రోమా అధ్యయనం – 57 16:17-23 శ్రద్ధ, జాగ్రత్తల అవసరత

 

రోమా అధ్యయనం – 57   16:17-23 

శ్రద్ధ, జాగ్రత్తల అవసరత

    మీరంతా బాగున్నారా? ఇనుప హస్తమని పేరుగాంచిన రోమ్ ప్రభుత్వపు జైల్లో ఉండి, తన ప్రాణము కొంత 

కాలములోనే వారు తీస్తారని తెలిసి కూడా ఆనందించినవారున్నారు. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, 

మరల చెప్పుదును, ఆనందించుడి” అని విశ్వాసులను హెచ్చరించిన పౌలు భక్తుణ్ణి జ్ఞాపకం తెచ్చుకొని లేచి ధైర్యం 

తెచ్చుకొని భోజనం చేయండి. ప్రభువునందలి ఆనందం ఎప్పుడైనా ఎక్కడైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉంటుంది. నీకిది 

కావాలంటే,  యేసుక్రీస్తుప్రభువుతో మీకు సంబంధం కావాలి, అది ఇప్పుడే పొందవచ్చు.

     

    జాగ్రతగా ఉన్నపుడే శ్రద్ధ కలుగుతుంది. జాగ్రత సుమీ! మీరు పట్టణ ప్రాంతములో జీవిస్తున్నట్లయితే, ట్రాఫిక్లో 

జాగ్రత! గ్రామీణ ప్రాంతమైతే, పశువులు, దుష్టుల మోసాలు, పాములు, తేళ్ళు, గాలి తుఫానులు, ఇలా ఎన్నెన్నో. 

క్రైస్తవ జీవితములో ఎంతో జాగ్రత అవసరం. మన శత్రువు సైతాను ఎన్నో వలలు, గుంటలు, కుట్రలు పన్నిఉంటాడు. 

మనమంతా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండడానికి ఏ మాత్రం వీలులేదు. జాగ్రత, శ్రద్ధ చాలా అవసరం.

         రోమా 16:17-23లో పౌలు అంశము జాగ్రత, శ్రద్ధల అవసరత.

         17 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు        వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి.
              18
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.
              19
మీ విధేయత అందరికిని ప్రచుర మైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు      విషయమై జ్ఞానులును, కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను.
              20
సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన        ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
              21
నా జతపనివాడగు తిమోతి నా బంధువులగు లూకియ యాసోను, సోసిపత్రు అనువారును మీకు    వందనములు చెప్పుచున్నారు.   

              22 ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను.
             
23 నాకును యావత్సంఘమునకును
ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు.

          పౌలు తాను గ్రహించిన కొన్ని పరిస్థితులను బట్టి జాగ్రత, శ్రద్ధల అవసరతను బోధించాడు. ఆ పరిస్థితులేమిటి?

        

     మొదటిది, తప్పుడు సిద్ధాంతముల పట్టును బట్టి జాగ్రత, శ్రద్ధలు అవసరం. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన 

సమయానికి దగ్గరలోనే పౌలు కూడా జీవించినందుచేత తప్పుడు సిధ్ద్ధాంతములు ప్రబలి ఉండక పోవచ్చు అని 

మనమనుకుంటాం. కానీ అప్పటికే తప్పుడు సిద్ధాంతములు ఉన్నాయి. కాలక్రమమును జాగ్రతగా పరిశీలించిన 

తరువాత యేసు క్రీస్తు ప్రభువు మరణించిన తరువాత 25 ఏళ్ళకు పౌలు జీవించాడు. అపోస్తలులు, విశ్వాసులు 

రోమా సామ్రాజ్యములో సువార్తను వ్యాప్తి చేస్తూ సంఘాలు స్థాపిస్తూ వచ్చారు. కానీ అప్పటికే విభేదాలు కలిగించి, 

సత్యమును దారి మళ్లించి వక్రీకరించేవారు ఉన్నారు. సత్యము అబద్ధమును, అసత్యమును కదిలిస్తుంది, 

ప్రకంపనలు పుట్టిస్తుంది. సత్యమంటూ లేకపోతే అబద్ధము కూడా ఉండదు. సత్యమునకు వ్యతిరేకమైన తప్పుడు 

సిధ్ద్ధాంతము సంఘమును దాడి చేస్తూ ముట్టడి చేస్తూ ఉంది. కాబట్టి అపోస్తలుడు వారికి హెచ్చరిక చేస్తున్నాడు.

         

     అసలు తిరుగుబాటు ఎక్కడ దాగిఉందో తెలుసుకోవడం ఆసక్తిని పుట్టిస్తుంది. 18వ వచనం గమనిస్తే,అట్టి వారు 

మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు;” అని వ్రాయబడింది, గమనించారా, శ్రోతలూ? వీరికి 

ప్రభువుని సేవించాలని లేదు గాని, వారిని వారే సేవించుకోవాలని ఉద్దేశించారు. వారు యేసు ప్రభువును హెచ్చించరు కానీ తమ్మును తామే హెచ్చించుకుంటారు. వారి తీయని, మృదువైన మాటలు ప్రజలను మోసగించటానికే. వారి 

బలమైన ఉద్దేశ్యం మొసోగించడం, కనుక భేదాలు కలిగించి, దీనిద్వారా, అమాయకులైన వారిని తప్పు త్రోవలో 

పడేస్తారు.

 

         రెండవది, నమ్మకమైన నిశ్చయత తో కలిగే భద్రతాభావము శ్రద్ధను ప్రతిబింబిస్తుంది, చూపిస్తుంది. సైతానును 

ఎదిరించడానికి శ్రద్ధ, జాగ్రత అవసరం. మంచితనమును ప్రోత్సహించడములో ఇది కనిపిస్తుంది. 19వ వచనములో 

పౌలు మరొక పరిస్థితిని చూపిస్తున్నాడు. అక్కడ ఒక సంతోషకరమైన  సంగతిని చెబుతున్నాడు. రోమాపత్రిక 

ఆరంభం లోనే వారి విధేయత అంతా తెలిసిందని ఆపో. పౌలు సాక్ష్యమిచ్చాడు. మొదటి అధ్యాయం అయిదవ వచనం 

ఒక్కసారి వెనక్కి పేజీలు తిరగేసి చూడండి: “ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు 

విధేయులగునట్లు...” అలాగే 8వ వచనములో కూడా గమనించండి: “మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము 

చేయుచుండుటను బట్టి” అనే మాటలు మన మనసుల్లో నాటుకోవాలి.

         

     ఇప్పుడు ఈ చివరి అధ్యాయములో మళ్ళీ విధేయత గురిoచి చెప్పడం గమనార్హం. ప్రియ సోదరీ సోదరులారా, 

ఇది ప్రాముఖ్యమైన సత్యం. ఏమిటది? తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. మనము అధ్యయనం చేస్తున్న ఈ 

సత్యాలు ఒక పాఠంలాగా మీరు వల్లించవచ్చు, దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. అవి మెదడులో మాత్రమే 

ఉంటాయి. విని, తెలుసుకున్న ఈ సత్యాలు విధేయతగా ఫలించాలి. అప్పుడే మేలు కలుగుతుంది.

         

     విధేయత కలిగిన మనసు క్రియ చేయడానికి సిద్ధపడుతుంది. మేలైనవాటిని, వెంబడించే జ్ఞానము 

కలిగియుండాలని పౌలు వారిని హెచ్చరించాడు కదా! అప్పుడే దుష్టత్వము, పాపమునకు దూరంగా ఉండాలని 

కూడా హెచ్చరించాడు. “కీడు విషయమై నిష్కపటులు” అనే మాటలను గమనించండి. జ్ఞానము దాన్ని అడ్డగిస్తుంది. 

మేలు చేయడానికి, స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారు. 20వ వచనములో శ్రేష్టమైన వాగ్దానమున్నది:  

సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును.”  ప్రియులారా, ఎవరు 

సైతానును  చితుకతొక్కుతారో గమనించారా? దేవుడు చేస్తాడు, హల్లెలూయ! మనము ఆయనలాగ ఎన్నటికీ 

చేయలేము. మనంతట మనము కానీ ప్రభువే ఒకానొక దినమున సైతాను చితుకతొక్కుతాడు, నాతో బాటు మీరు 

కూడా హల్లెలూయ! అని చెప్పి హృదయపూర్వకంగా దేవుని మహిమ చెల్లించండి. మనము విని, తెలుసుకున్న 

సత్యములకు విధేయత చూపిస్తే ఈలాటి నమ్మకమైన నిశ్చయతతో కలిగే భద్రతా భావము కలుగుతుంది.

          

    మూడవది, పరిచర్యలో సహచరులు, తోటివారి మద్దతు, సహకారం కావాలంటే శ్రద్ధ, జాగ్రత అవసరం. పౌలు ఈ 

పత్రిక వ్రాసే సమయములో ఈ సహచరులు ఆయనతోనే ఉన్నారు. మొదటి సారి తిమోతి పేరు ప్రస్తావిస్తున్నాడు, 

గమనించారా? ఆయనను “నా జతపనివాడు” అని పరిచయం చేస్తున్నాడు. ఇతర చోట్ల తిమోతిని పౌలు చాలా 

ప్రశంసించి మెచ్చుకోవడం గమనిస్తాo. అప్పటికి ఆయన ఒక యువకుడు మాత్రమే, అయినా, పౌలుతో చాలా 

సన్నిహితంగా మెలిగి, దగ్గరి వాడుగా ఉండి కలిసి పరిచర్య చేశాడు. తిమోతి అంటే పౌలునకు చాలా గాఢమైన లోతైన 

స్నేహభావము ఉన్నది. పౌలును  ఆయన చాలా బలపరచి తోటివానిగా పనిచేసినవాడు.

         

     ఇంకా ముగ్గురిని గూర్చి చెబుతున్నాడు. “లూకియ యాసోను, సోసిపత్రు” బంధువులు అని అంటున్నాడు, 

అంటే రక్తసంబంధమున్నదని కాదు, సువార్తలో, ప్రభువులో బంధుత్వమే. బంధువులంతా ప్రేమ, ఆప్యాయత, 

అనురాగము వారితో పౌలు కలిగిఉన్నాడు. ఈ మధ్యలో ఈ పత్రిక తనచేతితో వ్రాసిన తెర్తియు రోమ్ సంఘానికి 

వందనాలు చెబుతున్నాడు. పౌలు ఆయన అనుచరులకు కోరింథీలో ఉండిన గాయి ఆతిధ్యమిచ్చాడు. ఆయన 

వందనములు కూడా లెక్కలోకి వచ్చాయి. కోరింథీలో ఉన్న సంఘమంత ఆ గాయితో కలిసి రోమ్ లో ఉన్న 

సంఘమునకు వందనాలు పంపిస్తున్నారు. విచిత్రమైన విషయం గమనించండి, పట్టణపు ఖజానాదారుడు ఎరస్తు 

ఒక విశ్వాసిగా మారిన సహోదరుడు కూడా వందనములు, శుభములు చెబుతున్నాడు. మరొక సహోదరుడు 

క్వర్తుకూడా!

 

         మన పరిచర్యలో మనకు బాలమిచ్చి చేయూత, సహకారమునిచ్చిన వారు మనకు ఎంతో విలువైనవారు. 

మనము ఇతరులతో కలిసి శ్రద్ధ, జాగ్రతలతో ప్రభువు పరిచర్య చేయడం ఎంత సంతోషకర మైనది కదూ! ప్రియులారా, 

మనమంతా అతి జాగ్రతగా, శ్రద్ధతో పరిచర్య చేయాలి, జీవించాలి. ఎందుకంటే మనము అవగాహన చేసుకున్నంత 

మటుకే నిలబడగలుగుతాము. ప్రభువునకు మన విధేయత నిజమైనదైతే, స్వచ్చమైనదైతే, నమ్మకమైన నిశ్చయత 

వల్ల కలిగే భద్రతాభావము మనము ఆనందించగలుగుతాము. దానితో మన సహకారుల సహాయము, చేయూతతో 

శ్రద్ధ, జాగ్రతలతో ఉండడం సత్యమవుతుంది. దీనంతంటికీ అవసరమైన ప్రభువు మహా కృప మనకందరికీ ఆయనే 

అనుగ్రహించుగాక! అమెన్!!  

 

No comments:

Post a Comment

II కొరింధీ -15 2~12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము

>   II Cor-15   2 ~~ 12-17 Part 1 క్రీస్తు సువాసనను వెదజల్లుదాం! – మొదటి భాగము          శ్రోతలూ , బాగున్నారా ? ప్రస్తుత ప్రపంచ...