున్నాము. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు  

దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే 

వివేచింపదగును గనుక అతడు     వాటిని గ్రహింపజాలడు. ఆపో. మనతో మాట్లాడుతున్నది మానవ జ్ఞానముతో కాదు. 

ఆత్మీయ సత్యములు మానవ జ్ఞానముతో బోధించలేము. అదే భాషలో మాట్లాడవచ్చు, మాటలు కూడా దాదాపు 

అలాంటివే కావచ్చు, కానీ ఆత్మీయ సత్యము ఆ రీతిగా బోధించబడదు. మానవ జ్ఞానమునకు గర్వము ఉంటుంది, 

అంతే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా నిరతరo మారుతూ ఉంటుంది గనుక ఇంకా, ఇంకా, ఇంకా, 

నేర్చుకోవచ్చు. కానీ దేనిలో? మానవ జ్ఞానము, ఈ లోకపు జ్ఞానములో. శాస్త్రజ్ఞునులు, వేదాంతులు తరతరాలుగా 

మన మెదడును గూర్చి నివ్వెరపోతూ ఉన్నారు. మెదడు ఎలా పనిచేస్తుంది? దాని ప్రధాన పాత్ర ఏమిటి? దాని 

ప్రాముఖ్యమైన పాత్ర మన శరీరాలను అదుపులో పెట్టడం. కాని, ఇక్కడ మనకు చెప్పబడుతున్నది ఏమిటంటే, పౌలు 

గారు బోధించినది పరిశుద్ధాత్ముడు బోధించిందాని ఆధారమైన బోధన. మరో మాటలో చెప్పాలంటే, సాధారణ 

మానవుడు ఆత్మీయ సంగతులను గ్రహించలేడు. ఎందుకంటే, అతని మెదడు, లేదా మేధస్సు, దేవుని విషయాల్లో 

చనిపోయింది. దేవుని సంగతులలో వారు బ్రెయిన్-డెడ్” అనమాట. క్రైస్తవ్యం, దేవుని పరిశుద్ధగ్రంధం బైబిల్ జవాబు 

కావలసిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తుంది. దేవుని అబ్బురపరిచే విమోచన ప్రణాళిక ఆశ్చర్యాన్ని కలిగించే జ్ఞానమును 

చూపిస్తుంది. దానిద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మానవునికి విమోచన కలుగుతుంది. సాధారణ 

మానవుడు తన పాపములుఅపరాధములలో చనిపోయినవాడు, అందుకే, “బ్రెయిన్-డెడ్” అని చెప్పవలసివస్తుంది. 

ఈ హద్దులు నీవు గుర్తిస్తే, ప్రియ శ్రోతా, నీవు క్రీస్తు సిలువ చెంతకు ఇప్పుడే వచ్చి నీవు జీవము, విమోచన, జ్ఞానము, 

క్షమాపణ, క్రీస్తు నందు సమస్త సమృద్ధి పొందవచ్చు.

         ఇక మూడవ స్థాయి, ఆత్మీయమైన వ్యక్తి స్వంతగా వృద్ధి చెందడమును వినియోగించుకోవడం. 14-16 

వచనములు గమనించండి: “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి 

అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 

ఆత్మసంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును 

ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.”  ఆత్మీయమైన వ్యక్తి మొత్తానికే క్రొత్త 

రీతిగా ప్రవర్తిస్తాడు. ఆపో. II కోరింథీ 5:17లో ఏమన్నాడు? “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి;  

పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;” అన్నీ క్రొత్తవిగా మారిపోతాయి. సాధారణమైన వ్యక్తి చుట్టూ చుట్టూ తిరిగినట్టు 

అదే పద్ధతిలో జీవిస్తాడు. ఆత్మీయమైన వ్యక్తి సూటిగా యధార్ధంగా ఆలోచిస్తాడు. పరిస్థితులు ఉన్నవి ఉన్నట్టుగా 

గ్రహించి అన్నింటినీ దేవుని వాక్యపు వెలుగులో చూస్తాడు. 16వ వచనములో ఉన్నట్టుగా “ప్రభువునకు 

నేర్పించగలవారెవరు?” ఎవ్వరూ లేరు. దేవుని మనసును ఎవ్వరూ మొత్తము తెలుసుకోలేరు. అది అసాధ్యం. మన 

మానవ మనసులకు హద్దులున్నాయి. అందుచేత మనము దేవుని ప్రత్యక్షత మీద ఆధారపడక తప్పదు. ఆపో. పౌలు 

మాట గమనించండి: “మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.”  సాధారణ మానవుని నిష్పలమైన ఊహలు, 

సందేహాల ఊబి నుండి ఆత్మీయమైన వాడు పైకి లేపబడిఉన్నాడు. హల్లెలూయ! దేవుని నెరుగని ప్రతి ఒక్కరూ వారి 

స్వంత ఆలోచనల మానవ తర్కవాదములమీద నిలుకడ లేకుండాఉంటాడు. ప్రియ శ్రోతలూ, యేసు క్రీస్తు ప్రభువు 

ద్వారా దేవునితో సంబంధం కలిగినవారు ఈ అధిక్యతలు పొంది ధన్యులౌతారు. మారుమనసు అనుభవమును బట్టి 

నేను తెలిసుకోలేనివి తెలుసుకుంటున్నానని చెప్పటానికి సంతోషిస్తున్నాను. ఈలాంటి అనుభవము మరెందరికో 

ఉన్నది. ఇది మీ అనుభవము కూడానా? అయితే మీరేవిధంగా యేసు క్రీస్తు ద్వారా నూతన సృష్టిగా 

మార్చబడుతున్నారో పంచుకోవచ్చు. మీ చుట్టూ ఉన్నవారితో పంచుకోవచ్చు. తోటివారితో, స్నేహితు లతో, 

బంధువులతో, పంచుకోవచ్చు.    

1.      

మొదటి స్థాయి తెలుసుకోవలసినవాటి సరిహద్దులు వర్గీకరించుకోవడం . మొదటి స్థాయి.

2.    రెండవ స్థాయి సాధారణ మానవునికి గల హద్దులను గుర్తించడం.  

3.    మూడవ స్థాయి, ఆత్మీయమైన వ్యక్తి స్వంతగా వృద్ధి చెందడమును వినియోగించుకోవడం.

    మీకు కూడా సాధారణమైన మానవ జ్ఞానమును దాటి ఉన్నతమైన దేవుని జ్ఞానమును ఆస్వాదించడానికి 

ఇష్టపడుతున్నారా?  అలాగయితే, మొట్ట మొదటి మెట్టు, నీవే స్థితిలో ఉన్నావో యేసు ప్రభువుతో యధార్ధంగా చెప్పు. 

ఆయనను నీ రక్షకుడుగా విమోచకునిగా నీ జీవితములోనికి ఆహ్వానించు. అప్పుడు నీ ఆలోచనా విధానం పూర్తిగా 

మారుతుంది. దేవుని ఆత్మ అనుగ్రహించే ఆ కానుక ద్వారా తెలుసుకోలేనివి తెలుసుకునే స్థితిలో నీవుంటావు. దానికి 

అవసరమైనంత మహా కృప ప్రభు యేసు వారు నీకానుగ్రహించుగాక! అమెన్!!

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...